Thursday, September 15, 2011

నాయకుడెవరు - మోడీనా, రాహులా?: వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (16-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఎవరు నాయకులు? నాయకత్వ సామర్ధ్యాలేమిటి?, ప్రదర్శితం కాని రాహుల్ నాయకత్వ లక్షణాలు, ప్రశంసలనందుకున్న వరుణ్‌ గాంధీ ప్రసంగం, మోడీ, రాహుల్‌లలో నాయకుడెవరైనా కావచ్చు, కాకపోవచ్చు, నిర్ణేతలు ప్రజలే! ...ఎడిటర్

అందరికీ నాయకత్వ లక్షణాలుండాలని లేదు. నాయకత్వ లక్షణాలు లేనంత మాత్రాన మంచివారు కాదని కాని, గొప్ప వారు కాకూడదని కాని అనలేము. మంచితనం వేరు, నాయకత్వం వహించడం వేరు. నాయకత్వం కొందరికి పుట్టుకతో అబ్బితే, మరి కొందరికి వయసు పెరిగినా కొద్దీ ఆ లక్షణాలు రావచ్చు. ఎలా-ఎప్పుడు రావడం కంటే, వచ్చిన వాటిని ఆచరణలో నిరంతరం పెట్టగలిగే వారే శాశ్వతంగా నాయకులుగా మిగిలి పోతారు. కుటుంబ నేపధ్యంతో కొందరు హఠాత్తుగా నాయకులుగా ఎదగ వచ్చు. నాయకులైన తర్వాత స్వయం ప్రతిభతో సమర్థవంతంగా ముందుకు సాగవచ్చు. ఇక కొందరికి, ఎన్ని విధాల నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎన్ని లభించినా, ఉపయోగించుకోలేక మరో నాయకుడి కిందనే పని చేయడానికి ఇష్ట పడతారు. రాజకీయాల విషయానికొస్తే, వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, (అవినీతికి దూరంగా) మంచి-మంచి అలవాట్లతో, ఫలవంతమైన సహాయాన్ని తన పార్టీకి-రాష్ట్రానికి-దేశానికి అందించగల వారే నాయకులనిపించుకోగలుగుతారు. వీరిలో రక-రకాల స్థాయికి చెందిన వ్యక్తులుంటారు. అందరు, అన్ని రంగాలలో రాణించ లేరు.

"మొదటి స్థాయి (కింది) యోగ్యత గల స్వయం సాధకులు", "రెండో స్థాయికి చెందిన బృందంలోని భాగస్వామ్య సభ్యులు", సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల శక్తిగల వారై వుంటారు. "మూడో స్థాయికి చెందిన మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వారై వుంటారు. ఇక "నాలుగో స్థాయి సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. ఇలాంటి వారి నాయకత్వ లక్షణాలను ఉమ్మడిగా కలిగుండి, వీరందరిని, ఏఏ పనికి-ఎవరిని-ఎప్పుడు-ఎలా ఉపయోగించుకోవాలో, లక్ష్యాలను చేరుకోవడానికి-అధిగమించడానికి సరైన స్థానంలో ఎవరెవరిని-ఎంత మేరకు నియమించాలో నిర్ణయించగలిగేది, కేవలం "ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి" మాత్రమే. వీరు తమ వ్యక్తిగత నమ్రతలను, అణకువలను వృత్తి పరమైన కార్య సాధనతో జోడించి, ఒక రకమైన అసంభవ మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థానాన్ని చేరుకోగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. అలాంటివారే, రాజకీయాలలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర-జాతీయ స్థాయి అధ్యక్షులుగా, మంత్రులుగా-ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా-ప్రధాన మంత్రిగా, "స్వయం ప్రతిభతో" ఎదగ గలుగుతారు. వారసత్వం గానో, అయాచితంగా నో, రాజీ అభ్యర్థిగా నో, తాత్కాలిక నాయకుడుగా నో, ఒకరి త్యాగ ఫలితంగానో, "మధ్యంతర ఏర్పాటు" గానో, ఇలాంటి ఉన్నత స్థానాలకు చేరుకున్న వ్యక్తులకు, ఆ స్థానాలు తాత్కాలికంగానే మిగిలిపోతాయి తప్ప, శాశ్వతం కావు. ఇవన్నీ అనుభవంలో, మన దేశంలో-ఇతర దేశాలలో గమనిస్తూనే వున్నాం.

ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆమె అప్పగించిన నలుగురిలో తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే, సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం మొదలెట్టింది. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో, అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి తిరిగొచ్చారని భావించారు పలువురు. ఇక ఆయన భజన బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్" తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను, రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం. హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా, లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించు తూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.

మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. ఒక వేళ అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం, "దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!

ఈ నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఇటీవల. ఇదే సమయంలో యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది. ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో సహా చర్చలకు నడుం బిగించారు. వీరిద్దరిలో ఎవరు ప్రధాని అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!

జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్ ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ, తప్పో-ఒప్పో, అప్పటికే ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!

తన తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్ గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం, అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్ గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు. అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా, పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్ తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పన్నెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత మాత్రాన నాయకులు కాకుందా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం కలిగుండాలని లేనే లేదు.

ఇన్ని తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే, ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే, ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే, కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!

సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని వుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!

2 comments:

  1. it is too early to say.secondly it does not depend only on individual qualities ,but mainly on their respective parties strength and popularity at the time of elections.

    ReplyDelete
  2. వీళ్ళిద్దరూ కాదు. నిజమైన నాయకుడు నితీష్ కుమార్.
    కాని ఆయన ప్రధానమంత్రి కాకపోవచ్చు. ఒక వేళ అయినా ఎక్కువ రోజులు ఉండనివ్వరు.
    అలాగే మోడీ కూడా ప్రధాన మంత్రి కాకపోవచ్చు. NDA లో అందరూ అయనని అంగీకరించరు.
    ఇక రాహుల్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎంతకాలం ఉంటారన్నది, ఆయన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.

    ReplyDelete