విశ్వజనీనమైన ధర్మబుద్ధితో అశ్వమేధయాగం చేయమని
ధర్మరాజుకు చెప్పిన శ్రీకృష్ణుడు
ఆస్వాదన-133
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (14-08-2023)
భీష్ముడి నిర్యాణం అనంతరం, ఆయనకు జలతర్పణాలు చేసిన
ధర్మరాజు, ధృతరాష్ట్రుడిని ముందుంచుకుని గంగానదిని దాటి
ప్రయాణం చేశాడు. దుఃఖంతో బాధపడుతున్న ధర్మరాజు నేలమీదికి ఒరుగుతుంటే శ్రీకృష్ణుడి
సూచన ప్రకారం భీమార్జున నకుల సహదేవులు ఆయన్ను పొదివి పట్టుకున్నారు. సపర్యలు
చేశారు. సేద తీర్చారు. ఆ సమయంలో అక్కడున్న ధృతరాష్ట్రుడు ఒక్క సారి గతాన్ని-సుయోధనుడి
దుర్మార్గాన్ని మననం చేసుకుంటూ, ధర్మరాజుకు ధైర్యం చెప్పాడు. దుఃఖించాల్సిన సమయం
కాదని, తమ్ములతో కలిసి రాజ్యాన్ని అనుభవించమని, ఒంటరివాళ్లమైన తమను కనిపెట్టుకుని వుండమని చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా
ధృతరాష్ట్రుడి మాటలను సమర్థిస్తూ, భీష్ముడు ఆయనకు బోధించిన
ధర్మాలను, వ్యాసుడు, నారదుడు చేసిన నీతి బోధలను జ్ఞప్తికి
తెస్తూ, చింతించవద్దని అన్నాడు. మహాయగాలు చేయమని, దేవతలను, పితృ దేవతలను అర్చించమని, ప్రజలను రక్షించమని, బంధువులకు సుస్థితి
కలిగించమని, అతిథి, అభ్యాగతులను భగవత్సరూపులుగా పూజించమని
చెప్పాడు.
ఇవన్నీ విన్న ధర్మరాజు, భీష్ముడిని, కర్ణుడిని చంపిన మహాపాపానికి తనకు నిష్కృతి కలగాలంటే చేయాల్సిన
వ్రతవిధానం తెలియచేయమని వ్యాసుడిని కోరాడు. జవాబుగా వ్యాసుడు, మనిషి చేసే పనులకు అతడు కర్త కాడని, పరమేశ్వరుడు చేయమన్నరీతిలో మనిషి చేస్తాడని, కాబట్టి పాపాలు తొలగించుకోవడానికి యాగాలను, దానాలను
చేయమని, దక్షిణలు ఇవ్వమని,
అశ్వమేధయాగాన్ని చేయమని అన్నాడు. వ్యాసుడు చెప్పినట్లే అశ్వమేధయాగాన్ని చేస్తానని
అంటూ, దానికోసం తన దగ్గర తగినంత ధనం లేదని, ధనం సంపాదించడానికి సరైన మార్గాన్ని తెలియచేయమని ఆయన్ను కోరాడు.
దానికొరకు తనకు మంత్రిత్వం వహించమని కూడా వేడుకున్నాడు. మరుత్తుడు అనే రాజు యజ్ఞం
చేసి బ్రాహ్మణులకు ఇచ్చిన ధనరాసుల్లో అధిక భాగాన్ని ఒక నిదిగా ఏర్పాటు చేసి
దాచిపెట్టారని, దానిని కనుగొన్నవారికే అది చెందుతుందని, ఆ ధనాన్ని తెచ్చి కావలసినంత ఖర్చు చేయమని వ్యాసమహర్షి ధర్మరాజుకు
చెప్పాడు. పుణ్యప్రదమైన మరుత్తుడి కథను వివరించాడు వ్యాసుడు ఇలా.
‘కృతయుగంలో మనుచక్రవర్తికి ప్రజాని అనే కొడుకు పుట్టాడు.
అతడి వంశంలో క్షుతుడు, ఇక్ష్వాకుడు, వింశుడు, వివింశుడు తరువాత ఖనేత్రుడు
అనే దుర్మార్గుడు పుట్టాడు. మంత్రులు రహస్య పన్నాగం ద్వారా ఖనేత్రుడిని తొలగించి
అతడి కుమారుడిని రాజును చేశారు. అతడు తనకున్న ధనాన్ని అంతా బ్రాహ్మణులకు దానం
ఇచ్చి దారిద్ర్యంతో బాధ పడ్డాడు. అతడి సైన్యం క్షీణించడంతో శత్రువులు దాడి చేసి
ఓడించడంతో రాజ్యాన్ని వదిలి రాజు అడవులకు వెళ్లాడు. నియమనిష్టలతో తపస్సు చేసి ప్రభావశీలి
అయ్యాడు. దానితో ఒక పరమాద్భుతం జరిగింది. సేవకులు, సైనిక
సమూహాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు,
బంగారు రాసులు మొదలైనవన్నీ అక్కడ పుట్టాయి. వీటి సహాయంతో శత్రురాజుల మీద దండెత్తి, వారిని ఓడించి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతడికి దరిమిలా
కరంధముడు అన్న పేరు వచ్చింది. అతడు అనేక అశ్వమేధయాగాలు చేసి ప్రశంసలు పొందాడు.
అతడి మనుమడే మరుత్తుడు. మహా తేజోవంతుడు’.
‘మరుత్తుడు అశ్వమేధయాగం చేస్తూ యజ్ఞపదార్థాలను దాచడానికి
లెక్కకు మిక్కలి పెద్ద-పెద్ద బంగారు కుండలను చేయించాడు. శాస్త్రోక్తంగా యజ్ఞం
పూర్తిచేసి, బ్రాహ్మణులకు బంగారంతో చేయించిన అనేక ఉపకరణాలను దానం చేశాడు. బంగారాన్ని
దక్షిణగా ఇచ్చాడు. బంగారు పాత్రలను దానంగా ఇచ్చాడు. అతడికి ఇంత బంగారం లభ్యం
కావడానికి పూర్వ రంగం కూడా వున్నది. దేవతల గురువు బృహస్పతి సోదరుడు సంవర్తుడు
మరుత్తుడి యజ్ఞానికి ఉపద్రష్టగా వ్యవహరించాడు. మరుత్తుడు తాను ఏవిధంగా ధనవంతుడిని
కాగలనని సంవర్తుడిని ప్రశ్నించగా ఆయన ఉపాయం చెప్పాడు’ అని
సంవర్తుడు మరుత్తుడికి చెప్పిన వివరాలను వ్యాసుడు ధర్మారాజుకు తెలియచేశాడు ఇలా. “హిమాలయాలకు
ఉత్తరభాగంలో ముంజవంతమనే పర్వతం వున్నది. అక్కడ శివుడు పార్వతితో కూడి సమస్త బూతాల
సేవలు అందుకుంటూ విహరిస్తుంటాడు. దివ్యభూమైన ఆ కొండ పక్కన బంగారు రాళ్లు, బంగారు
ఇసుక ప్రకాశిస్తూ వుంటాయి. అక్కడికి వెళ్లి మహేశ్వరుడిని వివిధ రీతుల్లో
ప్రస్తుతించి, ఆయన అనుగ్రహాన్ని పొంది, అక్కడున్న బంగారాన్ని
మూటలు కట్టి తెచ్చుకోవాలి”.
వ్యాసుడు కొనసాగిస్తూ ఇలా అన్నాడు. ‘సంవర్తుడు వెంటరాగా
మరుత్తుడు ఆ పర్వతానికి వెళ్లి శివుడిని స్తుతించి, అతడి దయను పొంది, బంగారు రాశులను కోకొల్లలుగా మూటలు కట్టించి,
పనివారితో మోయించుకొని, నగరం చేరుకున్నారు. అలా మహా
ధనవంతుడైన మరుత్తుడు బంగారంతో యజ్ఞవాటికను, కుండలు మొదలైన యాగ సాధనాలను, ఇంకా అనేక రకాల ఉపకరణాలను చేయించాడు. యజ్ఞం ప్రారంభమైంది. సంవర్తమహాముని
అగ్నిలాగా ప్రకాశిస్తూ యాగవిధిని నడిపించాడు. యాగం మహావైభవంగా నిర్వహించబడింది.
ఇంద్రుడు కూడా చాలా సంతోషించాడు. యాగం పరిసమాప్తమైన తరువాత ఎన్నో బంగారు రాశులను, ఎందరో బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చాడు మరుత్తుడు. బంగారంతో చేసిన
యజ్ఞవాటికను, అందులోని సర్వ భాగాలను, కుండలను, ఇతర ఉపకరణాలను బ్రాహ్మణసమూహానికి దానంగా ఇచ్చాడు. ఇచ్చిన తరువాత చాలా
కాలం ధర్మంగా పాలన చేశాడు. బ్రాహ్మణులు తాము మోయగలంత బంగారాన్ని ఇళ్లకు తెచ్చుకొని, తక్కిన దానిని హిమాలయాలలో ఒక నిదిగా దాచిపెట్టి,
దాన్ని భవిష్యత్తులో ఎవరు కనుగొంటే వారికే అది చెందుతుందని ఒక మాటగా అన్నారు’.
ఇలా మరుత్తుడి కథను చెప్పిన వ్యాసుడు, ఆ
నిధిని తెచ్చి ఇష్టప్రకారం ఉపయోగించి, అశ్వమేధయాగం చేసి, దేవతలను సంతోషపరచమని ధర్మరాజుకు చెప్పాడు. ఈ నేపధ్యంలో ధర్మరాజు
పరితాపాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఆయన్ను జ్ఞానం వైపు ప్రయాణం చేయమని
ప్రభోదించాడు. ధర్మరాజు నిర్మలంగా ఏపనీ చేయడని, కనీసం దుఃఖాన్ని ఆపుచేసుకోలేక
పోయాడని, ఆయన వివేకం
ఏమైందని అంటూ, ఆయన లోపలి శత్రువుల సంగతి ఆయనకే తెలియదనీ, దానికి సంబంధించిన కథ వున్నదనీ, అంతఃశత్రువుల ప్రస్తావన తెచ్చాడు. ధర్మ
సూక్ష్మాన్ని గ్రహిస్తేనే అంతశ్శత్రుస్వభావం అర్థమవుతుందని అన్నాడు. ఇంకా ఇలా
అన్నాడు ధర్మరాజుతో.
‘సత్త్వరజస్తమోగుణాలు మూడూ సమత్వంలో వుండడమే మానసిక
స్వస్థతకు నిదర్శనం. ఏ ఒక్కటి గాడి తప్పినా అది మానసిక వ్యాధి అవుతుంది. కర్మను
అనుష్టించే పద్ధతిలోని ధర్మ సూక్ష్మం ఇది. దీన్ని నువ్వు ఎప్పుడూ అభ్యాసం చేయలేదు.
నిర్మలంగా ఏపనీ చేయలేక పోయావు. గతంలో జరిగిన అన్యాయాన్ని,
అడవిలో అనుభవించిన కష్టాలను మనసులో పెట్టుకోవద్దు. శత్రువులు చేసిన దుర్మార్గాలు
పదేపదే తలచుకోవద్దు. అసలు భీష్మాదులు చేసిన యుద్ధం యుద్ధమే కాదు. అలాంటప్పుడు
అందులో పుట్టిన మేలు కాని, కీడు కాని నీమనసులో వుంచుకోవద్దు.
భీష్మాదులతో చేసిన యుద్ధం మిథ్యాయుద్ధం. ఆ మహాయుద్ధానికి ఆత్మే నిజమైన తోడు.
మనస్సు శత్రువు. కాబట్టి నువ్వు లోపలి శత్రువులను జయించి,
మనసుకు శాంతిని కలిగించుకో. శాంతబుద్ధితో ప్రవర్తించడం అభ్యాసం చేయి. వివేకంతో
నిశ్చయ బుద్ధి కలిగి నేర్పరిగా నీదారిని మళ్లించుకో’.
‘రెండక్షరాలు మృత్యువు, మూడక్షరాలు బ్రహ్మము, “మమ” (శరీర వాదం) అనే రెండక్షరాలు “న మమ” (ఆత్మ వాదం) అనే మూడక్షరాలు
వరుసగా మృత్యువు, బ్రహ్మము. అవి ఏ భూతరాశికీ కనిపించకుండా
నిరంతరం పోట్లాడుతూ వుంటాయి. ఆత్మతత్త్వం శాశ్వతమైనది. శరీర సంబంధం లేనిది. కాని, భూతరాశి శరీర దారి కావడం వల్ల అది నియతంగా నశించే స్వభావం కలిగినది.
పరస్పరం హింసించుకోవడం దాని లక్షణమే. అందుకే దేహం ఒక “ఖండ” భాగం తప్ప ఆత్మ లాగా
అఖండం కాదు. శాశ్వతం కాదు. అందువల్ల దేహానికి తాత్త్వికలక్షణం లేదు. భూమ్మీద
గాఢమైన మమకారం లేని మానవుడికి పాపాలు ఎలా అంటుతాయి? లోపలి శత్రువులను గెలిస్తేనే
మోక్షమార్గ సాధన వీలవుతుంది. లోపలి శత్రువులలో “కాముడు” చాలా గొప్పవాడు. కామం లేని
పని ప్రపంచంలో ఏదీ లేదు. వేదాదులు చదివినా, యాగాలు చేసినా, దానాదులిచ్చినా, దానికి మూలం ఏదో ఒక “సంకల్పం” కదా?’
అని కామగీతలు (భగవద్గీతలో వున్న సారాంశమే దీంట్లోనూ వున్నది. కామగీతకు సాక్షులు
మానవులు, దేవతలు, రాక్షసులు, సకల సృష్టీ) వినిపించాడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు.
పుణ్యాత్ముడైన ధర్మరాజను అశ్వమేధ యాగాన్ని ఎలాంటి తీవ్రమైన
కోరికా లేని మనస్సుతో, విశ్వజనీనమైన ధర్మబుద్ధితో, కాముడినే కర్మసాక్షిగా
చేసి చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడు. చనిపోయిన బంధువులను మరలా తీసుకొని రావడం
సాధ్యం కాదని, వారిని గురించి తలచి-తలచి ఏడుస్తూ కూచోవద్దని, ఆయన ఇష్టం వచ్చినంత మోతాదులో బాగా దానధర్మాలు చేస్తే ప్రపంచంలో ఖ్యాతి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అన్నాడు శ్రీకృష్ణుడు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పడమే కాకుండా అంతకు ముందే
వ్యాసమహర్షి కర్తవ్య బోధ చేయడం, నారద మహర్షి హితోక్తులు పలకడం కూడా
జరిగింది. భీమాదులు, ద్రౌపదీదేవి తగిన మాటలు చెప్పారు.
శాస్త్ర పండితులైన బ్రాహ్మణులు వారికి తోచిన విధంగా మాట్లాడారు. అందరి మాటలు విన్న
ధర్మరాజు శోకాన్ని వదిలిపెట్టి రాజ్యపాలన చేయడానికి, యాగం
చేయడానికి అంగీకరించాడు. కొన్ని రోజులు గంగా తీరంలో వుండి యుద్ధ పాపం వల్ల కలిగిన
అపవిత్రత పోగొట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత వ్యాసమహర్షి పాదాలకు
నమస్కరించాడు. ఆయన చెప్పిన రహస్య నిధిని ఆయనతో కలిసి పోయి గ్రహిస్తానని, ఆ సమయానికి ఆయన తప్పకుండా రావాలని కోరాడు. వ్యాస,
నారదాది మహానుభావులంతా వీడ్కోలు తీసుకొని అంతర్థానం అయ్యారు.
ఆ తరువాత ధర్మరాజు
ధృతరాష్ట్రుడితో కలిసి భీష్ముడికి ఉత్తర క్రియలు నిర్వహించి,
కర్ణుడు మొదలైన వారికి స్వర్గప్రాప్తి కొరకు దానధర్మాలు చేశాడు. కొన్నాళ్ల తరువాత
ధృతరాష్ట్రుడుతో సహా హస్తినాపురానికి చేరుకున్నారు పాండవులు. రాజ్యపాలనా భారాన్ని
మోయడంలో ప్రవీణుడని పేరు తెచ్చుకున్నాడు ధర్మరాజు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అశ్వమేధపర్వం, ప్రథమాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment