Thursday, October 15, 2026

‘ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు’ – శ్రీశ్రీ >>>>> టాకీసుల చుట్టూ సినీరంగ యువ మేధావుల భ్రమణం, పరిభ్రమణం : వనం జ్వాలా నరసింహారావు

 ‘ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు’ – శ్రీశ్రీ

టాకీసుల చుట్టూ సినీరంగ యువ మేధావుల 

భ్రమణం, పరిభ్రమణం

వనం జ్వాలా నరసింహారావు 

(అక్టోబర్ 16, 2026)  

ఈ మధ్యన విడుదలైన ఒక మంచి సినిమాను, రెండురోజుల తరువాత చూడడానికి దగ్గరలోని ఒక ఆధునిక హంగుల థియేటర్ కు వెళ్లాను. సినిమా పూర్తైన తరువాత, అనుకోకుండా అక్కడే కలిసిన ఆ సినిమా మహిళా యువ దర్శక-నిర్మాతను, ఇంత చక్కటి సినిమా ప్రదర్శిస్తుంటే హాలెందుకు ఖాళీగా వున్నదని అడిగితే, అసలు హాలు దొరకడమే అబ్బురమైందని ఆశ్చర్యార్థకమైన సమాధానం వచ్చింది. తీసిన సినిమా మంచిదా? కాదా? ‘బ్లాక్ బస్టరా, వైట్ బ్లాస్టారా’? అనేది ముఖ్యంకాదని, దాని ప్రదర్శనకు హాలు దొరకబట్టే నైపుణ్యం ముఖ్యమని అర్థమైనప్పుడు, ప్రజాస్వామ్య రాజకీయాల లాగా ‘థియేటర్ రాజకీయాలనేవీ’ ఏమైనా వున్నాయా అన్న అనుమానం వచ్చింది. పైగానేను చూసిన ఆ అద్భుతమైన సందేశాత్మక సినిమా ఒక లో బడ్జెట్ సినిమా. జీవితాంతం పొదుపు చేసుకున్న సొమ్మును పెట్టుబడి పెట్టి, ఒక మంచి ఆలోచనతో తీసిన ఆలోచనలు రేకెత్తించే సినిమా.

ఇదొకరకమైన ఆదిపత్యమైతే, ఏవేవో అర్థంకాని పేర్లతో (బ్లాక్ బస్టర్) వందల హాళ్ళలో, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొన్ని సినిమాలు విడుదలైన గంటల్లోనే, కోట్ల రూపాయలలో ఆదాయాలు వచ్చినట్లు, రికార్డులు బద్దలు కొట్టినట్లు, అవే సినిమాలకు జాతీయ - అంతర్జాతీయ ఆవార్డులు అనతికాలంలోనే వచ్చినట్లు మీడియాలో చూస్తుంటాం, వింటాం, చదువుతాం. చివరకు ఆశ్చర్యపోతాం. ఈ పరస్పర వైరుధ్యం నాచిన్ని బుర్రకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒకప్పుడు సినిమా విజయవంతంగా నడిచింది అంటే, 50 రోజులో, 100 రోజులో ప్రదర్శించడం, శత దినోత్సవాలు జరుపుకోవడం, వాటి ఆధారంగా ఆవార్డులు-రివార్డులు రావడం ఆనవాయితీగా వుండేది. కొన్ని చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకున్న నేపధ్యంలో సినీరంగంలో గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం కూడా ఒక పద్దతి ప్రకారం వుండేది. అందుకే: ‘ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు.’

నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1500 నుండి 1800 వరకు సినిమా ప్రదర్శన శాలలు (థియేటర్లు లేదా మల్టీప్లెక్సులు) అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ భారీ సంఖ్య వెనుక ఒక అదృశ్య ఏకాధిపత్యం (Monopoly) దాగి ఉందనేది బహిరంగ రహస్యం. మెజారిటీ థియేటర్లు, లీజుల రూపంలోనో లేదా పంపిణీ వ్యవస్థల రూపంలోనో కొద్దిమంది బడా నిర్మాత-పంపిణీదారుల హస్తగతమై ఉన్నాయని అంటారు. ఒక సినిమాకు థియేటర్ లభించాలా లేదా అనేది ఆ చిత్రం యొక్క నాణ్యత కంటే, ఆ వెనుక ఉన్న పంపిణీదారుడి అండదండల మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ వ్యవస్థీకృత ఏకాధిపత్యం వెనుక ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు, కుల ప్రయోజనాలూ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన అగ్రశ్రేణి శక్తులు తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి థియేటర్ల నెట్‌వర్క్‌ను ఒక కవచంలా వాడుకుంటున్నారన్న భావన పరిశ్రమలోనే బాహాటంగా వ్యక్తమవుతోంది.

