Friday, December 6, 2013

భారత రత్న నెల్సన్ మండేలా:వనం జ్వాలా నరసింహారావు

నెల్సన్ మండేలా గురువారం, డిసెంబర్ 5, 2013 న మరణించారు

 భారత రత్న నెల్సన్ మండేలా

వనం జ్వాలా నరసింహారావు

నెల్సన్ మండేలా తన 95 వ ఏట మరణించారు. జోహన్స్ బర్గ్ లోని ఆయన స్వగృహంలో, మధ్య-మద్య ఆరోగ్యం కుదుటబడి, కోలుకుంటున్నప్పటికీ, చివరకు మృత్యువాత పడ్డారు. ఎప్పటికప్పుడు, ఆయన ఆరోగ్య పరిస్థితిని దక్షిణాఫ్రికా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం, ఆందోళనతో గమనిస్తూ వచ్చింది. జాత్యహంకార శ్వేత జాతి పాలకుల గుండెల్లో నిద్రపోయి, నల్లజాతివారిపాలిట మహాత్ముడయ్యాడు నెల్సన్ మండేలా. మరణించే చివరి రోజుల వరకు కూడా, పండు ముదుసలి వయసులో సహితం, ఆయన కర్ర సహాయంతో నడుచుకుంటూ, అనునిత్యం తాను అధ్యయనం చేసే గదిలోకి వెళుతుండేవాడు. అతికష్టం మీద మండేలా ఒక కుర్చీలో కూర్చుని, వెనుకకు వాలి, ఒక్కో కాలుని ఇబ్బందికరంగా పైకి లేపి, ఎదురుగా వుంచిన చిన్న బల్లపై పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిపోతే, ఆయన భార్య గ్రీసా ఆ సమయంలో ఆయన పాదాలను సవరించేదట. ఆయన కుర్చీ పక్కనే, మండేలాను ఇరవయ్యేడు సంవత్సరాల పాటు జైలులో నిర్బంధానికి గురిచేసిన జాత్యహంకారుల ఆంగ్ల, ఆఫ్రికన్ భాషల వార్తాపత్రికలు, మాగజైన్లు ఒక బల్లపై పడివుండేవి. ఆయనకు అతి సమీపంలో, ఆయన పక్కనే, ఆయనకు వినిపించేంత దగ్గరలో, కబుర్లు చెప్పుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూచుండేవారు. మండేలా జ్ఞాపక శక్తి క్రమేపీ తగ్గిపోయినా, పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూనే కాలం గడిపేవాడు. చనిపోయేంతవరకు కూడా ఆయనలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపించేదని వార్తా పత్రిక కథనాలు.

జులై 18, 1918 న జన్మించిన మండేలా, దక్షిణాఫ్రికా మొట్టమొదటి ఎన్నికైన అధ్యక్షుడిగా, 1994-1999 మధ్య కాలంలో పనిచేశారు. అధ్యక్ష పీఠం అధిష్టించడానికి పూర్వం, దీర్ఘకాలం, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన ధీరుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి నాయకుడు. 1962 లో అరెస్టు కాబడి, శిక్షకు గురై, జీవిత ఖైదీగా 27 సంవత్సరాల పాటు జైలులో గడిపారు. ఫిబ్రవరి 11, 1990 న విడుదలై, ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపి, 1994 లో "బహుళ జాతి ప్రజాస్వామ్యం" స్థాపనకు కారకుడైనాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారు. 1993 నోబెల్ శాంతి బహుమానం, అదే ఏడాది టైమ్స్ మాగజైన్ "మాన్ ఆఫ్ ద యియర్" గౌరవం, 1980 లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ బహుమతి, 1988 లో "లెనిన్ శాంతి బహుమతి", 1990 లో "భారతరత్న" ఆవార్డు అందుకున్నారు మండేలా. భారతదేశ పౌరుడు కాకపోయినా ఆయనకు "భారతరత్న" పురస్కారం ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. 1973 లో లీడ్స్ విశ్వవిద్యాలయంలో శాస్త్రజ్ఞులు కనుగొన్న ఒక అణు రేణువుకు "మండేలా పార్టికిల్" అని పేరు పెట్టారు. న్యూఢిల్లీలోని ఒక రోడ్డును నెల్సన్ మండేలా మార్గం అని పిలుస్తారు.


తింబు రాజ వంశానికి చెందిన మండేలా పితామహుడు కూడా ఒక రాజుగా ప్రసిద్ధిగాంచిన వాడే. తన తండ్రి పదమూడు మంది సంతానంలో పాఠశాలకు వెళ్లిన మొదటి వాడు మండేలానే. పాఠశాలలోనే ఆయన టీచర్ మండేలా పేరు ముందర "నెల్సన్" చేర్చింది. 1937 లో కళాశాలలో చేరిన మండేలా, ఫోర్ట్ హారే యూనివర్సిటీలో ఇంకా మొదటి సంవత్సరం చదువుతుండగానే, విశ్వవిద్యాలయం విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం చేపట్టిన ఉద్యమంలో పాలు పంచుకోవడంతో, బహిష్కృతుడై, దూర విద్య ద్వారా డిగ్రీ చదువు పూర్తి చేశాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులతో, స్నేహం ఏర్పడింది. అలనాటి ఆయన స్నేహితులు దరిమిలా యావజ్జీవిత స్నేహితులుగా మిగిలిపోయారు.

1948 లో దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన ఎన్నికలలో, వర్ణ-జాతి వివక్షతను సమర్థిస్తున్న జాత్యహంకార ఆఫ్రికన్ల జాతీయ పార్టీ గెలుపొందడంతో, మండేలా రాజకీయాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టాడు. అదే రోజుల్లో మహాత్మా గాంధీ ప్రభావం మండేలా మీద బాగా పడింది. 150 మంది సహచరులతో సహా డిసెంబర్ 5, 1956 న మండేలాను అరెస్ట్ చేసి కొద్దికాలం తరువాత విడుదల చేసింది ప్రభుత్వం. 1961 లో, "ఎంకే" అన్న పేరుతో పిలువబడిన, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి మండేలా నాయకు డయ్యారు. ప్రభుత్వ సైనికులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. విద్రోహ-విధ్వంసక చర్యలకు కూడా సమన్వయకర్తగా వ్యవహరించారాయన. అవి కూడా ఫలితాన్నివ్వకపోతే, వర్ణ-జాతి వివక్షతను ఆపు చేయలేకపోతే, గొరిల్లా తరహా పోరాటానికి కూడా సిద్ధమవ్వాలని ఒకానొక సందర్భంలో పిలుపిచ్చారు మండేలా. ఏళ్ల తరబడి జాత్యహంకార శ్వేత జాతీయుల వర్ణ-జాతి వివక్షతకు అడ్డూ-అదుపూలేకపోవడంతో, అహింసా మార్గం వదిలి, హింసాయుత మార్గంలో పోతే మంచిదన్న ఆలోచన కూడా చేశారాయన. "ఎంకే" ఆధ్వర్యంలో వర్ణ-జాతి వివక్షత చూపుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మొదలెట్టిన గొరిల్లా పోరాటంలో, సాధారణ పౌరుల ప్రాణాలు కూడా పోవడంతో, మండేలా స్పందించారు. తన నాయకత్వంలోని కొందరిని ఆయన తీవ్రంగా విమర్శించడమే కాకుండా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంగీకరించారు. ఇదిలా కొనసాగుతుండగానే, ఆగస్ట్ 5, 1962 న మండేలాను అరెస్ట్ చేసిఅక్టోబర్ 25, 1962 న తొలుత ఐదేళ్ల పాటు శిక్ష విధించింది ప్రభుత్వం. జూన్ 12, 1964 న ఇతర సహచరులతో సహా మండేలాకు యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం.

ఆయన 27 సంవత్సరాల జైలు జీవితంలో మొదటి 18 ఏళ్లు "రాబిన్ ఐలాండ్" జైలులో వుంచింది ప్రభుత్వం. దక్షిణాఫ్రికా శ్వేత జాతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల హక్కులకొరకు పోరాడుతున్న యోధుడిగా, జైలులో వున్న రోజుల్లో, మండేలాకు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడం మొదలైంది. జైలులో వుండగా, ఒక సున్నపు క్వారీలో, కఠినతరమైన కూలీ పని చేయించారు మండేలాతో. జైలు జీవితం చాలా దుర్భరంగా వుండేది. నల్ల జాతి ఖైదీలని, శ్వేత జాతీయులని విడి-విడిగా వారిని చూసేవారు జైలు సిబ్బంది. ఆహార విషయంలోనూ వివక్షత పాటించేవారు. రాజకీయ ఖైదీలకు ప్రత్యేకించి ఏ హక్కులూ వుండకపోయేది. మండేలాను చూడడానికి ఆరు నెలలకు ఒకసారి ఒక విజిటర్‌ను, చదవడానికి ఆర్నెల్లకి ఒక్క సారి ఒక్క ఉత్తరాన్ని అనుమతించేవారు! వచ్చిన ఆ ఒక్క ఉత్తరమైనా, ఎన్నాళ్లకో కాని మండేలాకు చేర్చేవారు కాదు. అది కూడా పూర్తిగా చినిగి, చదవడానికి పనికిరాని విధంగా చేసేవారు జైలు అధికారులు. ఇంత నిర్బంధంలో కూడా, జైలులో దూర విద్య ద్వారా చదువుకుని, లండన్ విశ్వ విద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు మండేలా. మార్చ్ 1982 లో, సహచర ఖైదీలతో సహా, మండేలాను, రాబిన్ ఐలాండ్ జైలు నుండి, పోల్స్ మూర్ జైలుకు మార్చింది ప్రభుత్వం.


"రాజకీయ ఆయుధంగా హింసాయుత మార్గాన్ని వ్యతిరేకించడానికి" నెల్సన్ మండేలా అంగీకరిస్తే, ఆయనను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు బోథా ఫిబ్రవరి 1985 లో సంసిద్ధత వ్యక్తం  చేసారు. ఆయన సూచనను మండేలా నిర్ధంద్వంగా తిరస్కరించారు. "ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద నిషేధం వున్నంతకాలం నాకు స్వేచ్ఛ ఇస్తాననడంలో అర్థం లేదు. స్వతంత్ర వాయువులు పీలుస్తున్న వారే చర్చలకు అర్హులు కాని, నా లాంటి జైలులో వున్నవారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలు కాదు" అని తన కూతురు ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపారు మండేలా. చివరకు నవంబర్ 1985 లో బోథా నేషనల్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధికి, మండేలాకు మధ్య మొదటి విడత సమావేశం చోటుచేసుకుంది. ఆ రోజుల్లో సమావేశం జరిగిన వోల్క్స్ ఆసుపత్రిలోనే మండేలా ప్రొస్టేట్ సర్జరీ చేయించుకున్నారు. అలాంటి సమావేశాలు మరి కొన్నిమరో నాలుగేళ్లు జరిగినప్పటికీ, ఫలితం అంతగా కనపడలేదు. కాకపోతే, భవిష్యత్ చర్చలకు అవి పునాదులేశాయి.1988 లో మండేలాను "విక్టర్ వెర్స్ టర్" జైలుకు తరలించి, విడుదల చేసేంతవరకు అక్కడే వుంచారు.

"నెల్సన్ మండేలాను విడుదల చేయాలి" అన్న నినాదంతో, ఆయన జైలులో వున్నంత కాలం, జాతీయ-అంతర్జాతీయ స్థాయి ఒత్తిడులు దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై వచ్చాయి పలుమార్లు. రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయ విభాగం ప్రతినిధులు ఎన్నో మార్లు మండేలాను జైలులో కలుసుకున్నారు. 1989 లో బోథా స్థానంలో ఫ్రెడెరిక్ విలియం క్లర్క్ దేశాధ్యక్షుడయ్యారు. ఏడాది తిరక్కుండానే, మండేలా విడుదల నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద, ఇతర వర్ణ-జాతి వివక్షత వ్యతిరేక సంస్థల మీద అంతవరకున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తరువాత ఫిబ్రవరి 1990 లో మండేలాను విడుదల చేసింది ప్రభుత్వం. ఆయన విడుదల కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. విడుదలైన రోజున జాతినుద్దేశించి మండేలా ప్రసంగం చేశారు. శ్వేత జాతీయులతో సఖ్యతకు-సహ జీవనానికి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తన నిబద్ధతను వ్యక్త పరుస్తూనే, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక పోరాటం ఆగిపోలేదని ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు మండేలా.

