Tuesday, July 21, 2026

‘శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ (తుమ్మలపల్లి కళాక్షేత్రం – విజయవాడలో ఆగస్ట్ 8, 2026) మహోత్సవం, ఒక చారిత్రాత్మక విలోకనం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవం 

ఒక చారిత్రాత్మక విలోకనం

అత్యంతాద్భుతాద్భుతమైన’ ఆధ్యాత్మిక

సామాజిక, చారిత్రాత్మక విలువల

సమ్మిళతమైన మాసపత్రిక ‘శ్రీవాణి’ 500 సంచిక ఆవిష్కరణ
(తుమ్మలపల్లి కళాక్షేత్రం – విజయవాడలో ఆగస్ట్ 8, 2026)
అభినందనలతో వనం జ్వాలా నరసింహారావు

అక్షరానికి ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్ది, సమాజ హితమే శ్వాసగా సాగుతున్న అపురూప మాసపత్రిక ‘శ్రీవాణి’. సుమారు నలభై ఏళ్లకు పైగా నిరంతరాయంగా సాగుతున్న ఈ అక్షర యజ్ఞం, 2026 ఆగస్ట్ 8వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఐదు వందల (500) సంచికల మైలురాయిని అధిగమించబోతోంది. ఈ చారిత్రాత్మక అపురూప ఘట్టాన్ని పురస్కరించుకుని, విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో అశేష అభిమానులు, మేధావుల సమక్షంలో నిర్వహించ తలపెట్టిన ‘ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వేడుక’ పత్రికా ప్రపంచంలోనే ఒక మైలురాయి కానున్నది. ఈ అద్భుత సభకు పత్రికా యాజమాన్యం (స్వర్గీయ కొమరగిరి కృష్ణమోహన్ రావు కుటుంబ సభ్యులు) ఆధునిక సాంకేతికతను జోడిస్తూ, వాట్సాప్ సందేశం ద్వారా ఆహ్వానం పలికిన విధానం డిజిటల్ యుగంలో ఒక వినూత్న ఒరవడికి, సంప్రదాయానికి నాంది పలికినట్లుగా వున్నది.

ఈ ఆహ్వానానికి అదనంగా నన్ను ఎంతగానో ఆకట్టుకున్న మరో సమకాలీన చారిత్రాత్మక విశేషం, ఈ పత్రికా ఆవిర్భావం నాటి నుండి ... దాని ఆరోహణలు, అవరోహణలు, నేటి పునరారోహణల వైభవంతో విడదీయరాని బంధం కలిగిన నా ఆప్తుడు తుర్లపాటి విజయ్ శంకర్ భార్యాసమేతంగా మమ్మల్ని (నన్ను, మా శ్రీమతిని) వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి (జులై 22, 2026) మా నివాసానికి రావడం. పాత జ్ఞాపకాల దొంతరలను విప్పుతూ, సమకాలీన సామాజిక-ఆధ్యాత్మిక అంశాలను చర్చిస్తూ ఆత్మీయ అనుబంధాల మధ్య మేము నలుగురం గడిపిన ఆ నాలుగు గంటల సమయం కాలాతీతంగా సాగిపోయింది.

ఆ సుదీర్ఘ సంభాషణలో ఎన్నో అపురూపమైన చారిత్రాత్మక విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, పత్రికా నిర్వహణలోని ఒడిదుడుకుల గురించిన జ్ఞాన సమాచారాన్ని పంచుకోవడం జరిగింది. నిజాయితీగా చెప్పాలంటే, ఆ ప్రసంగంలో చాలా భాగం ఆత్మీయ బంధువు, అంతకు మించి స్నేహితుడు, విజయ్ శంకర్ అనుభవాల నుండి నేను నేర్చుకున్నదే ఎక్కువ. ‘శ్రీవాణి’ పత్రికకు సంబంధించిన ఎన్నో తెలియని కోణాలను మనస్ఫూర్తిగా తెలుసుకోవడం సంతోషం కలిగించిన అంశం.

