Tuesday, March 12, 2013

పోప్ ఎన్నిక ఒక బృహత్తర ప్రహసనం: వనం జ్వాలా నరసింహారావు


పోప్ ఎన్నిక ఒక బృహత్తర ప్రహసనం

వనం జ్వాలా నరసింహారావు

వాటికన్‍లో మహా ఎన్నిక

ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-03-2013)

          పోప్-పదహారవ బెనెడిక్ట్ తన 85 వ ఏట, ఫిబ్రవరి నెల చివరలో పదవికి రాజీనామా చేశారు. 1415 వ సంవత్సరంలో అప్పటి పోప్ పన్నెండవ గ్రెగొరీ రాజీనామా అనంతరం ఇన్నేళ్లకు ఇలా జరగడం ఇదే మొదటి సారి. పోప్ బెనెడిక్ట్ రాజీనామాతో, మరో మారు శతాబ్దాల కాలం నాటి ప్రక్రియైన ఆయన వారసుడి ఎన్నికకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో, కాథలిక్ చర్చికి కొత్త పోప్‌ను ఎన్నుకునేందుకు రంగం ఆరంభమైంది. సోమవారం (11-03-2013) తుది ఎత్తుగడల దశకు చేరుకున్న ఈ ప్రక్రియ, మంగళవారం (12-03-2013) ప్రారంభమైన కార్డినళ్ల రహస్య మహా సమ్మేళనంతో కీలక ఘట్టానికి చేరుకుందిఎన్నిక నేపథ్యంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో ఒకరు ఇటలీలోకి చెందిన మిలన్ ఆర్బిబిషప్ ఏంజెలో స్కోలా కాగా, మరొకరు బ్రెజిల్‌లో గల సావో పాలో బిషప్ ఒడిలో షేరర్.  115 మంది ఓటింగ్ అర్హతగల కార్డినళ్లలో మూడో వంతు మంది మద్దతు పొందిన వారే పోప్ కాగలరు. పోప్ ఎంపికలో పాల్గొంటున్న ఓటర్లు-కార్డినళ్లందరూ ఆదివారం నాడే సామూహిక ప్రార్థనల్లో పాల్గొని, మార్గనిర్దేశం కోసం పరిశుద్ధాత్మను వేడుకున్నారు.

పోప్ ఎన్నిక ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా, కడు రహస్యంగా, ఒక వేడుకగా జరుగుతుంది. ఈ ఎన్నికలో ఓటర్లయిన కార్డినళ్లు, చర్చ్ లోని సీనియర్ మతాధికారులు. వీరందరినీ, పోప్ నియమిస్తారు. వీరిలో కొందరు ఎప్పుడో ఒకప్పుడు పోప్ అయ్యే అవకాశాలుంటాయి. ఎన్నికకు ముందు వీరందరినీ, వాటికన్ సిటీలో సమావేశం కావడానికి ఆహ్వానిస్తారు. వారందరు వచ్చిన తరువాత ఎన్నిక ప్రహసనం-కాంక్లేవ్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 69 దేశాలకు చెందిన 203 మంది కార్డినళ్లున్నారు. కాకపోతే వీరందరికీ ఓటు హక్కు లేదు. 1975 లో సవరించిన నిబంధనల ప్రకారం, 80 సంవత్సరాల వయస్సు దాటిన కార్డినళ్లను ఓటింగ్ నుంచి మినహాయించారు. అలా కుదించిన తరువాత ఆ సంఖ్య ఇంతవరకు 120 కి మించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటింగ్ కాన్‍క్లేవ్‍కు కేవలం 115 మందికి మాత్రమే అర్హత వుంది. అయితే వీరిలో 78  సంవత్సరాల వయసున్న జకార్తాకు చెందిన కార్డినల్ జూలియస్ ధర్మాత్మడ్జ, ఆరోగ్య కారణాల వల్ల ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. అదే విధంగా, బ్రిటన్‌కు చెందిన కార్డినల్ కీత్ ఓబ్రియెన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నందున రాజీనామా చేసినందున ఆయనా ఓటింగులో పాల్గొనడం లేదు.



సాధారణంగా, కార్డినళ్ల కళాశాల డీన్, పోప్ ఎన్నిక కాన్‍క్లేవ్‍ను సమావేశ పరిచే బాధ్యత తీసుకుంటారు. అయితే, ప్రస్తుతం ఆ పదవిని నిర్వహిస్తున్న ఇటాలియన్ కార్డినల్ యాంజిలో సొడానో వయస్సు 85 దాటినందున, ఓటింగ్‌కు అర్హత లేనందున, ఆ బాధ్యతను సీనియర్ కార్డినల్ ఓటరైన గియోవన్ని బట్టిస్టాకు అప్పగించారు. ప్రస్తుతం ఓటర్లుగా వున్న కార్డినళ్లలో ఎక్కువ మందిని మొన్న రాజీనామా చేసిన పోప్ నియమించగా, మిగతా వారిని-49 మందిని ఆయన కంటే ముందు పోప్ గా పనిచేసిన జాన్ పాల్-II నియమించారు. కార్డినళ్లలో 60 మంది యూరోపియన్లు, 21 మంది ఇటాలియన్లు, 19 మంది లాటిన్ అమెరికన్లు, 14 మంది ఉత్తర అమెరికా వారు, 11 మంది ఆఫ్రికన్లు, 10 మంది ఆసియా ఖండం వారున్నారు. ఒకరు ఓషియానియాకు చెందిన వారు. పోప్ రాజీనామా తరువాత ఆయన వారసుడు-నూతన పోప్‌ను ఎన్నుకునేంతవరకు, చర్చ్ పాలనా వ్యవహారాలను కార్డినల్ టార్‍సిస్కో బెర్టోన్ నాయకత్వాన కార్డినళ్ల కళాశాల నిర్వహిస్తుంది. ఆయనే యావత్ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించాలి. వాటికన్ సిస్టయిన్ చాపెల్ లో ప్రతి రోజూ జరిగే నాలుగు దఫాల రహస్య ఎన్నికల బ్యాలెట్ నిర్వహణ బాధ్యత కూడా అయనదే. ఎన్నిక కాన్‍క్లేవ్ జరిగినంత కాలం, కార్డినళ్లందరూ, విధిగా, వాటికన్‌లోనే వుండి తీరాలి, బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలుండ కూడదు. వుండే అవకాశం కూడా లేదు. కాన్‍క్లేవ్ జరిగినప్పుడు, రిటైరైన కార్డినళ్లతో సహా, అందరూ, కట్టు దిట్టమైన ఏర్పాట్ల మధ్య అత్యంత రహస్యంగా, కాబోయే పోప్ ఎవరనే విషయంలో చర్చించుకుంటారు. కార్డినళ్లలో ఎవరో ఒకరిని మాత్రమే పోప్ గా ఎన్నుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. కాకపోతే, అనాదిగా-సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచారం మేరకు, ఇంతవరకు, ఎవరో ఒక కార్డినల్‍నే పోప్ గా ఎన్నుకుంటూ వస్తున్నారు. ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో ప్రతి కార్డినల్ కూడా తమ అంతరాత్మ ప్రబోధం మేరకే, భగవదాజ్ఞగా నడుచుకుంటారు. రాజకీయం లేదంటానికి వీలైతే లేదు. అంతో ఇంతో రాజకీయం వుండడానికి అవకాశాలు లేకపోలేదు. పోప్ కాదల్చుకున్న వారు ఓటరులపై ప్రభావం చూపే ఆస్కారం కూడా లేక పోలేదు.



పోప్ ఎన్నిక అత్యంత రహస్యంగా-ఒక ప్రత్యేకత సంతరించుకున్న విధానంలో జరుగుతుంది. వాటికన్ సిటీలో, ఎన్నిక జరగాల్సిన ఒక గదిలో వుంచి తాళం వేసి, దాదాపు నిర్బంధానికి గురిచేసిన తరహాలో, కార్డినళ్లందరినీ సమావేశపర్చి, మరీ ఎన్నిక జరుపుతారు. వారందరూ విధిగా ఒక అవగాహనకు వచ్చి, మూడింట రెండొంతుల మెజారిటీతో పోప్‌ను ఎన్నుకునేంతవరకు వారు ఆ గదిలో వుండాల్సిందే. ఎన్నిక పూర్తి కావడానికి ఎన్ని రోజులైనా పట్టవచ్చు. గత శతాబ్దాలలో కొన్ని సార్లు వారాల-నెలల తరబడి ఎన్నిక ప్రక్రియ జరిగిన సందర్భాలు కూడా వున్నాయి. కొన్ని సార్లు కొందరు కార్డినళ్లు కాన్‍క్లేవ్ పూర్తయ్యేలోపుగా మరణించిన ఉదాహరణలు కూడా వున్నాయి. ఓటింగ్ ప్రక్రియలో జరిగిన ఏ అంశం కూడా, ఎట్టి పరిస్థితులలో కూడా బయటకు పొక్కకుండా వుండే రీతిలో పటిష్టమైన ఏర్పాట్లుంటాయి. ఓటింగ్ సమయంలో కాని, ఓటింగ్ పూర్తైన తరువాత కూడా కాని, అక్కడ చోటు చేసుకున్న విషయాలు రహస్యంగా వుండి తీరాల్సిందే! ఎవరైనా ఆ రహస్యాలను బయటకు చెప్పే ధైర్యం చేస్తే, వారికి మత బహిష్కారం తప్పదనే భయం కార్డినళ్లందరికీ వుంటుంది. పోప్ జాన్ పాల్-II ఆయన హయాంలో ఎన్నిక నిబంధనలో కొన్ని మార్పులు చేసి, సాధారణ మెజారిటీ ద్వారా పోప్ ఎన్నిక కావడానికి శ్రీకారం చుట్టారు. అయితే, బెనెడిక్ట్-XVI ఆ నిబంధనను మళ్లీ మార్చి, మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పని సరి చేశారు. ఓటింగ్ ప్రారంభానికి పూర్వ రంగంలో, ఆ ప్రాంగణాన్ని సమూలంగా తనిఖీ చేస్తారు. రహస్య మైక్రోఫోన్లు కాని, కెమెరాలు కాని లేవని మరీ-మరీ నిర్ధారించుకుంటారు. ఒక్క సారి కాన్‍క్లేవ్ ప్రారంభమవుతే, ఇక, అప్పటినుంచి, పోప్ ఎన్నిక అయ్యేంతవరకూ, కార్డినళ్లందరికీ భోజనం, బస, నిద్ర అన్నీ అక్కడే. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం వుండదు. ఆరోగ్య-వైద్య పరమైన అత్యవసర పరిస్థితి కలిగితే తక్షణ సహాయం అందించే వీలుంది. రేడియో కాని, టెలివిజన్ కాని, మొబైల్ ఫోన్ కాని, కనీసం వార్తా పత్రికలు కాని అందుబాటులో వుండవు. ఇద్దరు వైద్యులకు, ఒకరిద్దరు మతాచార్యులకు మాత్రం ప్రవేశముంటుంది. వాళ్లు కూడా రహస్యం పాటిస్తామని ప్రమాణం చేయాలి.

వాటికన్‌లోని సిస్టయిన్ చాపెల్ ఆవరణలో పోప్ ఎన్నిక జరుగుతుంది. ఆ ఆవరణ మొత్తం దైవత్వంతో నిండి వుంటుందని కార్డినళ్ల భావన. తాము చేయబోయే ప్రతి పని ఏనాడో-ఒకనాడు అక్కడున్న భగవంతుడు గమనిస్తూనే వుంటాడని వారందరి నమ్మకం. కాన్‍క్లేవ్ ప్రారంభమయ్యే రోజున, కార్డినళ్లందరూ సామూహిక ప్రార్థనల్లో పాల్గొని, మార్గనిర్దేశం కోసం పరిశుద్ధాత్మను వేడుకుంటారు. ఆ తరువాత వారందరు ఓటింగ్ హాలులోకి ప్రవేశించి, రహస్యాలు కాపాడుతానని ప్రమాణం చేస్తారు. గది తలుపులు మూసి వేసే ముందు, కార్డినళ్లు-ఓటర్లు కానివారందరు, హాలు నుంచి నిష్క్రమించాల్సిందిగా లాటిన్ భాషలో ఒక కమాండు కనిపిస్తుంది. ఓటింగ్ ప్రక్రియ మొదలవడానికి పూర్వం, బ్యాలెట్ పత్రాలను, వాటి కొరకు ఎంపిక చేయబడిన ఇద్దరు మాస్టర్లు, కార్డినళ్లకు పంపిణీ చేస్తారు. ఓటింగులో పాల్గొనే కార్డినళ్లలో ముగ్గురిని పర్యవేక్షకులుగా, ముగ్గురిని వారి పనిని మరో విడత పరిశీలించేందుకు గాను నియమించడం జరుగుతుంది. మొదటి రోజున ఒకే ఒక్క బ్యాలెట్ నిర్వహించినప్పటికీ, మర్నాటి నుంచి ఉదయం రెండు పర్యాయాలు, మధ్యాహ్నం రెండు సార్లు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. బ్యాలెట్ పత్రం దీర్ఘ చతురస్రాకారంలో వుంటుంది. పేపర్ పై భాగంలో నేను....ఫలానా వ్యక్తిని...పోప్ గా ఎన్నుకుంటున్నాను అని రాసి వుంటుంది. దాని కింద ఆ వ్యక్తి పేరు రాయడానికి జాగా వుంటుంది. రాయడానికి వీలుగా, పేపర్ మడవడానికి అనువుగా జాగ్రత్త తీసుకుంటారు. ఎవరు ఫలానా వ్యక్తి పేరు రాసింది అని కనుక్కోవడానికి వీలు లేని పద్ధతి అనుసరిస్తారు. అందరు తమ బ్యాలెట్లను ఇచ్చిన తరువాత వాటన్నిటినీ కలిపి, కలగాపులగం చేసి, లెక్కించుతారు. ఆ తరువాత వాటిని తెరుస్తారు. బ్యాలెట్ పత్రాలన్నిటినీ ఒక చోటు చేర్చి, ఒక రకమైన పదార్ధాన్ని కలిపి, వాటిని తగులపెట్టారు. నల్లటి ఆకారంలో బయట వున్న వ్యక్తులకు కనిపించే విధంగా పొగ వచ్చే ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే, ఒక వ్యక్తికి మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందో, అప్పుడు ఆ పొగ తెల్లగా బయటివారికి కనిపించే ఏర్పాటు చేస్తారు. పోప్ ఎన్నికైనట్లు అదే గుర్తు. పోప్ ఎన్నికయ్యేంతవరకూ, పొగ నల్లగాను, ఎన్నికైన తరువాత తెల్లగాను కనిపించడం ఎన్నిక ప్రక్రియలో ఒక భాగం.

మూడు రోజుల తరువాత ఓటింగులో ఎవరికీ మెజారిటీ రాకపోతే, తాత్కాలికంగా ఓటింగ్ ప్రక్రియను ఒక రోజంతా నిలుపుదల చేస్తారు. ఆ రోజున ఒక సీనియర్ కార్డినల్ నేతృత్వంలో, ఏం చేస్తే బాగుంటుందన్న విషయంలో కొంత చర్చ జరుగుతుంది. ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్నికంతా పూర్తయిన తరువాత, ప్రతిరోజు-ప్రతి సెషన్‌లో జరిగిన ఓటింగ్ వివరాలను, ఫలితాలను, క్రోడీకరించి, ఒక డాక్యుమెంటు రూపంలో కొత్తగా ఎన్నికైన పోప్ కు అంద చేస్తారు. ఆ డాక్యుమెంటును అతి భద్రంగా ఒక పదిలపర్చి, సీల్ వేసి వుంచుతారు. పోప్ ఉత్తర్వుల మేరకు మాత్రమే దాన్ని తెరిచే వీలుంటుంది. ఓటింగ్ హాలులో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి, బయటివారికి వున్న ఏకైక మార్గం రోజూ రెండు పూటల వెలువడే "పొగ" మాత్రమే! తెల్ల పొగ కనిపించిందంటే పోప్ ఎన్నిక జరిగిందనుకోవాలి. మెజారిటీ సాధించి పోప్ గా ఎన్నికైన వ్యక్తిని అతని అంగీకారం తెలపమని అడుగుతారందరూ. ఏ పేరుతో పోప్ గా పిలువబడాలనుకుంటున్నాడో అని కూడా అడుగుతారు. అభినందనలతో పాటు కార్డినళ్లందరూ పోప్‌కు తమ విధేయతను కూడా తెలుపుకుంటారు. కొత్త పోప్‌కు సరిపడే కొత్త దుస్తుల ఏర్పాటు కూడా వెంటనే జరిగిపోతుంది. వివిధ సైజుల్లో ఆ పాటికే సిద్ధంగా వుంచిన దుస్తులను ఆయనకు అందచేస్తారు. సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీ నుంచి, "మనకు కొత్త పోప్ వచ్చారు" అన్న ప్రకటన వెలువడుతుంది. ఆయన పేరు వెల్లడవుతుంది. కొత్తగా ఎన్నికైన పోప్ బయట వేచి వున్న వారందరికీ దర్శనమిస్తారు. ఇక నాటి నుంచీ ఆయనే పోప్!
POST SCRIPT: March 14, 2013:

కొత్త పోప్.. ఫ్రాన్సిస్-1: కేథలిక్కుల అథిపతిగా అర్జెంటీనా బిషప్: తొలిసారి లాటిన్ అమెరికాకు అవకాశం
120 కోట్ల కేథలిక్కులకు కొత్త అధిపతి ఎన్నికయ్యారు. ఆయన... అర్జెంటీనాకు చెందిన జార్జ్ మారియో బెర్గోగ్లియో! బ్యూనస్ ఎయిర్స్ ఆర్చిబిషప్‌గా ఉన్న జార్జ్ ను, 115 మంది కార్డినల్స్ కొత్త పోప్‌గా ఎన్నుకొన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కొత్తపోప్ ఎంపికకు సూచికగా వాటికన్‌లోని సిస్టీన్ చాపెల్ ప్రాసాదం చిమ్నీ నుంచి బుధవారం అర్ధరాత్రి సమయంలో తెల్లటి పొగ సుడులు తిరుగుతూ వెలువడింది. వాటికన్‌లో కొత్త పోప్‌కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న వేలాదిమంది కేథలిక్కులు కేరింతలు కొట్టారు. కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ మొదలైన రెండోరోజే 'తెల్ల పొగ రూపం'లో ఉత్కంఠ వీడింది. ఒక... కొత్త పోప్ ఎవరంటూ ప్రపంచమంతా వాటికన్‌లోని బాల్కనీ వైపు ఆసక్తిగా చూడ సాగింది. సుమారు గంట తర్వాత... ఆ ఉత్కంఠ కూడా వీడింది. అర్జెంటీనాకు చెందిన జార్జ్ బెర్గోగ్లియో 266 పోప్‌గా ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. పోప్‌గా ఆయన తన పేరును 'ఫ్రాన్సిస్-1' అని మార్చుకున్నారు. బాల్కనీలోకి వచ్చి భక్తులకు అభివాదం తెలిపారు. పోప్‌గా తన తొలి సందేశం వినిపించారు. జెస్యూట్ మత వర్గానికి చెందిన తొలిపోప్ ఆయన. అంతేకాదు... లాటిన్ అమెరికా నుంచి ఎంపికైన తొలి పోప్ కూడా ఆయనే. ఆధునిక చరిత్రలో ఐరోపాయేతర దేశాల నుంచి ఎన్నికైన తొలిపోప్ కూడా ఆయనే. 
పోప్ ఫ్రాన్సిస్-1 వయసు 76 సంవత్సరాలు. ఆయన 1936 డిసెంబర్ 17న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారు. చిన్న వయసులోనే ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఒక ఊపిరితిత్తి తీసేయాల్సి వచ్చింది. ఆయన 1998 నుంచి బ్యూనస్ ఎయిర్స్ ఆర్చిబిషప్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనను 2001లో పోప్ జాన్‌పాల్-2 కార్డినల్‌గా నియమించారు. ఫ్రాన్సిస్-1 ఫిలాసఫీ, సాహిత్యం, సైకాలజీ చదివారు. ఆయన పేదల పక్షపాతి. అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా వాదిస్తారు. అర్జెంటీనాలో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోవడంలేదంటూ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించారు. తమ దేశానికి చెందిన వారే పోప్‌గా ఎన్నిక కావాలంటూ అనేక దేశాల నుంచి వేలసంఖ్యలో భక్తులు తరలిరాగా... 'మీరు మాత్రం రావద్దు. మీ విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చును చర్చికి విరాళంగా ఇవ్వండి. ఆ నిధులను పేదల బాగుకోసం ఖర్చు చేయవచ్చు' అని అర్జెంటీనా వాసులకు ఆయన ముందుగానే పిలుపునిచ్చారు.
పోప్ ఫ్రాన్సిస్-1 అర్జెంటీనాకు చెందినప్పటికీ... ఆయన మూలాలు మాత్రం ఇటలీలో ఉన్నాయి. ఆయన తండ్రి ఇటలీలో రైల్వే ఉద్యోగి. నిరాడంబర జీవితానికి ఆయన పెట్టింది పేరు. బస్సులోనే ప్రయాణిస్తారు. స్వలింగ సంపర్కులను వ్యక్తులుగా గౌరవించినా... స్వలింగ సంపర్క వివాహాలకు మాత్రం వ్యతిరేకి. కుటుంబ వ్యవస్థను గౌరవించాలని సూచిస్తారు. పిల్లలను పెంచడం, చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అని బోధిస్తారు. 2005లోనూ ఆయన పేరు పోప్ పదవికి ప్రముఖంగా వినిపించింది.

No comments:

Post a Comment