శ్రీరామ చరితం
వనం జ్వాలా నరసింహారావు
భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక
(ఆగస్ట్ నెల 2023)
(శ్రీ
రామాయణం, భారతం,
భాగవతం అద్వితీయ
గీర్వాణ భాషా గ్రంథాలు. వాటిలో మొదటిది శ్రీ
రామాయణ కావ్యం. అనాదిగా ఆబాలగోపాలానికి రామాయణం పారాయణ గ్రంధ మైంది. వాల్మీకి రామాయణంలో అనంతరకాలంలో అనేక ప్రక్షిప్తాలు, నిక్షిప్తాలు చోటు చేసుకున్నాయి. ఎన్నెన్నో అవాల్మీకాలు ఆవిర్భవించాయి. వాటిని విడిచి పెడుతూ, యదార్థ వాల్మీకి రచనను, వివిధ ఘట్టాల ద్వారా అధ్యయనం చేయడానికి ఉద్దేశించినది ఈ శీర్షిక)-ప్రతి నెలా ఒక ఘట్టాన్ని గురించి చదవవచ్చు.
శ్రీరాముడు భగవంతుడన్న అర్థం,
హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని
ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. శ్రీరామచంద్రుడు
మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకేమో
వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. వాల్మీకి శ్రీమద్రామాయణంలో నాయిక
సాక్షాత్తు శ్రీదేవైన సీతాదేవి. నాయకుడు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి.
వీరిరువురు దుష్ట శిక్షణ, శిష్ట
రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించారు. సీతాదేవి
మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ
రామాయణాన్ని ‘సీతాయాశ్చరితం మహత్తు’ అని వెల్లడిచేశాడు.
శ్రీరామాయణం బాలకాండలో
శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య
కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే
అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి,
సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ
కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర
కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెప్పారు. వాల్మీకంలోని ప్రతికాండలో కథాకథనలే
కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ధర్మశాస్త్రం, రాజనీతి, భూగోళ, సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, ఖగోళశాస్త్రం, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురాతత్వ శాస్త్రాల
సమ్మేళనం దర్శనమిస్తుంది. సర్వ
విధాలైన ధర్మాలు తెలియవస్తాయి. రాజ ధర్మం,
ప్రజా ధర్మం, పతి ధర్మం,
సతీ ధర్మం, భాతృ
ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు
ధర్మం, మిత్ర ధర్మం, న్యాయవాది ధర్మం లాంటి సర్వ విధాలైన ధర్మాల గురించి వివరంగా
చెప్పబడింది. ఉదాహరణకు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చర్యల
వలన భాతృ ధర్మం, సుగ్రీవుడి చర్యల వలన మిత్ర ధర్మం,
హనుమంతుడి చర్యల వలన భృత్యు ధర్మం తెలియ చేయబడ్డాయి.
వాల్మీకి
సర్వజ్ఞత్వం
వాల్మీకి రామాయణమనే ‘కలశార్ణవం’ లో రత్నాలను వెదికేవారు,
మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. వాల్మీకి
రామాయణం ‘ధ్వని కావ్యం’. లోకహితం కోరిన గొప్ప
వేదాంతి,
దార్శనికుడు, తపస్వి, సంస్కర్త
వాల్మీకి మహర్షి రామాయణాన్ని 24 వేల
శ్లోకాలతో రచించాడు. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి
వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఈ గాయత్రీ
విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో
పాటే ఉపదేశించాడు. అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి కూర్చిన
బీజాక్షరాల మహాత్మ్యమే కారణం. అష్టాక్షరీ
మంత్రంలోని ‘రా’ శబ్దం, పంచాక్షరీ
మంత్రంలోని ‘మ’ శబ్దం కలిపి వశిష్ఠ మహర్షి ఏ
పుణ్య ముహూర్తంలో ‘రామ’ నామాన్ని నిర్ణయించారో కాని,
యుగయుగాలకు, అది తారక మంత్రమైంది. అజరామరమైంది.
వాల్మీకి
మహర్షి, నారదుడిని పదహారు
ప్రశ్నలు వేస్తాడు. పదహారు తపస్సంఖ్యాకం. పదహారు కళలతో కూడినవాడు పూర్ణ చంద్రుడు. అలానే పదహారు ప్రశ్నలకు
జవాబుగా శ్రీరామచంద్రుడిని తప్ప ఇంకొకరి పేరు చెప్పగలమా? అందుకే
శ్రీరాముడిది పూర్ణావతారం. ఆ పదహారు
కళలకు సాక్ష్యంగా, గుహుడితో
సహవాసం, తాటకాది రాక్షసుల సంహారం, గురువాజ్ఞ
మీరక పోవడం, జనకాజ్ఞ జవదాటక పోవడం, పరశురాముడిని చంపక పోవడం, హనుమంతుడితో సంభాషణ, వాలి వధ, కాకాసుర రక్షణ, హనుమంతుడి రామ సౌందర్య వర్ణన, విభీషణ శరణాగతి, ఇంద్రజిత్తుపై కోపించక పోవడం,
చేజిక్కిన రావణుడిని విడిచిపెట్టడం, విరోధైన
రావణుడిని మెచ్చుకోవడంలాంటి అనేకం వున్నాయి.
వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు,
జవాబిచ్చేవాడూ ఇరువురూ వేదాంతజ్ఞులే.
ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి
గురించే, నారదుడు జవాబిచ్చిందీ అవతార
మూర్తిని గురించే. ప్రశ్న, జవాబు ద్వారా స్పష్టంగా
తెలిసింది రాముడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడనే విషయం.
ఆశ్రిత
రక్షణ
రామాయణంలోని కొన్ని
ప్రధాన ఘట్టాలను పరిశీలిస్తే, ఎన్నో సామాన్య, విశిష్ట ధర్మాలు అవగతమౌతాయి. పితృవాక్య
పాలన, కైంకర్య వృత్తి,
ప్రపన్నుడి
భగవత్ పరతంత్రత, ప్రపత్తికి
భంగం కలిగించకపోవడం, సాక్షాత్తు దైవమైన శ్రీరామచంద్రమూర్తికి
కూడా శోకం కలగడం, గుహుడితో, శబరితో, సుగ్రీవుడితో
స్నేహం చేయడం లాంటివి ఇవన్నీ. ఒకే
ఒక్క బాణంతో రాముడు వాలిని నేలకూల్చాడని
చెప్పడమంటే, తమ్ముడి
భార్యతో సంగమించిన వాడికి శిక్ష వధ అనే శాస్త్ర
బద్ధమైన పనిని రాముడు చేయడమే. వెంటనే ప్రాణంపోయేటట్లు కొట్టలేదంటే వాలికి వాడి దోషం గురించి చెప్పి
ఇది ప్రాయశ్చిత్తమని తెలియచేయడమే. దీన్నిబట్టి రాముడి ధర్మబుద్ధి,
సత్యపరాక్రమం స్పష్టమవుతుంది. వాలి, సుగ్రీవులిరువురూ రామకార్యార్థమే
పుట్టారు. వాలి రావణ వధకొరకు శ్రీరాముడికి సహాయపడేందుకు బదులు,
రావణుడితో స్నేహం చేసాడు. భవిష్యత్ లో రామ కార్యానికి ఉపయోగ పడబోయే
సుగ్రీవుడికి హానిచేసి, అతడిని
చంపే ప్రయత్నం చేసి, రామ కార్యాన్ని భంగపరచ
తలపెట్టాడు. ఈ కారణాన వాలి రాముడి చేతిలో వధించబడ్డాడు.
రావణ
వధ తర్వాత,
విభీషణుడిని లంకకు
ప్రభువుగా చేశాడు శ్రీరాముడు
అని అంటే, రావణ వధ, సీతా
ప్రాప్తి కంటే విభీషణ
పట్టాభిషేకమే రాముడికి ప్రధానమని
సూచనగా భావించాలి. సీతా
ప్రాప్తి స్వకార్యం. చోరదండనమే రావణ వధ. తను
తప్పక చేయాల్సిన పని తాను చేయడంలో గొప్పేముంది?
విభీషణ పట్టాభిషేకం ఆశ్రిత రక్షాధర్మకార్యం. ఆ అశ్రిత రక్షాభిలాషే
రావణ వధకు ముఖ్య కారణం. సీతను కించిత్తు
సమయం నిరాకరించగలిగిన శ్రీరాముడు విభీషణుడి పట్టాభిషేకానికై ఉత్కంఠ
వహించాడు.
వాస్తవాలు-ప్రక్షిప్తాలు
దశరథుడి పుత్రకామేష్టి యాగం, శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల జననం, విశ్వామిత్రుడి యాగరక్షణ, సీతారామ కళ్యాణఘట్టం
మొదలైన అంశాలు బాలకాండ మొదట్లో, చివర్లో వుంటాయి. శ్రీరామచంద్రమూర్తి
అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. స్వధర్మ నిర్వహణ విధిగా విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం
శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా తాటకను చంపడం దోషం కాదు. క్షీరసాగర మధనం సందర్భంగా పేర్కొన్న అనేక
రహస్యాలలో, యోగశాస్త్రాన్ననుసరించి పాల సముద్రంలో అమృతం పుట్టడం, శివుడు వాసుకి కంకణుడు కాబట్టి,
విషం ఆయనను భాదించకపోవడం
లాంటివి వున్నాయి. అహల్య శిలగా మారడం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం
స్పష్టం చేసింది. వశిష్ట విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ
క్షత్రియ యుద్ధం మాత్రమే కాదని, ఆత్మవిద్యకు,
అనాత్మవిద్యకు మధ్య జరిగిన యుద్ధమని వాల్మీకి రామాయణం చెప్తుంది. అలాగే బ్రాహ్మణ్యానికి
కామ, క్రోధాలను జయించడం ఆవశ్యమనే విషయం కూడా వాల్మీకం స్పష్టం చేస్తుంది. రామాయణం
ఒక్కొక్క కాండలో ప్రత్యేకత సంతరించుకున్న ఘట్టాలనేకం వున్నాయి. వాటి వివరాలు
మున్ముందు తెలుసుకుందాం.
సంక్షిప్తంగా వివరాల్లోకి పోతే: రామావతార
ప్రయోజన అంకురార్పణగా యాగరక్షణకు
విశ్వామిత్రుడు శ్రీరాముడిని పంపమని దశరథుడుని అడగడం; వాల్మీకంలో గంగావతరణం; సీతా
కళ్యాణంలో వాల్మీకి భావ సూక్ష్మాలు; శ్రీరాముడి
వనవాసానికి నాందయిన మంథరోపాఖ్యానం,; వనవాసానికి పూర్వం ధర్మం కన్నా దైవం మిన్న అని
లక్ష్మణుడికి నచ్చ చెప్పిన రాముడు; భరతుడికి రాజధర్మం బోధించిన
శ్రీరాముడు; జాబాలి నాస్తికుడు కాదు, ఆస్తికుడు అనే విషయం; శ్రీరాముడి పాదుకా
పట్టాభిషేకం; రామరావణ యుద్ధానికి నాందయిన శూర్పనకోపాఖ్యానం; సీతాపహరణ, లక్ష్మణరేఖ
ప్రస్తావన లేకపోవడం; రామ సుగ్రీవుల స్నేహం; వాలివధ-ధర్మాధర్మాలు; సుగ్రీవుడు వివరించిన
సమస్త భూమండలం;
సుగ్రీవుడిమీద అంగదుడి తిరుగుబాటు; హనుమ సముద్ర లంఘన; త్రిజట స్వప్నం; సీతాదేవి విశ్వాసాన్ని
హనుమంతుడు పొందిన వివరం; హనుమ, రావణ కలయిక; ‘నియత, ప్రాణయుక్త, దేవి’ అని సీత జాడ రాముడికి హనుమ చెప్పిన సందర్భం; రావణుడు సిగ్గుతో
యుద్ధభూమిని వదిలిపోవడం, కుంభకర్ణుడి మరణం; ఇంద్రజిత్తు, రావణుడి మరణాలు; రావణుడికి సంస్కారం
చేయమని విభీషణుడికి రాముడి సూచన; సీతాదేవికి అగ్ని పరీక్ష; శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరామాయణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు.
అందరి మందరం (ఆగస్ట్ 1,
ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు పుణ్యతిథి)
వాల్మీకి బోయవాడికిచ్చిన శాపమే
రామాయణ ఉత్పత్తికి కారణమైంది. రామాయణం
రాయడానికి ముందర ఒక నాడు వాల్మీకి మహర్షి తమసా
నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో, మనోహరంగా
కూస్తూ, క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ క్షణంలో ఒక బోయవాడు, రెండు
పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చగానే, వాడిని కోపంతో
శపించాడు వాల్మీకి. తక్షణమే ఆదికవి
నోటినుండి వెలువడిన వాక్యాలు సమాక్షరాలైన నాలుగు పాదాల శ్లోకమయింది. ఆశ్చర్యంతో ఆశ్రమానికి వచ్చిన వాల్మీకికి బ్రహ్మదేవుడు
రామాయణం రాయమని ఉపదేశించి, సర్వం
ఆయనకు తెలిసేట్లు వరమివ్వడం, ఆ తరువాత నారదుడి ప్రేరణతో రామ
చరిత్రను, వాల్మీకి వివరంగా చెప్పాలనుకోవడం జగద్వితం.
'మానిషాద
ప్రతిష్టాం త్వ...' శ్లోకం
నుంచి ప్రారంభించి, ఆద్యంతం గూఢార్థాలను
వెతుకుతే కాని 'ఆదికావ్యం’ గా, వాల్మీకి 'ఆదికవి'గా లబ్ద ప్రతిష్టమైన వాల్మీకి రామాయణం గురించిన అసలు
విషయం బోధ పడదు. వాల్మీకి రచించిన రామాయణం అవశ్య పఠనీయం. వాల్మీకి చరిత్ర గురించి కూడా
రామాయణంలోనే ఇమిడి వుంది. సీతారామ
లక్ష్మణులు చిత్రకూటంలో వాల్మీకిని కలిసినప్పుడు ఆయనే తనగురించి చెప్పుకున్నాడు. కానీ సంస్కృతం రానివారికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు, కష్టమవుతుంది కూడా. ఆ
కష్టాన్ని మనకు ఆంధ్ర వాల్మీకిగా, వాసు
దాసుగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావుగారు (1863-1939) తీర్చారు. ఆయన నూట ఏబై
సంవత్సరాలకు పూర్వం, కడప జిల్లా ఒంటిమిట్టలో జన్మించారు. వాల్మీకి
రామాయణాన్ని (ఇంతవరకూ ఎవరూ చేయని విధంగా) యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను
కలిపి 24 వేల శ్లోకాలకు 24 వేల పద్యాలతో మందరం అనే పేరుతో
తెనిగించారు. తెలుగునేల
నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్న ఆంధ్రవాల్మీకి
రామాయణం మందరాల
వ్యాఖ్యానంలో విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. వాల్మీకి రామాయణం లేదా యధావాల్మీకమైన ఆంధ్రవాల్మీకి రామాయణం, ధ్వని, అర్థ ప్రతిపాదిత మహామంత్రపూతం, గాయత్రీ బీజసంయుతం, ఔపనిషతత్వసారం.
వాల్మీకి నోటి నుండి వచ్చిన సమాక్షరాలైన
నాలుగు పాదాల ఆ శ్లోకం:
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ
మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ
మిథునాదేక! మవధీః కామమోహితం"
ఆంధ్రవాల్మీకి
రామాయణంలో మొదటి పద్యంగా వాసుదాసుగారిలా
తెనిగించారు ఆ శ్లోకాన్ని:
"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ
నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"
ఈ పద్యం నిశితంగా పరిశీలిస్తే, రామాయణార్థాన్ని సంపూర్ణంగా
సూచిస్తుంది. రామాయణంలోని ఏడు కాండల అర్థం, కథ
ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది. ‘మానిషాదుండ’ అంటే లక్ష్మికి నివాస స్థానమయిన
శ్రీనివాసుడా, శ్రీరాముడా
అనే పదం బాలకాండ అర్థాన్ని; ‘ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు’ అనే పదం పితృవాక్య పరిపాలన,
రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని; ‘శాశ్వతహాయనముల’ అనే పదంలో రాముడు
దండకారణ్యంలో ఋషులకు చేసిన సహాయం ద్వారా
కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని; దాని ఉత్తరార్థంలో కిష్కింధ
కాండార్థాన్ని; క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర
కాండ అర్థాన్ని, తరువాత పదం యుద్ధకాండ అర్థాన్ని
సూచిస్తుంది.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణంమందరం ఆధారంగా)
No comments:
Post a Comment