ధనుర్మాసంలో గోదాదేవి, శ్రీరంగనాథుల దివ్య కల్యాణ మహోత్సవం
వనం
జ్వాలా నరసింహారావు
భక్తి అనేది విన్నపం కాదు. అది ఒక అనుబంధం. విరహం అనేది బాధ కాదు. అది
ఒక సాధన. ఈ సత్యాన్ని తన జీవితమంతటా ఆచరణలో చూపించిన దివ్యచరిత్రే గోదాదేవి కథ.
భూమిలో పుట్టి, భగవంతునిలో
లీనమైన ఈ మహానుభావురాలి జీవితం, పురాణాల ఘనతను, భక్తి సాహిత్యపు మాధుర్యాన్ని, మానవ హృదయపు లోతులను స్పృశిస్తుంది. ధనుర్మాసంలో
ప్రతిధ్వనించే తిరుప్పావై పాశురాలలో, శ్రీరంగనాథుని
పట్ల గోదాదేవికి కలిగిన పరమానురాగం మాత్రమే కాదు, జీవాత్మ పరమాత్మను చేరుకునే
యాత్ర అంతటా ప్రతిబింబిస్తుంది. తండ్రి వటపత్రశాయికి చేసిన మాలా కైంకర్యం నుంచి, కుమార్తె శ్రీరంగనాథునిలో లీనమయ్యే వరకూ సాగిన ఈ
కథ, భక్తి ఎలా
ప్రేమగా మారుతుందో, ప్రేమ ఎలా
మోక్షంగా పరిణమిస్తుందో చూపించే శాశ్వత ఉపాఖ్యానం.
గోదాదేవి జన్మకథ, ఆమె విరహభక్తి, తిరుప్పావై మహిమ, ధనుర్మాస
వ్రత పరమార్థం, అన్నీ కలసి ఒక దివ్యప్రవాహంగా ప్రవహిస్తాయి. గోదాదేవి చరిత్ర కేవలం
గతాన్ని తలచుకునే కథ కాదు. ప్రతి కాలానికి, ప్రతి హృదయానికి వర్తించే ఆధ్యాత్మిక సత్యానికి
ప్రతిరూపం. అపర జానకీ మాతను గుర్తుకు తెచ్చేదే ఆండాళ్ తల్లి. లేదా గోదా దేవి. జనక
మహారాజు యజ్ఞ శాల నిర్మించేందుకు భూమిని దున్నుతుంటే ఏ విధంగా సీత దొరికిందో, ఆండాళ్ కూడా తులసి వనం కొరకు, విష్ణుచిత్తుడు భూమిని దున్నుతుంటే, మొక్కల మధ్యన
దొరికింది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయం,
గోదాదేవి
లేని వైష్ణవాలయం (రామాలయంతో సహా) వుండదు. సీతమ్మ శ్రీరాముడిని, ఆండాళ్ శ్రీరంగ నాథుడిని, ఇలా ఇద్దరు సాక్షాత్తు
శ్రీ మహావిష్ణువు అంశతో అవతరించిన వారినే వివాహమాడారు. పన్నెండు ఆళ్వారులలో ఏకైక
స్త్రీరత్నంగా, భక్తిలోను,
విరహంలోను, శరణాగతిలోను
శిఖరస్థానాన్ని అధిరోహించింది గోదాదేవి.
ధనుర్మాసంలో, సంక్రాంతి
పండుగకు ముందు రోజైన భోగినాడు, మా స్వంతవూరు వనంవారి కృష్ణాపురం రెవెన్యూ గ్రామమైన
ముత్తారంలోని శ్రీ సీతారామచంద్ర ఆలయానికి సతేసమేతంగా వెళ్లడం, స్వర్గీయ మా
నాన్నగారి ఆదేశం మేరకు గోదా-రంగనాథుల
కల్యాణం జరిపించడం
మాకుటుంబ సంప్రదాయం. ఆలయ పూజారి బొర్రా వాసుదేవాచార్యులు ఆ కల్యాణాన్ని అత్యంత
ఆసక్తికరంగా, మూడు
గ్రామాలకు చెందిన ఆబాలగోపాలం సమక్షంలో, అంగరంగ
వైభోగంగా జరిపించడం, చుట్టుపక్కల
గ్రామాల భక్తులు కూడా ఆ కల్యాణాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో తరలి రావడం
విశేషంగా చెప్పుకుంటారు.
శ్రీ విల్లిపుత్తూరులో వెలసిన
శ్రీరంగనాథుడికి, ఆయనకు
ప్రీతిపాత్రురాలైన గోదాదేవి (ఆండాళ్)కి జరిగే దివ్యమైన వివాహ మహోత్సవాన్నే, ప్రాముఖ్యత సంతరించుకున్న గోదా రంగనాథుల కల్యాణమని
అంటారు. అన్ని వైష్ణవ ఆలయాల్లో ఘనంగా జరుపుకునే దీనిని చూడడం ద్వారా అవివాహితులకు వివాహ యోగం
కలుగుతుందని, దాంపత్యంలో
అన్యోన్యత పెరుగుతుందని, సంపద, శ్రేయస్సు
కలుగుతాయని, భక్తుల
నమ్మకం. గోదాదేవిని
మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ధనుర్మాసంలో ఈ
కల్యాణం చేయడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా నమ్ముతారు.
శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గ్రంథంలో దీనికి సంబంధించిన
వివరాలున్నాయి. విలుబుత్తూరు నగరవాసుల్లో, అద్వైత సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా
అనుసరించే పరమ భాగవతోత్తముడు విష్ణుచిత్తుడి భక్తియుక్తులకు మెచ్చిన విష్ణువు
ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తరువాత, ఒకనాడు, తులసి వనం కొరకు భూమిని దున్నుతుంటే, తులసి మొక్కల మధ్యన వున్న ఆండాళ్ శిశువు
కనిపించింది. బిడ్డలు లేని తనకు విష్ణుమూర్తే బిడ్డను ఇచ్చాడని అనుకుంటూ, ఎత్తుకుని
ముద్దాడుతూ, ఇంటికి తీసుకెళ్లి, పెంచమని భార్య
కిచ్చాడు విష్ణుచిత్తుడు. భూమిలో ఉద్భవించింది కాబట్టి ఆమెకు గోదాదేవి అని నామకరణం
చేశారు దంపతులు. అల్లారుముద్దుగా పెరిగి పెద్దై, జ్ఞానం
వచ్చేసరికి శ్రీమన్నారాయణుడుని తప్ప మానవ మాత్రులనెవరినీ వరించబోనని, వివాహం
చేసుకోనని, తన మనసులో
నిశ్చయించుకున్నది.
‘పేరి ఆళ్వారు’ గా కూడా పిలువబడే
శ్రీ విష్ణుచిత్తుడు, శ్రీవిల్లివుత్తూరులో
నిరంతరం వటపత్రశాయికి మాలా కైంకర్యం చేసుకుంటూ,
ఆ
విష్ణు మూర్తి ధ్యానంలోనే గడుపుతుండే వాడు. ఇక ‘ఆముక్తమాల్యద’ అనే పేరు కూడా కల గోదాదేవి,
అనునిత్యం ఒక వింతపని చేస్తూ వుండేది. తండ్రి ప్రతిరోజు వటపత్రశాయికి మాలా
కైంకర్యం చేయడం చూసి పరవశించి, ఆ మాలలు ఆయనకు తెలియకుండా ధరించి, విష్ణువును తలచుకునేది. భావి నీళ్లలో తన అందాన్ని
చూసుకొని మురిసిపోయి, విరహం పొందేది.
తండ్రికి తెలియకుండా, ఆ మాలలను బుట్టలో వేసి, యథాస్థానంలో
వుంచేది. ఆమె కోరుకునే భర్త శ్రీరంగంలోనే ఉన్నాడని, రంగనాథుడిని
పూజించమని సలహా ఇచ్చారు చెలికత్తెలు.
ఆనాటి నుండి ఆ కన్య విష్ణువునే ప్రియుడిగా తలచుకుంటూ ప్రేమగీతాలు
పాడసాగింది. సూర్యోదయానికి ముందే లేచి పూలమాలలు పట్టుకుని దేవాలయానికి వెళ్లేది.
ఇంటికి వచ్చి ఎప్పుడూ ప్రియుడి గురించి ద్రావిడ భాషలో పాటలు రాసి పాడుకుంటూ
వుండేది. గోపికలు కృష్ణుడి మీద చూపిన అనురక్తి లాంటిది ఆమెలో కనిపించ సాగింది.
