Wednesday, April 28, 2010

“ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ” తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు : వనం జ్వాలా నరసింహారావు

ఏప్రియల్ 30నుండి మే నెల1, 2010 వరకు జరుపుకుంటున్న
నూరేళ్ల శ్రీశ్రీ విరసం మహాసభల సందర్భంగా

భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి
“ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ”
తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు
వనం జ్వాలా నరసింహారావు

తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, "తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను, అలవోకగా అనువదించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఏకైక రచయిత గాను, కవిత్వం ద్వారా మరో ప్రపంచాన్ని వీక్షించిన మహా మనీషిగాను, అంచనాలకు అందని వ్యక్తి గాను అందరికీ సుపరిచితుడైన మహాకవి శ్రీ శ్రీ అనబడే శ్రీరంగం శ్రీనివాసరావు భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ (ఆంధ్ర ప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్-ఏ.పీ.సి.ఎల్.ఏ) తొలి అధ్యక్షులనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. నా వరకు నాకు మాత్రం ఆ విషయాలను వివరంగా తెలియచేసిన వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు-రాజ్యసభ మాజీ సభ్యుడు-పేరొందిన ప్రజా వైద్యుడు-భారతదేశంలోనే పౌరహక్కుల ఉద్యమానికి నాంది పలికిన మేధావి డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తి.

సోవియట్ యూనియన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల నడుమ తలెత్తిన సైద్ధాంతిక విభేదాల దరిమిలా, కారణాలేమైనప్పటికీ, భారత-చైనా దేశాల మధ్య 1962లోయుద్ధం జరిగింది. యుద్ధం నేపధ్యంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుకూల వాదులుగా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా పడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంనుండే, కమ్యూనిస్టుల కంచుకోటగా, ఖమ్మం జిల్లాకు పేరుండడంతో, ఆ జిల్లాకు చెందిన ముఖ్యమైన నాయకులందరినీ నిర్బంధించింది ప్రభుత్వం. ఇదిలా వుండగా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న నేపధ్యంలో, అంతకు ఒక ఏడాది క్రితం నుంచి, ఖమ్మం పట్టణంలోని స్థానిక డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్ వై.ఆర్.కె) ఇంట్లో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు-సానుభూతిపరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే వేదిక కింద సమావేశమై సిద్ధాంత పరమైన అనేక విషయాలపై చర్చించుకుంటుండేవారు. ఎవరు-ఎందుకు పెట్టారోగాని, అలా ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండె సమావేశాలకు హాజరయ్యేవారిని "ఆదివారం సంఘం" అని ఎద్దేవాగా పిలవడం జరిగింది.

పార్టీపట్ల, సిద్ధాంతాలపట్ల సంపూర్ణ విశ్వాసమున్న డాక్టర్ వై.ఆర్.కె, తన వంతు కృషిగా, కమ్యూనిస్ట్ నాయకుల విడుదలకు-పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేయసాగారు. స్థానిక ఖమ్మం న్యాయవాదులైన బోడేపూడి రాధ, కె.వి.సుబ్బారావుల మద్దతు కోరారు. ఆ ముగ్గురి (మేధావి త్రయం అన్న పేరొచ్చింది వారికి)కలయిక భవిష్యత్ భారత పౌర హక్కుల ఉద్యమానికి నాంది కాబోతున్నట్లు ఆనాడు వారితో సహా ఎవరూ ఊహించలేదు. కలిసి ఉద్యమించడానికి అంగీకరించిన "మేధావి త్రయం", సాధ్యమైనంత త్వరలో విజయవాడలో ఒక సదస్సు నిర్వహించాలని, ఆ సదస్సులో పౌరహక్కుల సంస్థ స్థాపన ప్రక్రియను ప్రారంభించాలని, అదే రోజున బహిరంగ సభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకుంది. వారు జరుపదల్చుకున్న సదస్సుకు-బహిరంగసభకు ఆహ్వానించాలనుకున్న వారిలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు శ్రీపాద అమృత డాంగే (సీ.పీ.ఐ), ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ (సీ.పి.ఐ.ఎం) లు ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని భావించిన నంబూద్రిపాద్ ను, జ్యోతిబసును అప్పటికింకా నిర్బంధంలోకి తీసుకోలేదు ప్రభుత్వం. డాంగే, నంబూద్రిపాద్ లతో పాటు ఇంకెవరెవరిని పిలవాలన్న ఆలోచన చేసిన మేధావి త్రయం "శ్రీ శ్రీ” ని ఆహ్వానించాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల ఉద్యమ వాది జస్టిస్. ఎన్.సీ. ఛటర్జీని, ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో వుంటున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కడియాల గోపాల రావును కూడా ఆహ్వానించాలని నిర్ణయం జరిగింది.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా విజయవాడ న్యాయవాది కే.వి.ఎస్.ఎన్ ప్రసాదరావు సారధ్యంలో, మేధావి త్రయం మార్గదర్శకత్వంలో, ఖమ్మం "ఆదివారం సంఘం" ఆశించిన రీతిలో పౌర హక్కుల ఉద్యమానికి విజయవాడ లోని "రైస్ మిల్లర్స్ సంఘం" భవనం వేదికగా శ్రీకారం చుట్టడానికి రంగం సిద్ధమయింది. అనుకున్నట్లు గానే నాలుగైదు వందల మంది డెలిగేట్స్ తో సదస్సు మొదలయింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వారే కాకుండా పలువురు సానుభూతి పరులు హాజరయ్యారు సదస్సుకు. ఇక సదస్సులో నిర్ణయం తీసుకుని సాయంత్రం బహిరంగ సభలో వెల్లడి చేయడమొక్కటే మిగిలింది. ఇంతలో అక్కడ చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన చిలికి-చిలికి గాలివానయ్యి, సీపీఐ కి చెందిన కార్యకర్తలంతా సదస్సును బహిష్కరించి వెళ్లిపోయారు. అప్పటికే విజయవాడ చేరుకున్న తమ నాయకుడు డాంగేని కలిసి బహిరంగసభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు వారంతా. చివరకు సాయంత్రం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభకు సీపీఐ కి చెందిన వారెవరూ హాజరవ్వలేదు. సదస్సులో "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ" ను నెలకొల్పాలని, ఉద్యమాన్ని ప్రతి జిల్లాకు తీసుకుపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగసభలో ప్రకటించారు.