సంబంధ బాంధవ్యాల పరంగా విజయ్ శంకర్ నాకు తోడల్లుడు. వయసులో నాకంటే చిన్నవాడే. ఆయన అర్ధాంగి వాణి (జుబ్బి) మా వివాహమైన నాటి నుండి నాకు ఒక చిన్న అమ్మాయిలాగే సుపరిచితురాలు. లోకంలో కొందరికి కొన్ని విద్యలు ఎక్కువగా రావచ్చు, మరికొందరికి తక్కువగా ఉండవచ్చు. కానీ, వీరికి ఉన్న అపారమైన నైపుణ్యాలను పదిమందికీ ప్రకటించుకుని ప్రచారం చేసుకోవాలనే తపన లేని ఒక అపురూపమైన, నిగర్వియైన వ్యక్తిత్వం వీరిద్దరిది. విజయ్ శంకర్ లో ఒక అద్భుతమైన కళాకారుడు, పండితుడు దాగి ఉన్నారు. ఆయన కంఠం విప్పితే గానం సుమధురంగా సాగుతుంది. ఛందోబద్ధమైన పద్యాన్ని అలవోకగా, ఆశువుగా అల్లగల ధిషణ ఆయన సొంతం. ఇక ఆయన చేతిలోకి పిల్లనగ్రోవి (Flute) చేరిందంటే, ఆ వేణుగాన లహరిలో పడి వినేవారు కాలజ్ఞానాన్ని సైతం మర్చిపోవాల్సిందే.

కేవలం సంగీతమే కాదు, ఆయన సాహిత్య సంపద కూడా అపారమైనది. మన సంస్కృతికి మూలస్తంభాలైన మహాభారతం, శ్రీమద్భాగవతం, రామాయణాలతో పాటు ప్రబంధ సాహిత్యంలో ఎక్కడ, ఏ ఘట్టంలో, ఏముందో తటుక్కున స్మరించి చెప్పగల అసాధారణ జ్ఞాపకశక్తి ఆయనది. సందర్భోచితంగా సంస్కృత శ్లోకాలను, తెలుగు పద్యాలను నవరసాలు ఒలికేలా ఆయన వల్లించే తీరు అమోఘం. అందుకే, మేమిద్దరం కలిసినప్పుడల్లా మా మధ్య జరిగే సంభాషణలలో ఈ సాహిత్య, ఆధ్యాత్మిక చర్చలకే సింహభాగం ప్రాధాన్యం ఉంటుంది. ఆ సమయాల్లో మా శ్రీమతులు (అక్కాచెల్లెళ్లు) మూగప్రేక్షకులైపోవాల్సిందే! అయితే, వారు కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా, మధ్యమధ్యలో తమదైన శైలిలో కలగజేసుకుంటూ ఆ సంభాషణకు మరింత ఆత్మీయతను అద్దుతుంటారు.

విజయ్ శంకర్‌కు ఈ బహుముఖ ప్రజ్ఞాపాటవాలు అబ్బడానికి ప్రధాన కారణం ఆయన అకుంఠిత స్వయంకృషి, అచంచలమైన ఆసక్తి, నిరంతర అన్వేషణ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీటన్నింటికీ తోడు భగవదనుగ్రహం, ముఖ్యంగా ఆ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయనేది కూడా నిర్వివాదాంశం. అయినప్పటికీ, ఈ అసాధారణ పాండిత్యానికి వెనుక ఇంకా ఏదో బలమైన అంతస్సూత్రం, వంశపారంపర్యంగా వచ్చిన మేధోసంపత్తి ఉండి తీరాలనే బలమైన అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉండేది. మాతాపిత్రుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం ఒక ఎత్తయితే... వారిలో ఒకరికైనా, లేదా ఇద్దరికైనా వైవిధ్యభరితమైన అంశాలలో ఇటువంటి బహుముఖ తెలివితేటలు, నైపుణ్యం, నిరంతర అధ్యయనాసక్తి ఉంటేనే కానీ సంతానానికి ఈ స్థాయి జ్ఞానసంపద లభించదు కదా అనిపించేది.

గతంలో ఎప్పుడూ ఈ విషయాన్ని లోతుగా అడగకపోయినా, జులై 22న జరిగిన సుదీర్ఘ సంభాషణలో నేనే స్వయంగా ఈ ప్రస్తావనను లేవనెత్తాను. అంతే... నా అనుమానం అక్షరసత్యమని నిరూపిస్తూ, పూజ్యనీయులైన తన తండ్రిగారి గురించి విజయ్ శంకర్ చెప్పిన అద్భుతమైన విషయాలు విస్మయానికి గురిచేశాయి. ఒక గొప్ప మేధావి, సహజ నాయకుడు, ఆధ్యాత్మిక వేత్త అయిన ఆయన తండ్రిగారి జీవిత విశేషాలను వింటుంటే, అసలు సిసలైన జ్ఞాన వారసత్వం అంటే ఇదేనని నాకు స్పష్టమైంది. విజయ్ శంకర్ తండ్రిగారైన స్వర్గీయ తుర్లపాటి వేంకట బసవేశ్వర రావు గారి జీవితం ఒక అసాధారణ కావ్యం. ఆయన జీవించిన కాలం కేవలం 54 సంవత్సరాల స్వల్ప వ్యవధే అయినప్పటికీ, ఆయన సాధించిన జ్ఞాన శిఖరాలు అమోఘమైనవి.

కేవలం 18 సంవత్సరాల ప్రాయంలో, అదీ వివాహమైన అతికొద్ది కాలానికే, విధి వంచనతో ఊహించని రీతిలో ఆయన రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. చదివింది కేవలం ఎస్సెస్సీ (SSC) మాత్రమే. కానీ, శారీరక వైకల్యం ఆయన మానసిక వికాసానికి, మేధోశక్తికి ఏనాడూ అడ్డుగోడ కాలేకపోయింది. కదలలేని స్థితిలోనే తన నివాసాన్నే ఒక అద్భుత గ్రంథాలయంగా మార్చేసుకుని, నిరంతర అధ్యయనంతో, స్వయం అభ్యాసంతో, సంస్కృత, తెలుగు భాషలలో అసమానమైన పాండిత్య ప్రతిభను సంపాదించుకున్న మహనీయుడాయన. ఆ అచంచల సాధనకు ప్రతిరూపంగా ‘వల్లీ కల్యాణం’ పేరుతో ఏకంగా 1800 పద్యాలతో కూడిన ఒక బృహత్ ప్రబంధాన్ని ఆశువుగా రచించిన మహాకవి ఆయన. దురదృష్టవశాత్తూ ఆ అపురూప గ్రంథం నేటికీ ప్రచురణకు నోచుకోలేదు.

ఆ గ్రంథ రచన పూర్తయిన తర్వాత ఆయనకు కలిగిన రెండవ కుమార్తెకు, ఆ కావ్యంపై మక్కువతో ‘లవలి’ అని పేరు పెట్టడం మధురాతి మధురమైన ఒక విశేషమనాలి. నిజానికి, తెలుగు సమాజంలో ‘లవలి’ అనే పేరున్న అమ్మాయిలు చాలా అరుదు అనడం అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా, జీవితాంతం పక్షవాతంతో మంచానికే పరిమితమైన భర్తకు దైవభావంతో అహర్నిశలు సేవలు చేస్తూ, ఆయన సాహిత్య వ్యాసంగానికి అండగా నిలిచిన విజయ్ శంకర్ తల్లి కమల గారి త్యాగపూరితమైన పతిసేవను, శుశ్రూషను విజయ్ శంకర్ అత్యంత భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆ తల్లిదండ్రుల పుణ్యఫలమే నేడు విజయ్ శంకర్‌లో కనిపిస్తున్న ఈ అపార విద్వత్తు.

ఈ వంశ వృక్షపు మూలాలను వెతుకుతూ పోతే మరిన్ని ఆశ్చర్యకరమైన చారిత్రాత్మక సత్యాలు వెలుగు చూశాయి. బసవేశ్వర రావు గారి తండ్రి, అంటే విజయ్ శంకర్ పితామహులు (తాతగారు) తుర్లపాటి రామలింగేశ్వర రావు గారు వరంగల్ జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన ధర్మపత్ని శ్యామలాంబ గారు. ఈ దంపతులకు 1921వ సంవత్సరంలో, వరంగల్ జిల్లాలోని 'కంఠాత్మకూర్' గ్రామంలో బసవేశ్వర రావు గారు జన్మించారు. అయితే, వీరి పూర్వీకుల స్వగ్రామం మాత్రం కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోని ‘అడవిరావులపాడు అగ్రహారం’. తమ స్వగ్రామం అగ్రహారంగా మారడం వెనుక ఒక విచిత్రమైన, అత్యంత ఆసక్తికరమైన చారిత్రాత్మక నేపథ్యం ఉందని విజయ్ శంకర్ వివరించారు.

పూర్వం అమరావతి సంస్థానాధీశులైన రాజా వారు ఒకానొక సందర్భంలో వేటకు వెళ్లినప్పుడు, వారి చేతిలో పొరపాటున ఒక భిల్లుడు (అడవి జాతి మనిషి) హతమయ్యాడు. ఆ హత్యాపాతకం వల్ల కలిగిన బ్రహ్మహత్యా సదృశ్య దోష పరిహారార్థం, రాజా వారి శ్రేయస్సును కోరే పండితులు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. ఆ దోషం పోవాలంటే సామ్రాజ్యంలో వేయికి పైగా శివలింగాలను ప్రతిష్టించాలని వారు సూచించారు. ఆ దేశాచార ప్రకారం కొన్ని శివలింగాలను ప్రతిష్టించినప్పటికీ, అన్ని లింగాలను ప్రతిష్టించి, వాటికి నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహించడం ఆచరణలో అత్యంత క్లిష్టంగా మారింది.

దీనికి ప్రత్యామ్నాయంగా ఆ పండితులే మరొక ఉపాయాన్ని చెప్పారు. నిర్దిష్ట సంఖ్యలో శివలింగాలను ప్రతిష్టించే బదులు, అంతటి పవిత్రమైన శివలింగాలను అర్హులైన వ్యక్తుల మెడలో ధరింపజేస్తే ఆ దోషం పరిహారమవుతుందని సెలవిచ్చారు. పండితుల ఆజ్ఞను శిరసావహించిన రాజా వారు, అందుకోసం సుమారు 2000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించి, పలువురు బ్రాహ్మణులకు పంపిణీ చేశారు. ఆ క్రమంలోనే అక్కడ ఉన్న ఆరువేల నియోగులను 'లింగధారులు'గా మార్చడం జరిగింది. అలా రాజా వారి దోష పరిహారార్థం ఏర్పడిన ఆ భూభాగమే తర్వాతి కాలంలో అడవిరావులపాడు అగ్రహారంగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా విజయ్ శంకర్ పూర్వీకుల చరిత్ర వెనుక ఒక అద్భుతమైన చారిత్రాత్మక గాథ దాగి ఉంది.

రాజా వారు అంతటితో ఆగకుండా ఆ అడవిరావులపాడు అగ్రహారాన్ని నాలుగు విభాగాలుగా గావించి, ఆయా భాగాలలో పండితులు స్థిరనివాసాలు ఏర్పరచుకునేందుకు సకల వసతులను కల్పించారు. అలా అమరావతి రాజా గారి ఆశ్రయంతో అక్కడ స్థిరపడిన విజయ్ శంకర్ పూర్వీకులు, కాలక్రమేణా మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, విద్యా ఉపాధులకై సమీపంలోని నందిగామ నగర వాతావరణానికి తరలివచ్చారు. విజయ్ శంకర్ పితృపాదులైన బసవేశ్వర రావు గారు అలా నందిగామ చేరినవారే. పూర్వజన్మ సుకృతమో, ఈ వంశ పరంపరాగత సంస్కారమో కానీ, బసవేశ్వర రావు గారు అద్భుతమైన ఏకసంతాగ్రాహి, నవనవోన్మేష ప్రజ్ఞాశాలి. ఆయనకు తెలియని విద్య, ఆయన స్పృశించని లలితకళ లేదు.

విశేషమేమిటంటే, ఈ విద్యలన్నింటిలోనూ ఆయనకు గురుముఖతః లభించిన శిక్షణ ఏమీ లేదు. అంతా కేవలం స్వయం అభ్యాసమే! ఆయనే గురువు, ఆయనే విద్యార్థియై అక్షరాలా ఏకలవ్య శిష్యరికం చేశారు. అలా అపారమైన ఆసక్తితో, స్వయంకృషితో ఆయన సాధించిన విద్యలలో వేద జ్యోతిష్యం, హోమియో వైద్యం, గాత్ర సంగీతం ప్రధానమైనవి. వాద్య సంగీతంలో హార్మోనియం, బుల్‌బుల్ తరంగ్ (వేణువు) లపై ఆయనకు అసాధారణ పట్టు ఉండేది. ఇక వయొలిన్ వాయించాలనే కోరిక కలిగినప్పుడు, మార్కెట్లో కొనే ఆర్థిక వసతి లేకపోయినా, తన శిల్ప, చిత్రలేఖన నైపుణ్యాలను ఉపయోగించి తానే స్వయంగా ఒక అద్భుతమైన వయొలిన్ తయారు చేసుకుని, దానిపై స్వంతంగా రాగసాధన చేసి సంగీత విద్వాంసులనే అబ్బురపరిచారు. ఒకానొక సందర్భంలో మరణానికి చేరువలో వున్న ఒక బాలికను హోమియో వైద్యంతో బ్రతికించిన వైద్యుడాయన.

ఆయన వృత్తిరీత్యా వ్యవసాయదారే అయినప్పటికీ, ప్రవృత్తి అంతా సాహిత్య, కళా సేవలోనే గడిచింది. దురదృష్టవశాత్తూ, 18 ఏళ్ల ప్రాయంలోనే పక్షవాతం బారిన పడడంతో, దత్తత ద్వారా ఆయనకు సంక్రమించిన అపారమైన ఆస్తిపాస్తులన్నీ ఆ సుదీర్ఘ వైద్య ఖర్చులకే కరిగిపోయాయి. చివరికి అత్యంత కొద్దిపాటి ఆస్తి మాత్రమే మిగిలినప్పటికీ, ఆయన ఏనాడూ ధైర్యాన్ని, తనలోని విద్యా తృష్ణను కోల్పోలేదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన మిగిల్చిన ఆధ్యాత్మిక, సాహిత్య సంపదే నేడు వారి సంతానానికి లభించిన అసలైన వారసత్వ నిధి.

ఇదిలా ఉండగా, ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం మరింత బలపడడానికి ఒక మధురమైన సందర్భం తోడైంది. బసవేశ్వర రావు గారు తన కుమార్తె అయిన (స్వర్గీయ) జయప్రద గారిని, స్వయానా తన సోదరి కుమారుడైన (స్వర్గీయ) కొమరగిరి కృష్ణమోహన్ రావు గారికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ విధంగా తుర్లపాటి, కొమరగిరి వంశాల మధ్య రక్తానుబంధంతో పాటు మేధో సంస్కారాల కలయిక కూడా జరిగింది. ప్రస్తుతం మనం ‘శ్రీవాణి’ ఆధ్యాత్మిక మాసపత్రిక 500వ ప్రత్యేక సంచిక మహోత్సవ ఆవిష్కరణ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ అక్షర సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ పత్రికా వ్యవస్థాపకులు, స్వర్గీయ కొమరగిరి కృష్ణమోహన్ రావు గారి నామస్మరణ చేసుకోవడం మన కనీస కర్తవ్యం.

ఆ మహనీయుడి జీవిత ప్రస్థానం అక్షరాలా భక్తి, దేశభక్తి, విద్యా వికాసాల అద్భుత త్రివేణీ సంగమం. కృష్ణా జిల్లాలోని నందిగామ పట్టణంలో జన్మించిన ఆయన, బాల్యం నుంచే సమాజ సేవ పట్ల అమితంగా ఆకర్షితులయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో బాల స్వయంసేవక్‌గా అడుగుపెట్టిన ఆయన, దేశభక్తిని నరనరాన జీర్ణించుకున్నారు. ఆ జాతీయ భావజాల స్ఫూర్తితోనే ప్రలోభాలకు లొంగకుండా, తన యావత్ యవ్వనాన్ని దేశసేవకే అంకితం చేస్తూ అవనిగడ్డ, నందిగామ ప్రాంతాలలో ఆర్.ఎస్.ఎస్ విస్తారక్‌గా (పూర్తి సమయ కార్యకర్తగా) అత్యంత క్రియాశీలకమైన సేవలందించారు. ఆ విధంగా సమాజ హితమే శ్వాసగా సాగిన కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు, ఆ తర్వాతి కాలంలో క్రియాశీలక రాజకీయ రంగంలో అడుగుపెట్టారు.

కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పల్లెనూ, పట్నాన్ని చుట్టుముడుతూ నాటి భారతీయ జనసంఘ్ పార్టీ బలోపేతానికి, అలాగే జాతీయ భావజాల వ్యాప్తికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. అయితే, 1975లో దేశ రాజకీయ యవనికపై నల్లటి నీడలు కమ్ముకుంటూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దేశంలో అత్యవసర పరిస్థితి (Emergency)ని విధించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పౌర హక్కుల కోసం కృష్ణమోహన్ రావు గారు రాజీలేని గళమెత్తారు. ఆ అకుంఠిత దీక్షకు గాను నాటి ప్రభుత్వం ఆయనను అత్యంత కఠినమైన 'మీసా' (MISA - Maintenance of Internal Security Act) చట్టం కింద అరెస్ట్ చేసి, 19 నెలల పాటు సుదీర్ఘ కాలం జైలు గోడల మధ్య నిర్బంధించింది.

అయితే, ఈ చారిత్రాత్మక ఘట్టానికి వెనుక ఉన్న ఒక అపురూపమైన, అంతర్గతమైన రహస్యాన్ని ఇక్కడ మనం తప్పక చెప్పుకుని తీరాలి. ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడానికి ముందే... గ్రహాల గమనాన్ని, కాల స్వరూపాన్ని జ్యోతిష్య శాస్త్ర పరంగా పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారి మామగారు తుర్లపాటి బసవేశ్వర రావు గారు, అల్లుడైన కృష్ణమోహన్ రావు గారిని ముందే హెచ్చరించారు. రాబోయే కాలం రాజకీయంగా అత్యంత క్లిష్టమైనదని గ్రహించిన ఆయన, ‘రాజకీయ వేదికలపై విపరీతమైన ఘాటైన పదజాలంతో, తీవ్రమైన విమర్శలతో కొన్నాళ్ల పాటు ప్రసంగాలు చేయవద్దు, కొంతకాలం మౌనంగా లేదా సంయమనంతో ఉండడం శ్రేయస్కరం’ అని ఒక హితవు పలికారు. ‘కృష్ణా రోజులు అనుకూలంగా లేవు నీ విమర్శల జోరు తగ్గించు. . నిన్ను జైల్లో పెట్టవచ్చు, జాగ్రత్తఅని అన్నారట.

కాలగతిని ముందుగానే ఊహించగల బసవేశ్వర రావు గారి అపార జ్యోతిష్య విజ్ఞానానికి, వారి దూరదృష్టికి ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనం. జ్యోతిష్య శాస్త్ర నిధి అయిన బసవేశ్వర రావు గారు అంతటితో ఆగకుండా, జూన్ 21వ తేదీన (అంటే దేశంలో అత్యవసర పరిస్థితి విధించడానికి సరిగ్గా ఐదు రోజుల ముందర) అసలు ఎటువంటి పనులూ పెట్టుకోవద్దని, ప్రయాణాలు చేయవద్దని అల్లుడికి అత్యంత ఖచ్చితమైన సూచన చేశారు. మామగారి మాటను శిరసావహించిన కృష్ణమోహన్ రావు గారు ఆ రోజును జాగ్రత్తగానే గడిపారు కానీ, విధి ఎంత విచిత్రమైనదో ఆ రోజే రుజువైంది. కృష్ణమోహన్ రావు గారు ఏమాత్రం ఊహించని రీతిలో, సరిగ్గా అదే జూన్ 21వ తేదీన బసవేశ్వర రావు గారు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటూనే అకస్మాత్తుగా శివైక్యం చెందారు (స్వర్గస్తులయ్యారు). ఆ మహనీయుడు తన అల్లుడికి రాబోయే కాలపు ముప్పు గురించి జ్యోతిష్య పరిభాషలో హెచ్చరించింది కేవలం రాజకీయ పరిణామాల గురించే కాదు, బహుశా తన భౌతిక జీవిత ముగింపు గురించి కూడానేమో అనిపించక మానదు.

ఇలా ఒకవైపు మామగారి ఆకస్మిక వియోగం, మరోవైపు దేశంలో ముంచుకొచ్చిన ఎమర్జెన్సీ చీకట్లు కృష్ణమోహన్ రావు గారిని చుట్టుముట్టాయి. ఆ వెంటనే ప్రభుత్వం ఆయనను మీసా చట్టం కింద జైలులో నిర్బంధించినప్పటికీ, ఆయన తన పోరాట పటిమను ఏమాత్రం కోల్పోలేదు. జైలు గోడలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని బంధించలేకపోయాయి. 19 నెలల సుదీర్ఘ నిర్బంధం తర్వాత జైలు నుండి విడుదలైన ఆయన, మరింత రెట్టింపు ఉత్సాహంతో వివిధ ప్రజా పోరాటాల్లోకి దూకారు. చారిత్రాత్మక 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' ఉద్యమంలో, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో, లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ (JP) దేశవ్యాప్తంగా నడిపిన 'సంపూర్ణ క్రాంతి' ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచి చురుగ్గా పాల్గొన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన నిబద్ధత గల ప్రజా నాయకుడిగా తెలుగు నేలపై చెరగని గుర్తింపు పొందారు.

కేవలం తాత్కాలిక రాజకీయ సంస్కరణలు లేదా సామాజిక పోరాటాల వల్ల మాత్రమే సమాజం సంపూర్ణంగా మారదని, మానవ మనుగడకు నైతిక, ఆధ్యాత్మిక విలువల పునాది అత్యంత అవసరమని కృష్ణమోహన్ రావు గారు బలంగా నమ్మారు. ఈ ఉన్నతమైన ఆశయ సాధన కోసమే ఆయన తన ప్రయాణాన్ని అక్షర సాధన వైపు మళ్లించారు. ఆ క్రమంలోనే, సాక్షాత్తు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులను, మార్గదర్శకత్వాన్ని పొంది, చారిత్రాత్మక మచిలీపట్నం కేంద్రంగా 'శ్రీవాణి' ఆధ్యాత్మిక మాసపత్రికకు అంకురార్పణ చేశారు. దానికి వ్యవస్థాపక సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టి, అక్షరాన్ని ఒక సాధనంగా మలిచారు. ఈ పత్రిక ద్వారా కేవలం పూజా పునస్కారాలకే పరిమితం కాకుండా, నిజమైన ఆధ్యాత్మిక చింతనను, భగవాన్ సత్యసాయి బాబా వారి 'సత్య, ధర్మ, శాంతి, ప్రేమ' అనే దివ్య సందేశాలను వేలాది మంది పాఠకుల హృదయాలలోకి విజయవంతంగా చేరవేశారు.

కృష్ణమోహన్ రావు గారి దార్శనికత కేవలం పత్రికా రంగానికే పరిమితం కాలేదు. సమాజ ఉన్నతికి, భావి భారత పౌరుల నిర్మాణానికి 'విలువలతో కూడిన విద్యే' మూలస్తంభమని ఆయన గ్రహించారు. భగవాన్ సత్యసాయి బాబా వారి విద్యా ఆదర్శాల స్ఫూర్తితో, కేవలం అక్షర ముక్కలు నేర్పే చదువు కాకుండా, సంస్కారాన్ని నేర్పే విద్యాసంస్థలను, పాఠశాలలను నెలకొల్పడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. వాటి స్థాపనలోనే కాకుండా, నైతిక విలువల ప్రాతిపదికన ఆ సంస్థలను నడపడంలో, వాటి ప్రగతిలో అహర్నిశలు శ్రమించారు. ఈ విధంగా 'శ్రీవాణి' పత్రిక ద్వారా అక్షర చైతన్యాన్ని, విద్యాసంస్థల ద్వారా సంస్కార చైతన్యాన్ని సమాంతరంగా నడిపించిన మహోన్నత దార్శనికుడు ఆయన. దేశభక్తి క్రమశిక్షణ లాటి ఆదర్శాలతో వివేకానంద విద్య నికేతన్ స్కూల్ (హాస్టల్ తో) స్థాపించారు. 20/30 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. తమాషా ఏంటంటే అందులో చేరటానికి వైజాగ్, చెన్నై కరీంనగర్ నుంచి విద్యార్ధులు చేరేవారు.

సమాజంలో అణగారిన, నిరుపేద వర్గాల పిల్లలకు ఉచితంగా, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రారంభమైన 'శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం' వంటి గొప్ప విద్యా, సేవా కార్యక్రమాలను అట్టడుగు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కృష్ణమోహన్ రావు గారు భగీరథ ప్రయత్నం చేశారు. ఎందరో అనాథల జీవితాలలో విద్యా కాంతులు నింపారు. ఈ విధంగా, ఒకవైపు దేశభక్తిని గుండెల్లో నింపుకున్న నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా, ప్రజా హితం కోసం జైలు శిక్షను సైతం లెక్కచేయని ప్రజా పోరాటాల యోధుడిగా... మరోవైపు అక్షర దాతగా, విద్యాదాతగా, 'శ్రీవాణి' పత్రికా సంపాదకుడిగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని వహించిన కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు సమాజానికి చేసిన బహుముఖ సేవలు కాలగర్భంలో కలిసిపోనివి, ఎప్పటికీ చిరస్మరణీయమైనవి. ఆ మహనీయుడు నాటిన అక్షర బీజం, ఆయన స్థాపించిన ‘శ్రీవాణి’ ఆధ్యాత్మిక మాసపత్రిక నేటికి విజయవంతంగా 500 నెలలు (500 సంచికలు) పూర్తి చేసుకుని అప్రతిహతంగా సాగుతుండడమే ఆయన దార్శనికతకు సజీవ సాక్ష్యం.

ఒక పత్రిక వందల సంచికల మైలురాయిని దాటడం అంటే కేవలం కాలం గడవడం కాదు, అక్షరం సజీవంగా సమాజాన్ని నడిపించడమే! కృష్ణమోహన్ రావు గారు ఏ ఆశయాలతో, ఏ నైతిక విలువల పునాదులపై ‘శ్రీవాణి’ని స్థాపించారో... ఐదు వందల సంచికల సుదీర్ఘ ప్రయాణంలో ఆ ఆశయాల విలువ ఇసుమంతైనా తగ్గలేదు. తుర్లపాటి బసవేశ్వర రావు గారి వంటి మహామహుల మేధో సంపత్తి, కొమరగిరి కృష్ణమోహన్ రావు గారి త్యాగ నిరతి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం... వీటన్నింటి సమ్మిళిత రూపమే నేటి ‘శ్రీవాణి’ వైభవం.

ఆగస్ట్ 8, 2026 నాడు మహామహుల (విజయ్ శంకర్ తో సహా) సారథ్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే ఈ 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవం కేవలం ఒక వేడుక కాదు. అది తెలుగు ఆధ్యాత్మిక, సామాజిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. వ్యవస్థాపకుల ఆశయాలను భుజానికెత్తుకుని, వారి కుటుంబ సభ్యులు, పత్రికా మేనేజ్‌మెంట్ ఈ అక్షర యజ్ఞాన్ని తర్వాతి తరాలకు అందిస్తున్న తీరు అభినందనీయం. కృష్ణమోహన్ రావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ‘శ్రీవాణి’లోని ప్రతి అక్షరంలోనూ, ప్రతి సంచికలోనూ ఆయన కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. ఈ అపురూప పత్రిక భవిష్యత్తులో మరెన్నో వేల సంచికలను పూర్తి చేసుకుని, సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, స్వర్గీయ కొమరగిరి కృష్ణమోహన్ రావు కుటుంబ సభ్యులకు సత్యసాయిబాబా ఆశీస్సులు సదా లభించాలని మనసారా కోరుకుంటూ,

... జ్వాలా నరసింహారావు, విజయలక్ష్మి, ఆదిత్య కృష్ణ రాయ్, కుటుంబ సభ్యులు

1 comment:

  1. పూర్వుల చారిత్రక వైభవాన్ని,
    వ్యక్తుల వారసత్వ మహత్వాన్ని,
    సామాజిక పరిణామాలను,
    Genetics ను, 'శ్రీవాణి' పత్రికా ప్రస్థానాన్ని,
    కొమరగిరి కృష్ణమోహనరావుగారి మూర్తిమత్వాన్ని స్ఫూర్తిమంతంగా అక్షరాలతో అలంకరించారు
    మీ శైలి శైలమంత సుశీలమైనది,
    శీతలమైనది,సులలితమైనది
    సమగ్రత దాని తీరు
    సౌందర్యం దాని పేరు

    ReplyDelete