లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (24-01-2025)
2025 జనవరి 7 నుండి ప్రారంభమైన ‘లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ’ 24 మంది ప్రాణాలు కోల్పోవడానికి, అనేక భవనాలు ధ్వంసమవ్వడానికి, సుమారు రెండు లక్షల మంది వారి నివాసాల నుండి ఖాళీ చేయడం లేదా ఖాళీ చేయించమని హెచ్చరికలు అందుకోవడానికి కారణమైంది. బహుశా ఈ దావాగ్నిని మహాభారత ఇతిహాసంలోని ఖాండవ దహన కథతో సమీపంగా పోల్చవచ్చునేమో! ఖాండవ దహనం కథలో చోటుచేసుకున్న ‘విధ్వంసం’ సృష్టి ఆదిమధ్యాంతాలను ప్రతిబింబిస్తుంది. ద్వాపర యుగాంత ఆరంభానికి, కలియుగ మొదలుకాబోవడానికి సంకేతమని భావించవచ్చు. మహాకావ్యం మహాభారతంలో, ఖాండవ అరణ్యం భగవత్సరూపులుగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణార్జున శక్తి-యుక్తులతో అగ్నికి ఆహుతైనట్లు వివరించడం జరిగింది. మానవుల అలక్ష్యం కారణానో, మెరుపుల దాటికో, లేదా అగ్ని పర్వతాల ప్రభావం వల్లో, అడవులలో సంభవించి, అతి త్వరగా వ్యాపించే ఆధునిక దావాగ్నుల ప్రమాదాలలో ఒకటైన ‘లాస్ ఏంజెల్స్ దావాగ్నికాండ’ కూడా ఖాండవ దహన విధ్వంసంలాంటి ప్రభావాన్ని చూపించాయి. రెండింటిలోనూ ‘అగ్ని (దేవత) శక్తి’ మార్పుకు సంకేతం.
లాస్ ఏంజెల్స్ అగ్నికాండలో హాలీవుడ్ ప్రముఖులు అంతోనీ హాప్కిన్స్, బిల్లీ క్రిస్టల్, పారిస్ హిల్టన్, జెఫ్ బ్రిడ్జెస్, మండీ మూర్, మిలో వెంటిమిగ్లియా, టీనా నోల్స్ తదితరుల విలువకట్టలేని గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. చిత్ర పరిశ్రమకు ప్రీతిపాత్రమైన ‘పసిఫిక్ ప్యాలిసేడ్’ ప్రాంతంలో దావాగ్ని ఉధృతంగా కొనసాగింది. ప్యాలిసేడ్ ప్రాంతంలో 23,700 ఎకరాలు, ఈటన్ ప్రాంతంలో 14,100 ఎకరాల పైగా భూభాగం దగ్ధమైంది. ‘ది డోర్స్’ బ్యాండ్‌కు చెందిన ప్రముఖ గిటారిస్ట్ రాబీ క్రీగర్ తన బృందానికి హిట్ సాంగ్ ‘లైట్ మై ఫైర్’ను రాసిన లాస్ ఏంజెల్స్ నివాసం కూడా అగ్నికి బలైంది. జెపాల్ గెట్టి మ్యూజియం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయాయి.
అడవి అగ్నిప్రమాదాలు సాధారణంగా ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సంభవిస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, దీర్ఘకాలిక వర్షాభావం వల్ల అడవులు అగ్ని ప్రమాదానికి గురయ్యేలా మారడం, ఎండల వల్ల తేమ తగ్గడం, వేడి-పొడిబారిన గాలులు అగ్నిని వేగంగా వ్యాపింపజేయడం, మళ్లీ మళ్లీ చెలరేగే అగ్ని చినుకులతో కొత్త ప్రాంతాల్లో మంటలు రావడం, దట్టమైన అడవులు అగ్ని తీవ్రతను పెంచడం, ప్రాణాంతకమైన కొన్ని అటవీ మొక్కలు, పర్వత ప్రాంతాలు మంట వ్యాప్తికి కారణమవుతాయి.
దురదృష్టవశాత్తూ, కాలిఫోర్నియాలో ప్రతీఏటా వేసవి, శరదృతువులలో అగ్నిప్రమాదాలు సాధారణంగా సంభవించినప్పటికీ, వాతావరణ శాస్త్రవేత్తలు వాటిని ముందుగా అంచనా వేయడం సాధ్యపడడం లేదు. ఉపగ్రహాలు, డ్రోన్లు, అగ్ని ట్రాకింగ్ సాంకేతికతలు ఉన్నప్పటికీ, దావాగ్నిప్రమాదం ఏ సమయంలో, ఎక్కడ విస్తరిస్తుందో, ఎలా ముంచుకొస్తున్నదో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఈసారి ప్రబల గాలులు అగ్ని వేగాన్ని ఊహించలేనంతగా పెంచాయి. లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు సమగ్ర చర్యలు అవసరం. అలాగే ఇప్పుడు సంభవించిన లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదంలో ‘సంక్షోభ నిర్వహణ’ అత్యంత అవశ్యం.
ఇదే జరుగుతున్నది ఇప్పుడక్కడ. లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాద నేపధ్యంలో ‘రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు’ త్వరితగతిన స్పందించి ‘తక్షణ అగ్నిమాపక చర్యలు’ చేపట్టాయి. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యేక బృందాలతో కలిసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పాటు, నేషనల్ గార్డ్‌ను మోహరించి, ‘సరయిన సురక్షిత స్థలాలను’ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా నిబద్ధతగల ఫెడరల్ అగ్నిమాపక సిబ్బంది విమానాలను కూడా రక్షణ చర్యలకు వినియోగించారు. అయితే, శతాబ్దం నాటి పాత పైపులైన్‌ల వల్ల నీటి కొరత తలెత్తింది. ఫైర్ హైడ్రెంట్లు నీటికొరతవల్ల వృధా కాగా, అగ్నిమాపక దళాలు ప్రధానంగా గగనతల నీటి వర్షంపై ఆధారపడాల్సి వచ్చింది. సహాయ కేంద్రాలు అవసరమైన అన్ని తాత్కాలిక సదుపాయాలను కల్పించాయి.
ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ‘తక్షణ ఖాళీ చేయించాల్సిన ఉత్తర్వులు’ (Mandatory Evacuation Orders) జారీ చేసింది. వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్, సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రసార సంస్థలు సరైన సమయంలో క్షణ-క్షణం చోటుచేసుకున్న సమాచారాన్ని అందించేందుకు వినియోగించబడ్డాయి. కొత్త అగ్నిప్రమాదాలను నివారించేందుకు ‘ముందస్తు విద్యుత్ సరఫరా నిలిపివేతలు’ చేపట్టారు. కాలిఫోర్నియాను ‘ప్రధాన విపత్తు ప్రాంతంగా ప్రకటించాలి’ అనే అభ్యర్థనను ఫెడరల్ ప్రభుత్వం ఆమోదించింది. తద్వారా ‘ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA)’ సహాయం అందుబాటులోకి వచ్చింది. ‘నేషనల్ ఇంటర్ ఏజెన్సీ ఫైర్ సెంటర్ (NIFC)’ వివిధ రాష్ట్రాలలో అగ్నిమాపక చర్యలను సమన్వయం చేసింది. ‘పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA)’ వాయు నాణ్యతను పర్యవేక్షించింది. అయితే, అధిక కాలుష్యం, పొగ, బూడిద, లాస్ ఏంజెల్స్ అంతటా వ్యాపించి, ప్రజల్లో శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారి తీసింది.
లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో అగ్నిప్రమాద నివారణ, సహాయ కార్యక్రమాలు, పునరావాసంలో సామాజిక, స్వచ్ఛంద సంస్థలు (NGOs) కీలక భూమిక పోషించాయి. తక్షణ సాయంగా తిండి, నీరు, ఆశ్రయం కల్పించడం, మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడం, జంతు రక్షణ, పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. అయితే, పరిమిత వనరులు, సమాచార లోపాలు, సమగ్ర సమన్వయం లోపించడం వంటి సవాళ్లు ముందుకొచ్చాయి. ‘అమెరికన్ రెడ్ క్రాస్, కాలిఫోర్నియా వాలంటీర్స్’ వంటి స్వచ్ఛంద సంస్థలు అత్యవసర సహాయ సేవలను అందించాయి.
ఈ నేపధ్యంలో మరొక్కమారు ఖాండవ దహనం, దాని విధ్వంసం ద్వారా సృష్టి ఆరంభ, అంతాలు చోటుచేసుకున్న వివరాలు ఆసక్తికరంగా వుంటాయి. అధిక సంఖ్యలో లక్షలాది జీవుల నివాసంగా ఉన్న ఖాండవ అరణ్యాన్ని, ‘దానవుల శిల్పి మాయ’ నివాసంగా ఉన్న దాన్ని, అర్జునుడు, శ్రీకృష్ణుడు ‘అగ్ని దేవుడి’ సహాయంతో సదుద్దేశంతో తగలబెట్టారు. అగ్ని దేవుడి ఆకలిని తీర్చేందుకు, ఆయన కోరికను నెరవేర్చేందుకు చేపట్టిన ఈ కార్యం యాదృచ్ఛిక ఘటన కాదు, దైవకల్పిత ఆదేశం. అరణ్యం నాశనమైనప్పటికీ, ఆ ప్రదేశంలో ‘మయ నగరం’ నిర్మితమైంది. దీనిని ఆధునిక విధ్వంస, పునర్నిర్మాణ సైకిల్ తోపోల్చవచ్చు. అంటే ఒక వినాశనం ఎప్పటికైనా మరొక నూతన సృష్టికి మార్గం సుగమం చేస్తుంది.
ఆధునిక అగ్ని ప్రమాదాలకు, ఖాండవ దహనానికి సారూప్యతలున్నాయి. కాలిఫోర్నియాలోని ఆధునిక అగ్ని ప్రమాదాలు సహజంగా లేదా మానవ అనాలోచన తప్పిదాలవల్ల సంభవించి విస్తృత స్థాయిలో నాశనానికి కారణమౌతాయి. ఖాండవ దహనంలో లాగా దేవతాప్రేరిత లేదా ప్రత్యేక ఉద్దేశాలు వీటికి నేపధ్యంలో లేకపోయినా, ఒకవేళ వున్నా తెలియక పోయినా, కొంతవరకు సామీప్య-సారూప్యతలు కనిపిస్తాయి. ఖాండవ దహనం లాగే, ఆధునిక అగ్ని ప్రమాదాలు అడవులను, వన్యప్రాణులను, మానవ నివాసాలను నాశనం చేయగల శక్తి కలవి. ఇరు సందర్భాల్లోనూ ప్రాణ నష్టం జరుగుతుంది. భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఖాండవ దహనం తర్వాత ‘మయనగరం’ నిర్మాణం జరిగినట్లే, ఆధునిక అగ్ని ప్రమాదాల తర్వాత పునరుద్ధరణ క్రమంలో కొత్త అభివృద్ధి, వన్యప్రాణుల పునరాగమనానికి అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలంలో విలువైన మట్టిని కోల్పోవడం, జీవ వైవిధ్యం తగ్గిపోవడం వంటి సవాళ్లు ఏర్పడతాయి.
దావాగ్ని ప్రమాదాలపై ఆధ్యాత్మికత, యథార్థవాదం తెలుసుకోవడం అవశ్యం. మహాభారతంలోని ఖాండవ దహనం ఒక నైతిక, ధార్మిక యుద్ధంలో భాగంగా జరిగిందని చెబుతారు. కృష్ణుడు, అర్జునుడు దైవ సంకల్పాన్ని నెరవేర్చడంలో పాత్ర వహించారు. అయితే, ఆధునిక అగ్ని ప్రమాదాలు ప్రధానంగా మానవ తప్పిదాలు, సహజ కారణాల వల్ల ఏర్పడి, విపత్తు నిర్వహణ కోణంలో చూడబడతాయి. అగ్ని ప్రమాదాల తర్వాత పూర్తి పునరుద్ధరణ కోసం హిందూమత సంప్రదాయరీతిలో సంబంధిత దేవుళ్లను ప్రార్థించడం, పూజలు చేయడం సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరంగా ప్రజలకు మేలు కలిగించవచ్చు. హిందూమత గ్రంథాలలో సూచించిన విధంగా అగ్ని దేవునికి ప్రార్థనలు, మహా మృత్యుంజయ మంత్రం, దుర్గాదేవి, శివుని పూజలు జరిపించడం వల్ల రక్షణ, పునరుద్ధరణ సులభతరం కావచ్చని ఒక నమ్మకం. అది నమ్మేవారిమీద ఆధారపడి వుంటుంది.
కానీ, దీర్ఘకాల పునరుద్ధరణకు ఆధ్యాత్మికతతో పాటు యథార్థవాద దృక్పథంతో విపత్తు నిర్వహణ చర్యలు సహితం అత్యంతమౌలికమైన అవసరం. ‘ఆధ్యాత్మిక స్థైర్యం, శాస్త్రీయ చర్యల’ సహజ సాంకేతిక, మానసిక కలయిక ద్వారా మాత్రమే బాధిత సమాజం పూర్తిగా కోలుకోవడమే కాక, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించగలాడం సాధ్యం. దావాగ్నులపై దీర్ఘకాలిక సమగ్ర పోరాటం చేయడం అంటే ఆధ్యాత్మిక మద్దతు, ప్రభుత్వ చర్యలు, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణ స్థిరత్వాన్ని సమతుల్యంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయడమే!
లాస్ ఏంజెల్స్‌లోని పాలిసేడ్స్ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రధాన కారణం మానవ ప్రమేయం కావచ్చని అధికారులు చెపుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, యువతీ యువకులకు ఆహ్లాదం కలిగించే ‘స్కల్ రాక్’ అనే ప్రదేశం దగ్గరిలో మొదలైంది. ఈటన్ అగ్ని ప్రమాదానికి పవర్ లైన్లలోని లోపాలని మరో కథనం. ఖాండవ దహనం ఒక దివ్య సంకల్పంగా పరిణమిస్తే, ఆధునిక అగ్ని ప్రమాదాలు మానవ తప్పిదాలు, సహజ విపత్తుల రూపంలో సమాజాన్ని పరీక్షిస్తున్నాయి. ధైర్యం, సామూహిక ప్రేరణ, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ఇలాంటి విపత్తుల ను అధిగమించవచ్చు. అగ్ని నిర్ఘాతం భవిష్యత్తును మార్చినా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం మన చేతిలో ఉంది.
(యూఎస్ఏ మీడియా నివేదికలు, మహాభారతం ఆధారంగా)
No comments:
Post a Comment