ఏ.పీ.సీ.ఎల్.సి అధ్యక్షుడిగా శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాలరావును, ఉపాధ్యక్షులుగా న్యాయవాదులు కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్. ప్రసాదరావులను, సభ్యులుగా న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావు, డాక్టర్ వై.అర్.కే లతో సహా మరి కొంత మందిని ఎన్నుకున్నారు డెలిగేట్లు. సదస్సు తీసుకున్న నిర్ణయాలను, కార్యాచరణ పథకాన్ని బహిరంగ సభలో ప్రకటించారు. నలభై వేల మందికి పైగా హాజరయిన బహిరంగ సభ వేదిక మీదున్న ప్రముఖుల్లో ఎన్.సీ.ఛటర్జీ, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులు ముఖ్యులు. ఆ విధంగా మొట్టమొదటి పౌర హక్కుల ఉద్యమానికి అధ్యక్షుడిగా శ్రీ శ్రీ వ్యవహరించసాగారు కొన్నాళ్లపాటు. కేవలం నామమాత్రంగా వ్యవహరించడమే కాకుండా జిల్లాలలో జరిగిన బహిరంగసభలకు తప్పకుండా హాజరయ్యేవారు శ్రీ శ్రీ.

పౌరహక్కుల ఉద్యమాన్ని బలీయంగా ముందుకు తీసుకెళ్లాలంటే, ఉద్యమ లక్ష్యాలను సాధించాలంటే, జిల్లా స్థాయి సదస్సులు-బహిరంగసభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. తదనుగుణంగానే, కర్నూల్, అనంతపూర్, నల్గొండ జిల్లా సూర్యాపేటలలో సభలు జరిగాయి. మూడు చోట్లా ప్రధాన ఆకర్షణ సభలకు హాజరై చక్కటి ఉపన్యాసం చేసిన శ్రీశ్రీ నే. నవంబర్ 1965 మూడవ వారంలో నిర్వహించిన సూర్యాపేట సదస్సు అన్నింటిలోకి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునేవారు. సరిగ్గా అది జరిగిన వారం రోజులకు మేధావి త్రయాన్ని, వారితో పాటు కర్నాటి రామ్మోహన్ రావును, రాష్ర్ట్రవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ నాయకత్వాన్నిముందస్తునిర్భంద చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం. వీరంతా అరెస్టయినప్పటికీ, ఆ తర్వాత పది రోజులకు అనుకున్న ప్రకారం న్యాయవాది ఏడునూతుల పురుషోత్తమ ఆవు ఆధ్వర్యంలో, నిర్వహించిన ఖమ్మం సదస్సుకు, నంబూద్రిపాద్, కడియాల గోపాల రావులు హాజరయ్యారు. శ్రీ శ్రీ రాలేదు. ఏ.పీ.సీ.ఎల్.ఏ ఆధ్వర్యంలో ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో నిర్వహించిన చివరి సదస్సు అదే.

ఖమ్మంలో అరెస్టయిన డాక్టర్ వై.ఆర్.కె ప్రభృతులను నిర్భంధించిన హైదరాబాద్ ముషీరాబాద్ జైల్‌లోనే వున్న మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లా రెడ్డి లాంటి ప్రముఖ నాయకులను కలిసే అవకాశం కలిగిందని డాక్టర్ రాధాకృష్ణమూర్తి అన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న కాసు బ్రహ్మానందరెడ్డిని పెరోల్ పై విడుదలైన సుందరయ్యగారు కలుసుకున్నప్పుడు, "మీ అందరికంటే పౌర హక్కుల ఉద్యమం చేపట్టిన మేధావి త్రయం లాంటివారు ఎక్కువ ప్రమాదకరమైన వ్యక్తులు" అని వ్యాఖ్యానించారట. అంటే ఆనాటి శ్రీ శ్రీ అధ్యక్షతన చేపట్టిన పౌరహక్కుల ఉద్యమం ప్రభుత్వంపై అంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిందనాలి.

ఆ తర్వాత కాలంలో పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని జైలునుంచే నడపాలని భావించారు. "హెబియస్ కార్పస్ పిటీషన్" అనే ఆయుధాన్ని ఉపయోగించారు. కొందరు హైకోర్టును, మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వై.ఆర్.కే, బోడేపూడి రాధలు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసినందున వారిని భద్రతా కారణాల దృష్ట్యా నాటి ప్రభుత్వం విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి తిహారీ జైల్లో వుంచింది విచారణ జరిగినంత కాలం. అప్పటికే తిహారీ జైలుకు హెబియస్ కార్పస్ విచారణకు తీసుకొచ్చిన వారిలో హరికిషన్ సింగ్ సూర్జిత్, ఏ.కె. గోపాలన్, బీ.టీ.రణదివే, మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, నాగభూషణం పట్నాయక్, హరే కృష్ణ కోనార్ లాంటి ప్రముఖ మార్క్సిస్ట్ నాయకులున్నారు. వారంతా, ఒక ప్రణాళిక ప్రకారం అనధికారికంగా పోలిట్ బ్యూరో సమావేశం జరుపుకునేందుకు తీహారీ జైలును వేదికగా ఉపయోగించుకున్నారు.

పిటీషన్ విచారణలో వుండగానే, పౌర హక్కుల ఉద్యమ ప్రభావం వల్లనో-దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం నిర్భందాలకు వ్యతిరేకంగా వెల్లడవుతున్నందువల్లనో, కేంద్ర ప్రభుత్వం ఏప్రియల్ 29, 1965న, పీడీ చట్టం కింద అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని, సుప్రీం కోర్టుకు ఆ విషయాన్ని తెలియచేసింది. ఆ విధంగా అంతా విడుదలయ్యారు. బహుశా ఆ విధంగా ఆలోచిస్తే, శ్రీ శ్రీ అధ్యక్షతన చేపట్టిన పౌరహక్కుల ఉద్యమం తన ప్రభావాన్ని చూపిందని అనాలి.

తర్వాత కాలంలో చాలా రోజులకు, బలమైన పౌరహక్కుల ఉద్యమాన్నొకటి నిర్మించాలన్న ఆలోచనొచ్చింది పుచ్చలపల్లి సుందరయ్య గారికి 1982లో. అదేదో కేవలం సీ.పి.ఎం నాయకత్వాన వుండేది కాకూడదని, ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా, పార్టీ రహిత మేధావుల ఆధ్వర్యంలో వుండాలని భావించారాయన. నవంబర్ 1982లో రఘునాథ రెడ్డి అధ్యక్షుడిగా, డాక్టర్ వై.ఆర్.కే ప్రధాన కార్యదర్శిగా, సురవరం సుధాకర రెడ్డి-విఠల్ కార్యదర్శులుగా, అన్ని పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు కార్యవర్గ సభ్యులుగా పౌరహక్కుల సంస్థ ఆవిర్భావం జరిగింది. కారణాలే వైనా, 1989లో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత రఘునాథ రెడ్డి గవర్నర్ కావడంతో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఉద్యమం ఆగిపోలేదు. కొనసాగుతూనే వుంది ఏదో ఒక రూపేణా.

కాలక్రమేణా ప్రభుత్వాల ఆలోచనా విధానంలోను మార్పు కనిపించ సాగింది. చట్ట పరంగా మానవ హక్కుల సంస్థలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయడం మొదలయింది. జాతీయ మానవ హక్కుల కమీషన్, రాష్ర్ట స్థాయి హక్కుల కమీషన్లు ఏర్పాటయ్యాయి. పౌర హక్కుల ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం తన వంతుగా మానవ హక్కుల పరిరక్షణకు పూనుకుంది. ఇదంతా జరగడానికి కారణం అలనాటి శ్రీ శ్రీ సారధ్యంలో ఆవిర్భవించిన పౌర హక్కుల సంస్థే అనడం అతిశయోక్తి కాదేమో !

1 comment:

  1. చాలా పాత విషయాలను గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete