Friday, April 16, 2010

లగడపాటిది సమైక్యవాదమా? వితండవాదమా?అమాయకత్వమా?: వనం జ్వాలానరసింహారావు

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు లగడపాటి లాంటి సమైక్యతా వాదులు ఏం చేశారు?
ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎన్ని రకాల చులకన-గేలి చేశారు?
వనం జ్వాలానరసింహారావు

"బత్తీస్ మార్ ఖాన్, చత్తిస్ మార్ ఖాన్" అని మా చిన్నతనంలో ఒక సరదా గేమ్ ఆడే వాళ్లం. తెలిసీ-తెలియని వయసులో ఒకేసారి ఈగలను అన్యాయంగా చంపడంలో నైపుణ్యం ప్రదర్శించే ఆట అది. సరిగ్గా అలాంటి గేమే ఆడుతున్నారు లగడపాటి తన "సమైక్య వాదం" తో. ఎన్ని ఎక్కువ నివేదికలిస్తే అంత గొప్ప అనుకుంటున్నారాయన. అందులో ఎన్ని ఎక్కువ పేజీలుంటే, తన తెలివి తేటలకు అంత నిదర్శనమని కూడా భావిస్తున్నట్లుంది. వాస్తవానికి తానేం చేస్తున్నాడని కనీసం ఒక్కసారైనా ప్రజా ప్రతినిధిగా ఆలోచించిన దాఖలాలు కనపడడం లేదు ఆయన వాదనలు వింటుంటే. "ఎందుకిన్ని నివేదికలిచ్చావయ్యా"అని అడుగుతే, సమాధానం ఇస్తూ రెచ్చిపోయి, మరో రెండు నివేదికలిస్తానంటాడు. "అందులో ఏముందండీ"అని ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం ఇవ్వకుండా, తెలంగాణ వాదులు (ముఖ్యంగా టీ ఆర్ ఎస్ ను వుద్దేశించి) అవాస్తవాలు చెపుతున్నారనీ-ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడుతున్నారనీ-అనేక విషయాల మీద వక్రీకరించి శ్రీకృష్ణ కమిటీ ముందు పెడుతున్నారని, అవన్నీ నిర్వీర్యం చేయడానికి తాను దశలవారీగా వారం-వారం ఒక నివేదిక ఇస్తున్నానని అంటారు. ఆయన సమైక్యతా వాదనలో స్పష్టత లేదనీ-నివేదికలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదాన్ని బలపరుస్తున్నాయని ఆయన దృష్టికి తెస్తే, ఎదురు ప్రశ్నిస్తారు తప్ప వివరణ ఇవ్వనే ఇవ్వరు. ఎప్పుడో నవంబర్ 1, 1956 ముందు సంగతులను, మహరాష్ట్ర-కర్నాటక రాష్ట్రాలలోని పూర్వ హైదరాబాద్ జిల్లాల విషయాన్ని అసందర్భంగా ప్రస్తావించి వితండ వాదాన్ని-అమాయకత్వాన్ని బయట పెట్టుకుంటారు. ప్రతిరోజు ఆయన గారు ఏదో ఒక ఛానల్ లో కనిపించి ఇదే అమాయకత్వాన్ని-వితండవాదాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి మరింత రెచ్చిపోయి, కే సీ ఆర్ ను బహిరంగ చర్చకు రమ్మంటూ సవాలు విసిరి ఇంకో నివేదిక తయారీలో నిమగ్నమైపోతారు. ఆ క్రమంలోనే ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడబోయి, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ముందు అవాక్కయి పోవడంతో ఆ తర్వాత మరే ఛానల్స్ లోను ఎక్కువగా కనిపించడం లేదు.

అసలు విషయానికొస్తే ఆ రోజు జరిగిన చర్చలో లగడపాటి, అమర్ తో పాటు దళిత వుద్యమ నాయకులు ప్రభాకర్ కూడా వున్నారు. వాద-ప్రతివాదనలు ఉదృత రూపం దాల్చడానికి ముందు, రాజగోపాల్ నివేదికల వుద్దేశాన్ని తప్పుబడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర్ర నినాదాన్ని నీరు కార్చే ప్రయత్నంలో భాగంగానే, మహరాష్ట్ర-కర్నాటక లోని జిల్లాలను అక్కడినుంచి విడగొట్టి తెలంగాణలో కలపే విషయాన్ని సమైక్యవాదులు తెర పైకి తెస్తున్నారన్నారు అమర్. ఇంతకూ తెలంగాణ కావాలని వుద్యమం చేసేది ఆంధ్రప్రదేశ్ లో వున్న తెలంగాణ ప్రాంతం వాళ్లే కాని, పక్క రాష్ట్రాల వాళ్లు కాదనే విషయం లగడపాటికి తెలియదా? ఏమో ! అదే విధంగా, సమాజంలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన దళితులు-అట్టడుగు వర్గాల వాళ్లు-పేదల స్థితిగతుల గురించి, వాటికీ-సమైక్య వాదానికీ వున్న సంబంధాల గురించి లగడపాటి తన నివేదికల్లో ఏమన్నా ప్రస్తావించారా అని ప్రభాకర్ అడిగిన దానికి కూడా సూటిగా వివరణ ఇవ్వలేదాయన. కరీంనగర్ లోగాని, కృష్ణా జిల్లా లోగాని దళితుల అణచివేతలో ఒకే విధంగా వ్యవహరించాయని, కాకపోతే తెలంగాణలో నెలకొన్న పటేల్-పట్వారీ వ్యవస్థ మూలాన వారు అక్కడ మరింత దోపిడీకి గురయ్యారని, అయినా ఎక్కడున్నా వారి పరిస్థితి ఒకటే అని ఏదో చెప్పబోయారే తప్ప సమైక్య వాదానికి దానికీ వున్న సంబంధం కానీ, అవి నివేదికల్లో పొందుపరిచిన విషయం కానీ వివరించలేదు. మధ్యలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన తెచ్చి వాదనను మరో వైపు మళ్లించారు. అదే విధంగా, మహారాష్ట్ర-కర్నాటక ప్రాంతాలకు, భారత-పాకిస్తాన్ ప్రాంతాలకు మరో రకమైన పోలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అసలు విషయమైన తెలంగాణ దళితుల ఆకాంక్ష గురించి ఆయనకు పట్టినట్లు లేదు. 54 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాల కాలం తప్ప మిగతా కాలం అంతా పాలించిన "లగడపాటి కాంగ్రెస్ పార్టీ" దళితులకు సమైక్య రాష్ట్రంలో మేలు జరుగుతుందా? ప్రత్యేక రాష్ట్రంలో మేలుజరుగుతుందా అన్న విషయాన్ని లగడపాటి తన నివేదికల్లో పట్టించుకోలేదని చర్చలో ప్రస్తావనకొచ్చింది. అందుకే తెలంగాణ ప్రాంత దళితులు, తాము విడిపోతా మంటున్నారు కదా అని ప్రశ్నిస్తే దానికీ సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోయారు రాజగోపాల్ గారు.

చిదంబరం డిసెంబర్ ప్రకటన తర్వాత అందరికంటే ముందు ఎందుకు లగడపాటి రాజీనామా చేశారని, ఎందుకు కే సీ ఆర్ కు పోటీగా నిరాహార దీక్షకు పూనుకున్నారని, వీటికి సంబంధించి నివేదికల్లో ఏమన్నా ప్రస్తావన వుందా అని ప్రశ్నిస్తే, ఆ సమాధానం కూడా వింతగానే వుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో అంతర్లీనంగా సమైక్య భావన వుందని, కలిసి వుండాలన్న తహ-తహ నిజాం కాలం నుంచే నాటుకు పోయిందని మరో రహస్యం వెల్లడి చేశారు. దరిమిలా హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడగొట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చి విశాలాంధ్ర ఏర్పాటు చేశారని, అప్పట్లో తెలంగాణ జిల్లాలతో సహా అందరూ "విశాలాంధ్ర" కు అనుకూలంగా తీర్మానం చేశారని బల్ల గుద్ది చెప్పడం మరో విశేషం. "తెలుగు తల్లి గర్భ సంచిలోంచి సమైక్యత వాదం పుట్టుకొచ్చింది" అని, దానికి తాను బలం చేకూరుస్తున్నానని (అందుకే తాను అవతరించినట్లు) గొప్పలు చెప్పుకున్నారు. ఇక ఇక్కడ నుంచి వాద-ప్రతివాదనలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతం వారు తమ వ్యాపార లావాదేవీలను కాపాడుకోవడానికి డిసెంబర్ తొమ్మిది తర్వాత సమైక్య వాదన పుట్టుకొచ్చిన విషయం వాస్తవం కాదా అని లగడపాటిని వివరణ అడుగుతే, దానికి సమాధానం ఇవ్వకుండా, పెద్దమనుషుల ఒప్పందం ఏ విషయంలోనూ, ఎప్పుడూ (ఒక్క ఉపముఖ్యమంత్రి విషయంలో తప్ప) ఉల్లంఘన జరగలేదని మరో వితండ వాదన తెర పైకి తెచ్చారు. రాజగోపాల్ ఎప్పుడైతే అలా వర్తమాన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం మొదలెట్టారో తెలంగాణ వుద్యమం గురించి ఆయనకు కొంత వివరించడం మంచిదని ఆ దిశగా తన వాదనను వినిపించారు సీరియస్ గా అమర్.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందని, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని, తమ సామాజిక-సాంస్కృతిక-భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగు వారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు ఏనాడో అభిప్రాయపడ్డారని, అయినా "విశాలాంధ్ర" ఏర్పాటు జరిగిందని, ఆ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అది జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయిందని మరొక్కమారు చరిత్రను గుర్తుచేశారు అమర్. 1969 లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గురించి, 1970 నాటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం గురించి, 350మంది తెలంగాణ ప్రాంతం వారు మరణించిన సంగతి వివరిస్తూ, అమర్ గత 30-40 సంవత్సరాల కాలంలో ఇంత జరుగుతున్నా, లగడపాటి లాంటి సమైక్యవాదులు, ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి వుండాలన్న భావనను ముందుకు తీసుకెళ్లడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకపోగా, రెచ్చగొట్టే చర్యలెన్నో చేపట్టారన్నారు. ఒకవేళ కలిసుంటే బాగుంటుందేమో అనుకునే కొంత మందిలో కూడా అ భద్రతా భావాన్ని పెంపొందించారని గుర్తుచేశారు. విడిపోదామన్న ఆకాంక్ష మరింత బలీయమై, ఈ రోజు గ్రామ-గ్రామానికి పాకి, ప్రతి తెలంగాణ వ్యక్తి, తమకు అన్నివిధాల అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి అరుస్తుంటే, ఈ సమైక్యవాదులు ఏమని నచ్చచెప్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం రాజగోపాల్ దగ్గర్నుంచి రాలేదు.

ఇరు ప్రాంతాలు విడిపోవాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగాలని కోరుతూ అనేకానేక పాటలు-గేయాలు-జానపదాలు-నాటకాలు వెలువడ్డాయని, సెమినార్లు నిర్వహించబడ్డాయని, కలిసుండాలన్న సమైక్యతా వాదులు ఇలాంటివి చేసిన దాఖలాలు ఒక్కటైనా ఎందుకు లేవని దళిత నాయకుడు ప్రభాకర్ ప్రశ్నిస్తే దానికీ జవాబు రాలేదు లగడపాటి నుంచి. ఎన్నికల్లో అన్ని పార్టీలు తెలంగాణ ఇస్తామని ప్రకటించ లేదా అని నిలదీస్తే అవాక్కై పోయారు పాపం. ఇక ఇలా కాదను కొన్న లగడపాటి మరో వితండవాదాన్ని-ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రస్తావించి చర్చలో పాల్గొన్న వారితో పాటు చూస్తున్న మాలాంటి వారి ఆగ్రహానికి కూడా గురయ్యారు. పంజాబ్ రాష్ట్రం నుంచి ఖలిస్తాన్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఒకటేనని పోల్చడంతో ఆయనకు ఘాటుగా సమాధానం చెప్పాల్సి వచ్చింది.

ఖలిస్తాన్ తో తెలంగాణ ఉద్యమాన్ని పోల్చడాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణించారు అమర్. భారత దేశాన్నుంచి విడిపోవాలన్న ఖలిస్తాన్ ఉద్యమానికి, భారత దేశంలోనే వుండాలన్న తెలంగాణ ఉద్యమానికి వ్యత్యాసం తెలుసుకోలేక పోవడం రాజగోపాల్ లాంటి వారు చేస్తున్న కుట్రలో భాగమే అని, ఇలాంటి వాదనలు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి ఎలా దోహదపడ్తాయని, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలను సీమాంధ్రులు తమ సరసకు తెచ్చుకునే ప్రయత్నం ఇదేనా అని ఎదురుదాడికి దిగితే తప్పించుకునే మార్గం కూడ కనపడలేదు లగడపాటికి ఆరోజు జరిగిన చర్చలో.

చివరగా:
"ఖలిస్తాన్-తెలంగాణ ఉద్యమాలు ఒకరకమైనవి కావు లగడపాటి గారు. ఖలిస్తాన్ ఉద్యమం ఎందుకు జరిగిందో చదువుకుని హోమ్ వర్క్ చేసి మరీ చర్చల్లో పాల్గొనండి రాజ్ గోపాల్ గారూ..."

"రెండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన వాళ్లు మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆలోచించండి !"

"రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు లగడపాటి లాంటి సమైక్యతా వాదులు ఏం చేశారు? ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎన్ని రకాల చులకన-గేలి చేశారు?"

"ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పక్కదారి పట్టించే ’బూచి’ ని చూపించకండి !"

"ఎన్నికల్లో గెలుపు-ఓటములు ఉదాహరణలుగా తీసుకుని తెలంగాణ వాదనను బలహీనంగా చిత్రించకండి !"

11 comments:

  1. 'ఎన్ని పేజీల నివేదిక ఇస్తే అంత గొప్పా? ' అని లగడపాటి అన్నారు. మరి మీరెందుకు ఇంత పెద్ద వ్యాసం రాశారు? లగడపాటి ఇచ్చిన నివేదిక తెలంగాణాని సపోర్ట్ చేస్తోంది అని మీ స్వయంపకటిత మేతావులు హరీష్ రావు, ముక్కు చంద్రశేఖరరావుల ఉవాచ! :) మీరేమో లగడపాటి మీద చాలా ఇదైపోతున్నారు, భాధ పడిపోతున్నారు? ఇంతకూ మేధావులు మీరా, మీ ఏకకుటుంబ పార్టీ తెరాస నాయకులా? ఇది ముందు తేల్చుకోండి, ఆ తరువాత లగడపాటి మీద పడి ఏడుదురు గాని.

    ReplyDelete
  2. మీ వాదన ఏదో ఆ ' దిక్కుమాలిన ' శ్రీకృష్ణ కమిటీకి నివేదించుకోండి. మీ ఏడ్పులేవో అక్కడ ఏడ్వండి, లగడపాటి మీద ఏడిస్తే ఏంప్రయోజనం? అనేది బుర్రపెట్టి అర్థం చేసుకోండి , మేతావుల్లారా! :))

    ReplyDelete
  3. లగడపాటి చేసిన చులకన-గేలి ఏమిటో కాస్తంత వివరిస్తారా?

    ReplyDelete
  4. తెలంగాణా ఉద్య్మాన్ని (కుట్ర అని అనాలి) పంజాబ్ పరిస్థితి తో "సమానం చేయటం" సరి ఐనది కాదు అని నేను అంగీకరిస్తాను. కానీ ఈ రెండు ఉద్యమాలను పోల్చటం లో ఏ మాత్రం తప్పు లేదు. ఈ రెండు ఉద్యమాలూ దేశ సమగ్రతా విఛ్ఛిన్నానికి దారి తీసేవే..

    ReplyDelete
  5. మీ పిచ్చి ప్రశ్నలకు లగడపాటి సమాధానం కావాలా? అతని అభిప్రాయాలు మీకు అంత ముఖ్యమా! లగడపాటిని హీరో చేసింది మీరే.

    చెన్నారెడ్డి దగ్గర 5ఏళ్ళు పిఆరో గా వున్నారు, మరి గురువుగారి తెలంగా వాదం ప్రపంచానికి తెలిసిందే కదా, ఇప్పటి కెసిఆర్ అంతకన్నా అమ్ముడుపోగల దగుల్భాజీ నాయకుడు. ఈయన తెలంగానము తెదెపా నుంచి తరిమాక మొదలయ్యింది , కాదా?

    ReplyDelete
  6. Lagadapati's main concern is his Lanco hills real estate project in Hyderabad.Otherwisw he would have been so worried about keeping the state united.

    ReplyDelete
  7. ఆ కార్యక్రమం నేను కుడా చూసాను, చివర్లో లాగడ పాటి ముఖం చూసి జాలేసింది.

    ReplyDelete
  8. నేను ఆ రోజు జరిగిన చర్చలోని అంశాలను మాత్రమే ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఎవరి మనసునూ నొప్పించే ఆలోచన నాకు లేదు. చదివి అభిప్రాయాలను వెల్లడి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  9. సమైఖ్య వాధమంటూ అమాయకత్వం నటించే వితండవాది...

    ReplyDelete
  10. లగడపాటి బూచిని చూపించటం సరైనది కాదు. అలానే కే సీ ఆర్ ఆంధ్ర బూచి ని చూపించటం మాత్రం న్యాయమైన విషయమా?
    రాష్ట్రం సమైక్యం గా ఉండాలని అనేక గేయాలు, సెమినార్లూ ఆంధ్ర లో జరిగాయి. తెలంగాణ లో భావ ప్రకటనా స్వేఛ్ఛ ఉందా? ఒక వేళ సమైక్యంధ్ర కు అనుకూలం గా ఏ సెమినారో పెడితే వాళ్ళను వేర్పాటువాదులు బతికి బట్ట కట్టనిస్తారా?
    జై ఆంధ్ర ఉద్యమం సమయం లో రాష్ట్రం సమైక్యం గా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది తెలంగాణా వారు. అప్పుడు తెలంగాణా వేర్పాటు ఉద్యమానికి ఏమైంది? అలానే కే సీ ఆర్ కి మంత్రి పదవి ఇవ్వకపోవటం వలన ప్రత్యేక ఉద్య్మాన్ని కోల్డ్ స్టోరేగీ లోంచీ తీశారు. ఈ ఉద్యమం యాభైల నుంచీ ఆక్టివ్ గా ఉంటూనే ఉంటే అప్పుడు అనుకోవచ్చు తెలంగాణ ఉద్యమానికి యాభై యేళ్ళ చరిత్ర అని.

    ReplyDelete