Saturday, July 14, 2012

దక్షిణ చైనా సాగర సంక్షోభంతో మారుతున్న చైనా విదేశాంగ విధానం: వనం జ్వాలా నరసింహారావు


దక్షిణ చైనా సాగర సంక్షోభం
మారుతున్న చైనా విదేశాంగ విధానం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (04-08-2012)
దక్షిణ చైనా సాగర సంక్షోభంపై జులై పదమూడున జరిగిన ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ శిఖరాగ్ర సభ అర్థాంతరంగా, ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసింది. సుమారు 45 సంవత్సరాల శిఖరాగ్ర సభల చరిత్రలో మొట్టమొదటి సారి సభ్యదేశాల ఉమ్మడి ప్రకటన వెలువడకుండా పోయింది. సింగపూర్ నుంచి తైవాన్ వరకూ వ్యాపించి వున్న దక్షిణ చైనా సాగర తీరం సుమారు 3,500,000 కిలోమీటర్లుంటుంది. ప్రపంచంలోని మూడోవంతు నౌకాయానం ఈ జలాలలోనే సాగుతుంటుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతపు సాగరగర్భంలో అపారమైన గాస్, నూనె నిక్షేపాలున్నాయని అంచనా. ఉమ్మడి ప్రకటన వెలువడకపోవడానికి ప్రధాన కారణం చైనా ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలే! ఆ దేశపు శత్రు పక్షమైన ఫిలిప్పీన్స్ అక్కడ జరిగిన వైఫల్యాలకు చైనాతో స్నేహం కలిపిన కాంబోడియాను తప్పుబట్టింది. ఆద్యతన భవిష్యత్‍లో అక్కడ సమస్య మరింత క్లిష్ట తరం కావడం ఖాయమని కూడా ఫిలిప్పీన్స్ హెచ్చరించింది. అక్కడి సాగర ప్రాంతంలో లభ్యమవుతుందని భావిస్తున్న గాస్, ఆయిల్ నిక్షేపాలకోసం చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు పోటీపడుతున్నాయి. చైనా-ఫిలిప్పీన్స్ దేశాల మధ్య, ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల నేపధ్యంలో, చైనా దూకుడు వ్యవహారం, అంతర్జాతీయ సంబంధాల దిశగా ఒక నూతనాధ్యాయానికి నాంది పలికే సూచనలు కనపడుతున్నాయని, విదేశాంగ విధాన నిపుణులు భావిస్తున్నారు. ఆసియా దేశంలో పరిస్థితిని సమతుల్యం చేయాలని తపన పడుతున్న అమెరికాకు, చైనా-ఫిలిప్పీన్స్ సంవాదం, ఆ దేశ ప్రయోజనాలను కాపాడుకునే ఆలోచనలో దింపవచ్చు.



కొరియా యుద్ధం కాని, ఇండియా-చైనా యుద్ధం కాని, చైనా-వియత్నాం యుద్ధం కాని, చైనా యుద్ధ విదేశాంగ నీతి అమలులో ఎదుర్కుంటున్న సవాళ్ల తీరుతెన్నులను తెలియచేస్తాయి. ప్రచ్ఛన్న యుద్ధాల రోజులు ముగిసిన తరువాత, పొరుగు దేశాలతో కాని, మరే ఇతర దేశాలతో కాని చైనా కయ్యానికి కాలుదువ్వలేదు. కాకపోతే కొన్ని అడపాదడపా సంఘటనలలో చైనా తలదూర్చక తప్పలేదు. ఉదాహరణలుగా 1995-96 తైవాన్ సాగర కాలువ సంక్షోభం; 2010 నాటి శంకాకు-డయాయు ఐలాండులో చోటుచేసుకున్న చైనా-జపాన్ యుద్ధనౌక సంక్షోభం; 2001 ఇ-పి నౌక సంఘటన లేదా "హైనాన్ ఐలాండ్ సంఘటన" లను చెప్పుకోవచ్చు.
సెప్టెంబర్ 1949 లో అమల్లోకి వచ్చిన చైనా తాత్కాలిక రాజ్యాంగంలో ఆ దేశపు విదేశాంగ విధానం మౌలిక సూత్రాలను పేర్కొంది. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రపంచ శాంతి-సహృద్భావం, ఇరుగు-పొరుగు దేశాలతో సహా అన్ని ప్రపంచ దేశాలతో మైత్రి, వలస వాద-సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకత ఆ సూత్రాలలో ప్రధానమైనవి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించిన తరువాత ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం విదేశాంగ విధానాన్ని మరింత వివరంగా పేర్కొంది. అందులో ప్రధానమైంది స్వతంత్ర విదేశాంగ విధానంతో కూడిన "పంచశీల సిద్ధాంతం". ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని-స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించడం; ఒకరిపై మరొకరు యుద్ధానికి దిగకుండా వుండడం; ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో తలదూర్చక పోవడం; ఒక దేశం మరొక దేశమంటే గౌరవంతో సమానత్వంతో మెలగడం; ఇతర దేశాలతో ఆర్థిక-సాంస్కృతిక వ్యవహారాల విషయంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో మెలగడం-సత్సంబంధాలను కలిగి వుండడం ఆ ఐదు సిద్ధాంతాలు. సామ్రాజ్యవాదాన్ని, వలస వాదాన్ని, ఆధిపత్య విధానాన్ని నిరంతరం వ్యతిరేకించడం కూడా చైనా విదేశాంగ విధానంలో భాగమే. అణగారిన ప్రపంచ దేశాలకు, అణచి వేయబడుతున్న దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, వారు తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం కొరకు జరుపుతున్న న్యాయ పోరాటాలలో వారికి అండగా నిలిచి, వారి అభివృద్ధికి తోడ్పడం కూడా చైనా విదేశాంగ నీతిలో ఒక భాగమే! తద్వారా ప్రపంచ శాంతిని, మానవాభివృద్దిని కాంక్షిస్తున్నట్లు చైనా పేర్కొంది తన రాజ్యాంగంలో. దాదాపు వంద సంవత్సరాల పాటు సామ్రాజ్యవాద దురాక్రమణకు గురైన చైనా, 1949 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించిన తరువాత, అది సుదీర్ఘ పోరాట ఫలితంగా సంపాదించుకున్న స్వాతంత్ర్యాన్నే తన విదేశాంగ విధాన మౌలిక సిద్ధాంతంగా పరిగణిస్తుంది. యుద్ధ నివారణకు, ప్రపంచ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొనడానికి, చైనా ఎల్లప్పుడూ సిద్ధమే అని రాజ్యాంగంలో వుంది.
ప్రచ్ఛన్న యుద్ధ కాలంనుంచీ చైనా విదేశాంగ విధానంలో సంక్షోభ నియంత్రణ-నివారణ జరిగే పద్ధతి ఒక రకమైన పజిల్ లాగా వుంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఉదాహరణకు, తైవాన్ సాగర కాలువ సంక్షోభం సందర్భంలో, ఆ దేశాధ్యక్షుడు 1995-96 లో కార్నెల్ విశ్వవిద్యాలయం సందర్శనకు వచ్చినప్పుడు, చైనా నాటకీయంగా అనుసరించిన విధానం చెప్పుకోవాలి. అదే విధంగా, 2001 లో ఇ. పి-3 వ్యవహారం. అప్పుడు చైనా ఎందుకు అమెరికాతో ఇచ్చి-పుచ్చుకునే పద్ధతిలో వ్యవహరించిందో అర్థం చేసుకోవాలి. అమెరికా నుంచి అస్పష్టంగా అందిన "క్షమాపణ" ఆధారంగా, ఆ దేశపు యుద్ధ నౌకను విడుదల చేసింది చైనా. విదేశాంగ విధానం సంక్షోభంలో పడిపోయినప్పుడు, చైనా, ఎప్పుడు రాజీపడుతుంది? ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తుంది? అన్నది ప్రశ్నార్థకమైన నిర్ణయంగానే భావించాలి. చైనా విదేశాంగ విధానం సంక్షోభం తీరుతెన్నులను మూడు రకాలుగా పరిశీలించాలి-అంచనా వేయాలి. సంక్షోభం ఎంత తీవ్రమైంది అనేది మొదటిది. అది నిజంగా అత్యంత తీవ్రమైంది అయితే, చైనా దెబ్బతినే పరిస్థితులే కనపడితే, సవాళ్లు విషమించితే, సాధారణంగా చైనా వెనక్కు తగ్గే ప్రసక్తి రానేరాదు. చైనా ప్రభుత్వం నడిపే నేతల అధికారం ఎంత మోతాదులో వుందనేది కూడా ప్రధానమైందే. కమ్యూనిస్ట్ రాజకీయ-సైనిక అధికార స్వామ్య చట్రంలో ఇంకా ఇమడలేని నాయకులు, సంక్షోభ నివారణలో కొంచెం వెనుకబడిపోతారు. చివరగా చెప్పుకోవాల్సింది, అంతర్జాతీయ ఒత్తిడులు. ముఖ్యంగా అమెరికా-ఇతర అగ్ర రాజ్యాల పరోక్ష ఒత్తిడులు కూడా చైనా విదేశాంగ విధాన సంక్షోభ పరిష్కారంలో అప్పుడప్పుడూ కీలకమవుతాయి.
ఈ కారణాలే ఆ దేశ విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుతాయి. నాయకుడు గట్టివాడైతే ఒక విధంగాను, బలహీనుడైతే మరొక విధంగాను నిర్ణయాలుంటాయి. గట్టివాడు ఇచ్చి-పుచ్చుకునే ధోరణిలోనో, పట్టు వీడని ధోరణిలోనో, సమయానుకూలంగా వ్యవహరించే అవకాశం వుంటుంది. చేతకాని వాడు, సంక్షోభాన్ని మరింత క్లిష్ట తరం చేసి, ఇంకొంచెం ఇబ్బందులకు గురిచేయవచ్చు. ఈ ఏడాది అటు అమెరికాలోను, ఇటు చైనాలోను, నాయకత్వ మార్పిడి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఒక వేళ ఒబామా ఓడి, ఆయన ప్రత్యర్థి మిట్ రోమ్‌నీ గెలుస్తే, ఆయన చైనా విదేశాంగ విధానానికి అనుగుణంగా చైనా నడచుకోక తప్పదు. రాబోయే రోజుల్లో, సమయం-సందర్భాన్ని పట్టి చూస్తే, పూర్తిగా మంచి కాలం అన్నా కావచ్చు, చెడు కాలమన్నా కావచ్చు. ఇప్పుడే చెప్పలేం. 2008 నుంచి, చైనా విదేశాంగ విధానం తీరుతెన్నులను పరిశీలించి విశ్లేషించిన నిపుణులు, వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం, ఆ దేశం కొంచెం ఆధిపత్య దిశగా సాగుతోందన్న అర్థం స్ఫురిస్తుంది. చైనా విధానాలకు అనుగుణంగా అమెరికా నడచుకోక తప్పదని కూడా వారి భావనలో గోచరిస్తుంది. గత శతాబ్దపు బూజుపట్టిన అమెరికా విధానాలను ఇంకా చైనా పట్ల అనుసరించడం అంత మంచిది కాదు. 21 వ శతాబ్దంలో అడుగిడిన చైనా విధానాలను అర్థం చేసుకుని, ఆ దేశం పట్ల అప్రమత్తతతో మెలగడం శ్రేయస్కరం.
ఇదిలా వుండగా, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, చైనాపై వ్యూహాత్మక ఒత్తిడి తెచ్చేందుకు, దక్షిణ చైనా సాగర ప్రాంతంలోని దేశాలలో సుడిగాలి పర్యటన చేశారు. అమెరికా-చైనా దేశాల మధ్య సంబంధాలు సక్రమంగా కొనసాగడానికి కాని, ఆసియా అభివృద్ధికి కాని, ఇలాంటి ఒత్తిడులు మంచిదికాదని నిపుణుల అభిప్రాయం. తన పర్యటనలో భాగంగా ఆమె, ఆఫ్గానిస్తాన్, జపాన్, మంగోలియా, లావోస్, వియత్నాం, కాంబోడియా దేశాలకు దౌత్య పరమైన రీతిలో తిరిగి వచ్చారు. అక్కడి సమస్యను మరింత జటిలం చేసే తరహాలో, కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాలకు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడారు. దక్షిణ చైనా సాగరంపై ఆ దేశానికి వున్న ఆసక్తిని కూడా పదే-పదే ప్రస్తావించింది క్లింటన్. గతంలో దక్షిణ చైనా సాగరం విషయంలో కొంత స్తబ్దత నెలకొని వుండేది. దానికి కారణం, సమస్యను సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సంబంధిత దేశాలన్నీ కోరుకోవడం. ఎప్పుడైతే, రెండేళ్ల క్రితం జరిగిన ఆగ్నేయ ఆసియా విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన క్లింటన్, తమ దేశానికి ఆ ప్రాంతంపై ఆసక్తి వుందని ప్రకటించాడో, అప్పుడే సమస్య తీవ్రత మొదలైంది. ఫిలిప్పైన్స్, జపాన్, వియత్నాం దేశాల ఇటీవలి ధోరణి కూడా సమస్యను మరికొంత జటిలం చేసింది. "చెట్లు నిశ్శబ్దంగా వున్నప్పటికీ గాలి వీస్తూనే వుంటుంది" అన్న చైనా సామెత ప్రకారం, ఆ దేశం ఎప్పుడు ఏ విదేశాంగ సమస్య వచ్చినా ఆచి-తూచి మరీ అడుగులు వేస్తుంది. చైనా దౌత్య నీతిని అనుసరించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నించినప్పటికీ, కొన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో, చైనాపై సవాళ్లు విసరడం, దానికి ఆ దేశం ఎదురు తిరగడం జరుగుతుంటుంది.
ఇరాక్-ఆఫ్గానిస్తాన్ దేశాలలో యుద్ధం అనంతరం, సుమారు పది సంవత్సరాల విరామం తరువాత, అమెరికా విదేశాంగ విధానం, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి దృష్టి సారిస్తే అభ్యంతరం లేదు. అలా కాకుండా స్వార్ధం కొరకు చేస్తే అది ప్రమాదానికి దారి తీయవచ్చు. శాంతి కొరకు చైనా ఆంతరంగిక విషయాలలో అమెరికా జోక్యం చేసుకోవడం ఆపు చేసి, ఆ దేశ సమస్యలను, చైనా ప్రభుత్వానికే వదిలెయ్యడం మంచిది. దానర్థం, చైనాలో జరగవచ్చని భావిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన లాంటి సంఘటనల విషయంలో, అంతర్జాతీయ సమాజం నోరు మెదపరాదని కాదు. అంతర్జాతీయ మార్గదర్శకాలను పాటించేలా చైనాను ప్రోత్సహించవచ్చనే కాని, ఆంతరంగిక విషయాలలో బలవంతంగా జోక్యం చేసుకోవడం తగదు. కొందరు అమెరికన్ రాజకీయ వేత్తలు చీటికిమాటికి, చైనాకు-అమెరికాకు మధ్య శత్రుత్వం శాశ్వతమైంది గా చిత్రించి మాట్లాడుతుంటారు. అది కూడా తగని పనే. సహకారం అనేది అటు చైనానుంచి ఎంతగా కోరుకుంటామో, అంతే మోతాదులో, ఇటు అమెరికా నుంచి కూడా వుండాలి. చైనాను మనం శత్రువు అని భావిస్తే, అది నిజంగా శత్రుత్వంతోనే వుంటుందంటున్నారు దౌత్యవేత్తలు. అందుకే, ఆ దేశ విదేశాంగ విధానంలో పేర్కొన్న విధంగా, చైనాకు స్నేహ హస్తం చాటడం మంచిదేమో!



                

1 comment:

  1. "చైనాకు స్నేహ హస్తం చాటడం మంచిదేమో!" ఇలా స్నేహ హస్తం ఇచ్చిన నెహ్రుగారు వెనుదిరగంగానే, యుద్ధనికి దూకిన నమ్మక ద్రోహి చైన.......కేవలం చైనానే కాదు....మరెవ్వరితోనూ మనం అతిగా ఉండటం మన దేశానికి మంచిది కాదు. ఎందుకంటే, స్వదేశీ విధానంలో స్వంత ప్రజల మీద చూపించే దూకుడు, విదేశీయుల మీద చూపించలేని అసమర్ధ రాజకీయ వ్యవస్థ మనకున్నది.

    ReplyDelete