Sunday, October 14, 2012

వివాదాల నోబెల్ శాంతి పురస్కారం: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

2012 సంవత్సరానికి గాను, యూరప్ ఖండం పటిష్టతకు కృషి చేసిన యూరోపియన్ యూనియన్‍‍ను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేస్తూ నార్వీజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. నోబెల్ చర్రితలోనే తొలిసారిగా.... కొన్ని దేశాల సమూహం శాంతి పురస్కారానికి ఎంపికైంది. సంక్షోభ సమయంలో తిరిగి ఏకమైనందుకు ఆ బహుమతిని యూరోపియన్ యూనియన్ దక్కించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఐరోపా దేశాలు విజయం సాధించాయి. ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, బెల్జియం, లక్సెంబర్గ్ కలిసి 1958లో, ఆర్థిక సమగ్రత అనే ఉమ్మడి లక్ష్యంతో, ఐరోపా ఆర్థిక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మరిన్ని దేశాలు అందులో చేరాయి. 1993లో యూరోపియన్ యూనియన్ ఏర్పాటైంది. ఇప్పుడు అందులో 27 దేశాలున్నాయి. మరెన్నో దేశాలు ఈయూలో చేరేందుకు తహతహలాడుతున్నాయి. ప్రజాస్వామ్యయుత పరిస్థితులు, పద్ధతుల ఆధారంగానే దేశానికైనా ఈయూలో చోటు లభిస్తుంది. బహుమతిని ప్రకటిస్తూ,  "ఒకప్పుడు వరుస యుద్ధాలతో ముక్కలు చెక్కలైన ఐరోపాను శాంతియుత ఖండంగా మార్చిన ఘనత ఐరోపా యూనియన్‌కు దక్కుతుంది'' అని నోబెల్ కమిటీ చైర్మన్ థోర్బ్‌జొయెర్న్ జాగ్లాండ్ ప్రస్తుతించారు.


ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దేశ-దేశాల పౌరులు, ఆయా దేశాల పార్లమెంట్ సభ్యులతో సహా, నోబెల్ శాంతి బహుమానానికి వ్యక్తులను, సంస్థలను, ఫిబ్రవరి మొదటి తేదీలోపల నామినేట్ చెయ్యొచ్చు. నార్వీజియన్ నోబెల్ కమిటీ కూడా కొందరిని నామినేట్ చేయవచ్చు. ఈ ఏడాది 43 సంస్థలతో సహా, 231 నామినేషన్లు వచ్చాయి నోబెల్ కమిటీ ముందర. వచ్చిన వాటితో రూపొందించిన సంక్షిప్త జాబితాలో, అమెరికాకు చెందిన అహింసాయుత ఉద్యమ స్ఫూర్తి దాత జీన్ షార్ప్, మానవ హక్కులకొరకు పోరాటం చేస్తున్న రష్యన్ వేదిక మెమోరియల్-దాని వ్యవస్థాపక సభ్యురాలు స్వెత్‍లానా గాన్నుష్కినా, మాస్కోకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ ఎఖో ఆఫ్ మాస్కో-దాని సంపాదకుడు అలెక్స్ వెనెడిక్టోవ్, నైజీరియాకు చెందిన ఆర్చ్ బిషప్ జాన్ ఒనాయ్ యే కాన్-మొహమ్మద్ సాద్ అబుబాకర్లకు సంయుక్తంగా, మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్ వున్నారు. ఐతే వారెవరినీ బహుమతి దక్కలేదు. బహుమతికి ఎంపికైన యూరోపియన్ యూనియన్‌‍ను నార్వీజియన్ నోబెల్ కమిటీ నామినేట్ చేసింది. 

 యూరోపియన్ యూనియన్‌ ఝండా


నోబెల్ శాంతి బహుమానం ఇంతవరకు 94 సార్లు 125 మంది అభిషిక్తలకు 2012 సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో 98 మంది వ్యక్తులకు, 21 వ్యవస్థలకు-సంస్థలకు ప్రదానం చేసింది నోబెల్ కమిటీ. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థకు 1917, 1944, 1963 సంవత్సరాలలో-మూడు సార్లు, శరణార్థుల కొరకు ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి హైకమీషనర్‌కు 1954, 1981-రెండు సార్లు ఇవ్వడం జరిగింది.


నోబెల్ శాంతి బహుమానాన్ని పొందిన అంతర్జాతీయ ప్రముఖుల్లో (కొందరిందులో తీవ్ర విమర్శలకు గురైనా)-సంస్థల్లో, హెన్రీ డ్యూరెంట్, థియోడోర్ రూజ్వెల్ట్, పాల్ హెన్రీ బెంజమిన్, అంతర్జాతీయ రెడ్ క్రాస్, ఉడ్రో విల్సన్, జేన్ ఆడమ్స్, ఆల్బర్ట్ స్క్వెట్జర్, డగ్ హామర్క్స్ జోల్డ్, లినస్ పాలింగ్, మార్టిన్ లూథర్ కింగ్, యునిసెఫ్, ఐఎల్ఓ, విల్లీ బ్రాండ్ట్, హెన్రీ కిస్సింజర్, అమ్నేస్టీ ఇంటర్నేషనల్, అన్వర్ సాదత్, మదర్ థెరిస్సా, అల్వా మిర్డాల్, లెచ్ వలేసా, మెనాఖెమ్ బెగిన్, డెస్మండ్ టుటు, దలైలామా, మైఖేల్ గోర్బచేవ్, ఔంగ్ సాన్ సూక్యి, నెల్సన్ మండేలా, ఫ్రెడెరిక్ విలియం డి క్లర్క్, యాసర్ అరాఫత్, బారక్ హుస్సేన్ ఒబామా, మొహమ్మద్ యూనస్, జిమ్మీ కార్టర్, కోఫీ అన్నన్ లను ప్రముఖంగా పేర్కొనాలి.


నోబెల్ బహుమానాలను, అందునా, శాంతి బహుమానాన్ని పొందిన వారు ప్రపంచ ప్రముఖ వ్యక్తులుగా-సంస్థలుగా పరిగణలోకి వస్తారు. బహుమానంగా దక్కిన ధనం కంటె, వేయిరెట్ల గౌరవం లభిస్తుంది వారికి. శాంతి స్థాపనకు కృషి చేసిన వారిగా గుర్తింపు రావడం వల్ల, అనర్హులైన వారిని ఎంపిక చేసిన సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తాయి. మొదటిసారి నోబెల్ శాంతి బహుమానానికి సంబంధించిన ప్రస్తావన, ఆల్ఫ్రెడ్ నోబెల్, తన దగ్గర పనిచేసిన మాజీ ఆంతరంగిక కార్యదర్శి "బెర్తా వాన్ సట్నర్" కు 1893 లో రాసిన లేఖలో వుంది. నోబెల్ తాను సంపాదించిన అపారమైన సంపదలో కొంత భాగాన్ని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పర్యాయం, ఐరోపాలో శాంతి స్థాపనకు కృషి చేసిన వారికి ఇవ్వాలని వుందని పేర్కొన్నాడు. జీవితాంతం బ్రహ్మచారిగానే వుండిపోయిన నోబెల్ జీవితంలో ప్రవేశించి ప్రేమ రగిలించిన ఒకే ఒక స్త్రీ బెర్తా వాన్ సట్నర్. తన దగ్గర, తన ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన సట్నర్ ఆంతరంగాన్ని అర్థం చేసుకోలేక పోయిన నోబెల్, ఆమె మనసు దోచుకోవడంలో కృత కృత్యుడు కాలేకపోయాడు. పంతొమ్మిదవ శతాబ్దపు అత్యంత ప్రముఖ శాంతి స్థాపన ప్రచార ఉద్యమ కారిణిగా పశ్చిమ ఐరోపాలో ఆమెకు పేరుండేది. ఆమె స్ఫూర్తే "నోబెల్ శాంతి బహుమానం".


ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు నిర్మాణాత్మకమైన కృషి సలిపిన వ్యక్తులకు-సంస్థలకు, లేదా, సైనిక సంపత్తిని సమకూర్చుకునే దేశాలను ఆ మార్గంనుంచి మళ్ళించి నివారించేందుకు-కనీసం తగ్గించేందుకు దోహదపడే వ్యక్తులకు-సంస్థలకు, శాంతి స్థాపన సమావేశాలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా నిర్వహించే వారికి, ఒక అంతర్జాతీయ స్థాయి బహుమానాన్ని తన సంపాదనతో ఇవ్వ తలచినట్లు ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 లో రాసిన తన వీలునామాలో పేర్కొన్నారు. ఈ సిద్ధాంత ప్రాతిపదికపైనే ఏటేటా నోబెల్ బహుమానాలను ఇస్తున్నారు. నోబెల్ శాంతి బహుమానానికి అర్హులైన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేసేందుకు, వచ్చిన ప్రపంచవ్యాప్త ప్రతిపాదనలను పరిశీలించేందుకు, నార్వీజియన్ పార్లమెంటు ఒక నోబెల్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. నాలుగు గోడల నడుమ, అత్యంత గోప్యంగా పార్లమెంటు నియమించిన కమిటీ జరిపే సమావేశాల వివరాలు ఎవరికీ బహిర్గతం అయ్యే అవకాశాలుండవు. కేవలం, వారి నిర్ణయం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతికి ఎంపికయిన వారి పేర్లను మాత్రమే వెల్లడి చేస్తారు.


ప్రప్రధమ నోబెల్ శాంతి బహుమానాన్ని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించిన మహనీయుడు, స్విట్జర్లాండు దేశస్థుడు హెన్రీ డ్యురాంటుకు, శాంతి నీతిని ప్రబోధించిన ఫ్రెంచ్ దేశస్థుడు ఫ్రెఢరిక్ పాసీలకు, సంయుక్తంగా 1901 వ సంవత్సరంలో ప్రదానం చేసింది నోబెల్ కమిటీ. వాస్తవానికి నోబెల్ మనసులో మాట గ్రహించడానికి కమిటీకి మరో ఐదు సంవత్సరాలు పట్టింది. ప్రధమ బహుమతి గ్రహీత కావాల్సిన బెర్తా వాన్ సట్నర్‍‍ను, 1905 లో ఎంపిక చేసింది కమిటీ. బహుమానాన్ని పొందిన ప్రధమ మహిళ కూడా ఆమే. నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించిన పదమూడు సంవత్సరాల తర్వాత మొదటి సారిగా 1914 లో ఎవరినీ బహుమతికి ఎంపిక చేయలేదు. ఆ తర్వాత కూడా సుమారు 15 పర్యాయాలు ఎవరినీ ఎంపిక చేయలేకపోయారంటే, శాంతి స్థాపనకు కృషి సలిపేవారు తక్కువైపోతున్నారేమో అనుకోవాలి! అగ్ర రాజ్యాలుగా-అణ్వస్త్ర కాముకులుగా పిలువబడే అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్ దేశాలకు సుమారు నలబై సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అలా లభించిన వారిలో హెన్రీ కిస్సింజర్, జిమ్మీ కార్టర్, ఒబామా లాంటి "శాంతి కాముకులు!" కూడా వుండడం విశేషం.


ఉత్తర వియత్నాంకు చెందిన లీడక్ థో, 1974 లో హెన్రీ కిస్సింజర్ తో పాటు సంయుక్తంగా బహుమానానికి ఎంపిక చేసినందుకు నిరసనగా బహుమతిని తిరస్కరించారు. జైలులో ఉన్న లీ జియావో బో కి 2010 సంవత్సరానికి శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్‌ కమిటీ పొరపాటు నిర్ణయం తీసుకున్నదని చైనా దేశ ప్రభుత్వం ఆరోపించినట్లే, నోబెల్ కమిటీ నిర్ణయాలను విమర్శించిన వారు లేకపోలేదు. చైనాలో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడమంటే చైనా న్యాయ వ్యవస్థలపట్ల నోబెల్ కమిటీకి గౌరవం లేదన్న విషయం స్పష్టమవుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అన్నారు. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ, నోబెల్ శాంతి బహుమానాలు, వాటికి ఎంపికైన వ్యక్తులను నిర్ణయించిన విధానం, వివాదాస్పదంగా తయారవుతున్నాయి. పలువురికి, వివిధ కారణాలవల్ల కోప కారణం కూడా అయ్యాయి. బహుమతి తనను ఎంపిక చేయలేదని తీవ్ర అసంతృప్తికి గురైన హిట్లర్, ఆగ్రహంతో, జర్మనీ దేశానికి చెందిన వారెవరినీ 1937 లో బహుమానాలను తీసుకోకుండా ఆంక్షలు విధించాడు.


జర్మనీ దేశానికి చెందిన శాంతి సమరయోధుడు, పాత్రికేయుడు, కార్లవాన్ ఒస్సీ స్టిస్కీని 1935 లో నోబెల్ శాంతి బహుమానానికి ఎంపిక చేశారు. లీ జియావో బో జైలులో వున్న విధంగానే, కార్లవాన్ హిట్లర్ నిర్బంధ శిబిరంలో బందీగా వున్నాడు. ఆయనను బహుమతికి ఎంపిక చేయడం గొప్ప సాహసమైన కార్యంగా భావించారప్పట్లో. బహుమానాన్ని తిరస్కరించాల్సిందిగా నాజీ దుర్మార్గులు ఆయనపై ఎన్ని ఒత్తిడులు తెచ్చినా కార్లవాన్ లొంగలేదు. అయినప్పటికీ బహుమానాన్ని స్వీకరించ లేకపోయాడు. మాట వినని కార్లవాన్ను నాజీ సైనికులు హింసించడంతో 1938 లో బెర్లిన్ జైలులో మరణించాడు. ఇక బహుమానానికి ఎంపికైన అమెరికన్లలో ఉడ్రోవిల్సన్, లీనస్ పాలింగ్ లాంటి వారి విషయంలో ఎవరికీ అభ్యంతరాలుండవు. 1974 లో ఎంపికైన కిస్సింజర్, కుట్రలు-కుతంత్రాలు-పన్నాగాలకు మారు పేరుగా ప్రసిద్ధికెక్కినవాడు. అలానే వివాదగ్రస్తులైన వారిలో అనేక యుద్ధాలను ప్రేరేపించిన థియోడోర్ రూజ్వెల్ట్, యుద్ధ సామాగ్రి తయారుచేసుకోవడానికి ఫాసిస్టు జర్మనీకి కోట్లాది డాలర్లు సహాయం చేసిన ఛార్లెస్ డాస్, యుద్ధోన్మాది జార్జ్ మార్షల్, ఆ క్రమంలోనే జిమ్మీ కార్టర్, ఒబామా లాంటి వారున్నారు. 1978 లో నోబెల్ బహుమానం విలువను పూర్తిగా మంట కలిపారు. లెబనాన్‌లో పాలస్తనీయులను ఊచకోత కోసిన కసాయి, అంతర్జాతీయ టెర్రరిస్ట్, ఇరవయ్యో శతాబ్దపు ప్రముఖ యుద్ధోన్మాది మనాఖెమ్ బెగిన్ కు బహుమానాన్ని ఇచ్చి, నోబెల్ ఆత్మకు క్షోభ మిగిలించింది కమిటీ.


1983 లో నోబెల్ శాంతి బహుమానానికి ఎంపికైన లెచ్ వాలేసాకున్న ఒకే ఒక అర్హత కమ్యూనిస్ట్ వ్యతిరేకత. కమ్యూనిస్ట్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభించడమే, ఆయన ప్రపంచ శాంతికి తోడ్పడడం అనుకోవాలా? 2010 బహుమతి గ్రహీత కూడా కమ్యూనిస్ట్ వ్యతిరేకి ఐనందునే బహుమానం ఇచ్చారా? ఒక్కో సారి నోబెల్ శాంతి బహుమానాన్ని పొందాల్సిన అర్హత వున్నవారు ఎంపిక కాకపోవడం శోచనీయం. 1976 శాంతి బహుమానానికి ఎవరినీ ఎంపిక చేయకపోవడంతో, ప్రజలు నోబెల్ కమిటీకి సరైన రీతిలో గుణపాఠం చెప్పారు. ఇరవై రెండు నార్వే వార్తా పత్రికలు మూడు లక్షల ఇరవై నాలుగు వేల డాలర్లు సేకరించి, "ప్రజల శాంతి బహుమానం" గా, ఉత్తర ఐర్లాండు దేశస్థులు, శాంతి ఉద్యమ నిర్మాతలైన మేరడ్ కారిగన్, బెట్టీ విలియమ్స్ అనే ఇద్దరు బెల్ ఫాస్ట్ మహిళలకు ఇచ్చారు. పశ్చాత్తాప పడ్డ నోబెల్ కమిటీ మరుసటి సంవత్సరం వారిద్దరికీ నోబెల్ శాంతి బహుమానాన్ని ప్రకటించింది.


చైనా దేశంలో ప్రాధమిక మానవ హక్కుల కొరకు దీర్ఘకాలంగా అహింసాయుత పోరాటం జరుపుతున్న ఇరవై ఒకటవ శతాబ్దపు గాంధీ "లీ జియావో బో" కు, 2010 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమానం రావడం, విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. అహింసాయుత పోరాటం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమానం ప్రదానం చేయకపోయినా, ఆయన మార్గంలో నడిచిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, లీ జియావో బో లాంటి కొందరి నైనా నోబెల్ కమిటీ గుర్తించడమంటే, గాంధీకి ఇచ్చినట్లే భావించాలి. చైనా ప్రభుత్వం నిరసనలను పట్టించుకోకుండా, పదకొండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న లియు ను, 2010 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమానానికి ఎంపిక చేసేందుకు, నార్వీజియన్ నోబెల్ కమిటీ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతంగా చెప్పుకోవచ్చు. అయితే, ఏటేటా ఇస్తుండే ఈ బహుమానాలకు ఎంపిక చేయబడిన వ్యక్తులు-సంస్థలు, ఎంపిక చేయబడిన విధానం, విమర్శలకతీతంగా మాత్రం లేవు. అమెరికా ప్రత్యక్ష-పరోక్ష ఒత్తిడికి లోను కావడం ఈ విమర్శల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి.


2011 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని మూడు సమాన భాగాలుగా చేసి, ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్‍కు, లేమా బోవీకు, తవక్కుల్ కర్మాన్‍కు పంచారు. మహిళల హక్కుల కొరకు, వారి భద్రత కొరకు ప్రపంచ వ్యాప్తంగా కృషి చేసినందుకు వారిని ఈ బహుమానం వరించింది. వీరిలో ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్‍ ఆఫ్రికా దేశపు ప్రపధమ ఎన్నికైన మహిళా అధ్యక్షురాలు. 


2008 మే 12న 98 ఏళ్ల వయస్సులో పోలెండ్‌లోని వార్సాలో చనిపోయిన ఇరెనా సెండ్లర్‍ను 2007లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం జరిగింది కాని, ఆ ఏడాది అల్ గోరెకి, బారక్ హుస్సేన్ ఒబామా కి సంయుక్తంగా బహుమతినిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, వార్సాలోని నాజీల గ్యాస్ చాంబర్‌లో మురికి నీటి గొట్టాలను అతికించే నిపుణురాలిగా పనిచేయడానికి ఇరెనా అనుమతి పొందింది. ఈ పని చేయడంలో ఆమెకు మరొక ఉద్దేశం ఉంది. తను మోసుకెళ్లిన పనిముట్ల పెట్టె అడుగు భాగంలో, నాజీల చిత్రహింసల శిబిరాలలో ఉంటున్న యూదు శిశువులను దాచిపెట్టి, ఆ శిబిరాలనుంచి నాజీలకు తెలియకుండా బయటకు తరలించేది ఇరెనా. మరింత పెద్ద వయసు పిల్లలను తరలించడానికి తన ట్రక్ వెనుక ఆమె ఒక గోనె సంచిని పెట్టుకుని వెళ్లేది. నాజీ సైనికులు చిత్రహింసల శిబిరంలోకి ఆమెను అనుమతించి, బయటకు పంపుతున్నప్పుడు ఇరెనా తన వెంట ఒక కుక్కను తీసుకెళ్లి అది ఆ సమయాల్లో మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది. సైనికులు తమ ముందు మొరుగుతూ వెళ్లే ఈ కుక్కను ఏమీ చేసేవారు కారు. కుక్క మొరుగుడు ఇరెనా తరలిస్తున్న శిశువులు చేసే శబ్దాలు బయటకు రాకుండా అడ్డుకునేది. ఇలా ఆమె 2500 మంది యూదు శిశువులను అప్పట్లో గ్యాస్ చాంబర్ల నుంచి బయటకు తరలించగలిగింది. చివరకు ఒక రోజు ఆమె పట్టుబడింది. నాజీలు ఆమె కాళ్లూ చేతులూ విరిచి చితకబాదారు. ఇలా ఆమె తరలించిన శిశువుల పేర్ల చిట్టాను తన ఇంటి పెరడు లోని ఒక చెట్టు కింద గ్లాస్ జాడీలో పెట్టి భద్రపర్చింది ఇరెనా. యుద్ధం ముగిసిన తర్వాత ఈ పిల్లల తల్లిదండ్రులలో ఎవరైనా బతికి ఉంటే వారిని కనుక్కునేందుకు  ఆమె ప్రయత్నించింది. పిల్లలను వారి కుటుంబాలతో కలిపేందుకు కూడా ప్రయత్నించింది. కాని పిల్లల తల్లిదండ్రులలో చాలామంది గ్యాస్ ఛాంబర్‌లకు బలయ్యారు. ఆమె కాపాడిన పిల్లలను క్రైస్తవ శరణాలయాలు స్వీకరించాయి లేదా దత్తత తీసుకున్నాయి. ఇరెనా చేపట్టిన సాహసిక చర్యకు ఇప్పుడు 65 ఏళ్లు. యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 65 ఏళ్లయింది. ఐనా ఇరెనాకు నోబెల్ శాంతి బహుమతి లభించలేదు. 


నోబెల్ శాంతి బహుమానం పొందిన మదర్ థెరిసా, ఆర్కే పచౌరీలతో సహా ఇతర రంగాలలో బహుమానం పొందిన భారతీయులు, భారత దేశ సంతతికి చెందిన వారు ఎక్కువ మంది లేకపోయినా కొందరైనా వున్నారు. సాహిత్యంలో రబీంద్రనాథ్ ఠాగూర్, వీఎస్ నైపాల్, రడ్యార్డ్ కిప్ల్ంగ్; భౌతిక శాస్త్రంలో సీవీ రామన్, సుబ్రమణియం చంద్రశేఖర్; రసాయన శాస్త్రంలో వెంకటరామన్ కృష్ణన్; వైద్య రంగంలో హరగోవింద్ ఖొరానా, రొనాల్డ్ రాస్; అర్థ శాస్త్రం లో అమర్త్య సేన్ లకు ఈ గౌరవం దక్కింది.


నోబెల్ శాంతి బహుమానం రాజకీయాలకు అతీతం కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏనాడో మానవ హక్కుల కొరకు పోరాడి, సామ్రాజ్యవాద-వలస వాద దేశాన్నుంచి శాంతి సమరం ద్వారా భారత దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మహాత్మా గాంధీని, పంచశీల పేరుతో అలీన ఉద్యమం నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా శాంతిని ప్రబోధించిన జవహర్లాల్ నెహ్రూ, ప్రపంచంలోనే మొదటి సోషలిస్టు దేశాన్ని స్థాపించిన లెనిన్ లను నోబెల్ శాంతి బహుమానానికి ఎంపిక చేయకపోవడం దురదృష్టకరం.
 

ఐతే, ఈ నేపధ్యంలో, 1950లో యూనియన్‌గా ఆవిర్భవించింది మొదలు... ఆరు దశాబ్దాలుగా సభ్య దేశాల్లో శాంతి, సామరస్యం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్ల చేస్తున్న యూరోపియన్ యూనియన్  ఈ అపురూపమైన బహుమానాన్ని గెలుచుకోవడం పలు సంస్థలకు, వ్యక్తులకు స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.

No comments:

Post a Comment