Saturday, July 11, 2015

నమస్కారం మన సంస్కారం (ధర్మప్రవృత్తి)


నమస్కారం మన సంస్కారం

(ధర్మప్రవృత్తి)

సంధ్యావందనమునకు చివర తన పాదములను భూమికి తాకి, నక్షత్రములకు, సూర్యునకు, బ్రాహ్మణులకు నమస్కారము చేయవలయును. తన గోత్రనామములను చెప్పి తండ్రికి, తల్లికి, జ్ఞానప్రదునకు, శ్రోత్రియునకు నమస్కారము చేయవలయును. తనకంటె మూడు సంవత్సరముల వయస్సు అధికముగలవారందరికి నమస్కారము చేయవలయును. తనకంటె చిన్నవారైనను, మేనమామకు, పినతండ్రికి నమస్కారము చేయవలయును. వృద్ధుడైనను కుటిలునకు నమస్కారము చేయగూడదు. తాను అపరిశుద్ధుడైయుండియు నడుచుచు, కుశలనుగాని, సమిధలనుగాని, పుష్పములనుగాని, జలపాత్రనుగాని ధరించియుండియు, ఇతరులకు నమస్కారము చేయగూడదు. రజస్వలకు, పతితునకు, శఠునకు, కృతఘ్నునకున్నూ, నమస్కరించినయడల యుపవాసము చేయవలయును. కుమారుడు, శిష్యుడు, దౌహిత్రుడు, అల్లుడు, ఈ నలుగురుకాక మిగతవారు తనకంటె చిన్నవారైనను నమస్కరించవలయును. వేదమును పదక్రములతో సహా చదివి అరణ్యకముతో సహా బ్రాహ్మణమును (పరాయతమును) చదివినవాడు చిన్నవాడైనను నమస్కరించతగినవాడు. అనగా తాను వేదము చదువనివాడైనపుడు తనకంటె చిన్నవానికైనను వేదము చదివినవానికి నమస్కారము చేయవలయును. ఉభయులు వేదమును చదివినయడల మూడు సంవత్సరములు పెద్దవానికి చిన్నవాడు నమస్కారము చేయవలయును. ఉభయులు శాస్త్రవేత్తలైనప్పుడు ఐదు సంవత్సరములు పెద్దవానికి చిన్నవాడు నమస్కారము చేయవలయును. ఉభయులు చదువురానివారైనపుడు యేక గ్రామస్తులలో పది సంవత్సరములు యెక్కువయున్నయడల చిన్నవాడు నమస్కారము చేయవలయును. తన బంధువులలో చదువురానివారుభయులలోను యెంతమాత్రమైనను వయస్సు అధికముగలవానికి తక్కువవాడు నమస్కారము చేయవలయును అని గ్రంథాంతరమందున్నది. కక్కువానికి, ఆవలించువారికి, దంతధావనమాచరించువానికి, తలంటుకున్నవానికి, స్నానముచేయువానికి, దూరమందున్నవానికి, జలమధ్యనున్నవానికి, నడుచువానికి, ధనాంధునకు, ఉన్మత్తునకు, చెవిటివానికి, మూగవానికి, గ్రుడ్డివానికి, సమిత్సుష్పకుశాదులను ధరించినవానికి, మృత్తికను, అన్నమును, అక్షతలను ధరించినవానికి, జపమును, హోమమును చేయుచున్నవానికి నమస్కారము చేయగూడదు. తాను జలమందున్నపుడును, శ్రాద్ధమందును, మలమూత్రములను, సూతకమందును, దానసమయమందును, రాజసన్నిధియందును, భోజనసమయమందును, దేవతార్చనసమయమందును, జపహోమసంధ్యాకాలములందును, మధూకరమందును, దిగంబరసమయమందును, ఇతరులకు నమస్కారము చేయగూడదు.


1 comment:

  1. ఒంటి చేతి నమస్కారాల సంస్కృతేగా నేడు...

    ReplyDelete