జైలునుంచి విడుదలైన మండేలా తిరిగి 1990-1994 మధ్య కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 27, 1994 న బహుళ జాతీయులందరూ పాల్గొన్న మొదటి ఎన్నికలు జరిగాయి. 62%  ఓట్లను పొందిన ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు మండేలా, మే 10, 1994 , నల్ల జాతి వారికి చెందిన ప్రప్రధమ దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడయ్యారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లు నిదర్శనంగా, క్లర్క్ కూడా మంత్రివర్గంలో చేరారు. "ట్రేడ్ మార్క్ బాటిక్ చొక్కాలను" ధరించుతూ, అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా గౌరవాన్ని ఇనుమడించే విధంగా ఆయన అధ్యక్ష పాలన కొనసాగింది. ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు, విద్యకు ప్రాధాన్యత, భూ సంస్కరణల అమలు, కార్మికులతో సత్సంబంధాలు లాంటివి ఆయన పాలనలో చెప్పుకోదగ్గవి. కల్నల్ గడ్డాఫీ లిబియాకు, అమెరికా-బ్రిటన్ దేశాలకు మధ్య విభేదాలను తొలగించేందుకు మండేలా కృషి చేశారు.

మండేలా మొదటి భార్యతో పదమూడేళ్లు కాపురం చేసి విడాకులిచ్చారు. దానికి ప్రధాన కారణం, మండేలా నిరంతరం ఉద్యమంలో పాల్గొనడమే! ఆ తరువాత రెండు సార్లు మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. తన 80 వ పుట్టిన రోజున 1998 లో ఇప్పుడున్న మూడో భార్య గ్రీసా మాషెల్‍ను వివాహమాడారు మండేలా. ఆమె దివంగత మొజాంబిక్ అధ్యక్షుడు సా మోరా మాషెల్ భార్య. పెళ్లికి ముందు ఎన్నో దఫాలుగా చర్చలు సాగాయి. రెండవ పర్యాయం ఎన్నికలలో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న మండేలా, తన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అప్పటినుంచి, రకరకాల సాంఘిక-మానవ హక్కుల సంస్థలకు సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు మండేలా.   జులై 2001 లో మండేలాకు ప్రోస్టేట్ కాన్సర్ వున్నట్లు నిర్ధారణ ఐంది. చికిత్స కూడా జరిగింది. 2003 లో పొరపాటున ఆయన మరణ వార్తను సిఎన్ఎన్ ప్రసారం చేసింది. తప్పు సరి దిద్దుకుంది. 2007 లోనూ అలాంటి పొరపాటే మరో విధంగా జరిగింది. వాస్తవానికి మండేలా ఆ సమయంలో మొజాంబిక్ లో కులాసాగా గడుపుతున్నారు.

జూన్ 2004 లో, తన  85 వ ఏట, ప్రజా జీవనం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించారు మండేలా. ప్రజలకు తన అవసరం వుందని తాను అనుకున్నప్పుడు తానే ప్రజలకు పిలుపిస్తానని, వారి వద్దకు వస్తానని, తనను వారు పిలువ వద్దని విజ్ఞప్తి చేశారు. అన్నమాట ప్రకారం అలానే వుండి పోయారు. ఆగస్ట్ 22, 2007 న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దక్షిణాఫ్రికా పర్యటనలో, మర్యాదపూర్వకంగా మండేలాను కలిసింది. ఇరువురు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా, 1967 లో, భారత దేశంలో, ఇందిరా గాంధీ సమక్షంలో, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం న్యూ ఢిల్లీలో ప్రారంభోత్సవం చేసిన నాటి చారిత్రాత్మక ఫొటోని మండేలాకు బహుకరించారు సోనియా గాంధీ. వాస్తవానికి, ఇందిరా గాంధీ, తన విద్యార్థి దశ నాటి నుంచీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, వారి పోరాటానికి మద్దతుగా ఎల్లప్పుడూ వుంటుండేవారు. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాయభార హోదా కలిగించింది కూడా. జనవరి 25, 1995 న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఉపన్యాసం ఇవ్వడానికి న్యూ ఢిల్లీకి వచ్చారు మండేలా.

మండేలా మరణంతో పాత తరం అంతర్జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల శకం ముగిసినట్లే అనుకోవాలి!
End


No comments:

Post a Comment