Saturday, January 29, 2022

ఇరుపక్షాల వున్న అతిరథ, మహారథాదుల వివరాలు చెప్పిన భీష్ముడు .... ఆస్వాదన-57 : వనం జ్వాలా నరసింహారావు

 ఇరుపక్షాల వున్న అతిరథ, మహారథాదుల వివరాలు చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-57

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (30-01-2022)

తీర్థయాత్రలకు పోవడం వల్ల బలరాముడు, కౌరవ-పాండవులు  ఇద్దరూ వద్దన్నందువల్ల రుక్మి మినహా జగతిలోని రాజులంతా కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడేందుకు రెండు పక్షాలలో ఒక దాంట్లో చేరారు. ఈ నేపధ్యంలో దుర్యోధనుడు, దుశ్శాసన, శకుని, కర్ణులతో మంతనాలాడి శకుని కొడుకు ఉలూకుడిని పాండవులకు దగ్గరికి తన పక్షాన వెళ్లి కొన్ని కఠినమైన మాటలు చెప్పమన్నాడు. ఉలూకుడు ఆయన ఆదేశానుసారం ధర్మరాజు దగ్గరికి వెళ్లాడు.

దుర్యోధనుడు చెప్పమన్న కఠినమైన పలుకులను ఆయన మాటలుగా చెప్పాడు ఉలూకుడు. తన వారినందరినీ కూర్చుకుని యుద్ధ రంగానికి రమ్మని, ఇక తప్పించుకోవడానికి వీలుకాదని, భీష్మద్రోణుల బల పరాక్రమాలు పాండవులు తెలుసుకుంటారని, వారిబారి నుండి అర్జునుడు తప్పించుకుని బతకడం సాధ్యం కాదని, శ్రీకృష్ణుడితోనే అంతా చక్కబడదని, భీముడు ప్రతిజ్ఞ చేసినట్లు చేతనైతే దుశ్శాసనుడి నెత్తురు తాగమని, యుద్ధంలో తమ చేతికి చిక్కితే అతడు తప్పించుకుని పోలేడని, జరిగిన అవమానాలు పాండవులు మరిచారా అని, విరాటుడి కొలువులో దీనులై వుండడం శూర లక్షణమా అని, భూమిలో రవ్వంత కూడా చీల్చి ఇవ్వమని, యుద్ధం చెయ్యక మానమని, ఇలా ఏవేవో చెప్పాడు. ఆ మాటలు విన్న భీమార్జున నకుల సహదేవులు ఒకరి ముఖం ఇంకొకరు చూస్తుండగా, శ్రీకృష్ణుడు వారి పక్షాన ఘాటైన సమాధానం ఇచ్చాడు. యుద్ధం రేపే అని, వీరుడవై మరణించమని, మరణించక తప్పించుకోలేడని, కధనంలో భీముడు దుశ్శాసనుడి వక్షం చీల్చి రక్తం తాగుతాడని దుర్యోధనుడికి చెప్పమన్నాడు. భీమార్జున నకుల సహదేవులు కూడా తమ బలపరాక్రమాలను వివరించి దుర్యోధనుడిని హెచ్చరించారు.

పాండవుల దగ్గరినుండి తిరిగొచ్చిన ఉలూకుడు కృష్ణార్జునులు అన్న మాటలు వున్నవి వున్నట్లుగా చెప్పాడు. అక్కడే వున్న భీష్ముడు దుర్యోధనుడికి ధైర్య వచనాలు పలికాడు. భీష్మద్రోణులు వుండగా తనకు భయం లేదన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు, కౌరవ పక్షంలో, పాండవుల పక్షంలో యుద్ధం చేయగల వీరుల ప్రత్యేకతలను వివరంగా చెప్పమని కోరాడు. సమాధానంగా భీష్ముడు ఇరు పక్షాల వారిలోని శక్తి-సామర్థ్యాలు, హెచ్చు తక్కువలు వున్నవి వున్నట్లుగా చెప్పాడు. భీష్ముడి ఉద్దేశంలో కౌరవ వీరుల ప్రత్యేకతలు ఇలా వున్నాయి.  

సుయోధనుడు అతిరథుడు, ఆయన తమ్ములంతా సమరథులలో ఉత్తములు. వారు ద్రుపదుడి సేనలను జయించగలరు. కృతవర్మ అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథోత్తముడు, సింధు దేశాధీశుడైన జయద్రథుడు మహారథుడు. కాంభోజ దేశానికి రాజైన సుదక్షిణుడు సమరథుడు. మాహిష్మతీ నాయకుడైన నీలుడు అర్థ రథుడు. అవంతి దేశపతులైన విందాను విందులు ఇద్దరూ అర్థరథులు. త్రిగర్త దేశపు రాజులైదుగురు మహారథులు. దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణకుమారుడు సమరథుడు. బృహద్బలుడు సమరథుడు. దండదారుడు అర్థరథుడు. (అతిరథుడు అనేక రథికులతో ఒంటరిగా పోరాడగల ఉత్తమ రథికుడు).

కృపాచార్యుడు అతిరథులలో శ్రేష్టుడు. శకుని సమరథుడు. దివ్యాస్త్రాలు తెలిసిన అశ్వత్థామ అర్జునుడితో సమానమైనవాడు. అతడికి సమానులు భూలోకంలో ఎవరూ లేరు. ద్రోణాచార్యుడు అతిరథులలో శ్రేష్టుడు. బాహ్లికుడు అతిరథుడు. అతడి కుమారుడు సోమదత్తుడు కూడా ప్రసిద్ధమైన బలం కలవాడే. రాక్షస శ్రేష్టుడైన అలంబసుడు సమరథుడు. ప్రాగ్జ్యోతిష నగరాధిపతైన భాగాదత్తుడు సమరథుడు. గాంధార రాజులైన వృక్షుడు, అచలుడు సమరథులు. కయ్యానికి కాలుదువ్వే దుర్యోధనుడి గారాబు నెచ్చెలికాడైన కర్ణుడు అర్థరథుడు.

కర్ణుడు అర్థరథుడని భీష్ముడు చెప్పడాన్ని ద్రోణాచార్యుడు సహితం సమర్థించాడు. భీష్మద్రోణుల మాటలు విన్న కర్ణుడికి కోపం వచ్చింది. తనమీద వున్న ద్వేషంతో పరుషవచనాలు పలికి తనను అర్థరథుడు అని వారు చెప్పారని, తనలో ఏలోపం వుందో తెలియచేయమని అడిగాడు. భీష్ముడి శక్తిని, పరాక్రమాన్ని బట్టి తన దృష్టిలో అతడు అర్థరథుడే అని కర్ణుడన్నాడు. భీష్ముడు అర్జునుడి పట్ల పక్షపాతం కలవాడని, పూనికతో యుద్ధం చేయడని, అతడిని కౌరవ పక్షం నుండి తొలగిస్తే కలిగే నష్టం ఏమిటని దుర్యోధనుడితో అన్నాడు కర్ణుడు. దురహంకారైన భీష్ముడితో కలిసి అతడితో చేరి యుద్ధం చేయడానికి తాను అంగీకరించనని స్పష్టం చేశాడు. తన శక్తి ఏపాటిదో కర్ణుడు తన గురువైన పరశురాముడిని అడిగి తెలుసుకోమన్నాడు భీష్ముడు. తాను యుద్ధం చాలించిన తరువాత, అర్జునుడు మహావీరులందరినీ కూల్చిన తరువాత, కర్ణుడు కదన రంగం ప్రవేశం చేయక తప్పదని, అప్పుడు ఆయన పరాక్రమం చూపమని అన్నాడు భీష్ముడు. దుర్యోధనుడు కలిగించుకుని వాతావరణాన్ని చల్లబర్చాడు.

కౌరవుల పక్షంలోని వారిలాగే పాండవుల పక్షంలో వున్న వీరుల తారతమ్యాలు చెప్పమని దుర్యోధనుడు కోరాడు భీష్ముడిని. అప్పుడు భీష్ముడు చెప్పిన ఆ వివరాలు: ధర్మరాజు అతిరథుడు. భీముడు అతిరథులలో మేటి. నకుల సహదేవులు సమరథులు. పాండవులందరు ఏకకాలంలో తాకితే కౌరవ సైన్యం తట్టుకోలేదు. అర్జునుడి బలపరాక్రమం ‘ఇంత అని చెప్పశక్యం కాదు. అంతటి వాడు ఎప్పుడూ, ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆయనకు శ్రీకృష్ణుడి తోడ్పాటున్నది. ఉప పాండవులు ఐదుగురు మహారథులు. వారితో సమానుడు ఉత్తరుడు.

అభిమన్యుడు అతిరథులలో అగ్రేసరుడు. సాత్యకి అతిరథులలో సిగబంతి. అభిమన్యుడు, సాత్యకి ఇద్దరూ గండరగండలు. ద్రుపదుడు, విరాటుడు మహారథులు. శిఖండి మహారథుడు. ధృష్టద్యుమ్నుడు అతిరథుడు. ఆయన కుమారుడు ధృతవర్ముడు అర్థరథుడు. శిశుపాలుడి కుమారుడు ధృష్టకేతుడు మహారథుడు. భోజుడు, అజుడు మహారథులు. పాంచాల వంశాన్ని ప్రకాశింప చేస్తున్న ఏడుగురు కూడా మహారథులే. కేకయ దేశాధిపతులు అయిదుగురు మహారథులు. విరాటుడి నలుగురు దాయాదులు మహారథులు. చిత్రాయుధుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు. సేనాబిందుడు అతిరథుడు. పాండ్యరాజు అతిరథుడు. కాశ్యుడు సమరథుడు. కుంతిభోజుడు అతిరథుడు. రోచమానుడు మహారథుడు. ఘటోత్కచుడు అతిరథుడు.

తనకు జ్ఞాపకం ఉన్నంత మేరకు ఉభయ పక్షాలలో వున్న వారి వీర పరాక్రామలు చెప్పానని, ఇంకా ఎంతోమంది మేటి వీరులు ఉండవచ్చని అన్నాడు భీష్ముడు. తానైతే పాండవ పక్షంలో వున్న శిఖండిని మాత్రం చంపలేనని చెప్పాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment