Saturday, May 21, 2011

యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు:వనం జ్వాలా నరసింహారావు

సాఫల్యాలతో సార్థక పాలన

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (24-05-2011)


డాక్టర్ మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్లయింది. భారత దేశ చరిత్రలో, స్వాతంత్ర్యం వచ్చిన సుమారు ముప్పై సంవత్సరాల అనంతరం, అలనాటి జనతా పార్టీ సారధ్యంలో, ప్రప్రధమంగా కాంగ్రేసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది. ఆ తర్వాత, ఓటమి పాలైన రెండున్నర ఏళ్లకే, అదే పూర్వ శోభతో కాంగ్రెస్ పార్టీని, మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కింది. ఆమె హత్యానంతరం, రికార్డు స్థాయిలో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధి. తదనంతరం సంభవించిన-సంభవిస్తూ వస్తున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో, అధికారం చేపట్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలే కాని, ఏ ఒక్క రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి మాత్రం కాదు. రాజీవ్ హత్యానంతరం ప్రధానైన పీవీ నరసింహారావు సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకి తొలుత లోక్ సభలో మెజారిటీ లేదు. అలానే ఆయన తర్వాత ప్రధానైన వాజ్ పాయే సారధ్యంలోని బీజేపీకి సొంత మెజారిటీ లేదు. కేంద్రంలో అధికారం దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ పార్టీ చేరుకోలేని పరిస్థితుల్లో, పీవీ-కేసరిల తర్వాత, పార్టీ పగ్గాలను చేపట్టిన సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర 2004 లో ప్రారంభమైంది. రాజీవ్ హత్యానంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని సోనియా గాంధీ 1996 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంభవించిన పరాజయం తర్వాత, పీవీ వారసుడు కేసరి పార్టీకి న్యాయం చేకూర్చలేడని భావించి పదవి స్వీకరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లోక్ సభలో పార్టీ బలాన్ని పెంచగలిగినా, ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేయలేకపోయింది కాంగ్రెస్.

ఆ నేపధ్యంలో 2004 లో జరిగిన ఎన్నికలలో 145 స్థానాలు గెలిచి, తన ప్రత్యర్థి ఎన్డీయేకు ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యాబలం లేదని తేలిన తర్వాత, "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" ఏర్పాటు చేసింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి 2004 ఎన్నికలలో ఎన్డీయే పక్షాన లోక్ సభకు గెలిచింది 169 మంది సభ్యులు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, తన సభ్యులతో సహా-తన ఆలోచనా ధోరణికి దగ్గర లో వున్న, వివిధ పార్టీల నుంచి లోక్ సభకు గెలుపొందిన, 222 మందితో 59 మంది సభ్యుల వామ పక్ష కూటమిని కలుపుకుని తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. "కామన్ మినిమమ్ ప్రోగ్రాం" పేరుతో, సంకీర్ణ భాగస్వామ్య పార్టీలందరికీ ఆమోద యోగ్యమైన ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది యూపీఏ.

వామ పక్షాలు ఒకానొక సందర్భంలో మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో, సమాజ్ వాది పార్టీ, బహు జన సమాజ్ పార్టీలు సమయానుకూలంగా మద్దతిచ్చి యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా కాపాడాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, యూపీఏ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టి, తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగును యూపీఏ పక్షాన ప్రధాన మంత్రిగా ప్రతిపాదించారు. పదమూడవ భారత ప్రధానిగా 2004 లో బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ సారధ్యంలోని తొలి యూపీఏ ప్రభుత్వం సాధించిన సాఫల్యాలు, ఐదేళ్ల అనంతరం 2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, తిరిగి యూపీఏ ను అధికారంలోకి వచ్చేందుకు దోహద పడ్డాయి. 2004 ఎన్నికల అనంతరం ఏర్పాటైన "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" భాగస్వామ్య పక్షాలు, ఈ సారి 2009 లో జరిగిన ఎన్నికలలో, ఉమ్మడిగా పోటీ చేసి, సంఖ్యా పరంగా తమ బలాన్ని పెంచుకుని, గతంలో కంటే, 61 స్థానాలను అధికంగా గెలుచుకుని, మొత్తం 262 సభ్యుల బలీయమైన కూటమిగా విజయ పథాన నిలిచింది. భారత దేశంలో, జవహర్లాల్ నెహ్రూ తర్వాత, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మరో మారు ప్రధాని కాగలిగిన రెండో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ రికార్డు సాధించారు. మే నెల 22, 2009 , సరిగ్గా రెండేళ్ల క్రితం, రెండవ పర్యాయం ప్రధాన మంత్రిగా, యూపీయే ప్రభుత్వ సారధిగా, బాధ్యతలు చేపట్టారు. సుస్థిర ప్రభుత్వానికి బాటలు మరో మారు వేశారాయన.

మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం తొలి విడత అధికారంలో వున్న మొదటి ఐదేళ్ళలో, పాలనా పరమైన సంస్కరణలు, సమాచార హక్కు చట్టం, పనికి ఆహార పథకం లాంటివి ప్రవేశ పెట్టి తన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టారు. ఐనా, ఏ నాడు, తన ప్రభుత్వం సాధించిన దాన్ని, అతిగా చెప్పే ప్రయత్నం చేయలేదు. అలానే, రెండో విడత అధికారం చేపట్టి ఏడాది నిండిన సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను, తక్కువ చేసి చూపుతూ, చేయాల్సింది ఇంక ఎంతో ఉందన్నారు. "సముచితమైన సాఫల్యాలను" సాధించిందని మాత్రమే అన్నారు ప్రధాని. తాను సాధించ దల్చుకున్నది ఎంతో మిగిలి పోయిందని, తన సాఫల్యాలను చారిత్రక కారులు ఎప్పుడో ఒకప్పుడు సరైన రీతిలో అంచనా వేస్తారని కూడా అన్నారాయన.

మన్మోహన్ సింగ్ ఎంత సవినయంగా తన ప్రభుత్వం గురించి అన్నప్పటికీ, యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ అంచనా వేయలేం. విదేశాంగ విధాన కానీయండి, ఆర్థిక పరమైన నిర్ణయాలు కానీయండి, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పే విషయమే కానీయండి, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వారి విషయంలో, సమతుల్యం పాటిస్తుందనడానికి నిదర్శనం తొలి విడత-మలి విడతలలో ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి". అందులోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం.

గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో పని చేసిన నాటి ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. ఆ మాటకొస్తే, పీవీ మంత్రివర్గంలో మన్మోహన్ నాటిన ఆర్థిక సంస్కరణల విత్తనాలు, మొక్కలై-వృక్షాలై, యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో భారతావనికి ఆ ప్రభావం పడకుండా చూడడానికి, యూపీఏకు ముందున్న ఎన్డీఏ సారధి వాజ్ పాయే కూడా కారణమనాలి. ప్రపంచం దృష్టిలో ఆర్థిక పరంగా రెండు దశాబ్దాల క్రితం భారత దేశంపై నున్న చులకన భావన స్థానంలో, అత్యంత గౌరవ స్థానం లభించడానికి కూడా మన్మోహన్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వమే కారణం. అలానే ప్రపంచ వర్తక-వాణిజ్య రంగంలో కూడా చక్కటి పురోగతి సాధించింది గత ఏడాది-రెండేళ్లలో. స్టాక్ మార్కెట్ పతనం దరిమిలా, దాని దుష్ప్రభావం ఏ మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా కాపాడిందీ ప్రభుత్వం.

మన్మోహన్ సింగ్ సారధ్యంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను-సాధించలేక పోయిన వాటిని గురించి ప్రతి పక్షాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే, బహుశా, రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సభ్యులనుద్దేశించి, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్తూ, ప్రధాని చేసిన ప్రసంగంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చి ఓటర్లు గెలిపించ తల్చుకోనప్పుడు, సంకీర్ణాలు తప్పవు. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.

రాష్ట్రపతి ప్రసంగంలో లేవనెత్తిన అంశాలను-ప్రతిపక్ష నాయకుల విమర్శలకు అనుసంధానం చేస్తూ, తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని, పరోక్షంగా, భవిష్యత్ లో యూపీఏ చేయబోతున్న వాటితో కలిపి చెప్పారు మన్మోహన్ సింగ్. సామాన్యులు-సగటు మనిషి, అధిక ధరల తాకిడి తట్టుకోడానికి ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడం, ప్రజా జీవితంలో సత్య నిష్టను-న్యాయ బుద్ధిని ప్రోత్సహించడం, బీద-సాద-పేద-బలహీన-వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధిలో తమ వంతు వాటా పొందేలా ఆర్థికాభి వృద్ధి సాధించడం, దేశ సమగ్రత-సమైక్యత విషయంలో అప్రమత్తంగా వుండడం, అంతర్జాతీయ స్థాయిలో భారత జాతి గొంతు గట్టిగా వినిపించేలా విదేశాంగ విధానం రూపొందించడం యూపీయే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం, తొలి విడత-మలి విడతలలో సాఫల్యం సాధించిందని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మాటల్లోనే, యూపీఏ సాధించిన ప్రగతిని అవగాహన చేసుకోవచ్చు.

అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, వారికి-యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు కూడా. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది.

పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. జాతీయ ఆరోగ్య బధ్రతా బిల్లు దీని కొరకే తెచ్చే ఆలోచనలో వుంది యూపీఏ ప్రభుత్వం. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.

సంకీర్ణ ధర్మం అడపదడప యూపీఏ ప్రభుత్వాన్ని ఊగిసలాటలో పడ వేసినప్పటికీ, మొదటి విడత లాగానే, గత రెండేళ్లలో గణనీయమైన సాఫల్యాలను సాధించిందనడంలో అతిశయోక్తి లేదనొచ్చు. యూపీఏ విజయాల వెనుక ప్రధాని మన్మోహన్ సింగ్, చైర్ పర్సన్ సోనియా గాంధి, సంకీర్ణ భాగస్వామ్య పక్షాల నాయకులు, బాధ్యతాయుతమైన ప్రతి పక్షాలున్నాయని చెప్పాలి.

1 comment: