గెలుపు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి
వనం జ్వాలా నరసింహారావు
ఒక సినిమా (అందునా తెలుగు?) బాక్సాఫీస్ హిట్టయి-శత దినోత్సవం జరుపుకుని-దరిమిలా అవార్డులను అందుకోవడానికి, ఒక టీం (భారత దేశం కావచ్చు?) ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రికెట్ మాచ్ లో విజయం సాధించి కప్పు సాధించడానికి-దరిమిలా బహుమతుల రూపంలో టీం సభ్యులు కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి, ఒక రాజకీయ నాయకుడు-నాయకురాలు (అందునా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన?) చట్ట సభలకు జరిగిన ఎన్నికలలో గెలవడానికి-దరిమిలా మంత్రి పదవి-ముఖ్య మంత్రి పదవి పొందడానికి కొన్ని పోలికలున్నాయి. మొదటి రెండింటి లో లేని మజా, "అధికారం" రూపంలో, ఓటమి పాలైన పార్టీ వారిపై-మళ్లీ అవకాశం వచ్చి ఆ పార్టీ గెలిచిందా కా, పెత్తనం సాగించే వెసులుబాటు, మూడవదైన రాజకీయ ప్రక్రియ కుంది. వచ్చిన చిక్కల్లా, అలా అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుల్లో, స్వయం శక్తితో కాకుండా, కేవలం అధిష్టానం అండ దండలతో కీలక పదవులను పొందిన వారితోనే వుంది. అధికారాన్ని, పదవిని వదులుకోలేక-పదవిని కాపాడుకోవడానికి, స్వపక్షం, విపక్షంలోని వ్యతిరేకులనుంచి తనను తాను రక్షించుకోలేక, తమ (న) ప్రభుత్వాన్ని ఎప్పుడు-ఎవరు పడగొడతారోనన్న ఆందోళన నుంచి బయట పడలేక, వారు నానా అవస్థలు పడుతుంటారు. ఇటీవల టీమిండియా సాధించిన ప్రపంచ కప్పు నేపధ్యంలో, కడప ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపధ్యంలో-ఓటమి దరిమిలా ప్రభుత్వ భవిష్యత్ పై ఆసక్తికర పరిణామాలు సంభవిచ్చని భావిస్తున్న నేపధ్యంలో, అడప దడపా ఎన్నో (తెలుగు) సినిమాలు పూర్తిగా విఫలం కావడమో-బాక్సాఫీసు హిట్ కావడమో జరిగిన నేపధ్యంలో, ఈ పోలికకు అంతో-ఇంతో ప్రాధాన్యం వుందనాలి.
కడప లోక్ సభ, పులివెందుల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిని ఎలా తీసుకుంటారని మీడియా వారడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఒక సారి ఓడిపోయినంత మాత్రాన, అది శాశ్వతంగా ఓటమి పాలైనట్లు కాదని సమాధానం ఇచ్చారు. గతంలో క్రికెట్ ఆటగాడైన కిరణ్ కుమార్ రెడ్డి, ఆ ఓటమిని క్రికెట్ మాచ్ తో పోల్చారు. పోలికకు ఉదాహరణగా, ఒకానొక అంతర్జాతీయ క్రికెట్ మాచ్ లో బలమైన టీమిండియా, బలహీనమైన బంగ్లాదేశ్ టీంతో ఓటమి పాలైన విషయాన్ని, ఆ తర్వాత, ఇటీవల ప్రపంచ కప్పును గెలవడాన్ని చెప్పారు సీఎం. ఇచ్చిన ఉదాహరణ, చేసిన పోలిక ఈ మధ్యనే ముగిసి, టీమిండియా అఖండ విజయం సాధించిన ప్రపంచ కప్పుకు సంబంధించినదైతే మరి కొంత బాగుండేదేమో! నాక్ ఔట్ దశలో, గ్రూప్ మాచులలో దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి పాలైన టీమిండియా, ఇంగ్లాండుతో డ్రా చేసిన టీమిండియా, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లో, సెమీ ఫైనల్స్ లో, చివరికి ఫైనల్స్ లో ఉద్దండ పిండాలను (దాయాది పాకిస్తాన్ టీంతో సహా) ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఓటమి-గెలుపుల వరకు పోలిక బాగానే వుంది కాని, మిగతా విషయాలలో, టీమిండియా సాధించిన విజయ రహస్యానికి-వ్యూహానికి వెనుక నున్న కృషి-పట్టుదల, ఓటమి పాలు కాకుండా వుండేందుకు, "కిరణ్ కుమార్ రెడ్డి కడప ఎన్నికల టీం" కు వుందా-లేదా అనేది ముఖ్యం.