కృష్ణుడు యమునలో జలక్రీడలాడే దృశ్యాన్ని మనస్సులో ఊహించుకుంటుంది. వటపత్రశాయి
దేవాలయం శ్రీకృష్ణుడి గృహం గాను, తోటి బాలికలు
గోపికలు గాను, వటపత్రశాయి
శ్రీకృష్ణుడి గాను, తాను ఒక
గోపాంగన గాను భావించుకుంటుంది. రోజుకొక ‘పాశురం’ ద్రావిడ భాషలో (తమిళం) వ్రాసి
వటపత్రుడి సన్నిధిలో పాడుకుంటూ కాత్యాయనీ వ్రతం చేసింది. శ్రీరంగ నాయకుడి
మహాదైశ్వర్యవిభూతి సౌందర్యానికి ముగ్ధురాలై, ఆయననే వివాహమాడాలని ధృఢంగా
నిశ్చయించుకుంది.
ఒక నాడు విష్ణుచిత్తుడు తన కూతురు చేస్తున్న మాలలు ధరించే
వ్యవహారాన్ని చూసి, గోదా చేసింది
తప్పని భావించాడు. మాలలు మాలిన్యమైనాయని ఆనాడు వటపత్రశాయికి అవి సమర్పించలేదు.
గోదా దేవిని సున్నితంగా మందలించాడు. స్వామికి నిర్ణయించ బడిన పూలదండలు ముందర ఆమె
ధరించడం అపచారమంటాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూల దండలు తనకెందుకు
సమర్పించలేదని విష్ణుచిత్తుడికి కలలో కనబడి ప్రశ్నించాడు వటపత్రశాయి.
విష్ణుచిత్తుడు తన కూతురు చేసిన అపరాధాన్ని వివరించి, మాలలను సమర్పించ లేకపోయిన కారణం తెలియ చేశాడు.
వాటికి బదులుగా వేరేవి తయారు చేసేందుకు సమయం లేకపోయింది అని విన్నవించుకున్నాడు.
వటపత్రశాయి ఆ భక్తుడి అమాయకతకు చిరునవ్వుతో, గోదాదేవి ముందుగా ధరించిన మాలంటేనే తనకు ఇష్టమని, అదే తాను కోరుకుంటున్నానని అంటాడు. ఆమె తలలో
పెట్టుకోని మాలలు తనకొద్దంటాడు. ఆమె విషయం విష్ణుచిత్తుడికి తెలియదని, సాక్షాత్తు లక్ష్మీదేవే భూలోకంలో గోదాదేవిగా
అవతరించిందని చెప్పాడు. తనలో చేరాలనే కోరికతో,
విష్ణుచిత్తుడికి
కూతురై తననే ప్రేమించి విరహతాపం పొందుతున్నదని చెప్పిన మన్ననారు స్వామి, అతడి కూతురును శ్రీరంగం తీసుకెళ్లి స్వామికి
అర్పించమని సూచించాడు. గోదా దేవి-శ్రీరంగనాథుల వివాహం జరిగేదెలా అని
విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడి కలలో కనిపించి ఆయన
కూతురుని వివాహం చేసుకుంటానని, దానికి
సిద్ధంగా వుండమని చెప్పి, ఆముక్తమాల్యదను
తన ఆత్మలోకి తీసుకున్నాడు.
శ్రీరంగనాథుడి పక్షాన పిల్లను ఇవ్వమని అడగడానికి బ్రహ్మ, శివుడు, పార్వతి, ఇంద్రుడు పెళ్లిపెద్దలుగా వచ్చారు. మర్నాడు శ్రీరంగనాథుడి
అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళ
తాళాలతో విష్ణుచిత్తుడి దగ్గర కొచ్చి, గోదా దేవిని,
విష్ణు చిత్తుడిని పల్లకిలో శ్రీరంగం తీసుకొని పోయారు. విష్ణుచిత్తుడు
శ్రీరంగనాథుడికి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించాడు. దేవుడిని కీర్తించాడు. తమ ఇంటి
ఆచారం ప్రకారం శ్రీరంగనాథుడు పెళ్లికొడుకై సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా తన
ఇంటికే వచ్చి పెళ్లి చేసుకుని, భార్యను
తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దేవతలు దానికి సమ్మతించారు. లగ్నం నిశ్చయించారు.
శ్రీవిలుబుత్తూరులో విష్ణుచిత్తుడు కూతురు పెళ్లికి ఏర్పాట్లు చేశాడు.
శ్రీమహావిష్ణువు పెళ్లికొడుకై గరుత్మంతుడి మీద ఊరేగుతూ వచ్చాడు. దేవతలంతా వచ్చారు.
శాస్త్రోక్తంగా కన్యాదానం జరిగింది. విష్ణుమూర్తి ఆముక్తమాల్యద మెడలో మంగళసూత్రం
కట్టాడు. అంతకు ముందు జీలకర్ర, బెల్లం పెట్టించారు. సప్తపది జరిపించి, అరుంధతీ దర్శనం చేయించారు. విష్ణుమూర్తి గోదాదేవిని భార్యగా
తీసుకుని వైకుంఠానికి తరలి వెళ్లాడు. అదే రోజున
స్వామి ఆజ్ఞ ప్రకారం, శ్రీ రంగనాథుడి
విగ్రహానికి, గోదా
దేవినిచ్చి వివాహం చేశారు. గోదాదేవి అందరూ చూస్తుండగా, శ్రీ రంగనాథుడి గర్భాలయంలోకి పోయి ఆయనలో లీనమై
పోయింది.
శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడిని చూసి, దిగులు
పడొద్దని అంటూ, ఆయనకు గౌరవ
పురస్కారంగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠ కోపము యిచ్చి, సత్కరించి పంపాడు. గోదా దేవికి ఆండాళ్, చూడి కొడుత్తామ్మాల్ అని పేర్లు కూడా వున్నాయి.
గోదాదేవిని 12 మంది
ఆళ్వారులలో చేర్చారు. ధనుర్మాసంలో ఆమె రచించి పాడిన తిరుప్పావై పాశురాలు జగత్
విఖ్యాతి చెందాయి. అన్ని వైష్ణవ దేవాలయాలలో,
ధనుర్మాసంలో, అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పై రోజులు
పాశురాలను పాడుకుంటు, ఆమెను
కొలుస్తుంటారు. ఆమె తిరుప్పావై (30 పాశురాలు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురాలు) జగత్ విఖ్యాతమై అందరి చేత నుతించ
బడుతున్నాయి. తిరుప్పావై ఒక దివ్య ప్రభందం.
గోదాదేవి భక్తి, విరహం, శరణాగతి, అన్నీ కలిసి ధనుర్మాసానికి విశిష్టమైన
ఆధ్యాత్మిక మహిమను ప్రసాదించాయి. ఆ విరహాగ్ని నుంచే జన్మించినవే ఆమె రచించిన దివ్య
పాశురాలు. ధనుర్మాసంలో ప్రతిరోజూ శ్రీకృష్ణుడిని ప్రియుడిగా భావిస్తూ, గోపికా భావంతో, కాత్యాయనీ
వ్రత స్వరూపంగా ఆమె పాడిన గీతాలే తిరుప్పావైగా ప్రసిద్ధి చెందాయి. ఇవి కేవలం
కవిత్వమో, భక్తిగీతాలో
కాకుండా, భగవంతుని
చేరుకునే మార్గాన్ని సూచించే ఆధ్యాత్మిక ఉపదేశాలుగా నిలిచాయి. తిరుప్పావైలోని
ముప్పై పాశురాలు, జీవాత్మ, పరమాత్మల
ఐక్యతను, శరణాగతి
తత్త్వాన్ని, భక్తి
మార్గంలోని సూక్ష్మతలను సులభంగా తెలియజేస్తాయి.
ధనుర్మాసమంతా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, ఆండాళ్‌ను
మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ, ఈ పాశురాలను పాడుతూ, భగవన్నామస్మరణ
చేయడంద్వారా మానవుడు అంతరంగ శుద్ధిని, దైవానుగ్రహాన్ని
పొందుతాడనే విశ్వాసం వైష్ణవ సంప్రదాయంలో బలపడింది. అలాగే గోదాదేవి రచించిన
నాచ్చియారు తిరుమొళి, ఆమె
అంతరంగంలోని విరహవేదనను, శ్రీరంగనాథుని
పట్ల కలిగిన అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఇందులో భక్తి కేవలం భయమో, విధియో కాకుండా, ప్రేమ, ఆత్మీయత, ఏకాంత
అనుబంధంగా రూపుదిద్దుకుంది. ఈ కృతులు గోదాదేవిని భక్తి సాహిత్యంలో శిఖరస్థానంలో
నిలిపాయి. తిరుప్పావై దివ్యప్రబంధంగా పూజింపబడుతూ, తరతరాల
భక్తులను శ్రీరంగనాథుడి సన్నిధికి నడిపిస్తున్న అమృతధారగా నిలుస్తోంది.
పాశురాలు కాలగతికి లోబడక, యుగయుగాలుగా
భక్తుల నోట నిత్యనూతనంగా మ్రోగుతున్నాయి. తిరుప్పావై సామాన్యమైన స్తోత్రసాహిత్యం
కాక, జీవాత్మ, పరమాత్మల
మధ్య ఉన్న అచ్యుతమైన అనుబంధానికి సాక్ష్యంగా నిలిచింది. అందువల్ల ఆ కృతులు భక్తి
రసంతో పాటు, ఆత్మతత్త్వాన్ని
కూడా లోతుగా ఆవిష్కరించాయి. ఈ విధంగా గోదాదేవి రచించిన దివ్యప్రబంధాలు, కాలక్రమేణా సమస్త వైష్ణవ దేవాలయాలలో
నిత్యపారాయణానికి పాత్రమయ్యాయి. ధనుర్మాసంలో ఆమె నామస్మరణ, పాశుర పారాయణం చేసేవారికి శ్రీహరిపాద సాన్నిధ్యం
నిశ్చయమని శాస్త్రార్థ భావం.
శ్రీరంగనాథుడిలో లీనమైపోయిన గోదాదేవి జీవితం, భక్తి మార్గం చివరకు ఏకత్వంలోనే ముగుస్తుందనే
శాశ్వత సత్యాన్ని లోకానికి చాటి చెప్పింది. అందుకే ఆమె కథ వినగానే హృదయం ద్రవించి, మనస్సు నిశ్చలమై, అంతరంగం
భగవంతుడి వైపు మొగ్గుతుంది. గోదాదేవి విగ్రహంలో లీనమైన సంఘటన ఒక విరామం కాదు, అది
ఆరంభం. ఆమె దేహంగా కాక, వాక్యంగా, భావంగా, భక్తిగా
యుగయుగాలుగా జీవిస్తోంది. ధనుర్మాసంలో ప్రతిధ్వనించే తిరుప్పావై పాశురాలు ఆమె
ఉనికికి సజీవ సాక్ష్యాలు. కాలాన్ని, భాషను, ప్రాంతాలను దాటి, ప్రతి
భక్తుడి హృదయంలో ఆమె నిత్యనూతనంగా నిలుస్తోంది. తిరుప్పావై ఒక దివ్యప్రబంధంగా, జీవులను వైకుంఠ మార్గంలో నడిపించే అమృత
వాక్యమాలికగా విరాజిల్లుతోంది.
పన్నెండు ఆళ్వారులలో గోదాదేవి ఒక అపూర్వ రత్నం. ఇతర ఆళ్వారులు
భగవంతుని దాస్య భావంతో కీర్తించగా, గోదాదేవి
ప్రేయసీ భావంతో శ్రీహరిని పూజించింది. ఈ కారణంగా ఆమె భక్తి మరింత సన్నిహితంగా, మరింత హృదయస్పర్శిగా మారింది. భూమిలో అవతరించిన
భూదేవియే గోదాదేవిగా జన్మించి, తిరిగి
శ్రీరంగనాథునిలో లీనమైందని ఆళ్వారులు గౌరవంతో స్మరిస్తారు. అందుకే ఆమెను ‘చూడి కొడుత్త నాచ్చియార్, ఆండాళ్ ‘ అని భక్తులు సాదరంగా పిలుచుకుంటారు. గోదాదేవి
రచించిన దివ్యప్రబంధాలు వైష్ణవ సంప్రదాయానికి శిరోభూషణాలై, తరతరాల భక్తులను భక్తి మార్గంలో నడిపిస్తూ, శ్రీహరిపాద సాన్నిధ్యానికి చేర్చుతున్నాయి.
ఆధునిక కాలంలో ప్రేమ అనేది చాలాసార్లు స్వార్థం, ఆకాంక్ష, స్వాధీన భావనల
మధ్య చిక్కుకుపోతోంది. ‘నాది’ అన్న భావమే ప్రేమకు కేంద్రంగా మారుతోంది. గోదాదేవి
ప్రేమ దీనికి భిన్నం. ఆమె ప్రేమలో స్వార్థం లేదు, ప్రతిఫలం
ఆశ లేదు. ‘నన్ను స్వీకరించాలి’ అన్న అహంకారం కాక, ‘నీలో
లీనమవ్వాలి’ అన్న వినయం మాత్రమే ఉంది. ఈ శుద్ధమైన ప్రేమ తత్త్వమే ఆధునిక మనిషి
మర్చిపోయిన అసలైన అనుబంధ రూపం. గోదాదేవి శ్రీరంగనాథుని ప్రేమించింది. అయినా ఆయన్ను
తనదిగా కోరలేదు. ఆయనలో
తానైపోవాలని కోరుకుంది. ఈ భావన ఆధునిక సంబంధాలకు గొప్ప బోధ. నిజమైన ప్రేమ అంటే
ఒకరిని బంధించడం కాదు. ఒకరికి
స్థలమివ్వడం, ఒకరిలో ఒకరు
ఎదగడం. గోదాదేవి ప్రేమ, ఆధునిక
సంబంధాల్లో కావలసిన విశ్వాసం, సహనం, త్యాగానికి దివ్య ఆదర్శం.
అలాగే ఆమె విరహం కూడా నేటి మనిషికి సందేశమే. విరహం అంటే నిరాశ కాదు. అది ఎదుగుదల. గోదాదేవి విరహాన్ని ఆత్మవినాశంగా
మార్చుకోలేదు. ఆధ్యాత్మిక సాధనగా మలచుకుంది. ఆధునిక జీవితం ఎదుర్కొనే విఫలాలు, దూరాలు, ఒంటరితనాలు, వాటిని
భక్తిగా, సృజనగా, ఆత్మవిశ్లేషణగా మార్చుకుంటేనే జీవితం
అర్థవంతమవుతుందన్న బోధ ఆమె జీవితం ఇస్తుంది. ఈ విధంగా గోదాదేవి, శ్రీరంగనాథుల
ప్రేమకథ పురాణాలకే పరిమితం కాదు. అది ఆధునిక మనిషికి మార్గదర్శకం. ప్రేమలో
పవిత్రతను, సంబంధాలలో
ఆత్మీయతను, జీవితంలో
పరమార్థాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ గోదాదేవి ఒక నిత్య స్ఫూర్తి. అందుకే ఆమె
ధనుర్మాసంలో మాత్రమే కాదు, ప్రతి కాలంలో, ప్రతి మనసులో
జీవించే శాశ్వత స్త్రీరత్నం.
ఈ విధంగా గోదాదేవి జీవితం, భక్తి, విరహం, శరణాగతి, అన్నీ
కలిసి ఒక దివ్య ఇతిహాసంగా అవతరించాయి. ఆమె ప్రేమ జీవాత్మ తన అసలైన గమ్యాన్ని
గుర్తించిన క్షణంలో జన్మించిన పరమానురాగం. శ్రీరంగనాథునిలో లీనమైపోయిన గోదాదేవి
జీవితం, భక్తి మార్గం
చివరకు ఏకత్వంలోనే ముగుస్తుందనే శాశ్వత సత్యాన్ని లోకానికి చాటి చెప్పింది. అందుకే
ఆమె కథ వినగానే హృదయం ద్రవించి, మనస్సు
నిశ్చలమై, అంతరంగం
భగవంతుని వైపు మొగ్గుతుంది. ధనుర్మాసంలో
ప్రతిధ్వనించే తిరుప్పావై పాశురాలు ఆమె ఉనికికి సాక్ష్యాలు. కాలాన్ని, భాషను, ప్రాంతాలను
దాటి, ప్రతి భక్తుని
హృదయంలో ఆమె నిత్యనూతనంగా నిలుస్తోంది. (నిన్నటి రోజున
మా ముత్తారం దేవాలయంలో జరిగిన గోదా-రంగనాథుల కల్యాణం నేపధ్యంలో)


No comments:
Post a Comment