Saturday, July 24, 2010

ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం :వనం జ్వాలా నరసింహారావు

ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుంగు సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్ చేసిన వైనం కాంగ్రెస్ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, చేయకూడని విధంగా, రాంబాబు విమర్శలు చేశాడన్న ఆరోపణతో ఆయన్ను సస్పెండ్ చేసింది అధిష్ఠానం. రాంబాబు వివరణ కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా సంఘం ఇచ్చిన గడువు ముగియక ముందే, హఠాత్తుగా సస్పెన్షన్ చేయాల్సిన కారణాలను మీడియాకు వివరించడంలో స్పష్టత లోపించిందనాలి. రాంబాబు సస్పెన్షన్ వ్యవహారంతో ఆగకుండా, వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్ ధిక్కార ధోరణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠానం, పటిష్ఠమైన ఈ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని, అప్రయత్నంగానే వదులుకునే దిశగా అడుగులేస్తున్నదన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతుందనాలి.

భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేసిన మితవాద భావాల "మాడరేట్ల" ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, 1907 లో పార్టీలో చీలి కొచ్చింది. మాడరేట్ల "కన్వెన్షన్" బాల గంగాధర తిలక్ ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించింది. వారంతా "నేషనలిస్ట్ పార్టీ" పేరుతో సమావేశమయ్యారు. అలా వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగింది. తిలక్ కారాగార శిక్ష పూర్తి చేసుకుని విడుదలై వచ్చేటప్పటికి, అయన్ను బహిష్కరించిన మాడరేట్లకు అనుచరులు లేకుండా పోయారు. రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ పై ఆయన ప్రభావం పడింది. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా "సత్యాగ్రహం" చేపట్టాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. దరిమిలా చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలది ధిక్కార స్వరమా? అభిప్రాయ భేదమా?

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. ఒకానొక సందర్భంలో, సుభాష్ చంద్ర బోసు కాంగ్రెస్ అధ్యక్షుడవడం ఇష్టపడని గాంధీజీ రాజీనామాకు సిద్ధపడడంతో, తనకంటే ఆయన సేవలే పార్టీకి శ్రేయస్కరమని భావించిన బోసు పార్టీని వదిలి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నారు. తనకిష్ఠమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్ తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్ లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్ఠమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్ కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్ లో ఆయన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించారు నెహ్రూ. అవన్నీ ఒక విధంగా గ్రూప్ రాజకీయాలే కదా ! పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించుకునే ప్రయత్నాలే కదా ! అసలు-సిసలైన అంతర్గత పోరాటం స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలైందనాలి.

1948-1950 మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా "జనగణమణ.." వుండాలా, "వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, నెహ్రూ ఎంత ప్రయత్నించినా, రాజ్యాంగంలో, "ప్రణాళిక, సామ్యవాదం" అన్న పదాలకు తావులేకుండా పటేల్ జాగ్రత్త పడ్డారు. జనవరి 26, 1950 న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్ కు ఆ పీఠం దక్కింది. ఆయన అధ్యక్షుడైన మరుక్షణం నుంచే, రాష్ట్రపతికి, ప్రధానికి వుండే అధికారాల-హక్కుల విషయంలో చర్చ మొదలైంది. ఒకవిధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. ఇంతలో పటేల్ చనిపోవడం, ఆయన చనిపోయిన పక్షం రోజుల లోపునే, నెహ్రూ అభీష్ఠం మేరకు, "ప్రణాళికా సంఘం" ఏర్పాటు కావడం జరిగింది. అయితే దానికి రాజ్యాంగ బద్ధత కలిపించకుండా, ఎగ్జిక్యూటివ్ బాడీ హోదా కలిగించడం విశేషం.

వల్లభాయ్ పటేల్ చనిపోవడంతో, టాండన్ కు చిక్కులు మొదలయ్యాయి. ప్రధానిగా వున్న నెహ్రూ టాండన్ కు వ్యతిరేకంగా తన నిరసన తెలియచేసేందుకు, పార్టీ పదవులన్నిటి కీ రాజీనామా చేశారు. దేశానికి నెహ్రూ వల్ల కలిగే మేలు ఎక్కువని భావించిన టాండన్, స్వచ్చందంగా, అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. వెంటనే సమావేశమైన వర్కింగ్ కమిటీ, నెహ్రూను ఆయన స్థానంలో ఎన్నుకోవడంతో, పార్టీ పదవి-ప్రధాని పదవి ఒకే వ్యక్తి చేపట్టారు. నెహ్రూ మద్దతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. మద్రాస్ రాష్ట్రం విషయంలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని రెండుండేవి. మొదటిది చెన్నైలోను, రెండోది విజయవాడలోను పనిచేస్తుండేవి. అప్పట్లో నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారని అంటారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదే-పదే "ఆ రెండు పత్రికలు" అన్న రీతిలోనే, ఇంచుమించు అదే అర్థం వచ్చే విధంగా, తనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు, ఒక పత్రిక సంపాదకుడు వరుసగా రాసిన ఐదు సంపాదకీయాలను "పంచ మహా పాతకాలు" గా ప్రకాశం పంతులు వర్ణించారు. 1950 లో జరిగిన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో నెహ్రూ మద్దతున్న సంజీవరెడ్డి చేతిలో ఎన్జీ రంగా ఓడిపోయారు. దరిమిలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న నినాదం పుంజుకుంది. ఇంతలో 1952 ఎన్నికలొచ్చాయి. రాజగోపాలా చారి మద్రాస్ ముఖ్య మంత్రయ్యారు. ఆంధ్ర మంత్రుల్లో చాలామంది ఓడిపోవడంతో, విద్యాధికుడైన దామోదరం సంజీవయ్యను, నెహ్రూ సలహామీద, మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజాజీ. జస్టిస్ శ్రీకృష్ణ కమీషన్ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా రాకపోతే "అంతర్యుద్ధం" తప్పదని కేసీఆర్ హెచ్చరిక చేసిన విధంగానే, అప్పట్లో అదే మాటను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయంలో, ప్రకాశం పంతులు ఉపయోగించారు.

అప్పట్లో నీలం సంజీవ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా, అల్లూరి సత్యనారాయణ రాజు ప్రధాన కార్యదర్శి గా, కాసు బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లా పరిషత్ బోర్డ్ చైర్మన్ గా వున్నారు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న సమయంలో, రాజధాని ఎక్కడ వుండాలన్న సంగతి మద్రాస్ శాసనసభలోని ఎమ్మెల్యేలు నిర్ణయించాల్సి వచ్చింది. ఎన్జీ రంగా తిరుపతి కావాలంటే, రాయలసీమలో వుండాలని ఎవరూ అనలేదు. ఏర్పాటు కాబోయే ఆంధ్ర రాష్ట్రం, తాత్కాలికమే నన్న రాజాజీ, ఒక్క రోజు కూడా మద్రాస్ రాజధానిగా వుండడానికి ఒప్పుకోలేదు. పైగా అంతా కాంగ్రెస్ వారే. అందరివీ ధిక్కార స్వరాల కాంగ్రెస్ రాజకీయాలే. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. తాత్కాలికంగా కర్నూల్ ను రాజధానిగా ఎంపిక చేశారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్ ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా కృషిక్ లోక్ పార్టీకి నాయకుడప్పట్లో.

శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్ నాయకులు పావులు కదిలించారు. అడుసుమల్లి సుబ్రహ్మణ్యం శాసన సభకు రాకుండా ఒక వర్గం ప్రణాళిక వేసింది. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో "కుల రాజకీయాలు" బహిర్గతం కావడం కూడ ఆరంభమయ్యాయనవచ్చు. కమ్యూనిస్టు అభ్యర్థులపై పోటీకి దిగడానికి వెనుకంజ వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి కుల రాజకీయాల అవసరం కలిగింది. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవ పున్నయ్యను కూచిన పూడిలో ఓడించడానికి వ్యూహాత్మకంగా, గౌడ కులానికి చెందిన అనగాని భగవంత రావును ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు. అయినా ధిక్కార స్వరాలు ఆగిపోలేదు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. అప్పట్లో ఆ ముగ్గురి ని "బుర్రకథ దళం" అని ముద్దు పేరుతో పిలిచేవారట. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా, 1956 లో విశాలాంధ్రగా "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చేసినాయన, తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తి కింద ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. ఒప్పుకోకపోతే, ధిక్కార స్వరాలు వినిపించే వే ! 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. మళ్లీ ధిక్కార స్వరాలు వినిపించాయి. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి " కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదని" అన్నారు. అదే రోజుల్లో జాతీయ స్థాయిలో రామ మనోహర్ లోహియా స్థాపించిన "సోషలిస్ట్ పార్టీ” లో, రాష్ట్రానికి చెందిన పివిజి రాజు చేరారు. వారూ-వీరూ ఏకమై "సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ" గా అవతరించి, నీలంకు వ్యతిరేకంగా పనిచేశారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1957-59 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన యు ఎన్ ధేబర్ స్థానంలో, 1960 లో ఆయన్ను నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో ఎవర్ని ముఖ్య మంత్రి చేయాలన్న విషయంలో మళ్లీ పోటీ మొదలైంది. అల్లూరి సత్యనారాయణ రాజు కాని, కాసు బ్రహ్మానందరెడ్డి కాని ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలున్నప్పటికీ, ఇరువురి లో ఎవరినీ కాదనలేని పరిస్థితుల్లో, అధిష్ఠానం ఆశీస్సులతో, వారిద్దరి మద్దతుతో, రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను పీఠం ఎక్కించారు. తనకు మద్దతిచ్చిన అల్లూరికి-కాసుకు, పి డబ్ల్యు-ఆర్థిక శాఖలను కేటాయించారు సంజీవయ్య. వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మర్రి చెన్నారెడ్డి స్థాపించిన డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బొమ్మ కంటి సత్యనారాయణ రావు అప్పట్లో సంజీవయ్యకు మద్దతుగా చక్రం తిప్పారు. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. రాష్ట్ర రాజకీయాలకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్న నీలం సంజీవరెడ్డి అప్పట్లో దూరంగా వుండేవారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. అంతకుముందే అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీని, 1962 ఎన్నికల్లో, కాంగ్రెస్ లో విలీనం చేశారు మర్రి చెన్నారెడ్డి ప్రభృతులు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు. ధిక్కార స్వరాలకు కొంతకాలం తెర పడింది.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని "మినిస్టీరియలిస్టులు" అని, ఏసీ వర్గాన్ని "డిసిడెంట్లు" అని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. ఏసీ సుబ్బారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేకాటలో, టెన్నిస్ క్రీడలో స్నేహితులైనా, రాజకీయాల్లో విరోధులే. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. అప్పట్లో, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైన శీలం సిద్దారెడ్డికి కాసు అండదండలుండడంతో, మరో నాయకుడు జలగం వెంగళ రావు పరోక్షంగా తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో మొదలవడానికి ప్రోత్సాహం ఇచ్చారంటారు. అదో రకమైన ధిక్కారం. ఇక చెన్నారెడ్డి నాయకత్వంలో హింసా మార్గంలోకి పోయిన తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానందరెడ్డిని, ఆయన భార్యను బాహాటంగా కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో ఎలా దూషించిందీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి గతంలో మాదిరిగానే, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

పీవీ మంత్రివర్గంలో పనిచేసిన జలగం వెంగళ రావు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ధిక్కార ధోరణి ప్రదర్శించిన వాడే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కి కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో "ఎమర్జెన్సీ హోం మినిస్టర్" గా పనిచేసిన "బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్" లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఏమైందాయన ధిక్కార స్వరం? ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.

నూటా పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి "స్వరాజిస్ట్ పార్టీ" లో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని "సిండికేట్" పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 12 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి "చేతితో" అధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో "ఏకాభిప్రాయం" అంటే, సోనియా గాంధి అనే "ఏక వ్యక్తి అభిప్రాయం" గా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం "విభజించి పెత్తనం సాగించడం" అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

No comments:

Post a Comment