ఆరోగ్య-వైద్య శాఖలో అమలు కాని ముఖ్య మంత్రి ఆదేశాలు
సూర్య దిన పత్రిక (20-05-2011)
వనం జ్వాలా నరసింహారావు
జూనియర్ డాక్టర్ల సమ్మె పూర్వ రంగంలో, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని, వైద్య-విద్యా సంచాలకుడిని సీ.ఎం. పిలిపించుకుని, జూడాల సమ్మె విషయంలో ఆరా తీసి, సమ్మె విరమింప చేయాలని ఆదేశాలిచ్చారు. అంటే... ముఖ్య మంత్రి దృష్టికి వచ్చేంత వరకు సమ్మె పరిష్కారానికి, సంబంధిత శాఖాధికారులు సరైన చర్యలు తీసుకోలేదనే అర్థం స్ఫురిస్తోంది. జూనియర్ డాక్టర్లు చీటికి-మాటికి సమ్మె చేస్తుంటే, ఎప్పటికప్పుడు, తాత్కాలిక ఉపశమనం తప్ప, శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించిన దాఖలాలు లేవు. జూనియర్ డాక్టర్లు శాశ్వతంగా జూనియర్ డాక్టర్లుగా వుండే అవకాశం లేకపోవడం, ఒక సారి సమ్మె చేసిన "జూడా", మరో సారి సమ్మె పిలుపొచ్చేసరికి సీనియర్ డాక్టర్-"సీడా" కావడం, వాళ్లు సమ్మె చేయడం-విరమించడం ఆనవాయితీగా మారిందని ప్రభుత్వం భావించడం కారణమై వుండవచ్చు.
ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సంప్రదింపులు పూర్తైన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, జూడాల సమ్మె మూలంగా, సమ్మె జరిగిన రోజుల్లో, పది మంది చనిపోవడం వాస్తవం కాదని, నిజానికి, "నిలోఫర్ ఆసుపత్రిలో ప్రతి రోజు, పది నుంచి పదిహేను మంది పసి పిల్లలు, వివిధ ఆరోగ్య రుగ్మతలతో-తక్షణం తలెత్తే క్లిష్ట సమస్యలతో, మరణిస్తున్నారని" చెప్పారు. నిలోఫర్ లాంటి సకల సౌకర్యాలున్న ఆసుపత్రిలోనే, ఇలా జరుగుతుందంటే, ఇక మిగిలిన ఆసుపత్రుల సంగతేంటో భగవంతుడికే తెలియాలి. మెరుగైన వైద్య సేవలను-సదుపాయాలను సమకూర్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత, దాని ఆధారంగా, ఒక వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, భవిష్యత్ లో వైద్య-ఆరోగ్య సేవల్లో లోపాలు లేకుండా ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని పత్రికా ముఖంగా వెల్లడి చేశారు ముఖ్య కార్యదర్శి. అంటే, ఇంతవరకు, ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య-వైద్య సేవలకు సంబంధించి, ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించ లేదనుకోవాలా? లేక, అది లోప భూయిష్టమైనదని అనుకోవాలా? లేదా, జూనియర్లో-సీనియర్లో డాక్టర్లు సమ్మె చేసినప్పుడే ఇలాంటి అంశాలు గుర్తుకొస్తాయని భావించాలా? వైద్య విద్యలో పట్టా పుచ్చుకొని, ప్రప్రధమంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా “డాక్టర్” ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న, అందునా, ప్రపంచంలోని పలు దేశాల్లో పని చేసిన అనుభవమున్న ఒక అధికారే ఇలా తన శాఖ గురించి బహిరంగంగా అన్నారంటే, ఎక్కడో లోపముందనుకోవాలి. తన మనసులో మాట దాచుకోలేక వాస్తవాలను బయట పెట్టిన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని అభినందించాలి. కాకపోతే, ఇకనైనా కారణాలు అన్వేషించి, లోపాలేవన్నా వుంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలి.
నిలోఫర్ ఆసుపత్రిలోనే, ప్రతిరోజు పది-పదిహేను మంది పసి వారు చని పోతున్నారంటే, దానికి కారణాలు అన్వేషించాల్సిందే. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్.ఆర్.హెచ్.ఎం) పథకం కింద చేపట్టిన పలు ఆరోగ్య వైద్య కార్యక్రమాల ఏకైక లక్ష్యం, మాతా శిశు మరణాలను తగ్గించడమే. ఆ దిశగా దేశవ్యాప్తంగా ఎన్.ఆర్.హెచ్.ఎం నిదులతో అమల్లోకి తెచ్చిన పలు పథకాలకు అదనంగా, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు, గత కొన్ని సంవత్సరాలుగా, మరో రెండు పథకాలు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అమలవుతున్నాయి. అత్యవసర సహాయ సేవలను అందించే 108 అంబులెన్సులు, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు, దీనికి అనుబంధంగా ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం చేసిన కృషితో మాతా శిశు మరణాల శాతం గణ నీయంగా తగ్గిందని వాటి నిర్వాహకులు బయట పెట్టిన లెక్కలు చెపుతున్నాయి.
కాల్ సెంటర్ కు అత్యవసర సహాయం కావాలని కోరుతూ, ఫోన్ లో సమాచారం అందుకున్న తక్షణమే, 108 అంబులెన్సులు రెక్కలు కట్టుకుని సహాయం కోరిన వారున్న స్థలానికి చేరుకుంటాయి. అలా సహాయం కోరిన వారిలో గణనీయ సంఖ్యలో, గర్భిణీ స్త్రీలు-చంటి పిల్లల తల్లి తండ్రులు-పదేళ్ల లోపు బాల, బాలికలు వున్నారు. వీరిలోను అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారుంటారు. సహజంగానే, ఆ సేవల మూలాన, మాతా-శిశు మరణాల సంఖ్య చాలా వరకు తగ్గుకుంటూ వచ్చింది. అలానే, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే గ్రామాల్లో ప్రసూతి, మాతా శిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, హృద్రోగం, రక్తపోటు, మూర్ఛ వంటి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పరీక్షలు-మందుల పంపిణీ కోసం నిర్ధారిత తేదీల్లో ఆయా గ్రామాల్లోకి వెళ్లేవి ఇటీవలి కాలం వరకు. వీటి ద్వారా కూడా మాతా శిశు మరణాల సంఖ్య పడిపోయింది. ఇప్పుడీ రెండు రకాల సేవలు, ప్రభుత్వంలో (ఆరోగ్య-వైద్య శాఖలో) పనిచేస్తున్న సంబంధిత అధికారుల అలసత్వంతో, ముఖ్య మంత్రి ఆదేశాలిచ్చినప్పటికీ, సకాలంలో నిధుల విడుదల చేయకపోవడం వల్ల, లేక, పలు రకాల నిర్లిప్తతల వల్ల, కుంటు పడి పోయాయి. దీని ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాల పరాకాష్టే నిన్న ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి చేసిన నిలోఫర్ ఆసుపత్రిలో పసి పిల్లల రోజు వారీ మరణాలు, రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని చోట్ల సంభవించనున్న మరణాలు. సర్కారులో స్తబ్దత అన్నది అక్షర సత్యం. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే ముందర అధికారులతో సంప్రదింపుల మాట ఎలా వున్నా, ముఖ్య మంత్రి తీసుకున్న నిర్ణయం, అది కూడా సాక్షాత్తు సంబంధిత సచివాలయ శాఖాధిపతి ముందర-ఆయనను సంప్రదించి తీసుకున్న నిర్ణయం, దరిమిలా ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కాని పరిస్థితులు నెల కొన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ప్రభుత్వ ప్రయివేటు భాగ స్వామ్యంలో, 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు, సంబంధిత ప్రభుత్వ శాఖలోని కొందరు అధికారుల అలసత్వం వల్ల, గతంలో వలె సేవలందించలేని స్థితికి చేరుకున్నాయి. సగటున గతంలో హాజరయ్యే రోజువారీ అత్యవసర సహాయ సేవలు గణనీయంగా పడిపోయాయి. సేవలను కోల్పోతున్న వారిలో, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, చిన్న పిల్లలు కూడా వున్నారు. అంటే తక్షణ చికిత్స ఆలశ్యం అవుతున్న దనుకోవాలి. అత్యవసర చికిత్స ఆలశ్యమవుతే సంభవించేది మరణాలే కదా! అదే విధంగా, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలలో పని చేస్తున్న సిబ్బంది సమ్మె సాకుగా చూపి, సిబ్బంది లేవనెత్తిన అంశాలను పరిష్కరించే బదులు, గత ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి, ప్రభుత్వమే సంబంధిత జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు పూర్వం, 475 సంచార వాహనాల ద్వారా, ఆ సేవలందించిన యాజమాన్యం, రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో- తాము నివసిస్తున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు కనీస వైద్య సౌకర్యాలు ఏ మాత్రం లేని, సుమారు ఇరవై వేల గ్రామాల ప్రజలకు, నెలకొక్క సారి, అది కూడా నిర్ధారిత తేదీన, అన్ని రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను సమకూర్చింది. లబ్ది పొందిన లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలలో, అనేక మంది గర్భిణీ స్త్రీలు, ప్రసూతి స్త్రీలు, పసి పిల్లలు, చంటి పిల్లలు కూడా వున్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ఆ సేవలెంతగానో తోడ్పడ్డాయి. డిసెంబర్ నెలనుంచి, కలెక్టర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అవే వాహనాలు, కనీసం ఒక్క రోజన్నా, ఒక్క గ్రామానికన్నా, నిర్ధారిత తేదీన వెళ్ళిన దాఖలాలు లేవని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులలో నిలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా మరెన్ని శిశు మరణాలు సంభవించ వచ్చో అంచనా వేయడం కష్టమే.
ఇదిలా వుంటే, సంచార వాహనాలకు అనుబంధంగా, ఆరోగ్య యాజమాన్య పరిశోధనా సంస్థ, గత నాలుగేళ్ల గా ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న, ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం, మాతా శిశు సంరక్షణకు సంబంధించి, కాల్ సెంటర్ ద్వారా అమూల్యమైన సలహాలిస్తూ వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా, ఇంతవరకు దాదాపు ఐదు కోట్లకు పైగా గ్రామీణులు కాల సెంటర్ కు ఉచిత ఫోన్ సౌకర్యం ద్వారా ఫోన్ చేసి, తమకు కావాల్సిన ఆరోగ్య-వైద్య సలహా సంప్రదింపులు జరిపారు. వారిలో రెండు కోట్లకు పైగా పేద ప్రజలు లబ్ది పొందారు. అందులో అధిక శాతం మాతా శిశు సంబంధమైనవే. ఆ సేవల ద్వారా కూడా నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన మరణాల లాంటివి కొంతవరకైనా తగ్గించ కలిగే వీలుంది. 108 అంబులెన్సులు, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు ఎలాంటి దుస్థితికి చేరుకున్నాయో, అలానే ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలు కూడా కానున్నాయి. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంలో, ప్రభుత్వ అందించే నిర్వహణ వ్యయం నిధులతో, లాభాపేక్ష రహిత ఆరోగ్య యాజమాన్య పరిశోధనా సంస్థ నడుపుతున్న ఈ సేవలకు, సకాలంలో ప్రభుత్వం నిధులను విడుదల చేయక, యాజమాన్యం మీద నెపం మోపి, ఆ సేవలను వారి పరిధిలోంచి తొలగించి, 104 సంచార వాహనాలకు పట్టిన గతే పట్టించే ప్రయత్నంలో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం వుంది.
దీనికి ముఖ్యమంత్రి ఆదేశాలున్నాయో-లేవో అన్న విషయంలో స్పష్టత లేదింత వరకూ. స్పష్టత లేదనటానికి ఆధారాలు లేకపోలేదు. ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలకు, ఒక ప్రణాళిక ప్రకారం, సంబంధిత ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న కొందరు, గండి కొట్టే ప్రయత్నంలో భాగంగానే, గత ఏడెనిమిది నెలలుగా, నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారు. ఒకానొక సమయంలో, గత ఫిబ్రవరి నాటికి, ప్రభుత్వం నుంచి విడుదల కాని నిధులు పదికోట్లు రూపాయలకు చేరుకోవడంతో, ఆరోగ్య యాజమాన్య పరిశోధనా సంస్థ యాజమాన్యం ముఖ్య మంత్రిని కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి సమక్షంలో, నిధుల విడుదలకు ముఖ్య మంత్రి ఆదేశాలిచ్చిన ఇరవై నాలుగు గంటల లోపు, నిధుల కేటాయింపుకు సంబంధించిన ఫైలులో కదలిక వచ్చింది. యాజమాన్యం అప్పటికి నెల రోజుల క్రితం శాఖాధిపతికి చేసిన అదే విజ్ఞప్తి, శాఖలోని కొందరు అధికారుల నిర్లిప్తతతో, "కోల్డు స్టోరేజీ" లో మగ్గుతోంది. ఏదో విధంగా ముఖ్య మంత్రి ఆదేశాలను అమలు పరిచారని యాజమాన్యం సంతోషించింది. అయితే, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చొరవతో, ఆర్థిక విభాగం అధికారులు త్వరగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నప్పటికీ, ముఖ్య మంత్రి ఆదేశాలు, తుచ తప్పకుండా అమలు కాకుండా, సంబంధిత శాఖాధిపతి కార్యాలయంలో, గతంలో మాదిరిగానే, చివరి నిమిషంలో కొందరు అడ్డు తగిలారు. ఆరోగ్య యాజమాన్య పరిశోధనా సంస్థకు ప్రభుత్వం గతంలో బకాయి పడ్డ నిధులన్నీ చెల్లించక పోగా, దరిమిలా ఇవ్వాల్సిన నెల-నెల నిర్వహణ నిధుల విడుదలలో కూడా జాప్యం చేస్తోంది.
ఏ ముఖ్య మంత్రి పదవిలో వున్నా, రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అధికారులు సహకరిస్తూండాలి. ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు. అలాంటి ప్రజోపయోగమైన పథకాలలో అత్యంత ప్రయోజనమైన వి, బహుళ జనా మోదం పొందినవి, రాజకీయాలకు అతీతంగా-కుల మతాలకు అతీతంగా ఉపయోగ పడేవి, 108 అంబులెన్సులు- నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు-ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలు. వీటిని నిధుల లేమితో నీరు కార్చే ప్రయత్నం చేస్తే, నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన తరహాలోనే శిశు మరణాలు చోటు చేసుకోవడం నిత్య కృత్యమై పోవడం ఖాయం! End
No comments:
Post a Comment