Sunday, June 4, 2023

కన్యాదానానికి అర్హుడు ఉత్తమ బ్రహ్మచారని, గంగమహాత్మ్యం స్మరణీయమని అన్న భీష్ముడు ..... ఆస్వాదన-123 : వనం జ్వాలా నరసింహారావు

 కన్యాదానానికి అర్హుడు ఉత్తమ బ్రహ్మచారని,

గంగమహాత్మ్యం స్మరణీయమని అన్న భీష్ముడు

ఆస్వాదన-123

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (05-06-2023)

కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ఒక ఇతిహాసాన్ని చెప్పాడు. ‘వదాన్యుడనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది. అష్టావక్రుడు అనే బ్రహ్మచారి ఆమెను వివాహమాడగోరి తండ్రైన వదాన్యుడిని అడిగాడు. రూపంలో, గుణంలో, ప్రవర్తనలో, వంశంలో, విద్యలో సాటిలేని అష్టావక్రుడు కోరిన విధంగానే అతడికి తన కూతురునిస్తానని మాట ఇచ్చి, అతడిని ఉత్తరదిశగా పయనించి పార్వతి శివుడికొరకు తపస్సు చేసిన ప్రాంతం దాటి కదంబవనంలో ప్రవేశించి, అక్కడ నివసించే ఒక పవిత్ర ప్రౌఢ వనితను దర్శించి తిరిగి రమ్మని కోరాడు. వచ్చిన వెంటనే వివాహం చేస్తానన్నాడు. అష్టావక్రుడు దానికి అంగీకరించి ఆ రాత్రి బాహుదా నదీతీరంలో ఆగి, మరునాడు కుబేర నగరానికి పోయి ఆయన కల్పించిన వినోదాలను వీక్షిస్తూ నిశ్చల మనస్సుతో ఏడాది గడపి, ఈశ్వరుడి క్రీడా క్షేత్రాలను దర్శించి, కడిమి చెట్ల వనం చేరి బంగారు మేడలో నివసించే ప్రౌఢవయస్కురాలైన పవిత్ర వనితను దర్శించాడు’.

‘అష్టావక్రుడు దర్శించిన ఆ వనిత అతడికి ఎన్నో అతిథి సత్కారాలను చేసింది. రాత్రి శయ్యపై అతడితో శయనించి భోగించమని కోరింది. ఆమె తన శరీరాన్ని అతడి దగ్గరకు చేర్చి, గట్టిగా కౌగలించుకున్నా అతడిలో చలనం లేదు. తనను అనుభవించకుందా వుండడం అతడికి తగదని చెప్పింది. అష్టావక్రుడు ఆమె తనను తాకకుండా ఉంటే ఉంటానని, లేకపోతే వెంటనే వెళ్ళిపోతానని, ధర్మంగా ప్రవర్తించమని అంటాడు. ఆ రోజు మిన్నకుండి మరునాడు రాత్రి ఆమె మరల అతడిని కోరింది. తనను వివాహం చేసుకొమ్మని అడిగింది. అష్టావక్రుడు, “స్త్రీని పసితనంలో తండ్రి, వివాహమైన తరువాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమె స్వతంత్రంగా ఏమీ చేయతగదు కాబట్టి ఆమెను తాను స్వీకరించను” అన్నాడు. ఆమె ఎన్ని విలాసాలు ప్రదర్శించినా చలించలేదు. అప్పుడామె సంతోషించి, తాను ఉత్తర దిక్కాంతనని, వదాన్యుడి ఆనతితో అతడిని పరీక్షించానని చెప్పి అభినందించి పంపింది. అష్టావక్రుడు తిరిగి వచ్చి వదాన్యుడి అభినందనలతో పాటు, సుప్రభను భార్యగా పొంది సుఖించాడు. కాబట్టి కన్యాదానానికి అర్హుడు ఉత్తమ బ్రహ్మచారి’.

