Saturday, July 21, 2012

రాహుల్ రావడమంటే నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ రావడమంటే నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!
వనం జ్వాలా నరసింహారావు


వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతానికి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే వున్న సోనియా తనయుడు, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ పరంపరలో ఐదోతరంవాడైన రాహుల్ గాంధీకి పార్టీలో మరింత కీలక బాధ్యతలు-నిర్ణయాత్మకమైన బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టుకుని మరీ డిమాండు చేస్తున్నారు. వారిలో కొందరు నేతలు మరొక్క అడుగు ముందుకు వేసి, 2014 ఎన్నికలలో రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా అంటున్నారు. ఆ మాటకొస్తే దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పలువురు రాష్ట్ర స్థాయి-జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు వీలైనప్పుడల్లా రాహుల్ జపం చేస్తూనే వస్తున్నారు. నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని పదిలంగా వుంచే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. 'రావాలి... రావాలి... రావాలి...' అని అందరూ ఆహ్వానిస్తుంటే ఎందుకు రాకూడదని అనుకున్నాడేమో ఏమో కాని, వచ్చేస్తున్నానంటూ బదులు పలకనే పలికాడు రాహుల్. డిమాండులకు తల్లి సోనియా పెదవి విప్పి, రావడం-రాకపోవడం తనయుడు రాహుల్ ఇష్టాయిష్టాలకు వదిలేస్తే, ఆ మర్నాడే, తనయుడు నోరు గట్టిగా విప్పి, ప్రభుత్వంలోను-పార్టీలోను క్రియాశీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధం అని ప్రకటించాడు. తనను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది తల్లి సోనియాకు, ప్రధాని మన్మోహన్‌కు వదిలేస్తున్నానని ఎంతో ఉదారంగా అన్నాడు. ఇలా రాహుల్ పెదవి విప్పాడో-లేదో, వెంటనే, మంత్రివర్గంలో ఆయన అప్పుడే చేరినట్లు, ఆయనకు ఫలానా పోర్టుఫోలియో కేటాయించనున్నట్లు ప్రచారాలు మొదలయ్యాయి. 1999 లో ఏ విధంగానైతే, పార్టీ అవసరాల దృష్ట్యా సోనియా గాంధీకి మొదలు సభ్యత్వం, ఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారో, అదే తరహాలో, ఆమె వారసుడి ఎంపికకు కూడా రంగం సిద్ధమౌతోంది. వారసత్వ రాజకీయాలు, అందునా నెహ్రూ-గాంధీ వారసత్వ రాజకీయాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.

రాజకీయాలలో వారసత్వంగా ఎదగ గలిగిన వారు అనేకమంది వున్నారు. దానికి కారణాలు అనేకం. ఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కాని, వారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు. ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కాని, భారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయి, ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదు. రాజకీయాల్లో కీలకమైన పదవులను పొంది, ఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనే, రాజకీయ ప్రవేశం చేసి, చకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది. మొదటి తరం నాయకులు, తమ సంతానాన్ని-సోదరీ, సోదరుల సంతానాన్ని, తమ్ముళ్లను, చెల్లెళ్లను, భార్యలను, వీలున్న బంధువులను వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి దింపి, వారసత్వ సంపదలాగా పదవులను దక్కించుకుంటున్నారు.

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. సుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలో, న్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ" కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారు. కాకపోతే, అందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకుని వుండవచ్చు. కుటుంబ నేపధ్యం తప్పక ఉపయోగపడిందనాలి.

భారత రాజకీయ కుటుంబ వారసత్వ పరంపరలో మునిగి తేలుతున్నవారు కోకొల్లలు. మూడేళ్ల క్రితం జరిగిన సారస్వత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన-ఓడిన అభ్యర్థుల జాబితా చూస్తే చాలు, రాజకీయ వారసుల జాబితాలో ఎన్ని పేర్లున్నాయో తెలుసుకోవడానికి. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మురళి దేవరా కుమారుడు మిళింద దేవరా, సునీల్ దత్ కుమార్తె ప్రియా దత్, చగన్ భుజ బల్ అల్లుడు సమీర్ భుజ్ బల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.బి.చవాన్ అల్లుడు-ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బావమరిది భాస్కర రావ్ పాటిల్, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొడుకు ముకుల్ వాస్నిక్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్. ఎన్. బహుగుణ కొడుకు ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ (ఇతడి సోదరి యు.పి.సీ.సీ అధ్యక్షురాలుగా పనిచేసిన రిటా బహుగుణ-మరో కజిన్ బిసి.ఖండూరీ ఒక నాటి ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి), ఆంధ్ర ప్రదేశ్ (దివంగత)ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి వారసులుగా ఎదుగుతున్న మరో తరం ప్రజాస్వామ్య భావితరం నాయకులు. ఆ మాటకొస్తే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు, ఆయన తమ్ముడికి, అల్లుడికి ఎమ్మెల్యే టికెట్లు, భార్యకు ఎంపీ టికెట్ లభించింది. అందరూ గెలవడం విశేషం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉమాశంకర్ దీక్షిత్ కోడలు శీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా దశాబ్దం పైగా పనిచేస్తుంది. ఆమె తనయుడు సందీప్ దీక్షిత్ ను ఆమె అప్పుడే రాజకీయాల్లోకి తేవడం పార్లమెంట్ సభ్యుడుగా చేయడం జరిగిపోయింది. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు దీపీందర్ సింగ్ హుడా ఆయన వారసుడుగా ఎదుగుతున్నాడు. ఆయనిప్పుడు పార్లమెంటు సభ్యుడు. భూపిందర్ కన్నా ముందున్న ముఖ్యమంత్రి దేవీ లాల్ తనయుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సమాజ్ వాది పార్టీ నాయకుడు, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులంతా వారసులుగా ఎదుగుతున్నవారే. కొడుకు అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగా, ఆయన రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన కోడలు ప్రస్తుతం లోక్ సభ సభ్యురాలు.

నెహ్రూ-గాంధి కుటుంబ వారసుడిగా ఐదో తరం నాయకుడు-భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధి, ఆయన తల్లి సోనియా గాంధి కాంగ్రెస్ అభ్యర్థులుగా వారసత్వ పరంపరలో పోటీ చేసి గెలవగా, సంజయ్ గాంధి కొడుకు వరుణ్-భార్య మేనకా గాంధి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచారు. ఒరిస్సా ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనయుడు దిప్ గొగోయ్, మరో మాజీ ముఖ్య మంత్రి బిజూ పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మనీష్ తివారి, వినీత్ సింగ్ బిట్టు, కుమారి షెల్ జా, నాధు రాం మిర్ధా మనుమ రాలు జ్యోతి మిర్ధాలు కూడా వారి-వారి కుటుంబాలకు వారసులే. మోతీలాల్ ఓరా కొడుకుకు, అజిత్ జోగి భార్యకు, రాజస్థాన్ లో జగన్నాధ పహాడియా-సిస్ రామ్ ఓలా-నావల్ కిశోర్ శర్మ-గోవింద్ సింగ్ గుర్జార్ వాళ్ల పిల్లలకు వారసత్వ నాయకులుగా ఎదిగే అవకాశాలు దొరికాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ-గాంధి కుటుంబ అడుగు జాడల్లోనే, ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా నడుచుకోవడం విశేషం. వారసత్వ కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్.సీ.పీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ కూతురు తండ్రికి వారసురాలిగా ఎదగసాగింది. ఆమె ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పెద్దకొడుకు రాఘవేంద్ర, మాజీ ప్రధాని దేవెగౌడ ఇద్దరు కుమారులు (ఒక కొడుకు హెచ్. డి. కుమార గౌడ ఈ ఈపాటికే జె. డి-ఎస్ నాయకుడు మాత్రమే కాకుండా, కర్నాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు), తమిళ నాడు ముఖ్యమంత్రి సంతానం: కొడుకు అజహగరి, కూతురు కణిమొజిహి, కొడుకు స్టాలిన్, మురసోలి మారన్ కొడుకు దయానిధి మారన్, మాజీ లోక సభ స్పీకర్ పీ. . సంగ్మా కూతురు అగాథ చురుగ్గా ఎదిగిన కొందరు కాంగ్రేసేతర వారసులు. వీరంతా చట్ట సభల్లో రంగ ప్రవేశం చేశారీ పాటికే. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా తనయుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా...అందరూ నాయకులే. అంతా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వారే. కేంద్రంలో కీలక పదవులను అనుభవించిన వారే. వారి ప్రత్యర్థి పీ.డీ.పీ నాయకుడు ముఫ్టి మహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా అప్పుడే నాయకురాలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు అల్లుళ్లిద్దరు, ఒక కొడుకు, కూతురు రాజకీయాల్లో కీలకమైన స్థానాల్లో వున్నారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు నాయకుడే. కొడుకు కూడా ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాడు. మహారాష్ట్ర శివసేన నాయకుడు బాల్ థాకరే కొడుకు నాయకుడే. అలానే కరుణాకరన్, నందినీ సత్ పథి, జగ్జీవన్ రాం వారసులూ ఎదిగారు. ఆర్.జే.డీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, జెఎంఎం పార్టీ మహితో, మాజీ గుజరాత్ సీ. ఎం చిమన్ భాయి పటేల్ తమ అర్థాంగులను అందలం ఎక్కించారు.
          
ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా, తమ సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. అందుకే, స్థానిక సంస్థల నుంచి, ప్రధాన మంత్రి స్థాయి వరకు, వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది. ఒక్క సారి అధికారంలోకి రావడంతోనే, తమ సర్వ శక్తులను ఒడ్డి, బయట వారెవరినీ రాకుండా, తమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా? భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ, అవినీతిని ఉత్పత్తిచేసే, వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలు. వీటిని పెంచి పోషించే వ్యక్తులు, తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని, తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం, ధన బలం-కండ బలం-కుల, మత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులు, సమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నా, దానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం, చేసినా, గెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.
          
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వారసత్వ స్వామ్యంగా మార్పుచెందుతుందనడానికి సజీవ సాక్ష్యాలెన్నో--ఎన్నెన్నో వున్నాయి. ఆదిలో ముఖ్యమంత్రి పీఠాన్నెక్కిన బూర్గుల, నీలం, బెజవాడల తర్వాత మిగిలిన వారందరి వారసులు పదవులను పొందిన వారే. బ్రహ్మానందరెడ్డికి చెందిన కాసు కృష్ణారెడ్డి; పీవీ నరసింహా రావుకు చెందిన ఇద్దరు రాజేశ్వర రావులు, రంగారావు, మరో ఒకరిద్దరు కజిన్లు; జలగం వెంగళ్ రావు తమ్ముడు, కొడుకులు; మర్రి చెన్నారెడ్డి కొడుకు శశిధర రెడ్డి; అంజయ్య సతీమణి మణెమ్మ; ఎన్. జనార్ధన రెడ్డి సతీమణి రాజ్య లక్ష్మి; కోట్ల విజయభాస్కర రెడ్డి కొడుకు సూర్య ప్రకాశ్ రెడ్డి-కోడలు సుజాత; డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి కొడుకు, భార్య; నాదెండ్ల భాస్కర రావు కొడుకు మనోహర్; ఎన్ టీ రామారావు కొడుకు, కూతురు, అల్లుళ్లు; చిరంజీవి తమ్ముళ్లు, బావమరిది; తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే సీ ఆర్ అల్లుడు, కొడుకు; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇంకా మిగిలి పోతారు. ఎంపీల, ఎమ్మెల్యేల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, పార్టీల అధ్యక్షుల కుటుంబీకులనేక మంది వారసత్వ వరుసలో వున్నారు.

ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందర, తర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసింది. విమాన ప్రమాదంలో సంజయ్ దుర్మరణం తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆ తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది కాదా? ఏమో! ఇలా...మోతీలాల్...దేవీ లాల్...భజన్ లాల్... కైరాన్... కరుణానిధి.. కరుణాకరన్..చరణ్ సింగ్...అర్జున్ సింగ్..బిజూ పట్నాయక్...దేవెగౌడ..శరద్ పవార్...బాల్ ఠాక్రే.. బహుగుణ.. నందిని సత్పథి...ఎవరైనా ఒకటే ! అందరి కోరికా తమ కుటుంబీకులే, తమ స్థానాల్లో పదవులలంకరించాలని. రాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదే! ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదు. అధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతో, కొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యం" గా మలిచేశారు. ప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసి, హాస్యాస్పదం చేశారు. ప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారు. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతో, ఇంతో భాగం వుంది. వారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్ప, చాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

6 comments:

  1. భళి! భళీ!! భారత ప్రజాస్వామ్యం ఎంత ఎదిగిపోయిందో!!!

    ReplyDelete
  2. Democracy in the west evolved from the thought process of the Greek and Roman civilization.
    We just copied its body without understanding its true spirit. Though some people understand it ,they feel ,they are comfortable with present scenario. AM I WRONG...?
    ..........MURTHY

    ReplyDelete
  3. పవిత్రబంధం అనే 1969 నాటి పాత తెలుగు సినిమాలో నాగేశ్వరరావు వేసిన పాత్ర పాడిన ఒక పాటలో ఆరుద్రగారు పలికించినది "పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకె భోజ్యం" అని.

    రాజు కొడుకు రాజు అనే పధ్ధతికి ఉద్వాసన చెప్పి ప్రజాస్వామ్యం పేరుతో, 'నాయకుడి బంధువు నాయకుడు' అనే కొత్త పధ్ధతికి మారాం అంతే. నటప్రపంచంపు వారసత్వ వికటనటులు మొదలు రాజకీయప్రపంచపు వికటవినాయకులదాకా అంతా ఒకటే ధోరణి. విలువలు అనేవి శూన్యం. తమాషా యేమిటంటె వారికి జైకొట్టే వారిని వారే దండిగా పోగేసుకుని ఊరేగుతూ ఉండగలరు, జనం కాబో లనుకోనూ‌గలరు!

    ReplyDelete
  4. అసలు వాళ్ళు గాంధీ వారసులు ఎలా అయ్యారు?

    ReplyDelete
    Replies
    1. ఇందిరాగాంధీ భర్త పేరు ఫిరోజ్ గాంధీ కదా. అక్కడినుండి వారు గాంధీలు. ఈ గాంధీలకూ మహాత్మాగాంధీగారికీ యేమీ సంబంధం లేదు.

      Delete
    2. ఈ విషయం గురించి ఇంతగా రాయనక్కరలేదు.అందరికీ తెలిసిందే.మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిణతి చెందలేదు.ఇంకా ప్రభుత్వం,సమాజం కూడా సెమి- ఫ్యూడల్ భావజాలం తోనే ఉన్నాయి.అన్ని రంగాలని,వారసత్వం ,కులం,డబ్బు ,శాసిస్తున్నాయి.ప్రజల్లో మార్పు రానిది ప్రభుత్వం లో మాత్రం మార్పు ఎలా వస్తుంది?

      Delete