ఏదీ ఆ టీం వర్క్? ఎక్కడుందా కెప్టెన్సీ? టీమిండియాలో ఉన్నటువంటి బౌలర్లు కాని, బాట్స్ మెన్ కాని కిరణ్ ఎంపిక చేసిన కడప ఎన్నికల మంత్రివర్గ పర్యవేక్షణ బృందంలో వున్నారా? కడప లోక్ సభకు కాని, పులివెందుల శాసన సభకు కాని ఎంపిక చేసిన అభ్యర్థులలో ఒక్కరైనా టీమిండియాలో ఎవరో ఒకరిలాగా, ఒంటి చేత్తో గెలిపించగలిగిన-గెలవగలిగిన సామర్థ్యం వున్నవారున్నారా? అన్నవి జవాబు దొరకని ప్రశ్నలు. గెలిచిన జగన్మోహన్ రెడ్డిని బంగ్లాదేశ్ తో పోలుస్తున్నారా-లేక-ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీని టీమిండియాతో పోలుస్తున్నారా ముఖ్య మంత్రి,? అర్థం కాని ప్రశ్న. బంగ్లాదేశ్ కూడా గెలుస్తుందని తెలిసిన క్రికెట్ ప్లేయర్ కిరణ్, రాజకీయంగా తాను కడపలో ఎదుర్కోనున్న వ్యక్తిని కనీసం బంగ్లాదేశ్ స్థాయిలోనైనా అంచనా వేయలేక పోయారా? వాస్తవానికి, ఆద్యంతం, జగన్మోహన్ రెడ్డిని, అత్యంత బలీయమైన శక్తిగానే ఊహించింది కాంగ్రెస్. కాకపోతే, ఎన్నికల వ్యూహమంతా ఓటమి దిశగానే రచన చేసింది. చివరకు ఓటమి పాలైంది. ఈ ప్రభుత్వాన్ని (తన తండ్రి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని) పడగొట్టను అని అన్న జగన్ నోటితోనే, పడగొట్టి తీరుతాను అన్న దాకా ప్రేరేపించింది. ఆ ఫలితం అనుభవించబోతోంది.
ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం, టీమిండియా ఓటమి పాలైనప్పుడు, క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆలోచించిన తరహాలో, కనీసం ఒక్క మాటగా నన్నా మాట్లాడ లేకపోతున్నారు. ఈ ఎన్నిక ఒక ప్రత్యేక పరిస్థితులలో జరిగిందని, రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనుల వల్లనే, ఆయన కుమారుడుగా, జగన్మోహన్ రెడ్డిని కడప ఓటర్లు, విజయలక్ష్మిని పులివెందుల ఓటర్లు గెలిపించారని ముఖ్య మంత్రి అంటుంటే, ఆయన పార్టీకి చెందిన ఇతరులు ఎవరికి తోచిన మాట వారంటున్నారు. అలా అంటున్న వారిలో, కడప పార్లమెంటుకు పోటీ చేసిన ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఒకరు. ఆయన, ఆయన తోటి ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఎన్నికలకు ముందు శల విచ్చిన మాటలను పూర్తిగా మరిచిపోయారు. జగన్మోహన్ రెడ్డికి రెండు లక్షలకు పైగా మెజారిటీ వస్తే, తమ అస్తులను (ఎవరికో తెలియదు కాని!) రాసిస్తామని ఎన్నికలకు ముందంటే, ఓడి-డిపాజిట్ కోల్పోయిన తర్వాత, తాను ఓటమిని ముందుగానే ఊహించానని (అది నిజమే కదా! కాకపోతే, తన ఓటమి రెండు లక్షల లోపు ఓట్ల తేడాతో మాత్రమే అనుకున్నారు పాపం!), తనకసలు పోటీ చేయాలని లేకపోయినా, అధిష్ఠానం ఆదేశాల మేరకే పోటీకి దిగానని, అనడం వింతగా వుంది. ఇక అసలు ప్రచారానికే పోని పీసీసీ అధ్యక్షుడి ధోరణే వేరు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం ఎలా విఫలం కానున్నదన్న ఆలోచనతోనే ఆయన వున్నట్లుగా ఆద్యంతం కనిపించింది. వెళ్ళిన పదహారు మంది మంత్రులకు ఎండ దెబ్బ భయమో-మరింకేదో కాని ప్రచారం చేయకుండా తమ-తమ గదులకే పరిమితమయ్యారు. జిల్లా ఇంచార్జ్ మంత్రిదీ అదే పరిస్థితి. ఇక రాజ్య సభ సభ్యుడు కేశవరావు మాట తీరే వేరు. "నేను పార్టీలో వుండను బాబో" అంటూ వెళ్లి పోయిన జగన్మోహన్ రెడ్డిని, మళ్లీ పార్టీలోకి తీసుకు వస్తానంటున్నారు. సోనియా గాంధీని తిట్టిన తిట్ల విషయం మటుకు ఆయన ప్రస్తావించలేదు.
ఇక రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణది వేరే దారి. కిరణ్ కుమార్ రెడ్డి కంటె పార్టీ పరంగా-మంత్రి వర్గ సభ్యుడుగా సీనియరైన బొత్స, తనను ముఖ్య మంత్రి సలహాలడగడం లేదనే భావనను, శనివారం (మే నెల 14 న) మీడియా సమావేశంలో ఆయన చెప్పిన మాటల్లో వ్యక్తం చేశారు. కాకపోతే, ఆ విషయాన్ని ఆయన నర్మ గర్భంగా అంటూ, సీఎంకు సలహాలివ్వడంలో, తాము విఫలం చెందా మేమో అని పెదవి విరిచారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరితో చర్చించడం లేదనే విషయం కూడా ఆయన ప్రస్తావించారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి పథకాల మలు సక్రమంగా లేదనే భావన ఆయన మాటల్లో పరోక్షంగా వ్యక్తమైంది. ఉదాహరణగా, రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతి పాత్రమైన 104, 108 అంబులెన్సుల వాహన సేవలు ఎలా నిధుల లేమి వల్ల కుంటుపడ్డాయో చెప్పారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న భరోసా కలిగించడంలో ప్రజల (ముఖ్యంగా కడప ఓటర్ల!) విశ్వాసాన్ని కోల్పోయినట్లు ఆయన మాటల్లో స్పష్టంగా గోచరించింది. పధకాల అమలులో నిర్లిప్తతకు బాధ్యులు కిరణ్ కుమార్ రెడ్డా? సంబంధిత శాఖామాత్యులా? అధికార గణమా? ఇకనైనా తేల్చాల్సిన బాధ్యత సీనియరు మంత్రిగా బొత్స తనపై వేసుకుంటే-కనీసం వేసుకుంటానంటే బాగుండేదేమో! ఓటమికి కారణాలను చెప్పడానికి, మరో మంత్రి పితాని సత్యనారాయణ, కడప కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలను గుర్తించారు. అందులో ఒకటి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ వర్గమని, మరోటి కాంగ్రెస్ వర్గమని అంటూ, రెండు వర్గాల వారు జగన్మోహన్ రెడ్డికే ఓటు వేశారని విచిత్రమైన వాదన తనదైన శైలిలో వినిపించారు. మరో మంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి, వై ఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డే అని ప్రకటించారు. ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఇక మరో ఎంపీ-రాజ్య సభ సభ్యుడు వీ. హనుమంత రావు, తనకు జగన్మోహన్ రెడ్డిపైనా, ఆయన తండ్రిపైనా వున్న అక్కసును ఏ మాత్రం దాచుకునే ప్రయత్నం చేయలేదు. జగన్ గెలుపులో పెద్ద విశేషం లేదని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో తలో మాట-తలో దారి. అందుకే అధిష్టానం "అంకుశం" ఇచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ-ప్రభుత్వ ప్రక్షాళనకు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ ను పురమాయించింది. ఆయన పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో వున్నాడు.
ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో సమీప భవిష్యత్ లోను, రాబోయే ఐదారు నెలలలోను, కనీసం 2014 లో జరగ బోయే ఎన్నికల లోపున-లేదా అంత కంటే ముందర మధ్యంతర ఎన్నికలంటూ వస్తే అప్పటికన్నా, జరుగనున్న రాజకీయ మార్పులు-సమీకరణలు-అవగాహనలు-నైతిక, అనైతిక ఒప్పందాలు-మాచ్ ఫిక్సింగులు-అడ్ద దారి, రహదారి రాజకీయాలు ఎలా వుంటాయన్నది ఊహకందీ-అందని విషయాలు. రైతు సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని కూలుస్తానని ఒక వైపు ప్రతిపక్ష తెలుగు దేశం నేత చంద్రబాబు నాయుడు విజయవాడ-గుంటూరు పర్యటనలో నిప్పులు కక్కుతుంటే, కూల్చాలన్న ఆలోచన ఆయన కుంటే, తొంభై మంది శాసన సభ సభ్యులున్నప్పటికీ ముఖ్య మంత్రిపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదని వై ఎస్ ఆర్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ కూడా అదే మాటంటున్నారిప్పుడు. అంతటితో ఆగకుండా రైతు దీక్షను కూడా గుంటూరులో ప్రారంభించారు. అంటే, వీరి వల్లనన్నా-లేదా అధిష్టానం ఆలోచనా సరళికు అనుగుణంగా నన్నా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీటుకు ఎసరు రానుందా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ రాష్ట్ర పర్యటన కాంగ్రెస్ వర్గాలలో-కొందరిలో ఆశ, మరి కొందరిలో నిరాశ కలిగిస్తున్నాయి. అధిష్టానానికి అందుతున్న సమాచారం ద్వారా ముఖ్యమంత్రి- మంత్రులకూ మధ్య అవగాహన లేదని, సీఎంను ఎవరూ గౌరవించడం లేదని వార్తలొస్తున్నాయి. కడప ఎన్నికల్లో ముఖ్య మంత్రి వ్యూహం సరైంది కాదని కొందరంటుంటే, మరి కొందరి పీసీసీ అధ్యక్షుడిని కూడా తప్పు పట్తున్నారు.
ఏదేమైనా సంక్షేమ పధకాల అమలులో ప్రభుత్వ నిర్లిప్తత నూటికి నూరు పాళ్లు నిజం. దానికి బాధ్యత ముఖ్య మంత్రిది-సంబంధిత శాఖ మంత్రిది. దురదృష్ట వశాత్తు, మన రాష్ట్రంలో మంత్రులకు-మంత్రులకు మధ్య; మంత్రులకు-ముఖ్య మంత్రికి మధ్య; మంత్రులకు, ముఖ్యమంత్రికి, సంబంధిత శాఖ అధికారులకు మధ్య అగాధం నానాటికి పెరిగిపోతోంది. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగ పరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యతే ఉంటుంది. అధికారికీ, మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి. అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పనిచేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. సంస్కరణల పేరిట పాత పథకాలకు పేర్లు మార్చడమో, నీరు కార్చడమో చేసి సంబంధిత శాఖ మంత్రికి, ముఖ్య మంత్రికి విషయం తెలిసే లోపున ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తారు. ఇటీవల కాలంలో ఇవన్నీ మామూలై పోయాయి. బొత్స సత్యనారాయణ లేవనెత్తిన 104, 108 పథకాల అమలు విషయం దానికి అసలు-సిసలైన సాక్ష్యం. ఏదో ఒక స్థాయి అధికారుల అలసత్వం మూలాన, పధకాల అమలులో-అందునా రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకాల అమలులో ప్రభుత్వం వైఫల్యం ప్రజలు గమనించారు. కడప ఓటర్లు మరింత ఎక్కువగా పసిగట్టారు.
ప్రభుత్వమంటే, సమష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న పూర్తి మంత్రి మండలి. దాని అధినేత ముఖ్యమంత్రి. సంబంధిత శాఖకు చెందిన పాలన విధానాన్ని నిర్ణయించేది ఆ శాఖ మంత్రే అయినా, అది యావత్ మంత్రి మండలి సమష్టి నిర్ణయమే. ఏ ఒక్క మంత్రి తప్పు చేసినా, దానికి అందరూ బాధ్యత వహించాలి అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అసలీ విషయం గురించిన ఆలోచనే ఇటీవలి కాలంలో మంత్రులకు రావడం లేదు. పైగా తోటి మంత్రి చేసిన దాన్ని తప్పు పట్టడం, బాహాటంగా మరో మంత్రిని విమర్శించడం, వీలుంటే ముఖ్య మంత్రినే విమర్శించడం, తన పార్టీకి చెందిన వాడే ముఖ్య మంత్రిగా వున్నప్పటికీ మరో వ్యక్తి ఆ పీఠంలోకి వస్తే బాగుంటుందని వ్యాఖ్యలు చేయడం, సర్వసాధారణ విషయాలవుతున్నాయి. బొత్స కూడా ఇదే మాట మరో విధంగా చెప్పారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గం, పార్టీ నేతలు సమష్టిగా పని చేయాల్సిన అవసరాన్ని, సమిష్టి బాధ్యతా రాహిత్యాన్ని ఆయన కూడా గుర్తించారు.
పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగపరంగా ఏ విధమైన బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అలాంటి బాధ్యతే ఉంటుంది. విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖ ముఖ్య అధికారి పూర్తిగా తోడ్పడాలి. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి. మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి. ఈ లోపాలే ఓటమికి కారణం. ఇటీవల ఒకానొక సందర్భంలో, ప్రభుత్వ ప్రయివేటు భాగ స్వామ్యంలో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఒక సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తున్న యాజమాన్యం, బాధ్యతాయుతమైన ఒక ఐఏఎస్ అధికారి వద్దకు, తమకు సకాలంలో నిర్వహణ నిధులను విడుదల చేయమని కోరడానికి వెళ్లారు. విడుదల చేయాల్సిన బాధ్యతను విస్మరించిన ఆ అధికారి, "ప్రభుత్వం" వద్దకు పోయి నిధులను తెచ్చుకోమని సలహా ఇవ్వడంతో "ప్రభుత్వం" అంటే మీరే కదా అని ప్రశ్నించారు యాజమాన్య ప్రతినిధులు. "కాదు" అని తాపీగా సమాధానం అధికారి ఇవ్వడంతో, ఏం చేయాలో తోచక పథకం అమలు చేయడంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురవుతున్నారు.
గెలిచింది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐనప్పటికీ, ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడించింది ప్రభుత్వాన్ని. ఓడిపోయింది సమిష్టి బాధ్యతా రాహిత్యానికి, అధికారుల అలసత్వానికి ప్రతీకైన ప్రభుత్వం. ప్రభుత్వంలోని సమిష్టి బాధ్యతా రాహిత్యం. ఆ బాధ్యతా రాహిత్యానికి వూతమిచ్చిన కొందరు అధికారుల సంక్షేమ పథకాల అమలు తీరు. దీని పర్యవసానం ఏమన్నా కావచ్చు. కనీసం సంక్షేమ పథకాల అమలన్నా సక్రమంగా జరుగుతుందని భావించుదాం!
No comments:
Post a Comment