మరోవైపు, వందల కోట్ల వ్యయంతో సినిమాలు తీస్తున్నామని, పదే-పదే సినిమాలు తీసే కొందరు దర్శక-నిర్మాతలు గుమ్మ గుమ్మలాడుతుంటారు. కానీ, ఆ కలెక్షన్ల లెక్కల్లో, భారీ బడ్జెట్ ప్రకటనల్లో ఎంతవరకు పారదర్శకత ఉందన్నది ఎప్పటికీ మిస్టరీనే. ఈ 'కార్పొరేట్ హైప్' సృష్టించే మాయాజాలంలో చిన్న, కొత్త, యువ మేధావ కళాకారులు నలిగిపోతున్నారు. ఎంతో సృజనాత్మకత, సామాజిక స్పృహ ఉండి కూడా, పరిశ్రమలోని పెద్దల 'చెప్పుచేతల్లో' లేదా వారి క్యాంపుల్లో లేకపోతే థియేటర్ల ముఖం చూడటం కూడా గగనమైపోతోంది. ఒకవేళ థియేటర్ దొరికినా, మొదటి రోజే 'హౌస్‌ఫుల్' బోర్డులు పడకపోతే, రెండో రోజుకే థియేటర్ నుండి ఆ చిత్రాన్ని లేపేసే క్రూరమైన వ్యాపార సంస్కృతి నేడు నడుస్తోంది.

వ్యాపార కోణం సినిమాకు అత్యంత ముఖ్యమైనదే అయినప్పటికీ, కళను కేవలం పెట్టుబడి, లాభాల గీటురాయితోనే కొలిస్తే పరిశ్రమలో సృజనాత్మకత అంతరించిపోతుంది. పెద్ద సినిమాలకు లభించే సదుపాయాల్లో కొంత శాతమైనా, కనీసం కొన్ని వారాల పాటు చిన్న, సందేశాత్మక చిత్రాలకు ప్రత్యేకంగా కేటాయించే పారదర్శకమైన విధానం రావలసి ఉన్నది. అప్పుడే సినిమా కేవలం కొందరి గుత్తాధిపత్యంగా మిగిలిపోకుండా, సకల కళాకారుల స్వేచ్ఛా వేదికగా, నిజమైన ప్రజా కళారూపంగా మనగలుగుతుంది.

ఈ నేపధ్యంలో అలనాటి సినీరంగ దిగ్గజం, అనుపమ చలనచిత్ర దర్శక నిర్మాత స్వర్గీయ కేబీ తిలక్, జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అందులో మరీ ముఖ్యంగా ప్రప్రధమ సినీ స్టూడియో (సారధి) హైదరాబాద్ కి వచ్చిన కారణాలు, దానికి ఆయన ఎడిటింగ్ లో విడుదలైన ‘రోజులు మారాయి’ శతదినోత్సవ వేడుకల సందర్భం, అరమరికలు లేని అలనాటి మహామాహులైన సినీరంగ ప్రముఖుల చొరవ, ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, సమష్టిగా స్టూడియో నెలకొల్పడానికి ఆదాయవనరుల సేకరణ, ఇత్యాది వివరాలున్నాయి. వాస్తవానికి తిలక్ జీవిత చరిత్ర అక్షరీకరణ చేసినది నేనే. అప్పట్లో వారం-వారం ఒక ప్రముఖ వారపత్రికలో ప్రచురితమైనప్పుడు స్థానిక ప్రెస్ క్లబ్ లో సంచిక విడుదలైననాడు ఒక సంచలనమే.

స్వర్గీయ కెబి తిలక్ ఒక మానవతావాది. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అలాంటి ఇతివృత్తాలే కధావస్తువుగా పలు చిత్రాలను నిర్మించారు. దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ, ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, చోటీబహు, కాంగన్ లాంటి చిత్రాల రూపకర్త ఆయన. ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన తిలక్ అతివాద పంథా కళాకారుల ఉద్యమాలతో చేతులు కలిపి, విప్లవ గీతాలను ఆలపించుతూ గ్రామగ్రామాన తిరిగేవారు. విశ్వవిఖ్యాత చలన చిత్ర దర్శక, నిర్మాత స్వర్గీయ ఎల్ వి ప్రసాద్ గారికి తిలక్ మేనల్లుడు. బొంబాయిలో వుండే ఆయన దగ్గరకు వెళ్లి, సినీపరిశ్రమలో అడుగిడిన తిలక్ నాటి 'పీపుల్స్ థియేటర్’ లో చేరి,  బల్ రాజ్ సహానీ, రోమేష్ తాపర్ లతో సాన్నిహిత్యం సంపాదించు కున్నారప్పట్లో. నగరంలోని ‘ఒపేరా హౌస్' అనే సినిమా టాకీసు ఆ రోజుల్లో వామపక్ష  వేదికయిన ప్రజానాట్యమండలి సమావేశాలకు ప్రధాన కూడలి. 

ఎల్ వి ప్రసాద్ వుంటున్న పొరుగింట్లో, ప్రఖ్యాత సినీ కళాకారుడు, ప్లేబ్యాక్ సింగర్ డబ్ల్యు ఎమ్ ఖాన్ ఉంటుండేవారు.  ఆయన దగ్గరకు వస్తూ పోతుండే సింథీకమెడియన్ 'గోపి' తో తిలక్ కు స్నేహం అయింది. తిలక్ సినీరంగంలో ప్రవేశించటానికి, రాణించడానికి గోపీ స్నేహం దోహదపడింది. ఎల్ వి ప్రసాద్ వద్ద 'ఏకలవ్య’  శిష్యరికం కూడా తోడ్పడింది. అప్పట్లో  ఎల్ వి ప్రసాద్ ప్రఖ్యాత సినీ దర్శక-నిర్మాత  ఎస్ ఎమ్ యూసఫ్ దగ్గర సహాయకుడిగా పనిచేసేవారు. ‘ఐనా', 'లేడీ డాక్టర్’ లాంటి కుటుంబ కథాచిత్రాలను ఎన్నో రూపొందించారు యూసఫ్. బొంబాయిలో వున్నరోజుల్లోనే, తిలక్ స్టూడియోలకు వెళ్తుండేవారు.

ఓ రెండేళ్లు బొంబాయిలో గడిపిన అనంతరం మద్రాసు (నేటి చెన్నై) కు ‘గృహ ప్రవేశం' అనే చలనచిత్రానికి  దర్శకత్వం వహించేందుకు బయలు దేరిన ఎల్ వి  ప్రసాద్ గారితో అక్కడికి చేరుకున్నారు శ్రీతిలక్ 1945 ప్రాంతంలో. సారధి బ్యానర్ క్రింద కె ఎస్ ప్రకాశరావు గారు తన 'మోడల్ ప్రొడక్షన్స్' సంస్థ తరఫున నిర్మిస్తున్న 'గృహప్రవేశం' సినిమాలో భానుమతి సరసన నటించటంతో పాటు, సినిమా దర్శకత్వం కూడా వహిస్తున్నారు ఎల్ వి ప్రసాద్ అప్పట్లో. త్రిపురనేని గోపీచంద్ ఆ సినిమా రచయిత. తన అభిరుచులకూ, ఆశయాలకు అనుకూలంగా వున్న సినీ ఎడిటర్ ఎమ్ వి రాజన్ తో దోస్తీ కుదిరింది. గృహప్రవేశం సినిమాకు కూడా ఆయనే ఎడిటర్. హెచ్ఎమ్ రెడ్డితో కలిసి పనిచేశారు. ఎల్ వి ప్రసాద్ భక్త ప్రహ్లాద (తెలుగులో మొదటి టాకీ చిత్రం) సినీ నిర్మాణం చేస్తున్న రోజుల్లో, రాజన్ తో సాన్నిహిత్యం పెంచుకుంటూ, ఎడిటింగ్ లైన్లో పట్టుసంపాదించుకునే ప్రయత్నాలు కొనసాగించారు తిలక్. మొదటి హిందీ టాకీ చిత్రమైన 'ఆలమ్ ఆరా'తో కూడా ప్రసాద్ కు సంబంధముంది.

తెలంగాణా విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం నీలినీడల్లో ప్రజా నాట్యమండలి ప్రముఖ వ్యక్తులు మద్రాసు చేరుకోనారంభించారు. ఓ విధంగా సాంస్కృతిక విభాగం అంతా చేరుకుంది మద్రాసుకు. అలాగే, భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీరంతా ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు ఉద్యమాల్లో తమ శక్తి  మేరకు పనిచేసిన వారేనని వేరే చెప్పనక్కర్లేదు. అది  కె ఎస్ ప్రకాశరావు, తిలక్ ద్వారా ఎల్ వి ప్రసాద్ వీలయినంత వరకు వీరికి ఒక ఆధారం కల్పించసాగారు. ఆ విధంగా సినీ పరిశ్రమలో ప్రజానాట్యమండలి తాలూకు పలువురు కళాకారులు స్థిరపడటానికి నాంది జరిగింది.

ఇదిలా వుండగా తిలక్ అప్పుడప్పుడే సినీరంగంలో ఎడిటర్‌గా స్థిరపడున్న రోజులవి. సరిగ్గా అప్పట్లోనే కొండముది గోపాల రాయశర్మ రాసిన ‘శ్రీమతి’ అనే స్క్రిప్ట్ సారథి ఫిల్మ్స్ కు ఉద్దేశించబడింది. గృహప్రవేశం సినిమా తీసిన తర్వాత మోడల్ ప్రొడక్షన్స్, సారథి నుండి విడిపోయింది. ‘స్వతంత్ర ప్రొడక్షన్స్’ అనే పేరుతో అదే రోజుల్లో మరో స్వంత కంపెనీని స్థాపించారు. ఇలా విస్తరించసాగాయి తెలుగు వారి ఫిల్మ్ కంపెనీలు రకరకాల కారణాల వల్ల. ఆ స్వతంత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ క్రిందనే ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో ‘ద్రోహి’ అనే సినిమాను తీశారు కెఎస్. కామ్రేడ్ పి సి జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల నుండి పార్టీ వైపు ఆకర్షితులైన చాలా మంది ప్రజా నాట్య మండలిలో సంబంధాలు పెట్టుకోవటంతో కాలక్రమేణా మద్రాసుకు వచ్చి సినీ రంగంలో స్థిరపడి క్యాపిటలిస్టయ్యారని తిలక్ చెప్పేవారు.

‘మేడమ్ ఎక్స్’ అనే నవల ఆధారంగా కొండముది గోపాల రాయశర్మ తయారుచేసిన ‘శ్రీమతి’ స్క్రిప్ట్ ను, సారధీ బ్యానర్ క్రింద సినిమా తీసేటందుకు ఇచ్చారు. దానికి అప్పట్లో డైరెక్టర్ ఎల్ వి ప్రసాద్. ‘శ్రీమతి’ సినిమాకు నూతన ఆర్టిస్టుల అన్వేషణలో కొండముది, లొకేషన్ (షూటింగ్ కొరకు) చూడటానికి డైరెక్టర్ ఎల్ వి ప్రసాద్, అమరావతిని దర్శించారు. వారప్పుడు ప్రాథమికంగా ఎంపిక చేసి మద్రాసుకు రమ్మని పిలిచిన వారిలో దశాబ్దాలపాటు సినీరంగాన్ని, దశాబ్దం పైగా ఆంధ్ర రాజకీయ రంగాన్ని శాసించిన నందమూరి తారక రామారావు వున్నారు. ఎన్టీరామారావుకు మూవీ టెస్ట్, స్టిల్ చేస్ట్, మేకప్ టెస్ట్ ఎల్వీ ప్రసాద్ చేయించినప్పుడు ఎడిట్ చేసిన ఇద్దరు వ్యక్తులు రాజన్, తిలక్ లు.  ఎమెచ్యూర్ కెమెరామెన్ డివి ఎస్ మణ్యం స్టిల్ ను తీశారు. తీయని ఆ సినిమాకు ఎన్టీరామారావును ఎంపిక చేశారని చెప్పారు తిలక్.  

దరిమిలా సారథి ఫిల్మ్స్ చల్లపల్లి రాజా సోదరుడు రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోకి పోవటం, ‘విజయా’ వారితో సహా ఇతరుల ప్రొడక్షన్స్ లో ఎల్.వి.ప్రసాద్ కూడా బిజీ కావటం కూడా ‘శ్రీమతి’ వాయిదా వేయటానికి దోహదపడ్డాయి. అప్పట్లో తిలక్, ఆ తర్వాత కె ఎస్ ప్రకాశరావులకు  మిర్జాపూర్ రాజుకు చెందిన ‘మీర్జాపూర్ స్టూడియో’ తో సంబంధముండేది. ఆ స్టూడియో ఆధ్వర్యంలో శరత్ నవల ఆధారంగా ‘మన దేశం’ అనే సినిమా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎల్ వి ప్రసాద్ దానికి దర్శకులు, నాయకుడి పాత్రను సిహెచ్ నారాయణరావు పోషించగా, నాయకిగా ఆయన సరసన మీర్జాపూర్ రాజా భార్య శ్రీమతి కృష్ణవేణి పోషించారు. అందులో అవకాశమిచ్చారు మొట్టమొదటి సారిగా ఎన్టీరామారావుకు సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర వేయటానికి.  అలా జరిగింది. ఆయన సినీరంగ ప్రవేశం.

హైదరాబాద్ లో సారథీ స్టూడియో నిర్మాణం

చల్లపల్లి రాజా సోదరుడు, రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోకి, సారధి సంస్థ వెళ్లింది. అప్పట్లో ప్రజానాట్యమండలి అభ్యుదయ బావాలకు ఆకర్షితులైన అనేక మంది కళాకారులను ఓ వేదికపై తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు సీవీవీఆర్ ప్రసాద్, ఎస్ వి నర్సయ్యలు. శాంతినికేతన్లో విద్యనభ్యసించి సినీరంగంలో టెక్నీషియన్‌గా కెమేరా ఫీల్డ్ లోకి ప్రవేశించిన ప్రసాద్ చాలా మందికి పరిచయస్తులే. శాంతినికేతన్ నుండి బొంబాయి వెళ్లడం వలన అక్కడ సీవీవీఆర్ కు ఎల్ వి గారితో కూడ పరిచయం అయింది. ఆభ్యుదయ కళాకారులందరూ ఒక వేదికపై ఎందుకు జమకూడారో కాని ఆ రోజుల్లో జరిగిన ఆ కలయిక భవిష్యత్ సినీరంగ ఆభివృద్ధిలో ఓ కీలకమైన ఘట్టానికి పరోక్షంగా అతి ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోయింది.

‘సారథి ఫిల్మ్స్' బ్యానర్ క్రింద ఐక్యవేదికనేర్పాటు చేసుకున్న కళాకారుల తొలి ప్రయత్నం ‘అంతా మనవాళ్లే' అనే చిత్ర నిర్మాణం, సహకార వ్యవస్థ, సహకార ఉద్యమం ప్రధాన ఇతివృత్తంగా తీసిన ఆ చిత్రానికి కథా రచియిత శ్రీ కొండేపూడి లక్ష్మినారాయణ. 'అంతా మనవాళ్లే’ సినీ దర్శకుడిగా పూర్తిగా కాకపోయినా ఎల్ వి ప్రసాద్ కనుసన్నలలోనే, అధ్వర్యంలోనే ఈ సినీ నిర్మాణం జరిగిందనే భావన ప్రేక్షకుల్లో కలిగే విధంగా చిత్ర నిర్మాణం జరిగింది. తద్వారా, తెలుగు చలన చిత్ర రంగ అభివృద్దిలో ఎన్నెన్నో ఫిల్మ్ సంస్థలు నెలకొనడానికి బాటలు వేసిన ఓ మహామనిషిగా ఎల్ వి ప్రసాద్ మిగిలిపోయారు. ఈ విషయాన్ని తిలక్ గర్వంగా గుర్తు చేసుకున్నారు.  

ఆ సినిమా ఎడిటర్ కేబీ తిలక్. ఆయనకు ఆదో అనుభూతి. 'అంతా మనవాళ్లే' చిత్ర నిర్మాణం మరో ఆధ్యాయానికి ఆరంభమే కాని అంతం కాదు, ఆ తర్వాత ఆ బృందం సారథి బ్యానర్ క్రింద తీసి, తెలుగు చలన చిత్ర రంగంలో మరో మలుపు, మైలు రాయిని చేసిన మేటి చిత్రం 'రోజులు మారాయి’. తాపీ ధర్మారావు, కొండేపూడి ఆక్ష్మీ నారాయణల కలం నుండి తెలంగాణోద్యమ ప్రభావం ప్రస్ఫుటించే కథగా వెలువడింది చిత్రం. బంజరు భూముల సమస్య ప్రధాన ఇతివృత్తం. కొసరాజు రచించిన ‘ఏరువాకా సాగేరోరన్నా... చిన్నన్నా.. నీ కష్టమంతా తీరే....’ అనే ఆ సినిమాలోని పాట నాటి నుండి నేటి వరకూ పల్లె ప్రజలకు మళ్ళీ మళ్లీ వినాలనిపించే పాట, వారు పాడుకుంటూ పనిచేసే పసందైన పాట.

హిందీ చలన చిత్ర రంగాన్ని దశాబ్దాల తరబడి కథానాయికగా శాసించిన వహీదా రెహ్మాన్ 'రోజులు మారాయి' సినిమా ద్వారానే సినీరంగ ప్రవేశం చేసారు. సినీ దర్శకుడు శ్రీ తాపీ చాణక్య, ఎడిటర్ తిలక్, డాన్స్ డైరెక్టర్ శ్రీ వెంపటి సత్యం, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వేణు (ప్రఖ్యాత సినీ కళాకారుడు శ్రీ భానుచందర్ తండ్రి) రోజులు మారాయి సినిమా కథానాయకుడిగా శ్రీ అక్కినేని నాగేశ్వర రావు, నాయికగా శ్రీమతి జానకి నటించారు. శ్రీ సిఎస్ఆర్ తదితరులు కూడా నటించారు. ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన శ్రీ తిలక్ ఆ రంగంలో నిలదోక్కుకోవటమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. 'రోజులు మారాయి' శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. హైదరాబాదు కు తెలుగు చలన చిత్రరంగం తరలిరావడానికి, ప్రప్రథమంగా సినీ స్టూడియో నిర్మాణం జరగడానికి ఆ శతదినోత్సవ వేడుకలు వేదికయ్యాయి. ఆదో చారిత్రక సంఘటన అని అనేవారు తిలక్.

నాటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి ఆవేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చి, సాహితీ సంస్కృతీ రంగాల అభివృద్ధికి చలన చిత్రరంగ ప్రముఖులు అగ్రభాగాన నిల్చి తోడ్పడాలని తమ ఉపన్యాసంలో సందేశమిచ్చారు. తదనుగుణంగానే 'రోజులు మారాయి' సినిమా యూనిట్ కు చెందిన ప్రముఖులందరూ కలిసికట్టుగా ఆలోచించి హైదరాబాద్ నగరంలో ‘సారథి స్టూడియో' స్థాపనకు, నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. చిరకాలంలోనే అది కార్యరూపం దాల్చింది. అమీర్ పేటలో స్టూడియో వెలసింది. సారదీ స్టూడియో నిర్మాణం కొరకు స్థలం కావాలని ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని అర్థించ లేదు దాని యజమానులు. ప్రయివేటు వ్యక్తుల వద్ద నుండి కొనుగోలు చేసిన భూమిలోనే స్టూడియో నిర్మాణం జరిగింది. స్టూడియో వున్న అమీర్ పేట ప్రాంతానికి రెండు-మూడు మైళ్ల దూరంలో ఉన్న ఖైరతాబాద్ సమీపంలో సారథీ యూనిట్ కళాకారులందరూ నివసించటానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు చేసారు. అలా కొన్న స్థలంలో నిర్మించిన ఇంట్లోనే నివాసముండేవారు శ్రీ సివివిఆర్ ప్రసాద్.

         ఇదే సారథి స్టూడియోలో విశ్వవిఖ్యాత 'నటసార్వభౌములు', 'నటసామ్రాట్టులు', 'పద్మశ్రీ'లుగానూ, పద్మభూషణ్ లుగానూ గౌరవ పురస్కారం అందుకొన్న నటీనటులెందరో, ఎన్నో చిత్రాల్లో నటించటానికి షూటింగ్ లో ఎన్నో సార్లు పాల్గొన్నారు. వీరిలో ఎన్టీఆర్, అక్కినేని, భానుమతి... ఇలా వ్రాసుకుంటూ పోతే అందరూ ఉన్నారు. కాకపోతే ఆ తర్వాతి కాల గమనంలో, సినీ కాలగమనంలో, ఎవరికి వారే వేరై ఎవరి ‘సినీ కుంపటి’ వారే పెట్టుకుని పరోక్షంగానో, ప్రత్యక్షంగానో సినీరంగ అభివృద్ధికి కృషి చేసారు. సారథీ యూనిట్ పరిణామ క్రమంలో ఇలా పురోగమిస్తుంటే, అదే స్పీడ్ లోనూ, ఒక్కొక్కసారి అంత కంటే కొద్ది తేడాతోనూ మరిన్ని సంస్థలు వెలిసాయి. వాటిలో ప్రముఖమైనవిగా చెప్పుకోవాలంటే పీపుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ప్రొడక్షన్స్, నవయుగ ప్రొడక్షన్స్, తిలక్ అనుపమ ఫిల్మ్స్.

అభ్యుదయ భావాలు, అభ్యుదయ భావాల వేదికలు భారత స్వాతంత్ర్య సమరంలోనూ, తెలంగాణ విమోచన ఉద్యమాలలోనూ ఆ తర్వాత మరికొంతకాలం వరకూ యువతను ఎంతగానో ఆకర్షించాయి. ఆ యువతను, కమ్యూనిస్టులుగానూ, సోషలిస్టులు గానూ, కాంగ్రెసు పార్టీలో అతివాదులుగానూ మలచాయి. అంతమాత్రాన వారంతా ఆ భావాలకే జీవితాంతం కట్టుబడి వున్నారని చెప్పటానికి వీల్లేదని అనేవారు తిలక్. కారణాలు ఏమైతేనేమి, ఏదో వ్యాపకంపేరుతో వారిలో పలువురి భావాలు ‘అభ్యుదయమే' అయినప్పటికీ, ఆశయాలు మంచివే అయినప్పటికీ, ఆచరణలో మాత్రం 'అంతస్తులు' పెంచుకునే వ్యవస్థలోకి లాగాయని తిలక్ గారి భావన. కాలమహిమా? సినీ ప్రభావమా? తననుతానే ప్రశ్నించుకునేవారు మా సంభాషణలలో కేబీ తిలక్. అదే ప్రభావమా? సినిమా థియేటర్ల మీద ఈ నాటి సార్వభౌమాదిపత్యం?

నిజమేనేమో... నాటి అభ్యుదయ భావాలు, కళాకారుల సమష్టి కృషి కాలక్రమేణా వ్యాపారీకరణ వైపు మళ్లడం వల్లే నేడు థియేటర్ల వ్యవస్థ కొందరి గుత్తాధిపత్యంలోకి (Monopoly) వెళ్ళిపోయింది. నాడు కేబీ తిలక్, ఎల్.వి. ప్రసాద్ వంటి మహానుభావులు టాలెంట్ కు పట్టం కట్టి ఎన్టీఆర్ వంటి నూతన నటీనటులను, వహీదా రెహ్మాన్ వంటి జాతీయ స్థాయి నటీమణులను పరిశ్రమకు పరిచయం చేశారు. కానీ నేటి కార్పొరేట్ హైప్, కోట్లతో కొలిచే కలెక్షన్ల మాయాజాలం వల్ల, ఆనాటి పారదర్శకత, ఆనాటి 'రోజులు మారాయి' వంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాల మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. అలనాటి విలువలను, నేటి వ్యాపార సంస్కృతిని బేరీజు వేసుకుంటే, సృజనాత్మకత కలిగిన యువ మేధావులు ఎవరి చెప్పుచేతల్లోనో ఉంటేనే తప్ప మనుగడ సాగించలేని దుస్థితి కనిపిస్తోంది. ఈ ధోరణి మారాలని, కళాకారులందరికీ సమాన అవకాశాలు లభించే పారదర్శకమైన వాతావరణం రావాలని ఆశించడం మన కనీస సామాజిక బాధ్యత.

1 comment:

  1. At present, maximum crap movies are being made in all languages, especially in Telugu.

    ReplyDelete