Tuesday, July 19, 2022

మోదీ జవాబివ్వలేని ప్రశ్నలు! .... వనం జ్వాలా నరసింహారావు

 మోదీ జవాబివ్వలేని ప్రశ్నలు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (20-07-2022)

వాల్మీకి రామాయణం సుందర కాండలో సీతమ్మవారిని దర్శనం చేసుకున్న హనుమంతుడు, ఆమెను రావణుడు లంకలోకి తెచ్చి దాచిన విషయం గోప్యంగా వుంచాడని, తానిప్పుడు బహిర్గతం చేస్తున్నానని, అది రావణ వినాశనానికి నాంది అని అంటాడు. అలాగే రావణుడి కొలువులో హనుమ ఆయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ అంతవరకూ ఆయన చేసిన పుణ్యాన్ని అనుభవించాడని, ఇక మున్ముందు పాపం అనుభవించాల్సి వుందని హెచ్చరించాడు. ఇందులో ఒక సందేశం వుంది. ఒక ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధినేత కానీ, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం ఎల్లకాలం గోప్యంగా వుంచడం సాధ్యం కాదు. అలాగే, ఎవరూ సుదీర్ఘకాలం తాను అది చేశా ఇది చేశా అని చెప్పుకుని అధికారంలో వుండలేరు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీపైన చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, తప్పటడుగు వేస్తున్న ప్రభుత్వాధినేతల బండారాన్ని ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు బయటపెట్టే సమయం రాకపోదనేది స్పష్టంగా అర్థమవుతున్నది.

జూలై 10న హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ గణాంకాలతోనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సోదాహరణంగా విమర్శించారు. భారతదేశ దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధానమంత్రి మోదీ అనీ, ఆయన ఎనిమిదేళ్ల పాలనలో దేశమంతా అవినీతేననీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే మోదీకి తెలిసిన రాజధర్మం అనీ, మోదీ హయాంలో క్యాపిటల్‌ డ్రెయిన్‌కు భారతదేశం ముందు వరుసలో నిలిచిందనీ, న్యాయమూర్తులను పాత్రికేయులను బెదిరిస్తున్న అహంకారపూరిత ప్రభుత్వం ఇదేననీ, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని మోదీ అమలుపరుస్తున్నాడనీ, కొందరు ఎంపిక చేసిన వ్యాపారులకు మోదీ సేల్స్‌మ్యాన్‌ లాగా వ్యవహరిస్తున్నారనీ... ఇలా మరెన్నో నగ్న సత్యాలను భారతదేశ ప్రజల ముందూ, యావత్ ప్రపంచం ముందూ నిర్భయంగా బహిర్గతం చేశారు కేసీఆర్. ఇలాంటి ప్రభుత్వం ఇక ఎక్కువ కాలం అధికారంలో ఉండడానికి తగదని స్పష్టం చేశారు. దాని మనుగడ ప్రశ్నార్థకం అని చెప్పకనే చెప్పారు.

కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం విన్నవారికి, మర్నాడు వార్తాపత్రికలలో చదివినవారికి అర్థమయ్యే విషయాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి: బీజేపీకి పాలన చేతకాదు. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు ఏ వర్గానికీ మంచి చేయలేకపోయింది. జాతీయంగా, అంతర్జాతీయంగా బీజేపీ ప్రజ్వలింప చేస్తున్న సంకుచిత విష ప్రచారానికి తప్పకుండా విరుగుడు కావాలి. లేకుంటే దేశం పెద్ద ప్రమాదంలో పడుతుంది.

ఎనిమిదేళ్ల మోదీ పాలనలో వ్యవసాయరంగంలో కాని, విద్యుత్తు రంగంలో కాని, సాగునీటి రంగంలో కాని, ఒక్క మంచి పని జరగలేదు. దేశానికి కరెంటు ఇవ్వడం, సాగునీళ్లు ఇవ్వడం, కనీసం మంచినీళ్లైనా ఇవ్వడం చేతకాని ప్రభుత్వం ఇది. దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కనీసం 20శాతం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగడం లేదు. నిత్యావసరాల ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం గరిష్ఠస్థాయికి పెరిగిపోయింది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, ధరల పెరుగుదల ఆగడం లేదు. రూపాయి దారుణంగా పతనమైంది.

ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు బీజేపీని పడగొట్టే ఆలోచన కేసీఆర్‌కు లేదు. వాళ్ల అహంకారం ఇంకా పెరగాలని, తప్పులు ఇంకా చెయ్యాలని, గ్యారంటీగా చేస్తారని, ఆ రోజు కోసం ఎదురుచూస్తామని అన్నారు కేసీఆర్. దానికొరకు అవసరమైతే జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ రూపాంతరం చెందుతుందని కేసీఆర్ సూచన ప్రాయంగా చెప్పారు. మహారాష్ట్రలో మాదిరి ఏక్‌నాథ్‌షిండే ప్రయోగం తమిళనాడులో కానీ, తెలంగాణలో కాని అప్రజాస్వామికంగా, నిరంకుశంగా చేస్తే ప్రజలు గట్టిగా సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

