శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పల ధడియం భరతశర్మ
అవధాన
పరంపరలో ఒక యుగసూచక యువమేధావి
వనం
జ్వాలా నరసింహారావు
తెలుగు సాహిత్యంలో అవధానం అనేది కేవలం ఒక కళ కాదు, అది మేధస్సు, ధారణ, ఆశుకవిత్వం, ఛందోపాండిత్యం, సమయస్ఫూర్తి
సమన్వయంగా అవతరించే మహావిన్యాసం. వేల ఏళ్ల చరిత్ర గల ఈ విశిష్ట ప్రక్రియ నేటి
కాలంలో అరుదైనదైపోతున్న తరుణంలో, అతి పిన్న
వయసులోనే అష్టావధానాలు, శతావధానాలు
నిర్వహిస్తూ అవధాన పరంపరకు కొత్త ప్రాణం పోస్తున్న యువ అవధాని, శతావధాన తిలక
బ్రహ్మశ్రీ ఉప్పల ధడియం భరతశర్మను మనస్ఫూర్తిగా అభినందించి తీరాలి.
అవధానం, ఛందస్సు, గురు పరంపర..... ఒక ఆసక్తికరమైన, విజ్ఞానపరమైన
అంశాలు. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, చందోబద్ధమైన ప్రక్రియలు, ఆధునిక సాహిత్యంలో
మహానీయిలెందరో చేసిన కృషి ఎంత పొగిడినా తక్కువే. షట్ శాస్త్రాలలో ‘ఛందస్సు’ వేదాంగంగా
భావించబడుతుంది. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో వాజ్మయ శరీరానికి శ్వాసలుగా
గురు, లఘువులు పనిచేస్తాయి. ఛందస్సు ప్రాచీన మానవ పరిణిత మేధా సృష్టి!
ఛందశ్శాస్త్రానికి గొప్ప గురుపరంపర ఉందని శాస్త్రాలు చెబుతాయి.
మహాశివుని నుండి బృహస్పతి, గుహుడు, ఇంద్రుడు,
శుక్రుడు, యాస్కుడు,
మాండవ్యుడు, పింగళుడు మొదలైన మహర్షుల వరకూ ఈ జ్ఞానం పరంపరగా
ప్రవహించిందని పండితులు పేర్కొంటారు. ఇది ఒక గురు పరంపర అంటారు! ఇలాంటి 30 రకాల ఛందో
గురుపరంపరలున్నాయని, చివరకు పింగళుడి
దగ్గర సర్వ ఛందశ్శాస్త్రం నిక్షిప్తమైందని పండితులంటారు. అటువంటి పవిత్ర పరంపరలో భాగంగా అవధాన విద్య
వికసించింది. కాగితం, కలం సహాయంతో పద్యం రచించేవారు ఒకరైతే, ఏకకాలంలో అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ఆశువుగా ఛందోబద్ధమైన పద్యాలను సృష్టించి, వాటిని ధారణలో నిలుపుకుని చివరికి ఒక్క తప్పు
లేకుండా పునఃస్మరణ చేసే అవధాని మరొకరు. ఇది సరస్వతీ కటాక్షం, గురుకృప, నిరంతర సాధన
కలిసినప్పుడే సాధ్యమయ్యే అపూర్వ కళ.
పద్యం ఎలా నిర్మితమవాలి, ఏ ఏ లక్షణాలతో
ఎటువంటి పద్యాలుంటాయి, ఆ పద్యాలు
రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్సాస్త్రం. పద్యాలతో కవిత్వం
చెప్పదల్చుకున్న రచయిత మదిలో పుట్టిన భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన
నిర్మాణాన్ని పొంది, ఆహ్లాదాన్ని
కలిగిస్తూ ఒక లయలాగా సాగడాన్ని ఛందస్సు అంటారు. పద్యం ఒక నియమానుసారం ‘పాదాలు’ గా
విభజించబడతాయి. ఆ పాదాలు ‘గణాల’ మీద ఆధారపడతాయి. గణాలు వాటి స్వభావాన్ని,
స్వరూపాన్ని బట్టి రకరకాలుగా నియంత్రించ బడ్డాయి.
గణాల కలయిక వల్ల ఏర్పడిన పాదాలన్నీ కలిసి పద్యంగా ఏర్పడుతుంది. గురు, లఘువులు, యతి ప్రాసలు, పద్యకవిత్వం చెప్పేవారు తప్పనిసరిగా పాటించి
తీరాల్సిన నియమాలు. గణాలు ఎలా కలవాలి, యతి, ప్రాసల
నియమాలు ఏమిటి, ఇవన్నీ నిర్దేశించేది ఛందశ్శాస్త్రమే. ఏ ఏ లక్షణాలతో ఎటువంటి
పద్యాలుంటాయి, ఆ పద్యాలు
రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్సాస్త్రం. ఈ ఛందస్సును సామాన్య
శ్రోతలకూ ఆస్వాద్యంగా తీసుకువచ్చిన ప్రక్రియ అవధానమని చెప్పడంలో అతిశయోక్తి
లేదేమో!
తిరుపతిలో జన్మించిన ఉప్పల ధడియం భరతశర్మకు బాల్యం నుంచే సాహిత్య, సంగీత
వాతావరణం అలవడింది. తల్లి శ్రీమతి శైలజ, సంగీతం, వీణ
విద్యలో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయురాలు. తండ్రి శ్రీ రాజీవలోచన శర్మ,
జర్నలిస్ట్. చిన్ననాట నుంచే భగవద్గీత శ్లోకాలు,
భాగవత
పద్యాలు అభ్యసించడం వల్ల సంస్కృతం, తెలుగు భాషలపై
భరతశర్మకు సహజమైన మక్కువ పెరిగింది. ప్రస్తుతం తిరుపతిలోని జాతీయ సంస్కృత
విశ్వవిద్యాలయంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న భరతశర్మ, విద్యార్థి దశలోనే అవధానం, ప్రవచనం, మృదంగ వాద్యం
వంటి అనేక రంగాలలో విశేషమైన ప్రావీణ్యం సంపాదించారు.
అవధాన విద్యలో గురువుల పాత్ర అమూల్యమైనది. భరతశర్మకు ఈ విషయంలో
అపూర్వమైన భాగ్యం కలిగింది. ‘త్రిభాషా సహస్రావధాని’ బ్రహ్మశ్రీ వద్దిపర్తి
పద్మాకర్, ‘ఛందశ్శాస్త్ర
రత్నాకర’ బ్రహ్మశ్రీ తోపెల్ల బాలస్తబ్రహ్మణ్య శర్మల శిక్షణలో భరతశర్మ అవధాన విద్య, ఛందస్సు సూత్రాలు, ఆశుకవిత్వ
గరిమను లోతుగా అభ్యసించారు. భరతశర్మ తన 15వ ఏట
మొదటి అష్టావధానాన్ని నిర్వహించడం తెలుగు సాహితీ వేదికలపై సంచలనంగా మారింది.
2021 దసరా సందర్భంలో
బ్రహ్మశ్రీ తోపెల్ల బాలస్తబ్రహ్మణ్య శర్మ సంచాలకత్వంలో అంతరంగిక అష్టావధానం
ప్రారంభించి, అనంతరం
ఏలూరులోని ప్రణవ పీఠంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సంచాలకత్వంలో మొదటి
ప్రతాక్ష అష్టావధానాన్ని నిర్వహించారు. 2025
సెప్టెంబర్
నాటికి భరతశర్మ చేసిన అవధానాల సంఖ్య: 91 అష్టావధానాలు (6 ద్విగుణిత అష్టావధానాలు, ఒక సంస్కృత అష్టావధానం సహా), 3 శతావధానాలు. 16
ఏళ్లకే
మొదటి శతావధానం చేసి ‘అత్యంత యువ శతావధాని’గా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 17 ఏళ్ల వయసులో ఆలుగడులో జరిగిన శతావధానంలో కేవలం 22 నిమిషాలలో 75
పద్యాలను
ధారణ చేసి ‘శతావధాన తిలక’ బిరుదును సొంతం చేసుకున్నారు.
భరతశర్మ రచనలు, సాహిత్య సేవ
ప్రత్యేకంగా పెర్కొనాల్సిన విషయాలు. అవధానంతో పాటు భరతశర్మ రచనా రంగంలోనూ విశేష
కృషి చేశారు. ఆయన రచనలు: శివభవేశ శతకము
(2021), యాదగిరి
శ్రీలక్ష్మీనృసింహేశ్వర శతకము (2022), అనంతఛందస్సౌరభములో
100 వివిధ
ఛందస్సులలో శతక రచన (2022), భరత శతావధానం – తొలి శతావధాన పద్య సంకలనం (2023), శ్రీ కపిలేశ్వర శతకము (2024), అవధాన బాలభాస్కరము – తొలి 50 అవధానాల పద్య
సంకలనం (2025) మొదలైనవి
వున్నాయి.
భరతశర్మ బహుముఖ ప్రతిభలొ భాగంగా ఆయనకు సంగీతం, నాటకం, ప్రవచనంలో
వున్న ప్రావీణ్యాన్ని గురించి చెప్పుకోవాలి. సాహిత్యంతో పాటు సంగీత రంగంలోనూ
భరతశర్మ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మశ్రీ పారుపల్లి బాలస్తబ్రహ్మణ్య శర్మ శిక్షణలో
మృదంగం డిప్లొమా కోర్సును పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తల్లి
శ్రీమతి శైలజ వీణ కచేరీలకు, వివిధ సంగీత
సభలకు మృదంగ సహకారాన్ని అందించారు. భువనవిజయ నాటకంలో అల్లసాని పెద్దన పాత్రను
పోషించి, పద్య–గద్యాల
అనరీళ ప్రదర్శనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
తన లక్ష్యం, అవధాన విద్య ద్వారా సామాజిక చైతన్యం కలిగించడమేనని భరతశర్మ
అంటారు. సంస్కృత, ఆంధ్ర కావ్యాలు, పురాణాల ద్వారా నేటి యువతకు జీవన విలువలను
అందించడం, అవధాన ప్రక్రియ
ద్వారా విద్యార్థుల్లో ధారణాశక్తి, చింతన విధానం, సృజనాత్మక ఆలోచన పెంపొందించడం అనేదే అవధాని ఉప్పల
ధడియం భరతశర్మ లక్ష్యం. అవధానాన్ని వేదికలకే పరిమితం చేయకుండా సమాజ చైతన్యానికి ఒక
సాధనంగా మలచాలన్న సంకల్పం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇదిలా వుండగా, దర్శనమ్
ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో జనవరి 9, 10
(2026), శుక్ర-శని వారాలు, రెండు
రోజులపాటు హైదరాబాద్ భాగ్యనగరంలో జరిగిన హైదరాబాద్ శతావధానం, ఒక సాహితీ మహోత్సవంగా
పేర్కొనాలి. త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సంచాలకత్వంలో, మరెంతోమంది
సాహితీవేత్తలు, కవి, పండిత దిగ్గజాల సమక్షంలో, వందల సంఖ్యల
ఆహ్వానితులు ఆస్వాదిస్తుండగా, శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పల ధడియం భరతశర్మ
శతావధానం. శృంగేరీ జగద్గురువుల దివ్యాశీరనుగ్రహంతో ‘వజ్రోత్సవ భారతి-శతావధాన
సంక్రాంతి’ శీర్షికన తెలంగాణా సారస్వత పరిషత్తు సాహిత్య వేదికపై భరతశర్మ శతావధానం
ఘనంగా ఆరంభమైంది.
దానికి పూర్వం, 7- 30 గంటలకు అతిథులు, కవి పండితులు. ప్రాశ్నికులతో వజ్రోత్సవ భారతి శోభాయాత్ర దేవాదాయ శాఖ కార్యాలయం నుండి సారస్వత పరిషత్తు దాకా సాగి అనంతరం శతావధానం ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, మహామహోపాధ్యాయ ప్రాచార్య బ్రహ్మశ్రీ డాక్టర్ శలాక రఘునాథ శర్మ, ఇతర సాహితీ వేత్తలు ప్రారంభ సభలో పాల్గొని జ్యోతి ప్రకాశనంలో పాల్గొన్నారు. 10 వ తేదీ శనివారం సాయంత్రం శతావధానం ధారణ సభ, వెనువెంటనే వారికి సత్కార కార్యక్రమం జరిగాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నవారిలో పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి, శతావధాని రామశర్మ, డాక్టర్ శలాక రఘునాథ శర్మ తదిర పెద్దలతో పాటు నాకు కూడా పాల్గొనే అవకాశం కలిగింది.
రెండవ రోజు ముగింపు సభ జరగడానికి పూర్వం త్రిభాషా సహస్రావధాని
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ (అవధాని భగత్ శర్మ గురువు గారు) సంచాలకత్వంలో
జరిగిన శతావధాన ధారణ సభలో, కేవలం 44
నిమిషాలలో 75 పద్యాలను, పృచ్ఛకుల
పేర్లు, సమస్యలు, సందర్భోచిత భావాలతో సహా, ఎక్కడా తప్పులకు ఆస్కారం లేకుండా భరత్ శర్మ
పద్యాలను హృద్యంగా పునఃస్మరణ చేయడం అత్యద్భుతం. కొన్ని పద్యాలు భరతశర్మ ధారణ
చేస్తున్నప్పుడు, సెలయేటి
ప్రవాహంలా, కొన్ని బెజవాడ
కృష్ణా బ్రిడ్జ్ మీద రైలు పోతున్నప్పటి చక్కటి శబ్దంలా, లయబద్ధంగా శ్రోతల హృదయాలను తాకి అద్వితీయానుభూతి
కలిగించాయి. ఈ శతావధానం ఇటీవలి కాలంలో
జరిగిన ఒక అత్యద్భుతమైన సాహితీ సంఘటనగా నిలిచింది. ఆ వివరాలు కొన్ని:
· చిటితోట విజయ్
కుమార్ సమస్య:
చం: సరసకవిత్వ తత్వ విలసత్ పదగుంభిత
సత్ప్రబంధలిస్తవి
స్తర రచరాసమర్థుగు తద్యలు ప్రశ్నలు చాలకున్నచో
వరలు విదేశ సందిత సభా స్థలులందుననూర్గులేలకో
శతావధానమునకు పాశ్నికులిరువది మంది చాలరే!
· వేమురాజు వేంకట
కృష్ణ కుమార్ సమస్య:
చం: అనయంబున్ తన పాద పంకజముల్ ధ్యానించు సద్భక్తులై
జనులందున్ పరమాత్మ భావనను నిష్టాపూర్ణులై చేసే మా
దునహింసాకృతల్ సొనర్పరట సాధుస్వాంతులు యా పాపచిం
తనకున్ శత్రువులై వారి నరయన్ దైవంబు ప్రోచున్ సదా
· కందిశంరయ్య
సమస్య:
శా: త్విణ్మ యహిత ప్రభావములు పెంపు వహింపగ
లోకమందు ప్రా
పుణ్మహనీయకాల మన వేసవిలన్ పితృపాళి యాన్య భూ
రాణ్మయ జీవులౌ తమకు శ్రార్థ మునన్ కలదూత పాత్రమున్
మృణ్మయ పాత్రకుండు వెల మిక్కిలి,
స్వర్ణ
ఘటంబుచౌకయౌ
·
ధనికొండ సమస్య:
ఉ: తిక్కను గల్గువారలకు తిక్కను
పెంపచులివేసమస్యలున్
మిక్కిలియౌగృహస్తునకు మీద నచుల్ వింటికానియేడనా
యక్కట చుప్పనాతి యగు నాలిలభించెనను ధాతవ్రా నన్
తిక్కనను వరించెగద తిక్కల పోరి యిదేమిలాల్ల యో
·
మాచవోలు శ్రీధర్ రావు సమస్య:
మత్త: సద్య ఉక్తుల విద్య రీతుల సద్య శంమ్మును గాంచగా
విద్య యొక్కటి సద్గురుప్రవిత్ర వీక్షణమొక్కటి యా
య్యాద్య జన్మ పలమ్ము నొక్కటి అంద సార విహీనమౌ
పద్యమొక్కటి రానివాడును వాసిగాంచె వధానిగన్
·
ముద్దు రాజయ్య సమస్య:
శా: సారంబంత మెరింగినట్టి కవితా సౌందర్య
బృందిష్కులై ధీరాజన్యుడు
బమ్మెరాన్వయుడు గంధీ భరాత పాకమ్ముగా కూరెన్
భాగవతమ్ము యెల్లెడల తెల్లున్ పల్కు మాధుర్యసం
స్కారంబెక్కువయ్యే ఒపాయసములా కంజాత పత్రేక్షణా!
·
జంధ్యాల సుబ్బలక్ష్మి సమస్య:
తే: సత్య ధర్మంబులకు మూల సౌధమగుచు
నలరు హనుమదాదిగ అనూత్య ప్రబలులు
ఋష్య మూకాగ్రి సుగ్రీవ హితులు గూడి
ఆయనకు నేవు రైరిరామాయణమున
· వేదాల గాయత్రి
సమస్య:
ఉ. ఆయక పాండితీ గరిమ పొందిన యట్టిమహోత్తముండుగా
ఏయితరంబులైన విదుతెన్నియు ప్రాసిననున్ సహింకు
కానీ
నీయసత్ర్పజాళికి వచించుట మదీఢ్య కవిత్వము
పల్కునట్లుగా
వ్రాయకు వ్రాయబోకు మయ వ్రాయకు వ్రాయకు మిట్ట
ప్రాతలన్
· కాటేపల్లి
లక్ష్మీ నరసింహమూర్తి సమస్య:
మంచి చెడ్డ వేరు చేయు మాన్య మౌ
విచక్షణ్ సంచితాధముల్వా దీయ సత్యమార్గ
బోధులన్ డించ నెంచు దుష్ట ప్రక్క మీరె యోగిరా
యంచపైన గుడ్ల గూబకంత కోపమేలకో
· వర్ణనలు: మంచినీళ్ళసరస్వతి
శా: ఇచ్చా కాద్యము తెల్ల పండుటకు దీవింపంగ శ్రీ
భారతీ
స్వేఛ్ఛానుగ్రహ సద్గురూత్తమ కృపా సంపూర్ణ, నేత్రచ్ఛవుల్
సచ్చాత్రావళి యౌచు దర్శనము సంస్థా విద్వద
గ్రేసురుల్
స్వేచ్చ న్ దిగ్విజయంబు బొందెదరు
సంవిద్యాక్రియాశక్తి చే
·
వర్ణనలు: కామేశ్వరరావుగావు
అమ్మ భాషను మరిచినవాడ దేశమునందు ఉండకూడదు
అమ్మకెప్పుడు పిడికెడన్నంబుపెట్టడేని భారతాంబ కిడడె వందనమ్ము
మాతృ భాష మరచి మతమును మార్చినేన్
భరత జాతినికతడ భమ్రి సముడు
· వర్ణనలు: అష్టకాల
విద్యాచరణ్
తల్లి దండ్రులందు దైవసన్నిధియందు,
గురులయందు వైద్య వరుల యందు
ఆత్మ సాక్షి యందు అర్ధాంగి మందున
పలుక వచ్చు నిజము పాడియగును
·
దత్తపదులు: లలితవాణి
బ్రహ్మ శాపంబు బొంది యర్చనలు లేక
వాజ్మయంబున పూజింప బ్రహ్మ నెపుడు
బ్రహ్మ రథమని బ్రహాండ భావమనుచు
కొలుచునట్టిది మనదైన తెలుగు భాష
·
దత్తపదులు: లోకనాథం
అకట శోకాకరంచైన ఆహవమున
బంధువుల జంపు దోషంబు పట్టు ననుచు
యేడ్చె క్రీడికి కొందలంబె గొట్టె
సాంత్వ బీరమేశుండొ సంగె శౌరీ!
·
దత్తపదులు: కృష్ణ మూర్తి
కం ధర్మాకృతి గోపాలుడు కర్మ మ్ముల
తలపెరుగును జ్ఞానాకృతియై
శర్మా తతుకులనూనె హరియె
హర్మిలికృష్ణుడె గినెయ్యియై నడిపించెన్
·
దత్తపదులు: రఘువీర ప్రతాప్
చెట్టు లేక ప్రాసి యంచెట్టులగును
పుట్టలేలేక ప్రకృతి సొంపుట్టు లెట్లు
పిట్ట బ్రతుకుచు నెట్టుల గట్టు నేక్కు
ప్రకృతినంతను రక్షింప వలయు మీరు
ఛందస్సును విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రక్రియల్లో మొదటిగా
పేర్కొనాల్సింది అవధానం. కాగితం మీద కలం పెట్టి, ఆలోచిస్తూ, ఛందోబద్ధమైన కవిత్వం చెప్పేవారు కొందరైతే, అలవోకగా, ఆశువుగా, శ్రోతలను ఆకట్టుకుంటూ అవధానం చేస్తూ ఛందోబద్ధమైన
పద్యాలను ధారణ చేసేవారు మరి కొందరు. అవధానం చేయాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి.
