Wednesday, January 5, 2011

ప్రాధమిక హక్కుల ఉల్లంఘన సమర్థనీయం కాదన్న సుప్రీం కోర్టు:వనం జ్వాలా నరసింహారావు

జనవరి 3, 2011 న ప్రాధమిక-మానవ హక్కుల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో....

ప్రాధమిక హక్కులను ఉల్లంఘించిన ఎమర్జెన్సీ రోజుల నాటి
అత్యున్నత న్యాయస్థానం తీర్పును తప్పుబట్టిన నేటి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
వనం జ్వాలా నరసింహారావు

కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఏడాది కింద అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009 న, ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రి కరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

ఈ వ్యవహారం పూర్వాపరాల్లోకి పోతే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. నలుగురు ని హత్య చేసిన నేరారోపణ మీద చౌహాన్ అనే వ్యక్తికి కోర్టు మరణ శిక్ష విధించిన విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంస్థ, అతడి కౌమార వయసు దృష్ట్యా, కేసుని పరిశీలించాల్సిందిగా అస్సాం గవర్నర్ ను కోరారు 2009 లో. పరిశీలన అనంతరం మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది ప్రభుత్వం. చౌహాన్ కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకున్నారు. విచారణ జరిపిన సుప్రీం కోర్టు, జాతీయ మానవ హక్కుల సంస్థను తప్పు పడుతూ, సంస్థకు కోర్టు తీర్పులో కలుగచేసుకునే అధికారం లేదని చెప్పి, మరణ శిక్షను ధృవ పరుస్తూ మే 2009 లో తీర్పిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ, చౌహాన్ కుటుంబ సభ్యులు మరో రివ్యూ పిటీషను సుప్రీం కోర్టులో వేశారు. మానవ హక్కులను కాపాడడానికి జాతీయ మానవ హక్కుల సంస్థ ఎటువంటి చర్యైనా తీసుకోవచ్చని 1993 చట్టంలో వున్న విషయాన్ని పేర్కొంటూ, చౌహాన్ మరణ శిక్షను మరో మారు యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. ఆ సందర్భంగా ప్రాధమిక హక్కుల అంశాన్ని ప్రస్తావిస్తూ, 1976 నాటి సుప్రీం కోర్టు తీర్పులోని అంశాలను పేర్కొన్నారు న్యాయమూర్తులు.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. జబల్పూర్ అదనపు మెజిస్ట్రేట్-శివ కాంత్ శుక్లాల హెబియస్ కార్పస్ కేసు సుప్రీం కోర్టు ముందుకు విచారణకొచ్చింది. తీర్పిచ్చిన ఐదుగురిలో, నలుగురు న్యాయమూర్తులు ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. అదే జరిగిందిప్పుడు.

తన భిన్నాభిప్రాయం కోర్టులో తెలియచేయడానికి ముందు, తానివ్వబోయే తీర్పును పరోక్షంగా ప్రస్తావిస్తూ, బహుశా తనకు రావాల్సిన సుప్ర్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా, తనకు దక్కకుండా పోయే అవకాశాలున్నాయని సోదరితో అన్నారట జస్టిస్ ఖన్నా. ఆయన అనుమానమే నిజమైంది. జనవరి 1977 లో, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందరికంటే సీనియర్ న్యాయమూర్తైన జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేయలేదు. అంతవరకు వస్తున్న సాంప్రదాయానికి ఇందిర ప్రభుత్వం స్వస్తి పలికింది. జరిగిన అన్యాయానికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తూ జస్టిస్ ఖన్నా తీసుకున్న నిర్ణయం, నేటికీ-ఏ నాటికి, సహచర భారత దేశ న్యాయ వ్యవస్థకు చెందిన వారిలో ఒక సాహసోపేత వ్యక్తిగా గుర్తింపు తెచ్చింది. ఇందిరా గాంధి ఓటమి తర్వాత జస్టిస్ ఖన్నా కొంతకాలం లా కమీషన్ చైర్మన్ గా, కొంతకాలం చరణ్ సింగ్ మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పిటిఐ సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారాయన. జైల్ సింగ్ పై ప్రతి పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడి పోయారు. ఎమర్జెన్సీ రోజుల్లో సుప్రీం కోర్టు హెబియస్ కార్పస్ పిటీషన్ కేసులో ఖన్నా వెలిబుచ్చిన "భిన్నాభిప్రాయం", దరిమిలా 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా రూపొంది, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగంలోని 20, 21 ఆర్టికల్స్, ఎమర్జెన్సీ నిబంధనల పరిధి నుంచి తొలగించడ జరిగింది.

బహుశా జస్టిస్ ఖన్నా గురించి అప్పట్లో అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసిన కధనం పౌరహక్కులు కోరుకునే అందరికీ మార్గదర్శకంగా పేర్కొన వచ్చు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి పద్దెనిమిది సంవత్సరాల స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యానికి, సర్వ సత్తాక స్వతంత్ర జాతికి, గుర్తుగా ఎవరో ఒకరు-ఎప్పుడో ఒకప్పుడు, జస్టిస్ ఖన్నా జ్ఞాపకార్థం శాశ్వతంగా వుండే "స్మారక స్థూపం" నిర్మించడానికి పూనుకుంటారని పేర్కొంది న్యూయార్క్ టైమ్స్. స్వతంత్ర న్యాయ వ్యవస్థ నిరంకుశ ప్రభుత్వానికి లొంగి పనిచేయడమంటే, ప్రజాస్వామ్యం నశించిపోయే దిశగా ఆఖరి అడుగు వేసినట్లే అని కూడా వ్యాఖ్యానించింది ఆ పత్రిక.

ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.

అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ నాడు, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా కృషి చేసిన నాడే ఒక కన్నభీరన్ కు, ఒక ఎస్ ఆర్ శంకరన్ కు, ఒక బాలగోపాల్‌కు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్లమౌతాం. End

No comments:

Post a Comment