Tuesday, July 20, 2010

అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి రాష్ట్రేతర ఇంజనీరింగు నిపుణులను నియమించాలి : వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై సంవత్సరాల వరకు, అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ట్రాలలోను కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో వున్నాయి. సరిహద్దు నున్న పొరుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తి, పార్టీ పరంగా చాలావరకు సమసి పోయినా, అన్ని విషయాల్లో-అన్ని సందర్భాల్లో అంగీకారానికి వచ్చాయని అనలేం. కాకపోతే ఆరంభంలో, రాష్ట్రానికి ఒకటో-రెండో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటివి మాత్రమే వుండడంతో, పెద్దగా పేచీలుండకపోయేయి. క్రమేపీ, ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, రక-రకాల పంపకాలలో విభేదాలు తలెత్తడం మొదలైంది. అవీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యనే-కాంగ్రెస్ ఇంకా కేంద్రంలో అధికారం కోల్పోక ముందే తలెత్తాయి. కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో, విభేదాలు చిలికి-చిలికి గాలివానలయ్యాయి. పొరుగు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను రాజకీయ కోణం నుంచి, రాజకీయ లబ్దిని దృష్టిలో వుంచుకుని చూడడం సహజమైంది. ఇంతలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ-తమ ప్రాంత ప్రజలకు లాభం చేకూరాలన్న కోణంలో ఆలోచన చేయడం, ఆ ఆలోచనలో రాజకీయం వుండడం, అంతటితో ఆగకుండా కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల వారికి నష్టం జరిగినా తమకు లబ్ది జరగాలని ముందుకు సాగడం నిరంతర సమస్యలకు నాంది పలింది. తమ రాష్ట్రం నుండి పారుతున్న నీటిపై తమకే హక్కు అని కొందరు వాదిస్తే, మిగులు జలాలపై హక్కు తమదనే అని మరికొందరు వాదించ సాగారు. సహజంగా ప్రవహించే నీటిపై హక్కు ఎవరికి-ఎంత మోతాదులో వుండాల్నోనని తేల్చాల్సిన కేంద్ర జల వనరుల సంఘం, ప్రాజెక్టులు ఆరంభించినప్పటినుంచి, పూర్తయ్యేవరకు నిమ్మకు నీరెత్తినట్లు వుండి, ఆ తర్వాత తమకే హక్కుందని వాదించే పొరుగునున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తమదైన శైలిలో వంతుల వారీగా మద్దతిచ్చి సమస్యను మరింత జటిలం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అలాంటి తాజా వివాదమే బాబ్లీ ప్రాజెక్టు.

బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది, తప్పా-ఒప్పా అని నిర్ణయించే అధికారమున్న "కేంద్ర జల వనరుల సంఘం" తీర్పు చెప్పే లోపునే నిర్మాణం పూర్తైంది. తెలుగు దేశం హయాంలోనే పనులు మొదలయ్యాయని కాంగ్రెస్ వారు, కాదని తెలుగుదేశం నాయకులు వాదించు కోవడంతో మొదలైన జగడం, సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనే వరకు పోయింది. అఖిల పక్ష కమిటీ ప్రధానిని కలిసే లోపునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల బృందం, బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకుంది. వారిని మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, అంతటితో ఆగకుండా, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మర్నాడు న్యాయమూర్తి ముందర హాజరు పరిచారు. అరెస్ట్ చేసిన విధానం తప్పని న్యాయమూర్తికి ఎందుకు అనిపించ లేదో న్యాయ కోవిదులకే తెలియాలి. పైగా అరెస్టు చేసింది ఆంధ్ర హద్దుల్లో. అక్కడ ఏ నిషేధాజ్ఞలు లేవు. వున్నా అరెస్ట్ చేసే అధికారం మరాఠా పోలీసులకు లేదు. సరే.. అంతవరకు సరిపుచ్చుకుందామనుకుంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, మిగతా వారందరు చట్ట సభలకు ఎన్నికైన వారని కూడా చూడకుండా, అందులోనూ మహిళలున్నారని కూడా ఆలోచించకుండా, మరాఠీ పోలీసులు ప్రవర్తించారు. రోజు-రోజుకు వారి ప్రవర్తన మరీ అభ్యంతరకరంగా మారి, నాలుగో రోజుకు పతాక స్థాయికి చేరుకుంది. అందరినీ జైలుకు తరలించాలన్న ఆలోచనతో, కనీస సౌకర్యాలు లేని ధర్మా బాద్ తాత్కాలిక జైలు నుంచి, అంతకంటే అధ్వాన్నంగా వున్న పోలీసు వాహనాలలోకి ఎక్కించే ప్రయత్నం జరిగింది. అభ్యంతరం చెప్పిన బాబు ప్రభృతులను దాదాపు చిత్ర వధలకు గురిచేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ధర్మా బాద్ నుంచి బహిర్గతం చేయని ప్రదేశానికి తరలించడానికి ముందు రాత్రి వివిధ కారణాల వల్ల అనారోగ్యానికి గురైన మాజీ ముఖ్యమంత్రికి, ఆయన సహచర ఎమ్మెల్యేలకు అవసరమైన అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అక్కడకు బయల్దేరిన నాలుగు "ఇ.ఎం.ఆర్.ఐ-108 అంబులెన్స్" వాహనాలను సరిహద్దు దాటనివ్వకపోవడం మానవత్వమున్న ప్రతి వ్యక్తీ ఖండించాల్సిన విషయం. తమకందిన ప్రభుత్వ సమాచారం మేరకు నాలుగు అంబులెన్సులలో, నలుగురు వైద్యులను, ఏడెనిమిది మంది పేరా మెడికల్ సిబ్బందిని, మామూలుగా వుండే అంబులెన్స్ సిబ్బందిని వెంట బెట్టుకుని, అర్థరాత్రి బయలుదేరి వెళ్ళిన ఇ.ఎం.ఆర్.ఐ-108 అధికారికి, ఆయన సహచరులకు చేదు అనుభవం ఎదురైంది. రాత్రి రెండున్నరకు చేరుకున్న వాహనాలను, సిబ్బందిని ఎన్ని ప్రయత్నాలు చేసినా, బాబు ప్రభృతులున్న ప్రదేశానికి అనుమతించలేదు. ఎట్ట కేలకు స్థానిక పోలీసు అధికారుల జోక్యంతో, తెల్లవారిన తర్వాత, షరతుల మధ్య ధర్మా బాద్ కు పోనిచ్చారు మరాఠా పోలీసులు. అంబులెన్సులు-సిబ్బంది అక్కడికి చేరుకున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కాల కృత్యాలు తీర్చుకుంటుంటే, వీలున్నంతమందికి అత్యవసర వైద్య సహాయం కల్పించారు. వీరు పరీక్షించిన పలువురి పరిస్థితి కడు దయనీయంగా వుందట. చంద్ర బాబు నాయుడుని కలుద్దామనుకుంటుండగానే, హఠాత్తుగా కలకలం మొదలవడంతో హెచ్చరికల నడుమ వెనుదిరిగి సమీపంలో పార్క్ చేసిన అంబులెన్సులలో తలదాచుకున్నట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక అంబులెన్సుల సిబ్బంది గతే అలాగుంటే, ఇతరుల సంగతి చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఆ తర్వాత జరిగిందంతా వివిధ టెలివిజన్ ఛానళ్లు నిరంతరం ప్రసారం చేశాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, వారూ-వీరూ అనే తేడా లేకుండా, పురుషులు-మహిళలు అన్న విచక్షణా జ్ఞానం లేకుండా, ఉపాహారం తీసుకుంటున్న సమయంలో, బాబు ప్రభృతులందరినీ చితకబాదుతూ, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా, వాహనాల్లోకి ఎక్కించారు. బాబు అరెస్టయిన నాటినుంచే రాష్ట్రంలో చెలరేగిన ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. మరో పక్కన తెలుగు వారికి, మరాఠీలకు మధ్య చిచ్చు లేపింది అటు మహారాష్ట్ర ప్రభుత్వం-ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడి వాహనాలను అక్కడ, అక్కడి వాహనాలను ఇక్కడ ధ్వంసం చేసుకునే పరిస్థితులకు దారితీసింది. పుట్టపర్తి రావాల్సిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన పర్యటనను నిరసనల మధ్య వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసమర్థతను బాహాటంగా బహిర్గతం చేసుకున్నాయి.

గతంలో రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు-పొరుగు రాష్ట్రాలతో పోరాడవలసి వచ్చినప్పుడు, పార్టీలకతీతంగా కలిసి-మెలిసి పని చేసేవారు. ఇప్పుడా స్ఫూర్తి పోయింది. చంద్రబాబు నాయుడు చేసిన పని విమర్శించవచ్చునేమో కాని, ఆయన అరెస్టును, ఆ తర్వాత ఆయన పట్ల-ఆయన సహచరుల పట్ల మరాఠా పోలీసులు వ్యవహరించిన తీరును, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాని-ప్రభుత్వం కాని ఖండించకపోవడం శోచనీయం. తెలుగు దేశానికి దీనివల్ల రాజకీయ లబ్ది కలుగుతుందో-లేదో కాని, ప్రభుత్వం-కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అప్రతిష్ఠ పాలు కాక తప్పదు. ఎంతో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలింతకీ బాబ్లీ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల రైతుల సమస్య. మహారాష్ట్ర రైతే బాగుపడాలని కాని, ఆంధ్రా రైతే బాగు పడాలని కాని కోరడం సమంజసం కాదు. భారత దేశంలోని రైతు ఎక్కడున్నా రైతే. జల వివాదాలు పరిష్కరించుకొని, అంతర్ రాష్ట్రాల గుండా పారుతున్న జలాలను, ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా, పొరుగు నున్న రాష్ట్రాల రైతులకు కూడా లాభం కలిగే ట్లు ఉపయోగించుకోవాలి. రెండు-లేక-మూడు ఇరుగు-పొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదం వుంటే, రాజకీయాలను ఆస్కారం లేకుండా, ఇతర రాష్ట్రాల ఇంజనీరింగు నిపుణుల సంఘం పరిష్కరించే విధానం రూపొందించాలి. వారి నిర్ణయాన్ని ధిక్కరించకుండా సంబంధిత రాష్ట్రాలు అమలు పరిచే చట్టం రూపొందించాలి. అంతవరకు రాజకీయాలకు అతీతంగా భారత దేశ రైతు లాభ పడే ఆస్కారం భవిష్యత్ లో లేదు.

చారిత్రాత్మకంగా-భౌగోళికంగా రూపు దిద్దుకొని, సుస్థిర జన సమూహంతో-సామాజిక వర్గంతో కూడి, ఉమ్మడి భాష-పరిసరాలు-ఆర్థిక జీవన శైలి-మానసిక స్థితిగతులు కలిగిన సార్వజనీన సమాజ లక్షణాలుంటే దానినొక "జాతి" గా-"దేశం" గా పరిగణించాలని, అదే జాతికి సరైన నిర్వచనమని, మార్క్సిస్ట్ సిద్ధాంతం చెపుతుంది. ఈ నిర్వచనం అన్ని కోణాలలోంచి పరికించి చూస్తే సరిపోతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎల్లలతో కూడిన సరిహద్దులున్నప్పుడే దాన్ని ఒక ప్రత్యేక జాతిగా, లేదా, దేశంగా పిలవాలని మరి కొందరి అభిప్రాయం. గత కొన్నాళ్లపాటు వార్తల్లోకెక్కిన బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం గమనిస్తుంటే, ఒక దేశం విషయంలో ఇది నిజం కావచ్చునేమో కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో (భారత జాతి-ఉదాహరణకు) భాగమైన వివిధ రాష్ట్రాల విషయంలో హద్దులు-సరిహద్దులు-ఎల్లలు-హక్కులు-ప్రత్యేకతలు-వేర్పాటు ధోరణులు అనే భావన కలగడం సరైందేనా? అని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైందనాలి.

భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్య (ఫెడరల్ తరహా వ్యవస్థ). కాకపోతే, పాక్షికంగా ఏక కేంద్రక ప్రభుత్వ విధానాన్ని పాటించే రాజ్యాంగ వ్యవస్థ అని కూడా అంటాం. ఒక వైపు సకలాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం, మరో వైపు తమ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అదే మోతాదులో సర్వాధికారాలున్న రాష్ట్ర ప్రభుత్వాలు, సాధ్యమైనంత వరకు తమ-తమ హద్దుల్లో, రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లో, అధికారాన్ని చలాయిస్తుంటాయి. రాష్ట్రాధికారాలని, కేంద్రం అధికారాలని, ఉమ్మడి అధికారాలని, వేర్వేరు రకాల అధికారాలను, అటు ఫెడరల్ విధానానికి-ఇటు యూనిటరీ విధానానికి భంగం కలగని రీతిలో రాజ్యాంగం నిర్దేశించింది. అంత వరకూ బాగానే వుంది కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో, భిన్న భాషలు మాట్లాడే, విభిన్న సంస్కృతులు అనుసరించే, రక-రకాల మనస్తత్వాలున్న సామాజిక వర్గంతో నిండిన వివిధ రాష్ట్రాల మధ్య అధికారాల-హక్కుల విషయంలో తేడాలొస్తే, పరిష్కరించుకునే విధానం అస్పష్టంగా వుండడంతో, బాబ్లీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం మొదలైంది.

అసలింతకీ మనముంటున్నది ఒకే దేశంలోని, ఒకే జాతి వారమా? లేక ఒకే దేశంలో నివసిస్తున్న విదేశీయుల మా? పొరుగునున్న ప్రాజెక్టును చూస్తామనడంలో తప్పేం టో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలిలానే కొన సాగిస్తే, భిన్నత్వంలో ఏకత్వానికి-ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీకని మనం చెప్పుకుంటున్న భారతావని ప్రకటనలకే పరిమితం అనాల్సి వస్తుందేమో !

2 comments:

  1. జ్వాలా నరసింహా రావు గారు,

    మీరు పొరుగున ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడు తున్నారు. ఈ రాష్ట్రంలోనే శాసన సభ్యుడిగా వుంది పోతిరెడ్డిపాడు సందర్శించ లేక పోయారు దివంగత జనార్థన్ రెడ్డి గారు. ఓబులాపురం గనులు మన శాసన సభ్యులు చూడాలనుకున్నప్పుడు ఎంత రభస జరిగిందో చూశాం. ఇటీవలే జగన్ కూడా మహబూబాబాద్ వెళ్ళలేక పోయాడు. మన రాష్ట్రంలోనే పరిస్థితులు ఇలా ఉంటే పక్క రాష్ట్రం గురించి చెప్పేది ఏముంది? మీరన్నట్టు మన రాజ్యాంగంలోని లొసుగులను ముందు సరిదిద్దాలేమో అనిపిస్తుంది.

    ReplyDelete