Saturday, July 9, 2022

అశ్వత్థామకు కృష్ణార్జునుల మహిమ చెప్పి, శివుడిని లింగాకారంలో పూజించడం అధికమన్న వ్యాసమహర్షి ... ఆస్వాదన-79 : వనం జ్వాలా నరసింహారావు

 అశ్వత్థామకు కృష్ణార్జునుల మహిమ చెప్పి,

శివుడిని లింగాకారంలో పూజించడం అధికమన్న వ్యాసమహర్షి

ఆస్వాదన-79

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (10-7-2022)

యోగాన్ని ఆశ్రయించి శరీర త్యాగం చేసి, బ్రహ్మలోకానికి పోయిన తరువాత  ధృష్టద్యుమ్నుడు పాండవులు వారిస్తున్నా వినకుండా ద్రోణుడి తల నరికి వేసిన విషయం కృపాచార్యుడి ద్వారా తెలుసుకున్న అశ్వత్థామ విజృంభించి నారాయణాస్త్రాన్ని శత్రు సైన్యం మీద ప్రయోగించడం, దానికి విరుగుడుగా పాండవుల చతురంగబలాలను వాహనాలు దిగి నేలమీద ఆయుధాలు లేకుండా నిలబడమని కృష్ణుడు చెప్పడం,  ఆ తరువాత అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి నారాయణాస్త్రం ప్రభావాన్ని తగ్గించడం, అది శాంతించడం దరిమిలా, అశ్వత్థామ పాండవుల మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పాండవుల సైన్యంలో ఒక అక్షౌహిణి సైన్యాన్ని నశింపచేసింది. అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలన్నీ వమ్మయిపోయే విధంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో ఆగ్నేయాస్త్రం క్షీణించింది. కౌరవ సైన్యం తిరుగు ముఖం పట్టింది.

దివ్యాస్త్రాల బలం తనకు లేదని స్పష్టంగా గ్రహించిన అశ్వత్థామ ఇక ఆ పైన సిగ్గు విడిచి యుద్ధం చేయడం ఎందుకనుకుని తన ధనుస్సును కింద పడేశాడు. అలా చేసి, రథం మీదనుండి దూకి,  రణరంగం విడిచి వెళ్లిపోతుంటే వ్యాసమహర్షి ఎదురుగా వచ్చాడు. ఆయన్ను చూడగానే అశ్వత్థామ, తన ఆగ్నేయాస్త్రం వ్యర్తమైన విషయం ఆయనకు చెప్పి, అదేం మాయ అని అడిగాడు. ఆ దివ్యాస్త్రం దేవదానవ గంధర్వాది దివ్యజాతుల వారికి కూడా సహింపరానిదని, అయినా మానవమాత్రులైన కృష్ణార్జునులను దహించలేక పోయిందని విచారం వెలిబుచ్చాడు. అశ్వత్థామ సంశయ నివృత్తి చేస్తూ వ్యాస మహర్షి ఇలా అన్నాడు.

‘ఆది దేవుడైన విష్ణు భగవానుడు లోకాలను రక్షించడానికి నారాయణ ఋషిగా జన్మించి మైనాక పర్వతం మీద చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు శివుడు సంతోషించి నారాయణుడికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడా నారాయణ ఋషి అంజలి ఘటించి స్తోత్రం చేశాడు. శివుడిని భక్తితో భజిస్తున్న తనకు ఇతరులకు పొంద సాధ్యం కాని ప్రభావాన్ని కలగ చేయమని ప్రార్థించాడు నారాయణ ఋషి శివుడిని. నరులను, సురలను, గంధర్వులను, కిన్నరులను, గరుడులను, నాగులను, వారు-వీరు అనే భేదం లేకుండా అందరినీ అనాయాసంగా నారాయణ ఋషి గెలుస్తాడని, అతడికి దేనివల్ల కూడా శారీరక బాధ కాని, మరణం కాని కలుగదని శివుడు చెప్పాడు. అంతే కాకుండా ప్రపంచంలో ఏ వస్తువు కూడా అతడిని నొప్పించలేదని, శస్త్రాస్త్రాలు అతడిని ఏమీ చేయలేవని, పంచ మహా భూతాల వల్ల కూడా అతడికి ఎలాంటి భయం లేదని, ఏవీ కూడా అతడిని ఏమీ చేయలేవని, ఒకవేళ ఎదిరిస్తే తనను కూడా జయిస్తాడని శివుడు వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవ్వరికీ జయింప శక్యం కాని సర్వోత్కృష్టుడై నారాయణుడు విలసిల్లాడు. ఆ నారాయణుడి నుండి పుట్టినవాడు కావడం వల్ల అలాంటి వాడుగానే నరుడు సంచరిస్తూ వుంటాడు. ఆ నరనారాయణులే ఈ కృష్ణార్జునులు’.

ఇలా చెప్పిన వ్యాస మహర్షి, అశ్వత్థామ కూడా దైవాంశ సంభూతుడే అని, అయినప్పటికీ నరనారాయణులకు ఆయనకు తేడా వున్నదని అంటూ ఆ తేడాను వివరించాడు. అశ్వత్థామ పూర్వజన్మలో శుభ్రమైన మనస్సుతో అందమైన శివుడి ప్రతిమ చేసి, ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసి, భగవంతుడిని ఆవాహన చేసి, అన్ని పూజలను నిష్టతో చేశాడని; అలాగే కృష్ణార్జునులు పూర్వం నరనారాయణ రూపంలో వున్నప్పుడు కఠోర నియమాలు పాటించి పరమేశ్వరుడిని లింగంగా ప్రతిష్టించి భవ్యంగా ఆరాధించారని చెప్పాడు వ్యాసుడు. ఏవిధంగా శివారాధన చేసినా మనోరథం నెరవేరుతుంది కాని, లింగాకారంలో వున్న శివుడిని పూజించడం, ప్రతిమాకారంలో వున్న శివుడిని పూజించడం కంటే ఎన్నో రెట్లు అధికమని అన్నాడు. కృష్ణార్జునులు లింగాకారంలో వున్న శివుడిని పూజించారని, అశ్వత్థామ మాత్రం ప్రతిమలో వున్న శివుడిని పూజించాడని, అందువల్ల వారిని జయించడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు వ్యాసుడు.

ఇది విన్న అశ్వత్థామ ప్రశాంతత పొంది, పరమేశ్వర రూపాన్ని మనసులో స్మరించుకుని, నమస్కరించాడు. కృష్ణుడిని ప్రస్తుతించాడు. వ్యాసుడికి పాదాభివందనం చేశాడు. అప్పుడు వ్యాసుడు అంతర్థానం చెందాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో సైన్యం యుద్ధరంగం నుండి మరలింది.

ఆ తరువాత అశ్వత్థామ దగ్గర అంతర్థానమైన వ్యాసమహర్షి అర్జునుడి దగ్గరికి వచ్చాడు. ఆయన్ను చూడగానే, ‘మహర్షీ అని సంభోదిస్తూ అర్జునుడు తనకు కలిగిన ఒక సందేహాన్ని గురించి ప్రశ్నించాడు. తాను యుద్ధంలో శత్రువులను కొట్టడానికి పూనుకుంటుంటే తన ముందర ఒక మహాపురుషుడు భయంకరమైన శూలం ధరించి శత్రువులందరినీ సంహరించడం తనకెంతో ఆశ్చర్యం కలిగించేదని, వెనుకవైపు నుండి బాణాలు వేస్తున్న తను సంహరించేది తానే అనుకున్నప్పటికీ వాస్తవానికి తాను కాదని, విజయం మాత్రం తనకు దక్కిందని అంటూ, ఆ దివ్యపురుషుడు ఎవరని అడిగాడు. అలా చేసినవాడు ఈ సృష్టికంతటికీ మూలమైనవాడని, లోకాలన్నీ పరిపాలించే ప్రభువని, అంతం అనేది లేనివాడని, తత్త్వస్వరూపుడని, దివ్యమైన నామం కలవాడని, పార్వతీపతని, మూడవ కంటితో ప్రకాశించే లలాటం కలవాడని, భక్తికి వశమయ్యేవాడని, బాహ్య దృష్టికి కనిపించని వాడని, నల్లని కంఠం కలవాడని, శాశ్వతంగా వుండేవాడని, అంతా తానైనవాడని, పవిత్రమైనవాడని వర్ణించి అర్జునుడు చూసినవాడు సాక్షాత్తు రుద్రుడని తెలియచేప్పాడు. అలా, అలా రుద్రుడి దివ్యలీలలు వర్ణించి చెప్పిన వ్యాసుడు, ఆ పరమేశ్వరుడే అర్జునుడి అభీష్టాన్ని నేరవేర్చడానికి ఆయన ముందుకు విచ్చేశాడని, అలా శివుడు శత్రువధ చేయడంతో అర్జునుడి గెలుపు సులభమైందని, ఆ పరామ్మత్ముడిని శరణు వేడమని అర్జునుడికి చెప్పి అంతర్థానమయ్యాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment