భాగవతంలో శివుడు
వనం జ్వాలా నరసింహారావు
భక్తిపత్రిక (ఫిబ్రవరి, 2025)
పోతన భాగవతంలో వివిధ సందర్భాలలో శివుడి ప్రస్తావన సందర్భోచితంగా, కనిపిస్తుంది. దక్షయజ్ఞాన్ని శివుడు ధ్వంసం చేయడం; త్రిపురాసుర సంహారం; క్షీరసాగర మథనంలో పాల సముద్ర్తం నుండి పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగడం; వృకాసురుడి శివద్రోహం; శివకేశవుల జీవాయుధ పోరాటం మొదలైనవి ముఖ్యమైనవి.
బాణాసురుడి కథ అత్యంత కమనీయంగా ఉంటుంది భాగవతంలో. బలి చక్రవర్తి కుమారుడైన గొప్ప శివ భక్తుడు. అతడు కోరిన వరం ప్రకారం శివుడు అతడి కోట వాకిటి ముందు కావలిగా ఉన్నాడు. పరివారంతో సహా బాణుడి శోణపురానికి రక్షకుడయ్యాడు.
బాణుడి కూతురు పేరు ఉష. ఒకరాత్రి నిద్రలో రుక్మిణీ, శ్రీకృష్ణుల మనుమడు, ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడిని ఆమె కలిసి సుఖించినట్లు కలకన్నది. అప్పటి నుంచి అతడి కోసం తపించ సాగింది. ఆమె బాధ చూడలేని స్నేహితురాలు చిత్రరేఖ అనిరుద్ధుడి చిత్రాన్ని వేసి చూపించగా గుర్తుపట్టింది ఉషాకన్య. చిత్రరేఖ తనకు తెలిసిన విద్యతో అతడి గురించిన వివరాలన్నీ సేకరించి, స్నేహితురాలికి చెప్పింది. అనిరుద్ధుడుని యోగమహిమతో ఎత్తుకుని వచ్చి, ఉషాకన్యతో కలిపింది. వారి ప్రేమకు చిహ్నంగా ఉషాకన్య గర్భం దాల్చింది.
బాణాసురుడికి ఈ విషయం తెలిసింది. అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు. కారాగారంలో పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ద సుడిగాలి వీచి బాణుడి విశాలమైన ధ్వజం కూలి నేలమీద పడింది. శివుడు తనకు చెప్పినట్లు తనకు సరైన జోడీతో యుద్ధం జరగ బోతున్నదని బాణుడు సంతోషించాడు. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు బాణాసురుడి మీదికి దండయాత్రకు బయల్దేరాడు. యాదవ సైన్యం బాణుడి నగరాన్ని ధ్వంసం చేశారు. యుద్ధం మొదలైంది. నగరానికి రక్షకుడుగా వున్న పరమ శివుడు బాణుడికి సహాయంగా రణరంగానికి వెళ్లాడు.
శివకేశవుల యుద్ధం
శివుడు, కృష్ణుడు ఒకరితో మరొకరు తలపడ్డారు. కృష్ణుడి శౌర్యప్రతాపాలను శివుడు సహించలేకపోయాడు. బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు శివుడు. దాన్ని శ్రీకృష్ణుడు అద్భుతంగా ఉపశమింప చేశాడు. శివుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని పర్వతాస్త్రంతో తుంచి వేశాడు కృష్ణుడు. ఆగ్నేయాస్త్రాన్ని ఐంద్ర బాణంతో రూపుమాపాడు. మహేశ్వరుడు శ్రీకృష్ణుడి మీద పాశుపతాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. నారాయణాస్త్రాన్ని వేసి దాన్ని వెనుకకు మరలించాడు శ్రీకృష్ణుడు. ఉత్సాహాన్ని కోల్పోయిన శివుడి మీద సమ్మోహనాస్త్రాన్ని వదలడంతో ఆయన సోలిపోయాడు.
తక్షణమే శ్రీకృష్ణుడు వీరవిహారం చేస్తూ బాణాసురుడి సమస్త సైన్యాన్ని పరిమార్చాడు. కృష్ణుడి అఖండ పరాక్రమానికి బాణాసురుడు భయపడి రాచనగరులోకి పారిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే శివ-కేశవుల మధ్య ‘జీవాయుథ యుద్ధం’ చోటు చేసుకుంది. మూడు తలలు, మూడు పాదాలు, భయంకరాకారం కలిగి, కోపావేశంతో ‘శివజ్వరం’ (శివుడి జీవాయుథం) కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అలా వచ్చిన దాన్ని చూసిన కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు. వెంటనే (తన జీవాయుథమైన) ‘వైష్ణవజ్వరాన్ని’ ‘శివజ్వరం’ మీదికి ప్రయోగించాడు. ‘శివవైష్ణవ జ్వరాలు’ రెండూ తమ బలాన్ని, శక్తిని, శౌర్యాన్ని, ప్రతాపాన్నీ ప్రదర్శిస్తూ ఘోరంగా యుద్ధం చేశాయి. చివరకు వైష్ణవజ్వరం ముందు శైవజ్వరం ఓడిపోయింది. ప్రాణభీతి పట్టుకుని, శివజ్వరం, కృష్ణుడి పాదాలమీద పడి, అనేక విధాల స్తుతించి ‘నీవే శరణు నాకు’ అని వేడుకుంది. వైష్ణవజ్వరం దాన్ని బాధించదని శ్రీకృష్ణుడు చెప్పగానే శివజ్వరం పరమానందంతో పరమాత్ముడికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్లిపోయింది.
యజుర్వేదం ‘శివాయ విష్ణురూపాయ’ అనే మాట శివకేశవుల అభేదాన్ని తెలియచేస్తుంది. ‘శివ’ శబ్దానికి త్రిగుణాతీతుడు, శుభస్వరూపుడు అనే అర్థాలున్నాయి. ‘విష్ణు’ అంటే వ్యాపించినవాడు. త్రిగుణాతీతమైన, మంగళకరమైన ఈశ్వర చైతన్యం ‘శివుడు’ కాగా, విశ్వమంతా వ్యాపించితే ‘విష్ణువు’ అవుతుంది. అదే ‘శివాయ విష్ణురూపాయ’. శివకేశవులకు, ‘శివపురాణం, విష్ణుపురాణం’ అనే ప్రత్యేక పురాణాలు ఉన్నప్పటికీ వాటి అర్థం తెలుసుకుంటే భేదభావం కనిపించదు. భగవంతుడు కలహించడు. కలహం మతవాదుల మధ్యనే. ‘చేతులారంగ శివుని పూజించడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని’ అని అంటారు. చేతులారా శివుని పూజించి, నోటితో హరికీర్తన చేయమంటూ పోతన పద్యకవితలోని అంతరార్థం ఇదే. శివుడు శ్రీరామనామరసికుడు, విష్ణు వల్లభుడు. ఒకరినొకరు గౌరవించుకున్నారంటే అర్థం, ఒకరికంటే ఇంకొకరు తక్కువనీ, ఎక్కువనీ కాదు. ఇద్దరూ సమానమేననీ, లోక నిర్వహణ కోసం రెండుగా వ్యక్తమైన ఒకే తత్త్వమని అర్థం.
పారిపోయిన బాణాసురుడు మళ్లీ కదన రంగానికి వచ్చాడు రెండో సారి. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. అది బాణుడు వేయి చేతులలో నాలుగు మాత్రం మిగిల్చి మిగిలిన వాటన్నింటినీ నరికి వేసింది. అతడి మీద వాత్సల్యం వున్న పరమేశ్వరుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, ఆయన్ను స్తోత్రం చేశాడు. శివుడి ప్రియ భక్తుడైన బాణుడిని చంపడం లేదన్నాడు శ్రీకృష్ణుడు. బాణాసురుడు శోణపురానికి పోయి తన కుమార్తె ఉషాకన్యకు, అనిరుద్ధుడికి బంగారు ఆభరణాలు ఇచ్చి, తీసుకువచ్చి శ్రీకృష్ణుడికి అప్పగించాడు. ఇదే ‘ఉషాపరిణయం’ నేపధ్యం.
దక్షయజ్ఞ గాథ
దక్ష ప్రజాపతి ఒక పర్యాయం, పెద్దలు నిర్వహిస్తున్న ఒక సత్రయాగం చూడడానికి దక్షుడు రాగా బ్రహ్మ, మహేశ్వరులు మినహా, సభాసదులందరూ మర్యాద పూర్వకంగా లేచి నిల్చున్నారు. దక్షుడు తనకు తండ్రైన బ్రహ్మకు నమస్కరించి, ఉచితాసనం మీద కూర్చున్నాడు. తనను చూసి ఆసనం మీద నుండి దిగని శివుడి వైపు కోపంగా చూస్తూ, అక్కడున్న దేవతలను, ఇతరులను ఉద్దేశించి శివుడిని పరిపరి విధాల దూషించాడు. శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అతడిని శపిస్తానని జలాన్ని స్వీకరించాడు.
కోపంతో దక్షుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. దక్షుడికి, ఈశ్వరుడికి మధ్య పరస్పర విరోధం కొనసాగింది. ఈ నేపధ్యంలో రుద్రహీనమైన ‘వాజపేయం’ అనే యజ్ఞాన్ని చేసిన దక్షుడు, ‘బృహస్పతి సవనం’ అనే యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. ఇది తెలుసుకున్న ఈశ్వరుడి భార్య సతీదేవి తామిద్దరం కూడా వెళ్దామని భర్తతో అన్నది. సత్రయాగంలో జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ శివుడు, వద్దని వారించాడు. ఒకవేళ ఆమె వెళ్లితే, పరాభవం కలుగుతుందని హెచ్చరించాడు. తండ్రిని చూడాలన్న కోరికతో సతీదేవి పుట్టింటికి వెళ్లింది. యజ్ఞశాల దగ్గర తల్లి, తోబుట్టువులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు.
తండ్రి పలకరించనందుకు మౌనంగా వుండిపోయిందామె. తండ్రి అనాదరణకు గురైన ఆమె బాధను చూసి, కోపంతో, భూత గణాలు ఆవేశపడ్డాయి. దక్షుడిని హతమారుస్తామంటూ లేచిన గణాలను సతీదేవి వారించింది. తన రోషాన్ని వ్యక్తం చేస్తూ, దుష్టబుద్ధితో ఈశ్వరుడిని నిందించిన దక్షుడి వల్ల సంప్రాప్తించిన తన శరీరాన్ని విడిచి పరిశుద్ధురాలినవుతానని అన్నది. యజ్ఞసభా మధ్యలో నిలబడి, శరీర త్యాగం చెయ్యాలని భావించింది. యోగాగ్నిని రగుల్కొలిపి, అగ్నిలో ఆ క్షణమే దగ్ధమైపోయింది సతీదేవి.
శివుడికి పట్టరాని కోపం వచ్చి, జటాజూటం నుండి ఒక జడను పెరికి భూమ్మీద విసిరికొట్టాడు. అందులోనుండి వీరభద్రుడు రుద్రుడి ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, దక్షుడిని సంహరించమని చెప్పాడు శివుడు. ఆయన యజ్ఞవాటికకు చేరుతుంటే, భయంకరమైన కారుచీకటి కమ్మింది. ధూళి పుట్టింది. ప్రభంజనం వీచింది. వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుడిని పడతోసి, కంఠాన్ని నులిమి, శిరస్సును తుంచి, మహాకోపంతో దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇలా వీరభద్రుడు శివుడి ఆజ్ఞానుసారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి కైలాసానికి వెళ్లిపోయాడు.
ఇదంతా దేవతలు బ్రహ్మదేవుడికి చెప్పి ఆయనకు మొరపెట్టుకున్నారు. వారంతా కలిసి కైలాసాన్ని దర్శించారు. ధర్భాసనం మీద కూర్చున్న ఈశ్వరుడిని చూశారు. ‘యజ్ఞభాగాన్ని పొందే అర్హతగల నీకు యజ్ఞభాగాన్ని సమర్పించక పోవడం వల్ల, నీవల్ల ధ్వంసం చేయబడి, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ దక్షుడి యాగాన్ని మళ్లీ ఉద్ధరించి, దక్షుడిని పునఃజీవితుడిని చెయ్యాలని ప్రార్థన. మిగిలిన యజ్ఞాన్ని పరిపూర్తి చేసి ఈ యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించు’ అని వేడుకున్నారు.
ఇంద్రాది దేవతలు, ఋషులు వెంటరాగా బ్రహ్మ దేవుడు రుద్రుడిని తీసుకుని దక్షయజ్ఞ వాటికకు వచ్చాడు. దక్షుడిని గొర్రెతల వాడిగా చేయడంతో, అతడు నిద్ర నుండి లేచినవాడిలాగా లేచి సంతోషించాడు. రుద్రుడిని ద్వేషించడం వల్ల కలిగిన పాపాల నుండి విముక్తి పొందాడు. శివుడిని స్తుతించాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. యజ్ఞకార్యాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. యజ్ఞపరిసమాప్తి అవుతుంటే, శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. రుద్రుడు ఆటంకపరచిన దక్షుడి యజ్ఞాన్ని శ్రీహరి పూర్తి చేశాడు. దక్షుడిని చూసి తాను తృప్తి చెందానని అన్నాడు. దక్షుడు శ్రీహరిని పూజించాడు. సతీదేవి పూర్వదేహాన్ని వదిలి, హిమవంతుడి పుత్రికగా మేనకకు జన్మించి, ఈశ్వరుడిని వరించింది.
No comments:
Post a Comment