‘పితామహా! పుణ్యతీర్థాల విశేషాలు చెప్పమని అడిగాడు ధర్మరాజు భీష్ముడిని. పూర్వం గౌతముడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అంగిరసుడు చెప్పిన విశేషాలను ధర్మరాజుకు వివరించాడు భీష్ముడు. కామక్రోధ విరహితమైన మనస్సుతో తీర్థాలను సేవించాలని, దూరదూర తీర్థాలను భక్తితో స్మరిస్తే చాలని, అలా చేస్తే పాపాలు తొలగిపోతాయని భీష్ముడు చెప్పాడు. ‘ఏ ఊళ్ళు, కొండలు, ఏరులు మాహాత్మ్యం కలవో చెప్పమని అడిగాడు ఆ తరువాత. జవాబుగా గంగామాహాత్మ్యాన్ని భీష్ముడు వివరించాడు. గంగ ఏ దేశంలో ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉన్న ప్రతి వస్తువు పవిత్రమైనదేనని, గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయని,  దేవతలకు అమృతం ఎట్లాగో నరులకు నదులలో గంగనీరు అట్లాంటిదని, గంగను చూడనివాడు గొడ్డుతో సమానుడని, సాగరులను స్వర్గానికి పంపిన గంగమాహాత్మ్యం స్మరణీయమని, గంగ దివ్య గుణాలను లెక్కించటం సముద్రంలో నీటి బొట్లను లెక్కించటం వంటిదని అన్నాడు భీష్ముడు.

‘లోకంలో ఎవ్వరు సర్వజన పూజ్యులని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించగా, సమాధానంగా ఆయన వాసుదేవ-నారద సంవాదం అనే పురాణ గాథను చెప్పాడు.  దాని తాత్పర్యమిది: ‘వరుణాది దేవతలు, వేదవేత్తలు, తపోధనులు, ధనధాన్య భూములను గోవులను దానం చేసేవారు, అతిథి పూజాపరులు, పితృదేవతలను పూజించేవారు, భిక్షాన్నంతో తృప్తిపడే శాంతస్వభావులు, సత్యవ్రతులు, ధర్మార్థకామ సేవనులు, అహంకార మమకార రహితులు, వ్యామోహ రహితులు, సత్ప్రవర్తనులు, జ్ఞానులు పూజించ-నమస్కరించదగినవారు’.

‘రాజులకు కర్తవ్యాలు ఎన్నో ఉంటాయని, వాటిలో ప్రధాన కృత్యం ఏమిటని ప్రశ్నించాడు ధర్మరాజు పితామహుడిని. రాజ్యాభిషిక్తుడైన రాజు చేయదగిన ముఖ్య కర్తవ్యం బ్రాహ్మణ పూజని, బ్రాహ్మణులు సమాధాన పడితే (రాజులు వారితో స్నేహంగా వుంటే) లోకానికి మేలని, వారు గౌరవించదగినవారని, వారికి మన్నన లోపిస్తే లోకాలకు మేలు లేదని భీష్ముడు చెప్పాడు. బ్రాహ్మణులు దైవాన్ని అదైవంగా, అదైవాన్ని దైవంగా చేయగల సమర్థులని, వారెవరిమీద ప్రేమకలిగి వుంటారో వారే రాజ్యానికి అధిపతులు కాగలరని, వారు ఇంద్రుడికైనా ఆపదలు కలిగించగలరని, సంపదను సృష్టించగలరని, శాపానుగ్రహ సమర్థులని అన్నాడు భీష్ముడు. ఒకసారి నారాయణుడికి, భూదేవికి జరిగిన సంభాషణలో, పూజ పాపాలను తొలగిస్తుందని భూదేవి వాసుదేవుడికి చెప్పింది. ఆత్మోపాసనం, ధర్మబుద్ధితో పరబ్రహ్మను ఉపాసించటం బ్రాహ్మణధర్మమని బ్రహ్మదేవుడు పేర్కొన్న సంగతి చెప్పి, విప్రసేవ కల్పవృక్ష సేవ వంటిదని, శంబరాది రాక్షసులు బ్రాహ్మణ సేవవలన అధిక సంపదలు పొందారని చెప్పాడు భీష్ముడు.

‘అపూర్వులు, చిరకాలం నుండి ఆశ్రయించుకొన్నవారు, దూరం నుండి వచ్చినవారు, వీరిలో ఎవరు ఉత్తములని ధర్మరాజు ప్రశ్నించాడు అ ఆతరువాత. ఈర్ష్యాసూయాదులు లేని స్నేహితులు, చుట్టాలు, ఋత్విజులు, పురోహితులు యోగ్యులు. విద్యావంతులు ఆచారవంతులైతే దూరం నుండి వచ్చినవారుకూడా పూజార్హులే అని సమాధానం ఇచ్చాడు భీష్ముడు.

‘పాపాలన్నింటికి మూలం స్త్రీలంటారు నిజమేనా? వారిని ఎట్లా కాపాడుకొనాలి?’ అని అడిగాడు ధర్మరాజు. సమాధానంగా భీష్ముడు పూర్వం స్త్రీలు సాధువులై పవిత్రమై ఉండేవారని, వారి మనస్సులు పవిత్రంగా ఉండేవని, మాయామర్మాలు లేని ఆ రోజులలో పురుషులంతా కావలసినప్పుడు దైవత్వాన్ని పొందేవారని అంటూ స్త్రీ రక్షణను గురించిన ఒక కథ చెప్పుతాను వినుమన్నాడు.

‘దేవశర్మ అనే మునికి రుచి అనే పేరుగల భార్య ఉండేది. ఆమె అపూర్వ సౌందర్యవతి. ఇంద్రుడు ఆమెను పొందాలని ఉవ్విళ్ళూరుతుండేవాడు. దేవశర్మ రుచిని కాపాడుకొంటూ ఉండేవాడు. ఒకసారి దేవశర్మ యజ్ఞాన్ని నిర్వహించటానికి పోతూ తన భార్యను ఇంద్రుడి దృష్టినుండి రక్షించే బాధ్యత తన శిష్యుడైన విపులుడికి ఒప్పజెప్పాడు. విపులుడు తన యోగశక్తితో రుచిని ఆవహించాడు. విపులుడి ఆత్మ రుచిలో ప్రవేశించింది. ఆమె చైతన్యం జడంగా మారింది. అప్పుడు ఇంద్రుడు సుందరరూపంతో ఆమెను సమీపించి ఆమెను వలపుమాటలతో వశం చేసికొనటానికి యత్నించాడు’.

‘అప్పుడు రుచి శరీరంలో ఉన్న విపులుడు ఇంద్రుడిని “నీవు ఇక్కడికి రావలసిన పని ఏమిటి?” అని ప్రశ్నించి, రుచిని సొమ్మసిల్లచేసి, తన ఆత్మను తన శరీరంలో ఉంచుకొని ఇంద్రుడిని ముఖాముఖి మందలించాడు. ఇంద్రుడు సిగ్గుపడి అదృశ్యుడయ్యాడు. తరువాత విపులుడు రుచిని మేల్కొల్పి, గురువు వచ్చిన తరువాత జరిగిన సంగతి తెలియచెప్పి, అతడివలన వరం పొంది తపస్సుకు వెళ్ళాడు. రుచి దేవశర్మలు సుఖంగా జీవించారు’.

స్త్రీలలో పలువురు యథేఛ్చగా తిరిగేవారున్నప్పటికీ, వారిలో చాలామంది చాలా మంచివారని, అలాంటి కులసతుల వల్లే ఈ లోకం పచ్చగా వున్నదని, పతివ్రతకూ దైవానికి భేదం లేదని, సద్భార్యవలననే పురుషుడికి పురుషార్థసిద్ధి కలుగుతుందని, ధర్మం, అర్థం, సుఖం, కీర్తి ఇవన్నీ పురుషుడికి స్త్రీవల్లే లభిస్తాయని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ముగింపుగా.

(ఈ అంశాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ తుమ్మపూడి కోటీశ్వరరావు గారు ఇలా రాశారు: “ఇది స్త్రీ ప్రశంస. భారతం ఒక చిత్రమైన ఇతిహాసం. లోకంలో ఏవిధంగా మంచి-చెడులు మనిషిని ఆశ్రయించుకుని వుంటాయో, అదే విధంగా స్త్రీలలో ఈ రెండు పార్శ్వాలు వుంటాయి. అలాగే పురుషుల్లోనూ వుంటాయని చూపించడమే వైచిత్రి. రాత్రి-పగలు లాగా స్త్రీలలో (మగవారిలో కూడా) చెడువారిలాగా మంచివారు కూడా వున్నారు. ఆ తల్లుల ఉనికి వల్లే ఈ భూమి పచ్చగా వున్నది అని భీష్ముడు ముగింపు చేయడం అద్భుతం”).   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment