Thursday, September 29, 2011

ఉద్యమానికి ఊతం ప్రభుత్వ నిర్లిప్తత: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దినపత్రిక (30-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఉద్యమంలో అవాంఛనీయ ఘటనలు, చేయి దాటిపోతున్న పరిస్థితులు, ప్రత్యేక- సమైక్య వ్యూహ ప్రతి వ్యూహాలు, అటూ ఇటూ మాటల తూటాలు, సమస్య పరిష్కారం ఎవరికి సాధ్యం? – ఎడిటర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! వారిలో కొందరు మనసా వాచా తెలుగు వారందరూ సమైక్యంగా వుండాలని కోరుకునే "విశాలాంధ్ర" సిద్ధాంతానానికి కట్టుబడి వున్నవారు. వారలా భావించడంలో తప్పు లేదు. వచ్చిన చిక్కల్లా రాజకీయాలకు సీమాంధ్ర ప్రాంతం, వ్యాపారాలకు తెలంగాణ ప్రాంతం-అందునా హైదరాబాద్ తో అవసరం వున్న స్వార్థపరులతోనే! వారిలో కనీసం ఒకరిద్దరికి, కేంద్రంలో అధికారంలో వున్న కీలకమైన వారో, లేక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలు తెలుసుకునే అవకాశమున్న వ్యక్తులో, లేక, వారి సొంత నిఘా విభాగమో కాని, తెలంగాణ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయన్న సమాచారం తక్షణమే చేరుతుంది. అసలు కేంద్రానికి ఆ ఆలోచన వుంటుందో లేదో కాని, వుందన్న సంగతి మాత్రం బయటకొస్తుంది. అంతే, అప్పటివరకూ, తమ తమ వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతుండే ఆ నాయకులు, సమైక్యాంధ్ర నినాదంతో రంకెలేయడం ప్రారంభమవుతుంది. కలిసున్నా- విడిపోయినా, స్నేహంగా-కలిసున్న రోజులు కలకాలం గుర్తుండేలా భావించే సీమాంధ్రులకు కాని, తెలంగాణ వారికి కాని ఇలాంటి ఆలోచనలు రావు. అందుకే-ఇందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఉద్యమం. ప్రభుత్వం నిర్లిప్తతతో ఉద్వేగమవుతున్న ఆ ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నది ఇలాంటి స్వార్థపరులే.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన సకల జనుల సమ్మె పదిహేడవ రోజుకు చేరింది. శాంతి యుతంగా మొదలైన ఉద్యమం, అందులో పాల్గొంటున్న ఉద్యమకారుల ప్రమేయం లేకుండానే, క్రమక్రమంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలా జరగడానికి అవకాశం కలిగే ఒకటి రెండు సంఘటనలు గత వారం చోటు చేసుకోవడంతో, రోజురోజుకు పరిస్థితి చేయి దాటి పోతోంది. ఎలాంటి ఉప్పు-ఎక్కడనుంచి అందిందో కాని, ఇటీవల కొంత కాలంగా, ప్రశాంతంగా వుంటున్న లగడపాటి లోని సమైక్యాంధ్ర ఆకాంక్ష మరొక్క సారి బయటకొచ్చింది. ఉధృతంగా సాగుతున్న సకల జనుల సమ్మె నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కావాలని సృష్టించారో - లేక కాకతాళీయంగా జరిగిందో కాని, ఆయన చేసిన హడావిడి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మరింత ప్రేరణను ఇచ్చిందనాలి. రాజకీయ విశ్లేషకులు మాత్రం లగడపాటి రాజగోపాల్, హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రావడం వెనుక కొంత వ్యూహ రచన వుందనే అంటున్నారు. తనది కేవలం సమైక్యాంధ్ర నినాదమే కాదని, తెలంగాణ ఉద్యమంలో, ఆయన దృష్టిలో సీమాంధ్రులకెవరికైనా అన్యాయం జరిగితే, వారికి తన అండదండలు వుంటాయన్న మరో నినాదాన్ని ఆర్టీఏ ఆఫీసుకు పోవడం ద్వారా చెప్పకనే చెప్పారు. పనిలో పనిగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేసే ఆలోచన కూడా వున్న విషయం ఆ విధంగా బయట పెట్టారు. సరే ఆయనను అరెస్ట్ చేయడంతో పోలీసులు అగ్నికి ఆజ్యం అన్ని వైపులనుంచీ పోశారనవచ్చు. హెచ్చరికలు-ప్రతి హెచ్చరికలు పార్లమెంటరీ భాషకు అతీతంగా సాగాయి. ఎవరూ వెనుకకు తగ్గలేదు. అరెస్టయిన లగడపాటిని విడుదల చేసినా, పంపించే వరకూ, వెళ్లకపోవడం విశేషం.

