Monday, June 19, 2023

గోదానం, భూదానం, విద్యా దానం, అన్నదానం, జల దానం గొప్పవన్న భీష్ముడు ..... ఆస్వాదన-125 : వనం జ్వాలా నరసింహారావు

 గోదానం, భూదానం, విద్యా దానం, అన్నదానం,

జల దానం గొప్పవన్న భీష్ముడు

ఆస్వాదన-125

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-06-2023)

దాన విశేషాల గురించి వివరంగా చెప్పమని ధర్మరాజు భీష్మ పితామహుడిని కోరగా ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు. ‘పాలు పితకడానికి కంచు పాత్రతో సహా ఆవును మంచి బ్రాహ్మణుడికి, మంచి భక్తితో దానమిస్తే, ఇచ్చిన వ్యక్తి, ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు వుంటాయో అన్ని దివ్య సంవత్సరాలు దేవతల లోకంలో నివసిస్తాడు. తమ వంశంలో ఏడు  తరాల వారిని ఉత్తమ లోకాలకు పంపుతారు. ఆడపిల్ల, భూమి, ఇల్లు, బంగారం, అన్నం, నీరు, వస్త్రం, పాన్పు, కూచుండే పీట, వాహనం మొదలైన వాటిని విద్య పుష్కలంగా వున్న బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇచ్చినవారికి ఈ లోకంలో, పరలోకంలో, సుఖాన్నిస్తుంది’.

అలాంటప్పుడు ‘వీటన్నిటికన్నా గొప్ప దానం ఏదని’ ప్రశ్నించాడు ధర్మరాజు.

జవాబుగా భీష్ముడు, ఏది కోరి యాచకుడు తన దగ్గరకు వస్తాడో దాన్నే ప్రేమతో ఇవ్వడం అన్ని దానాలలో శ్రేష్టమైన దానమని, దానికంటే కూడా అభయ మివ్వడం చాలా గొప్పదని అన్నాడు. వీరశయనమన్నిటి కంటే గొప్పదని, దానితో పోలిస్తే మిగిలినవి అసలు దానాలే కావని, సర్వపుణ్య కర్మలలోను అదే గొప్పదని చెప్పాడు.

‘శత్రువు ఎలాంటి వాడైనా దైన్యంతో శరణు కోరితే అతడి కోరిక తీర్చినవాడిని పురుషోత్తముడని అంటారు. భార్యా పుత్రులను పోషించుకోలేక పేదరికంతో బాధపడే మనిషి దుఃఖాన్ని పోగొట్టడం గొప్ప గుణం. నిత్యం యజ్ఞయాగాదులు చేస్తూ, కామ రోషాలు లేని మంచి బ్రాహ్మణులకు దానం చేయడం ముల్లోకాలలోనూ గొప్ప విషయమే కాకుండా, ముల్లోకాలలోనూ పూజించతగ్గది’ అని అన్నాడు భీష్ముడు.   

అడిగినవాడికి దానం చేయడం మంచిదా లేక అడగనివాడికి దానం చేయడం మంచిదా అని ప్రశ్నించాడు ధర్మరాజు. అడిగితే ఇవ్వడం కంటే అడగని వాడు ఫలానా వాడని తెలిసి వాడికివ్వడం చాలా గొప్పదానమని, అసలు అడగడం అన్నది చావు లాంటిదని, అడగబడడం పెద్దచావు లాంటిదని, కాబట్టి అడగని వాడికివ్వడం వల్ల వాడినీ, పుచ్చుకున్నవాడినీ, తననూ రక్షించేవాడౌతాడని చెప్పాడు భీష్ముడు.

యజ్ఞంలాంటి దానంలో వున్న ధర్మవిధులలో అధికమైన ఫలితాలను ఇచ్చేది ఏదని అడిగాడు ధర్మరాజు. నిత్యం బ్రాహ్మణులకు వినయపూర్వకంగా, ధనధాన్యాలు, ఆవు, రత్నం, భూమి, నీరు, అన్నాదులు సద్బుద్ధితో ఇవ్వడం ఇక యజ్ఞమని, కాబట్టి దానం చేయాలని, అది తపస్సును, యజ్ఞాన్ని చేసిన ఫలితాన్నిస్తుందని భీష్ముడు అన్నాడు.

అలాంటప్పుడు, అనేకదానాలుగా చెప్పబడుతున్న వాటిలో ఉత్తమైనది ఏదని మళ్లీ ప్రశ్నించాడు ధర్మరాజు. సమాధానంగా ఇలా అన్నాడు భీష్ముడు. ‘దానాలన్నింటిలో భూదానమే శ్రేష్టం. ధాన్యాలన్నిటికీ నేలయే ఆధారం. అతిశయంగా ధనం సమకూర్చేది నేలే. బంగారం, వెండి, వస్త్రం, ధాన్యం, వివిధ రత్నాలు ఇచ్చిన ఫలాలను అన్నిటినీ శ్రేష్టమైన భూదానం చేసినవాడు పొందుతాడు. భూమి ఎంతకాలం వుంటుందో భూదానం చేసినవాడు సైతం స్వర్గలోకంలో అంతకాలం వుంటాడు. కొంచెం నేలను దానం చేసినా ఎంతో నేలను పొందగలడు. రాజనేవాడు రణమరణమైనా పొందాలి, లేదా, భూదానమైనా చేయాలి. భూదానం వల్ల బ్రహ్మహత్యలాంటి పాపాలు పోతాయి. భూదానాన్ని ఎంత పాపాత్ముడు చేసినా, గ్రహించినవాడికి కల్మషం రాదు. భూదానం అశ్వమేధం సమానం అంటారు. బ్రాహ్మణుడికి పంటపండే భూమిని దానం చేస్తే కలిగే ఫలితాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. భూదాన విధులలో శ్రేష్టమైన విధి యాగం చేసినవాడు, బ్రాహ్మణుడిని ప్రార్థించైనా సరే భూమిని గ్రహించేట్లు చేయడం మంచిది’.

‘సరైన బ్రాహ్మణుడికి గోచర్మం అంత భూమిని దానమిస్తే పోని పాపం లేనేలేదు. భూదేవి రత్నగర్భ కాబట్టి భూదానం చేసినవాడికి గుర్రం, ఏనుగు, స్త్రీ మొదలైన రత్నాలను ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. రాజైనవాడు భూదానం తప్పక చేయాలి. ఎందుకంటే, రాజైనవాడు పాలనలో అనేక పాపాలు చేస్తాడు. అది పోవాలంటే భూదానమే మార్గం. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటాడో వాడు తన వారైన 21 తరాల వాళ్లను నరకంలో పడేట్లు చేస్తాడు. మహాపాపానికి కేంద్రం అవుతాడు. ఇస్తానని వాగ్దానం చేసిన భూమిని ఇవ్వకపోవడం కంటే మహాపాపం లేదు. అడక్కుండానే ఇచ్చినంత మహాపుణ్యం కూడా లేదు’ అని చెప్పాడు భీష్ముడు.

దాన స్వభావం కలవారు దానం చేయడానికి అర్హమైన వస్తువులేవి అని ప్రశ్నించాడు ధర్మరాజు. అన్నం, బంగారం, పానీయాలు మొదలైనవి వున్నాయని అయితే ముందుగా ‘ఒకరోజు అన్నదానం’ గురించి  తెలియచేస్తానని, వినమని అన్నాడు భీష్ముడు.

‘లోకయాత్రలో యజ్ఞయాగాదులు, ఇతరాలు అన్నంతోనే ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి అన్నం కంటే విశిష్టమైనది ఇంకొకటి లేదు. అన్న దానంతో సమానమైనది లేదు. దాన్ని పవిత్రంగా చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. అన్నం ప్రాణధారకం కాబట్టి ఇంట్లో వారికి పెట్టడం మానుకొనైనా అతిథులకు పెట్టడం పుణ్యం. అలసటతో వున్నవాడికి, స్త్రీలకూ, బాలురకు, అంగవైకల్యం కలవారికి, ముసలివారికి, తాపసులకు అసలే కాదనకూడదు. ఆకలితో వచ్చిన కుక్కను కూడా ఆదరించాలి. అన్నం పెట్టడానికి కులం, విద్య, నడవడిక అడగరాదు. బ్రాహ్మణుడు అన్నం కావాలని అనగానే ఆదరపూర్వకంగా పెట్టాలి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ అన్నం అమృతమని చెప్పాడు. కాబట్టి అన్నం లేనివాడు ఎంత బలం కలవాడైనా బలహీనుడు అవుతున్నాడు. అన్నం సప్త ధాతువులను పోషిస్తుంది. అన్నదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి’ అని అన్నాడు భీష్ముడు.

చెరువులు, కొలనులు, నూతులు, బావులు తవ్వించడం మంచిపనని, స్వర్గలోక నివాసాన్ని కలిగించే ఈ పనులు దాన కర్మలలో పవిత్రమైనవని, గొడుగును దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని, బండిని దానం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని, చెప్పులు దానం చేస్తే శత్రువులను జయించవచ్చని, నువ్వులు ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారని, ఇచ్చినవాడు పవిత్రుడౌతాదని అన్నాడు భీష్ముడు. అడవి, కొండలు, నదులు, అనేక తీర్థాలు దానధర్మాలు చేయడానికి యోగ్యమైన స్థలాలని చెప్పాడు.  

గోదాన మహిమను ధర్మరాజు కోరిక ప్రకారం వివరించాడు భీష్ముడు ఈవిధంగా. ‘గోవన్నా, బ్రాహ్మణుడన్నా ఒకే తత్త్వం కావడం వల్ల గోదానం చేసినవాడు ముక్తి పొందుతాడు. ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తే ఎలాంటి సంకట స్థితి పొందక ఎవరూ పొందరాని పుణ్యలోకాలలో సుఖంగా వుంటారు. ఆవుపాలు అమృతంతో సమానమని దేవేంద్రుడు చెప్పాడు కాబట్టి ఆవును దానం చెయ్యడం వలన అమృతాన్ని దానం చేసిన ఫలాన్ని పొందగలడు. మునులు ఆవులంటే ప్రాణాలని చెప్తారు కాబట్టి ప్రాణదానం చెయ్యడం వల్ల లభించే ఫలం గోదానకర్తకు కలుగుతుంది. బాగా పరీక్షించి గోవును దానం చేయాలి. క్రూరుడికి, నాస్తికుడికి, చెడుపనులు చేసేవారికి, గోవును ఇస్తే అది శోకిస్తుంది కాబట్టి, ఆ శోకం దాతను నరకలోకంలో పడేస్తుంది. గోవులు పుణ్యలోకాలనే కాకుండా మోక్షాన్ని కూడా కలిగించగలవు’.

అన్నదానం అన్నింటికంటే చాలా గొప్పదని, అన్నదానం ప్రాణదానంతో సమానమని, అన్నం కంటే జలదానం గొప్పదని చెప్పాడు భీష్ముడు. ‘దానం చేయదగ్గవి మూడున్నాయి. భూమి, చదువు, గోవు. వీటికంటే గొప్పవి లేవు. గోదాన ఫలం ఇచ్చినవాడికీ, తీసుకున్నవాడికీ కలుగుతుంది. గోదాన ఫలం ఇంతది అని చెప్పడానికి బ్రహ్మకు కూడా శక్యం కాదు. ఆవులంటే సూర్యకిరణాల లాంటివి కాబట్టి గోదానం చేసినవారు సూర్యుడిలాగా ప్రకాశిస్తారు. పుణ్యపురుషుల చరిత్రలు కూడా గోదానానికి సరికావు’ అని అన్నాడు.

ఆవులలో కపిలగోవు శ్రేష్ఠమైనదని, దానిని దానం చేస్తే పాపాలన్నీ పోతాయని, ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా చెప్పిన భీష్ముడు కపిల గోవులకు ఆ విశేషం ఎలా కలిగిందో వివరించాడు ఇలా. ‘దేవతలకు ఆకలివేసి బ్రహ్మవద్దకు పోగా వారికి ఆయన అమృతాన్ని అందించాడు. ఆ అమృతపు వాసనలకు కామధేనువు పుట్టింది. దానికి ఆవులు పుట్టాయి. అవి హిమాలయ పర్వత పై భాగాన తిరుగుతున్నప్పుడు ఒక లేగదూడ తల్లిపాలు త్రాగుతూ ఉండగా పాలనురుగు గాలివాటానికి ఎగిరి శివుడి శిరస్సుమీద పడింది. దానికి ఆయన కోపించి మూడవ కన్ను తెరిచాడు. ఆ మంటకు ఆవులు ఎర్రబడిపోయాయి. బ్రహ్మదేవుడు శివుడి వద్దకు వచ్చి ఆవుపాలు అమృతం వంటివని ప్రశంసించి ఆయనను ప్రసన్నుడిని చేసికొన్నాడు. శివుడు గోవులకు ఎక్కడైనా తిరిగే వరమిచ్చాడు. తన కంటి మంటకు ఎర్రబడిన ఆవులు శ్రేష్ఠమైనవని పేర్కొన్నాడు. దానితో కపిలగోవులను దానం చేయటం ఉత్తమమైనదనే ప్రశస్తి ఏర్పడింది. కపిలగోవుల కథ పుణ్యప్రదమైనది’.

ఆ తరువాత ధర్మరాజు కోరిక మేరకు గోలోకం బ్రహ్మలోకానికి పైన ఎందుకుందో చెప్పడిలా. ‘పూర్వం బ్రహ్మ అపూర్వ సౌందర్యరాశి అయిన సురభి అనే కన్యను, మార్తాండుడనే మగవాడిని సృష్టించి, వారిరువురకు కలిగే సంతానం యాగాలకూ, మోక్షానికి పనికివచ్చే పాలను సృష్టించి, బ్రహ్మలోకానికి పైభాగాన ఉండేటట్లు వరమిచ్చాడు. వారికి పుట్టిన ఆవులు క్షీరము లిచ్చాయి. మరొకసారి కామధేనువు చేసే తపస్సుకు మెచ్చి గోలోకాన్ని వరంగా ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మలోకంకంటె గోలోకం ఉన్నతంగా నిలిచింది’ అని అన్నాడు.  

భీష్ముడు ధర్మరాజు కోరికపై గోమహిమలను గురించి మరెన్నో విశేషాలను వివరించి చెప్పాడు. ఆవుపేడలో లక్ష్మి వుండడానికి కారణం (గో శ్రీసంవాదం అనే పూర్వగాథ ఆధారంగా) కూడా చెప్పాడు ఇలా. ‘ఒకసారి లక్ష్మీదేవి గోవులమందలోనికి వెళ్లి వాటి మధ్య ఉండటానికి అభిలషించింది. కాని, లక్ష్మి చంచల స్వభావురాలు కాన అవి ఆమె కోర్కెను మన్నించలేదు. ఆవులు తిరస్కరిస్తే లోకం గౌరవించదని పలికి లక్ష్మి గోవులను ప్రార్థించింది. గోవులు తమ మలమూత్రాలు పరమ పవిత్రమైనవని వేదం పేర్కొన్నది కాబట్టి వాటిలో నివసించమని అనుమతించాయి. లక్ష్మి దానికి ఆమోదించి వాటిలో నివసించింది. అందువలన వాటి మహిమ పెరిగింది’.

గోమాహాత్మ్యం తెలిపే కథలు వినినవారికి ఆయువు, సంపద, అధికారం, కీర్తి, సద్గతి కలుగుతాయి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ద్వితీయ-తృతీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

   

 

No comments:

Post a Comment