Thursday, September 8, 2011

అంతం కాదిది ఆరంభమే(నా) !: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (09-09-2011)

ఆలోచింపచేస్తున్న సీబీఐ అరెస్టులు, కొందరికి వందల వేల రెట్ల ఆదాయం ఎలా సాధ్యం?, శిక్షల దాకా వ్యవహారం కొనసాగుతుందా?, ప్రజల్లో కొనసాగుతూనే ఉన్న అపోహలు, విచారణలకు రాజకీయ కారణాలేనా!, నివారణ కంటె నిరోధం ముఖ్యం....ఎడిటర్

స్వతంత్ర భారత దేశంలో, విభజించి-పాలించు అనే ఆంగ్లేయుల పరిపాలనా వారసత్వాన్ని, పోకడలో అవినీతి మయమైన కొన్ని ప్రపంచ దేశాల విధానాన్ని, అక్షరాలా పాటిస్తూ వస్తున్న ఈ దేశ రాజకీయ నాయకుల ఆటలకు మధ్య-మధ్య అంతరాయం కలిగించి, ఆట కట్టించడానికి కారణమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను - ఆ వ్యవస్థల పుణ్యమా అని నెల కొన్న సంస్థలను - అందులో (అందరూ కాకపోయినా) నిబద్ధతతో పని చేస్తున్న అధికారులను మనసార అభినందించాలి. వాస్తవానికి ఆ వ్యవస్థలు-సంస్థలు-వ్యక్తులు నిరంతరాయంగా కనుక తమ బాధ్యతలను పరిపూర్ణమైన నిష్ఠతో నిర్వర్తిస్తున్నట్లయితే (అధికారంలో వున్న రాజకీయనాయకులు అడ్డుపడకుండా వుంటే!) అవినీతిపరుల అరెస్టులతో మాత్రమే ఆగకుండా-వారి గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టే పరిస్థితులను కలిగించ గలిగే వారు. ఒక వైపు పౌర సమాజం నాయకుడు అన్నా హజారే-ఆయన బృందం గత కొన్ని నెలలుగా అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తరతమ భేదం లేకుండా, కాంగ్రెస్-కాంగ్రేసేతర-బీజేపి-బీజేపేతర అవినీతి సామ్రాట్టులను అంచలంచలుగా అదుపులోకి తీసుకుని విచారించడం, సామాజిక-రాజకీయ-ఆర్థిక విశ్లేషకులను ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా, స్వతంత్రం వచ్చి అరవై నాలుగు సంవత్సరాలు నిండిన సందర్భంలో తలఎత్తుతున్న ఈ పరిణామాలను సగటు భారతీయ పౌరుడు స్వాగతిస్తుంటే, ఈ దేశ పరిణామాలను ఆసక్తితో యావత్ ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. భారత దేశ ప్రజాస్వామ్యం ఇంత గట్టిగా పని చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు వారంతా.

ఆ సంస్థకు ఎవరిష్టమొచ్చిన పేర్లు వారు పెట్టారు. కొందరేమో "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అన్నారు. అలా అన్నవారు సహితం జగన్మోహన్ రెడ్డిపై అ సంస్థ విచారణను మనసార స్వాగతించారు. మరికొందరేమో అదే సంస్థను "కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్" అని సాక్షాత్తు చట్టసభలోనే నామకరణం చేశారు. అలా చేసి వారం రోజులు తిరక్కుండానే, ఎవరిని "బచావ్" చేయడానికి జరిగిందో కాని, ఆమె అనుంగు అనుచరుడు గాలి జనార్థన్ రెడ్డి కటకటాల పాలయ్యాడు. మధ్యలో పేర్లు పెట్టడానికి తామూ తీసి పోమన్న తరహాలో కొందరు మహా నాయకులు, తమ పార్టీని దూషించిన ప్రత్యర్థి పార్టీకి "భారతీయ జగన్ పార్టీ" అని, "బచావో జగన్ పాలసీ" అని మారు పేర్లు తగిలించారు. ఇవేవీ తమకు పట్టదన్న ధోరణిలో, గుట్టుచప్పుడు కాకుండా, తమపని తాము చేసుకుపోతున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు - ప్రస్తుతం వారికి ఆంధ్ర-కర్నాటకలలో నాయకత్వం వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆ అధికారి మన తెలుగువాడు కావడం, ఆరోపణలొచ్చిన వ్యక్తి ఎంత మహా-మహానుభావుడైనా, ఏ స్థాయిలో అండ-దండలున్నా, కాంగ్రెస్ వారైనా-ప్రతిపక్ష నాయకులైనా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుకుని పోవడం, ఆబాల గోపాలం అభినందించాల్సిన-ఆనందించాల్సిన విషయం.

అవినీతి సామ్రాట్టులను అదుపులో తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని (వున్నదున్నట్లు చెప్పాలంటే... న్యాయ స్థానాలను-సిబిఐని) అభినందించాల్నా? లేక ఇంతకాలం వారి అవినీతితో ప్రజాధనం కొల్లగొడుతుంటే, ప్రేక్షక పాత్ర వహించినందుకు-సీబీఐ తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా పరోక్షంగానన్నా అడ్డుకున్నందుకు అదే ప్రభుత్వాన్ని అభిశసించాల్నా? ఆలశ్యంగానైనా, మరింత దుర్మార్గం జరగనివ్వకుండా ఆపుదల చేసినందుకు, ప్రస్తుతానికి మెచ్చుకోవడమే మంచిదే మో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో-సరిహద్దు కర్నాటక రాష్ట్రంలో, ఇంచుమించు ఏక కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు లింకు వుండే అవకాశాలు చాలానే వున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమైతే-కనీసం వాస్తవానికి చేరువలో వుంటే (వుండే అవకాశాలే ఎక్కువ అనక తప్పదు), దశాబ్దం కింద వారి సొంతం అనుకున్న ఆస్తిపాస్తులకు, నేటి వారి ఆస్తులకు, నక్కకు-నాగ లోకానికి వున్న తేడా వుంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కాని-ఒక వ్యాపార సంస్థ కాని ఆస్తులు సమకూర్చుకోరాదన్న నిబంధన కాని, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెంపొందించుకోరాదన్న చట్టం కాని లేదన్నది ఒపుక్కోవాల్సిందే. వచ్చిన చిక్కల్లా, ఆ ఆదాయ వనరులు ఎలా సమకూరాయన్న విషయంలో అవలంబించిన మార్గాలే. రూపాయి ఆదాయం-పది రూపాయల ఆస్తులు-పాతిక రూపాయల ఖర్చులున్న వారికి, ఏడాది-రెండేళ్లు-మూడేళ్లు తిరక్కుండానే, వందల-వేల రెట్ల ఆదాయం పెరగడం-దానికి రెట్టింపు ఆస్తులు సమకూరడం, ఖర్చులే మో తగ్గడం ఎలా సంభవమనే దే అంతుచిక్కని ప్రశ్న. అదే జరిగింది-జరుగుతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోను, వారికి అత్యంత సన్నిహితుడు-అవునన్నా, కాదన్నా వ్యాపార భాగస్వామి గాలి జనార్థన్ రెడ్డి వ్యవహారంలో.

బహిర్గతమైన ఆదాయ-వ్యయ వనరుల లెక్కల ప్రకారం, వీరిరురివురి ఆర్థిక పరిస్థితి దశాబ్దం క్రితం ఎంతనేది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు, ఐన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆదాయమెంత? ఆదాయపు పన్నెంత కట్టారు? పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఎన్ని ఆస్తులు అఫిడవిట్ లో చూపించారు? అన్న సంగతి బహిరంగ రహస్యమే కదా? అలానే సుష్మా స్వరాజ్ కర్నాటక నుంచి లోక్ సభకు పోటీ చేసిన రోజుల్లో-అంతకు కొన్నాళ్ల, కొన్నేళ్ళ క్రితం గాలి జనార్థన రెడ్డి ఆస్తులెన్నో మీడియాలో వస్తున్నాయి కదా. వారిరువురూ న్యాయసమ్మతంగా-ధర్మ సమ్మతంగా వ్యాపారాలు చేసి తమ ఆస్తులను పెంచుకున్నారా? లేక రాజకీయాధికారాన్ని (తమది-తమ ఆప్తులది) ఆసరాగా చేసుకుని ఆస్తులను కూడగట్టుకునారా? మైక్రో సాఫ్ట్ బిల్ గేట్స్, గూగుల్-ఒరాకిల్-ఫేస్ బుక్ సంస్థల అధినేతలు కూడా అతి తక్కువ సమయంలోనే ఆస్తులు సమకూర్చుకున్నప్పటికీ వారిపై అవినీతి ఆరోపణలెందుకు రావడం లేదు? బహుశా వారేమో ఫక్తు వ్యాపార సరళిలో మిలియనీర్లు-బిలియనీర్లు అయ్యుండాలి...వీరేమో... అందినంత దండుకో! అన్న చందాన కోటీశ్వరులై వుండాలి. ఐనా, ఇప్పుడిప్పుడే అలా మాట్లాడక పోవడం మంచిదే మో! ఎలాగూ, విచారణ జరుగుతోంది కదా! ఎటొచ్చీ..చిక్కల్లా, విచారణ చేసినంత కాలం చేసి, ఆ తర్వాత, సరైన సాక్ష్యాధారాలు లేవని వదులు తే ఏం కావాలన్నదే సామాన్యుడి మదిలో మెదిలే అంతులేని వింత ప్రశ్న. అరెస్టులు ఆరంభం కావాలే కాని అంతం కారాదు.

న్యాయస్థానాల ఆదేశాల మేరకే, సిబిఐ దర్యాప్తు ప్రారంభమై, త్వరితగతిన సాగుతున్నప్పటికీ, ప్రజల్లో అపోహలు ఇంకా కొనసాగుతూనే వుండడానికి కారణం...ఇన్నాళ్లూ-ఇన్నాళ్లూ, ఇంత అవినీతి జరుగుతున్నా, చేస్తున్న వారినెవరినీ నిలుపుదల చేయలేకపోవడం వెనుకనున్నబలీయమైన కారణాలేంటి? అని. ఏ అధికారులను-అనధికారులనైతే సిబిఐ ప్రస్తుతం విచారణ చేస్తున్నదో, వారితో సహా, చేయని ఇతర అధికారులకు-అనధికారులకు ఈ విచారణ ఒక కనువిప్పు కావాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచన జరగాలి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కాని, సోదాలు కాని, రాజకీయ కారణాల వల్ల కానేకాదు అన్న నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. కేవలం విచారణతో ఆగకుండా శిక్షల దాకా వ్యవహారం (తప్పు జరిగిందని తేలితే-తేల్చగలిగితే) కొనసాగాలి. అదెంతవరకు వీలుంటుందోకాని, గత రెండు-మూడు రోజులుగా ఉన్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే, అవినీతికి పాల్పడినట్లు భావించి విచారణకు గురవుతున్న వారు తమను వేధించడానికి రాజకీయ కారణాలే తప్ప మరేమీకాదన్న అభిప్రాయం బలంగా కలిగించడానికి దేశ రాజధానిలో కాలికి బలపం కట్టుకుని ఎక్కని గడప-దిగని గడప లేకుండా బిజీ-బిజీగా గడుపుతున్నారట.

చివరకు ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తా యో కాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఏ కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చాడో, ఆ పార్టీ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్" పంచన చేరడానికి తన సంసిద్ధతను బహిరంగంగానే-అదీ పేరుపొందిన జాతీయ టెలివిజన్ ఛానల్ ద్వారా తెలియచేయడము విశేషం. తన సచ్ఛీలతను తెలియచేయడానికి, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు విషయంలో సహితం మౌనంగా వుండి పోయారు. మరో వైపు, తనను లోక్ సభలో వెనకేసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మ స్వరాజ్ కు కూడా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా గాలి జనార్దనరెడ్డి ఆమెకు సన్నిహితుడంటారు. తాను జగన్మోహన్ రెడ్డికి లోక్ సభలో మద్దతిచ్చినా తన సన్నిహితుడి విషయంలో ఆయన ఏమీ తెలియనట్లు మాట్లాడడం వెనుక గూడార్థం ఏమై వుంటుందో?

భారత దేశంలో అపారమైన కోటానుకోట్ల రూపాయల విలువ చేసే సంపద వ్యవసాయ పంటల రూపేణా నెలల తరబడి ఎటువంటి బధ్రత లేకుండా బహిరంగంగానే అందరి కళ్ల ముందర పడేసి వుంటుంది. ఐనా, అందులో కొంచెం కూడా దొంగల పాలవదు-ఎప్పుడో ఒకప్పుడు తప్ప. గాలి లాంటి ఘనులే కనుక అనాదిగా మన వ్యవస్థలో వుండి వున్నట్లయితే, పరిస్థితి వేరే విధంగా వుండేదేమో! ఇక ఇప్పడు అలా కాదు. భూగర్భంలో అనాదిగా నిక్షిప్తమై వున్న అపార సంపదను కూడా కొల్లగొట్టే మహానుభావులు పుట్టుకొచ్చారు. అలాంటివారికి ఆ నిక్షిప్తమైన సంపదను వెలికి తీసేందుకు లైసెన్సులను ఇచ్చిన "ప్రభుత్వ అధికారులను" ప్రధమ ముద్దాయిలుగా పేర్కొనాలి. వారిని అలా చేయమని వారిని ప్రోత్సహించిన అనధికారులను (మంత్రి వర్గ సభ్యులను) రెండవ ముద్దాయిలుగా పేర్కొనాలి. అప్పుడే ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా వుండే ఆస్కారముంటుంది. ఏ విధంగానైతే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో స్థలం, విల్లాలు కొనుక్కున్న వారిని విచారణ చేయడానికి నిర్ణయం జరిగిందో, అదే విధంగా, పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా గాలి గనుల విషయంలో కాని, జగన్మోహన్ కంపెనీలలో పెట్టుబడుల వ్యవహారంలో కాని విచారణ జరగాలి.

వ్యాధి నివారణ కంటే, నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి జరిగిన తర్వాత చర్యలకంటే, ముందస్తుగానే నిరోధించగల వ్యవస్థలుండాలి. కావాల్సింది "పోస్ట్ ఆడిట్" కాదు.."ప్రీ ఆడిట్". లక్ష్మీ నారాయణ లాంటి అధికారులు లక్షలలో-వేలల్లో కాకపోయినా, వందల సంఖ్యలో నన్నా మన దేశంలో వుండే వుంటారు. భారీ కుంభకోణం జరిగేందుకు ఆస్కారముండే వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే ముందర, ఇలాంటి అధికారులతో, లైసెన్సు కోరిన వారి పూర్వా-పరాలు, రాజకీయ సంబంధాల గురించి సమగ్ర దర్యాప్తు చేయించాలి. అంతటితో ఆగకుండా, ఆ లైసెన్సుకు సంబంధించిన వారి వ్యాపారం సాగేంతవరకూ, ఏడాదికో-ఆర్నెల్లకో వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో, లేదో, విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా-బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. అప్పటికీ దొరకకుండా తప్పించుకుంటే, ఇక ఎలాగూ పోస్ట్ ఆడిట్ వుండనే వుంటుంది. కనీసం కొంతకాలమైనా, అవినీతి కొంతలో కొంతన్నా అరికట్టడానికి ఈ చర్యలు అమల్లోకి రావాలి. లోక్ సభలో చర్చకు రానున్న లోక్ పాల్ బిల్లులో ఈ అంశాలకూ ప్రాధాన్యతుండాలి. లేకపోతే, గాలి లాంటి వారు తమకున్న పలుకుబడితో అప్రతిహతంగా అవినీతి మార్గాలలో పయనిస్తూనే వుంటారు.

1 comment:

  1. మంచి విషయము. ఆలొచింపజేసే విధంగా చెఫ్పారు.బాగుంది.. ధన్యవాదములు.

    ReplyDelete