Tuesday, December 3, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు - అయోధ్యా కాండ -1: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -1
వనం జ్వాలా నరసింహారావు

          దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకొని అందరినీ సంప్రదించి వారి సమ్మతిని పోందాడు. తనకు కలిగిన అభిప్రాయాన్ని రాముడికి తెలియచేస్తూ, అతడికి పుట్టుకతోనే వినయం-సుగుణాలు వచ్చాయని, అతనికి సమానులైన వారు మనుష్యులలో ఎవరూ లేరని అంటూ దశరథుడన్న మరికొన్ని విషయాలను చెప్పేందుకు "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకుంటారు వాసు దాసుగారు. ఆ పద్యమిలా సాగింది:


మత్తకోకిలము:     నీ వెరుంగని యట్టినీత్యవి నీతు  లున్న వె  యెందునే ?
                        నేవి  క్రొత్తగ నీకు  నేర్పఁ గ నేను  నేర్తుఁ గుమారకా !
                        భావితాదృతిఁ జేసి  పుత్రక వత్సలత్వము పేర్మి  నే
                        నేవియో  యొకకొన్నిటిన్ వచి యించెద న్విను  నందనా ! -18

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     కుమారా ! నీకు తెలియని నీతులు-అవినీతులు లేవు. నేను నీకు కొత్తగా ఏం నేర్పగలను? అయినా నీవు నా కొడుకువు కనుక, పుత్రవాత్సల్యం వల్ల కలిగిన ఆదరణతో, తండ్రులు కొడుకులకు హితోపదేశం చేయడం ధర్మం కనుక ఏవో కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. నువ్వు నా కొడుకువు కావడంవల్ల నన్ను సంతోషపర్చడం నీకు తగిన కార్యం. తండ్రి బతికున్నంతవరకు ఆయన చెప్పినట్లు నడుచుకొనేవాడినే పుత్రుడంటారు. కాబట్టి నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే సంతోషిస్తాను. అలా అయితే నన్ను ఏమి చేయమందువా?

No comments:

Post a Comment