లగడపాటి రంగ ప్రవేశం తెలుసుకున్న తెలంగాణ వాదులు ఎమ్మెల్యే హరీష్ రావు కేంద్ర బిందువుగా కదన రంగంలోకి దిగారు. ఆయనతో పాటు, ఎంపీ మధు యాష్కీ, ఎమ్మెల్యే విష్ణు, స్వామి గౌడ్, బీజేపీ నేత విద్యాసాగరరావు తదితరులు లగడపాటి చర్యను ఖండించడంతో పాటు, ఆర్టీఏ అధికారిని నిలదీశారు. కమిషనర్ గదిలోకెళ్లి ఆయన్ని ఘెరావ్ చేశారు. సంఘటనల్లో హరీష్ రావు చొక్కా చినిగింది. స్వామి గౌడ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఉద్యమం ఉద్వేగమైంది. ఐనా, ప్రభుత్వ నిర్లిప్తత నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. తెలంగాణ ఎన్ జీవోల నాయకుడు స్వామి గౌడ్ పై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మరుసటి రోజున ఆందోళనను ఉదృతం చేయడానికి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి, తెలంగాణ వాదులు సిద్ధమయ్యారు.

ఇంతలో వింతైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మధ్యే మార్గమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధిష్టానం ఆంతరంగికుల ద్వారా బయట పెట్టింది. మరో వైపు ఆ వార్తలను తనకు అనుకూలంగా, తెలంగాణ ఉద్యమానికి ఆసరాగా మలచుకోవడానికి, తన రాజీలేని పోరాటాన్ని మాటల తూటాల ద్వారా కొనసాగిస్తున్నారు తెరాస అధినేత చంద్రశేఖర రావు. "ఆరు నూరైనా, తలకాయ తెగిపడినా సరే హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేది లేదని", హైదరాబాద్ తో కూడిన తెలంగాణాయే కావాలని స్పష్టం చేశారు. 60 ఏళ్లుగా తెలంగాణ కోసం చేస్తున్న పోరాటంలో "ప్రాణాలర్పించైనా తెలంగాణ తీసుకు వస్తానని" కేసీఆర్ అనడం లగడపాటి లాంటి వారి వ్యూహాలకు పటిష్టమైన ప్రయోగాత్మక ప్రతి వ్యూహమే! వాస్తవానికి రెండు-మూడు రోజుల క్రితమే, సమాచారం వుండి అన్నారో, లేక, యాదృచ్ఛికంగా అన్నారో కాని, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆ అర్థం స్ఫురించే రీతిలోనే మాట్లాడారు. అంతో-ఇంతో తేడాతో రక్షణ మంత్రి ఆంటోనీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఆంతరంగం కూడా అలానే వుంది. ఏ మధ్యే మార్గమైనా, హైదరాబాద్ తో కలిసిన తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా నిర్ణయం దిశగా లేకపోతే, నాయకులకు అంగీకారమవుతుందేమో కాని, తెలంగాణ ప్రజలకు అవుతుందా? మధ్యే మార్గం సూచించడానికి గులాం నబీ ఆజాద్ చెపుతున్న ఒకే ఒక కారణం, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని పక్షాలను ఒప్పించడం మాత్రమే! రేపు ఒక పక్షం వారు, సమైక్యాంధ్ర తప్ప ఇంకేమీ వద్దంటే, గులాం నబీ ఆజాద్ అదే మధ్యే మార్గం అంటే తెలంగాణ వారు అంగీకరించాలా? ఇలాంటి వాదనలు చేస్తూనే, అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మభ్య పెటుతున్నది చాలక మళ్లీ ఇప్పుడు మధ్యే మార్గం అన్న కొత్త నినాదంతో రావడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే!

ఈ నేపధ్యంలో ఇటీవల బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న రాజకీయ నాయకుల మాటలు కొన్ని జుగుప్సాకరంగా, బాధాకరంగా, వింతగా వున్నాయనక తప్పదు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన కార్యాలయంలోనే పట్టుకుని, "మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కాని, సీమాంధ్రకు కాదు" అని ఒక ఎంపీ (పొన్నం ప్రభాకర్) అనడంతో ప్రారంభమైన ఈ మాటలు రోజురోజుకూ జోరందుకుంటున్నాయి. ముఖ్య మంత్రి తనను-తన పార్టీకి చెందిన ఎంపీనే అలా అనడానికి అవకాశం ఇచ్చి వుండాల్సింది కాదు. ఆ ఎంపీ అలా అనడానికి కారణం కూడా ఆయనే చెప్పారు. సకల జనుల సమ్మె ప్రభావం లేదని ముఖ్య మంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఆయన ఆరోపణ చేశారు. అంతేకాకుండా, ఆయన సీఎం ఎలా అయ్యారో (తప్పుడు నివేదికలిచ్చి) అన్న విషయంలో కూడా కిరణ్ కు నచ్చని విధంగా వ్యాఖ్యలు చేశారు (ఆయన దృష్టిలో సమంజసం కావచ్చు). ఆ వాదన అంతటితో ఆగిపోతే బాగుండేదేమో!"వాట్ నాన్‌సెన్స్ యూ ఆర్ టాకిం గ్?" అంటూ సీఎం ఫైర్ అయ్యారు. వెంటనే మరో కాంగ్రెస్ ఎంపీ వివేక్ తీవ్రంగా స్పందిస్తూ, "ఒక ఎంపీని నాన్‌సెన్స్ అంటారా?" అనడం, చివరకు అంతా సర్దుకుపోవడం జరిగింది. ఈ మాటలన్నీ బయట సీఎంను ఆ రోజు కలవడానికి వచ్చిన వారంతా (మంత్రులతో సహా) వినినట్లు మర్నాడు పత్రికల్లో వార్తలొచ్చాయి. ఏదో సామెత చెప్పినట్లు "మొగుడు కొట్టినందుకు కాదు...ఆడ బిడ్డ నవ్వినందుకు" అన్న చందాన వుందీ వ్యవహారమంతా. ఒక ముఖ్య మంత్రి సహనం కోల్పోవడం ఎంత భావ్యం కాదో, ఆయన సహనాన్ని పరీక్షించడం కూడా అంత మంచిది కాదు. గతంలో 1968-1969 వేర్పాటువాద ఉద్యమాలలో, అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకంగా ఎంత ఘాటైన పదాలు వాడ బడ్డాయో చరిత్ర తెలిసిన వారందరికీ జ్ఞాపకం వుండే వుంటుంది.

"తెలంగాణ తేలేమని అనుకున్న రోజున ఆత్మహత్య చేసుకొని చస్తాం" అని భావోద్వేగంతో రాజ్యసభ సభ్యుడు కేశవరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవకు చెందినవే. ఎంత మనస్థాపానికి గురైతే అలా అన్నారో గమనించాల్సిన విషయం. అంతటితో ఆగకుండా "అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధం" అని కూడా అన్నారు. అదే సమయంలో మరో మారు పొన్నం ప్రభాకర్ "సీఎం కావడానికి ఏయే రిపోర్టులు కేంద్రానికి పంపించారో చెబితే అదే దారిలో తెలంగాణ తెచ్చుకుంటాం" అంటూ ముఖ్యమంత్రికి మరో మారు సవాలు విసిరారు. అదే క్రమంలో సకల జనుల సమ్మె ప్రభావంతో కలిగిన కరెంటు కష్టాలను అధిగమించాలన్న ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలకు జైపాల్ రెడ్డి అడ్డుతగిలారన్న భావన కిరణ్ కుమార్ రెడ్డికి కలిగింది. సహజంగానే ఆయనకు కోపం వచ్చింది పాపం. దరిమిలా ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రికీ మధ్య వివాదం రాజుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సీఎంకు దూరం మరింత పెంచింది. "సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిపి వేయించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, గ్యాస్ కావాలని తాను కేంద్రం సహాయం కోరితే, జైపాల్ రెడ్డితో ఇవ్వొద్దని సలహా ఇచ్చారు" అంటూ సీఎం బహిరంగంగా పేర్కొనడం ఎంతవరకు సబబు? ఎంత కోపం వచ్చినా ఓర్పు వహించడం బాధ్యతాయుతమైన పదవులలో వున్నవారికి చాలా అవసరం. తామెందుకు అనవసరంగా మాటలు పడాలనుకున్నారేమో, జైపాల్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "సీఎం మాట్లాడింది నాన్‌సెన్స్" అని కేశవరావు, "అన్నీ తెలిసిన ముఖ్య మంత్రి ఇలా మాట్లాడితే ఎలా?" అని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్య మంత్రి వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి సంజాయిషీలాంటి సమాధానాలు, మళ్లీ వాటికి ప్రతి స్పందనలు, మామూలు స్థాయి వారికి తగునేమో కాని వారి స్థాయి వారికి తగినవి కాదని విశ్లేషకుల అభిప్రాయం. మరో రోజు గడిచిందో, లేదో, కరీంనగర్ లో బ్యాంక్ ఉద్యోగుల ర్యాలీలో, ఎంపీ పొన్నం ప్రభాకర్ మరో మారు సీఎం మీద నిప్పులు కురిపించారు. "ఈయనేమన్నా పోటుగాడా?" అంటూ, "మంత్రిగా కూడా పని చేయని వాడిని యాబై ఏళ్లకే ముఖ్య మంత్రిని చేశారు!" అని కటువుగా అన్నారు. లాబీ చేసి కుర్చీ ఎక్కిన కిరణ్ ను దింపేస్తామని కూడా హెచ్చరించారు. ఇక ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా వున్నాయి. "సీమాంధ్ర కోడి తలలు కూడా నరకలేరు తెలంగాణ ప్రాంతం వారు" అని ఆయన అనడం ఒక ఎత్తైతే, ఆ వ్యాఖ్యలను పొన్నం తిప్పికొట్టిన వ్యవహారం అదే మోతాదులో వుందనాలి. "తలలు నరకడం మొదలుపెడితే బిడ్డా, కోడి తలలు నరకం, మీలాంటి ఆంధ్రా తలలు నరుకు తాం'' అని ఆనంను ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు పొన్నం.

ఏదేమైనా ఉద్యమం ఉద్వేగమవుతోంది. సెగ రాజుకుంటుంది. అందరూ చేతులెత్తేసే పరిస్థితి కలగకూడదు. ఎవరికి వారు తమ చేతుల్లో లేదనడం ఎంతవరకు భావ్యం? ముఖ్య మంత్రి కిరణ్ కు చేతకాక, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీకి చేతకాక, కేంద్ర మంత్రులు ఆంటోనీ-ప్రణబ్-చిదంబరం లకు చేతకాక, ప్రధాని మన్మోహన్ కు చేతకాక పోతే మరి చేతనైంది ఎవరికి? ఆ సత్తా-సామర్థ్యం వున్న సోనియా గాంధీనో, ఆమె కొడుకు రాహుల్ గాంధీనో ఎంత తొంరగా కళ్లు తెరిస్తే అంత మంచిది. తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదు సమస్య. ప్రభుత్వం నిర్లిప్తత పెద్ద సమస్య. ఆ నిర్లిప్తతతో ఉద్వేగమవుతున్న ఉద్యమం అంతకన్నా పెద్ద సమస్య. నిలకడలేని రాజకీయ నాయకుల ధోరణి అంతకంటే అతి పెద్ద సమస్య. సమస్య పరిష్కరించక పోతే మిగిలేది "ఉద్వేగమే"!


3 comments:

  1. / ప్రమేయం లేకుండానే, క్రమక్రమంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి./

    అన్నీ శాంతి యుతంగా, గాంధేయ పద్దతిలో జరిగే సమ్మె. అవాంఛనీయ సంఘటనలు కూడా శాంతి యుతంగానే జరుగుతున్ననయి కదా...

    /లగడపాటి రాజగోపాల్ కావాలని సృష్టించారో - లేక కాకతాళీయంగా జరిగిందో కాని, ఆయన చేసిన హడావిడి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మరింత ప్రేరణను ఇచ్చిందనాలి./

    మంచిదే కదా..లగడపాటి కి థాంక్స్ చెప్పడం పోయి..తిట్టడం ఏమిటి ?

    /"తెలంగాణ తేలేమని అనుకున్న రోజున ఆత్మహత్య చేసుకొని చస్తాం" అని భావోద్వేగంతో రాజ్యసభ సభ్యుడు కేశవరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవకు చెందినవే. ఎంత మనస్థాపానికి గురైతే అలా అన్నారో గమనించాల్సిన విషయం. /

    పాపం...ఎంత మనస్థాపమో...నిజంగా ఆత్మహత్య చేసుకుంటాడేమో..

    / ఉద్యమానికి ఊతం ప్రభుత్వ నిర్లిప్తత/

    ఉద్యమాని కి సాయం చేసినట్టేకదా...మంచిదే కదా

    /ఎంత కోపం వచ్చినా ఓర్పు వహించడం బాధ్యతాయుతమైన పదవులలో వున్నవారికి చాలా అవసరం.
    1. "మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కాని, సీమాంధ్రకు కాదు"
    2."సీఎం కావడానికి ఏయే రిపోర్టులు కేంద్రానికి పంపించారో చెబితే అదే దారిలో తెలంగాణ తెచ్చుకుంటాం"
    3."మంత్రిగా కూడా పని చేయని వాడిని యాబై ఏళ్లకే ముఖ్య మంత్రిని చేశారు!"
    4."తలలు నరకడం మొదలుపెడితే బిడ్డా, కోడి తలలు నరకం, మీలాంటి ఆంధ్రా తలలు నరుకు తాం''/

    MP పదవి బాధ్యతాయుతమైంది కాదేమో

    /1."సీఎం మాట్లాడింది నాన్‌సెన్స్"
    2.మరో కాంగ్రెస్ ఎంపీ వివేక్ తీవ్రంగా స్పందిస్తూ, "ఒక ఎంపీని నాన్‌సెన్స్ అంటారా?"/

    ఎంపీని నాన్‌సెన్స్ అనకూడదు. మఖ్యమంత్రి ని అనొచ్చు.

    ReplyDelete
  2. మీరు తె.వాద ముసుగు తియ్యనంతవరకు కోస్తా-సీమలో చీమ చిటుక్కుమన్నా అది మామీద వేసిన ఆటం బాంబే అని వారనగలరు, మీరు నమ్మించ ప్రయత్నిచగలరు. అసలు తెలంగాణా గూండాలని, ఆంధ్రా బెక బెకలని ఒకే గాటన కట్టడమేంటండీ?
    అబద్ధాలు, కట్టుకథలు,సాటివారిమీద అసూయ, ద్వేషం,కించిత్తు బాషాభిమానం కూడా లేకపోవటం లాంటి వాటికి గూండాగిరి, రాజకీయం, సంకుచితంగా అలోచించే మేధావి వర్గం, గడచినకాలపు పోరాట నేపథ్యం అన్నిటిని మించి మిగిలిన ప్రాంతాల వారి అలవిమాలిన నిర్లిప్తత, మీడియా ఇవన్నీ కలిపితే తయారయిన అనాగరిక ఉద్యమం ఇది. దీన్ని వేరే వాటితో ఎందుకు కలుపుతారు, సార్. కేసీ ఆర్ వస్తే పూలతో స్వాగతిస్తాం అనే వాళ్ళకి, ' నా కొడుకు మా హైద్రబాద్ల కొస్తే ఈడ్నే ఖతం జేస్తాం " అని టీవీలముందు నిర్లజ్జగా వాగే మాజీ ఎం ఎల్ యే లని ఒకే గాటన కట్టడమేంటండి.
    కొంచెం కళ్ళద్దాలు మార్చండి, ప్లీజ్.

    ReplyDelete