సరస్వతి నాలుకమీద నిలవాలి. అందరికీ అది సాధ్యం కాదు. అతి కొద్దిమంది మాత్రమే
వర్తమాన కాలంలో అవధానాలు చేయగలుగుతున్న నేపధ్యంలో,
అమెరికా దేశంలో పుట్టి, పెరిగిన
లలితాదిత్య స్వయంగా, సొంతంగా ఆన్
లైన్లో శిక్షణ పొంది, అద్భుతమైన తీతిలో, అష్టావధానం,
శతావధానం, ద్విభాషావధానం
లాంటివి అనేకం అద్వితీయంగా చేస్తున్నారు.
అదే పరంపరలో ఉప్పలధడియం భరత్ శర్మ కూడా అంతే పిన్నవయసులో అష్టావధానాలు, శతావధానాలు అమ్రిమ్త అద్వితీయంగా చేస్తూ తెలుగు
భాషలో ప్రావీణ్యం ఉన్నవారిని, ప్రవేశం
మాత్రమే ఉన్నవారిని అవధానఉన్మాదునలను, పద్యోన్మత్తులను చేస్తున్నారు. అవధానం అనే
తెలుగు సాహిత్యం విశిష్ట ప్రక్రియను అద్భుతంగా ముందుకు తీసుకు వెళ్తున్న ఒక యువ
అవధాన మేథావి.
క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, ఆశువుగా పద్యాలు చెప్తూ, వీటన్నిటినీ ఏక కాలంలో
అవధాని చేసిన సాహితీ విన్యాసమే భరత్ శర్మ అవధానం. ఆయన ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా
శక్తికి, పాండితీ
ప్రకర్షకు ఒక పర్యాయపదంగా దర్శనమిచ్చాడు. అవధాని పాండిత్యాన్ని, సమయస్ఫూర్తినీ పరీక్షిస్తూ ప్రశ్నలను సంధించిన పృచ్ఛకులకు
ధారణా రూపేణా అవధాని ఇచ్చిన సమాధానం
సాక్షాత్తు సరస్వతీ-శారదామాతకు భరత్ శర్మ మీద వున్న దయకు నిదర్శనం.
వేల సంవత్సరాల చరిత్ర గల అవధాన పరంపర, నేటి
యువత చేతుల్లో సురక్షితంగా కొనసాగుతోందనడానికి భరతశర్మ ఒక సజీవ నిదర్శనం. ఆయన
ప్రయాణం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు
సాధించిన విజయాలు, హైదరాబాద్
శతావధానం వంటి ఘన సంఘటనలు. భవిష్యత్తులో తెలుగు సాహిత్యానికి, అవధాన విద్యకు ఆయన అందించబోయే అపూర్వ సేవకు
స్పష్టమైన సూచికలు. అవధాన పండుగలు మళ్లీ మళ్లీ జరగాలి; ఈ కళ ఆచంద్రతారార్కం కొనసాగాలి.
అవధానం విద్య కొందరికి భగవత్ దత్తం అయితే, కొందరికి అభ్యాసం ద్వారా సిద్ధిస్తుంది. కాకపొతే, అవధానాలు చేసేవారు తగ్గిపోతున్నారు.
ఆస్వాదించేవారూ తగ్గిపోతున్నారు. దాదాపు వేళ్లమీద లెక్కించగలంత మందే ప్రస్తుతం
అవధానాలు చేస్తున్నారు. వేల యేండ్ల చరిత్ర గల ఈ ఛందశ్శాస్త్రం, అవధాన ప్రక్రియ సుప్త చేతనావస్తలోకి పోకుండా, నడుం బిగించినవారిలో మరుమాముల సోదరులు అగ్రభాగాన
వున్నారు. అవధానం, పద్యవిద్య, చంధస్సు సార్వజనీనం కావాలి. పద్యం సాధారణ
మానవుడినీ కదిలించాలి. ఈ అవధాన పరంపర నిర్విరామంగా, ఆచంద్రతారార్కం
కొనసాగాలి. అవధాన పండుగలు నిర్వహించుకునే రోజులు మళ్లీ-మళ్లీ రావాలి. దర్శనమ్ శర్మ లాంటివారికి ప్రభుత్వ సహాయ సహకారాలు, పూర్తిగా లభించాలి. ఇంత గొప్ప కార్యక్రమాలను
నిర్వహిస్తున్నందుకు ఆయన్ను సదా అభినందించాలి. సముచితంగా గౌరవించుకోవాలి.


No comments:
Post a Comment