75 ఏండ్లుగా దేశంలో కాంగ్రెస్‌ మీద బీజేపీ, బీజేపీ మీద కాంగ్రెస్‌ బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్నాయి. 75 ఏండ్ల రొటీన్‌ రాజకీయాల నుంచి దేశం బయటపడాలి. అప్పుడు ప్రబలమైన మార్పులు వస్తాయి. ప్రజలకు మేలుకూర్చే అన్ని రంగాల్లో దేశానికి స్వావలంబన శక్తిని తీసుకొచ్చే విధంగా, సింగపూర్‌, చైనా దేశాల్లోలాంటి నాయకత్వం దేశానికి కావాలి. భారత దేశంలో ఉన్నంత యువశక్తి ప్రపంచంలో మరే దేశంలో లేదు. అద్భుతమైన ప్రగతిబాటలో పయనింపచేయాల్సిన యువతలో మతపిచ్చిని లేపుతున్నది బీజేపీ ప్రభుత్వం. దేశప్రగతిపై గంభీరమైన దృక్పథం గానీ, అవగాహన గానీ, సరైన వ్యూహం గానీ బీజేపీ దగ్గర లేవని ఈ ఎనిమిదేళ్లల్లోనూ ఋజువు చేసుకున్నారు. సంకల్పం, గొప్ప నాయకత్వం ఉంటే, గుణాత్మక మార్పు అంటే ఏమిటో భారత ప్రజానీకానికి వివరించి, వారిని అభివృద్ధి బాటలో పయనింపజేయవచ్చు. ఆ దిశగా అవసరమైతే టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా మారుతుంది. ఈ దేశానికి కొత్త అభివృద్ధి ఎజెండా కావాలి. దేశ రాజకీయాల నుంచి బీజేపీని తన్ని తరిమేయాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.

ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం కచ్చితంగా కేసీఆర్ ఒక పాలసీ ప్రకారం బీజేపీని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క విషయంలో నరేంద్రమోదీకి, బీజేపీకి థ్యాంక్స్‌ చెప్తున్నానంటూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తప్పక రావాలన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం స్పీడ్‌ ఎక్కువ ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం స్పీడ్‌ తక్కువ ఉన్నదని, కాబట్టి కచ్చితంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కావాలని, కేంద్రంలో ఇప్పుడున్న సర్కారు పోయి తెలంగాణ లాంటి సర్కారు రావాలని మోదీ మాట మోదీకే అప్పచెప్పారు కేసీఆర్.

ప్రజాస్వామ్యంలో నేతలను గెలిపించేది, ఓడించేది ప్రజలే. ఎవరైనా ‘ఓడిస్తా’ అంటూ మాట్లాడారంటే అది వారి అహంకారానికి, అవివేకానికి నిదర్శనం. బీజేపీ వాళ్లకు దమ్ముంటే డేట్‌ ఫిక్స్‌ చేయుమని, తాను అసెంబ్లీ రద్దు చేస్తానని, చిల్లర రాజకీయాలు మాట్లాడకూడదని, ఇది పద్ధతి కాదని, ఇకనైనా మార్చుకోవాలని హితవు పలికారు కేసీఆర్.

దేశంలో బ్యాంకు మోసాలన్నీ ప్రధాని నరేంద్రమోదీకి తెలిసే జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసి, ఆ వివరాలన్నీ త్వరలో దేశం ముందుపెడతానని హెచ్చరించారు. బ్యాంకు లూటీల్లో మోదీ వాటా ఎంతని నేరుగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లలో ఒక్క బ్యాంకు దొంగను కూడా ఎందుకు వెనక్కి తీసుకురాలేక పోయిందని నిలదీశారు. ఈడీలు, సీబీఐలు, ఇతర కేంద్ర సంస్థలు బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదని, రైతులకు సబ్సిడీ ఇయ్యొద్దు, కరెంటు సబ్సిడీ ఇయ్యొద్దు, మీటర్లు పెట్టాలె... అనే ప్రభుత్వం కొందరికి లక్షల కోట్లు దోచిపెట్టాల్నా అని ప్రశ్నించారు కేసీఆర్.

తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనని విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ మీద మోదీ ప్రభుత్వానికి అవగాహన లేనే లేదన్న విషయాన్ని బహిర్గతం చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయని, ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయని, మోదీ విదేశాలు తిరిగి, గుప్పెడుమంది పెట్టుబడిదారులకు సేల్స్‌మ్యాన్‌గా పని చేసి, వారికి బిజినెస్‌ ఇప్పించారని, మేకిన్‌ ఇండియా అట్టర్‌ ప్లాప్‌ అని.... ఇలా కేసీఆర్ విమర్శల్లో ఎన్నో కోణాలున్నాయి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని మేల్కొల్పుతామని, బీజేపీని గద్దె దించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కేసీఆర్ అత్యంత విశ్వాసంతో, ధైర్యంగా చెప్పడాన్ని విశ్లేషిస్తే, కేంద్రంలో మార్పు తథ్యమనే నమ్మకం ప్రజల్లో బలీయంగా కలుగుతున్నది.

ప్రధాని మోదీ గురించి సీఎం కేసీఆర్‌ నిర్భయంగా వాస్తవాలు చెప్పారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ప్రశంసించారు. మోదీపై చేసిన విమర్శలను స్వాగతిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. మీడియా సమావేశంలో ప్రధానిపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వార్తాసంస్థ ‘బ్రట్‌’ రూపొందించిన వీడియోను ప్రశాంత్‌భూషణ్‌ షేర్ చేశారు. కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రస్తావించిన విషయాలమీద దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు ఆసక్తి కనపరుస్తున్నారు.

 

1 comment:

  1. కామెడీ బావుంది :)

    ReplyDelete