Monday, July 20, 2015

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం కానున్న యాదాద్రి : వనం జ్వాలా నరసింహారావు

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా 
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం కానున్న యాదాద్రి
వనం జ్వాలా నరసింహారావు
{పర్యాటక మకుటంగా యాదాద్రి

నమస్తే తెలంగాణ (27-07-2015)}

          తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒకనాటి యాదగిరిగుట్ట, నేటి యాదాద్రి నారసింహ దేవాలయం, దాని పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చెందిన ప్రణాళికా రచన, అమలు చురుగ్గా-వేగవంతంగా సాగుతోంది. అచిర కాలంలోనే, అక్కడున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, రాష్ట్రవ్యాప్తంగా-దేశవ్యాప్తంగా అనుదినం వచ్చే లక్షలాది భక్తులతో, పర్యాటకులతో భాసిల్లే పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా రూపు దిద్దుకోనుంది. దేవాలయం, పరిసర ప్రాంతాలలో అభివృద్ధి జరుగనున్న వార్తల నేపధ్యంలో, ఇటీవల కాలంలో భక్తుల-యాత్రీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారాంతపు-ఇతర సెలవు దినాలలో, శని-ఆదివారాలలో గత రెండు మూడు నెలలుగా భక్తుల సంఖ్య సుమారు రోజుకు 70, 000 లకు చేరుకుంది. దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. బహుశా ఈ కారణాన నేమో, దేవస్థానం చరిత్రలో మొట్ట మొదటి సారి, ప్రముఖులకు ప్రత్యేక వీఐపీ దర్శనం పద్ధతిని కూడా ప్రవేశ పెట్టారు ఆలయ నిర్వాహకులు. టాటాలు, అంబానీలు, జెన్‌కో, బీహెచె‍ఈఎల్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు సుమారు రు. 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి, దేవాలయ పరిసరాలలో మౌలిక వసతులు కలిగించేందుకు సంసిద్ధత కనబరిచాయి.
            హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిలో, హైదరాబాద్‌కు సుమారు 70 కిలో మీటర్ల దూరంలో వుంది యాదగిరిగుట్ట దేవాలయం. అక్కడికి చేరుకోవడానికి, గుట్ట వరకు బస్ సౌకర్యం, సమీపంలో రైలు సౌకర్యం కూడా వుంది.

          పంచ నారసింహ క్షేత్రంగా పిలువబడే ఇక్కడి అతి పురాతన-పవిత్ర దేవాలయంలో నరసింహ స్వామి ఐదు అవతారాలలో (జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, గండ భేరుండ నరసింహ, లక్ష్మీ నరసింహ) భక్తులకు దర్శనమిస్తాడు. అనునిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి, అనేక రకాల సంప్రదాయ బద్ధమైన పూజలు చేస్తారు. హిందూ మతానికి అనుగుణంగా అనేక రకమైన వేడుకలు కూడా జరుపుకుంటారు. వీటిలో అన్నప్రాశన, పుట్టు వెంట్రుకలు, అక్షరాభ్యాసం, వివాహాలు మొదలైనవి వుంటాయి. భక్తులు తల నీలాలు సమర్పించుకునే ఆనవాయితీ కూడా వుందిక్కడ. ఈ దేవాలయ ఆవిర్భావం గురించి స్కాంద పురాణంలోను, ఇతిహాసాలలోను పేర్కొనబడింది.

ఫాల్గుణ (ఫిబ్రవరి-మార్చ్) మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలు, వైశాఖ (మే నెల) మాసంలో వచ్చే నరసింహ జయంతి లతో సహా ఎన్నో పండుగలను, ఉత్సవాలను, ప్రతి ఏడు యాదాద్రిలో నిర్వహిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో దేవాలయంలో శత ఘటకాభిషేకం జరుపుతారు. ఇలాంటివి జరిగినప్పుడల్లా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి, దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ పుణ్య క్షేత్రంలోనే, ఎన్నో సంవత్సరాల పూర్వం, ప్రాముఖ్యత సంతరించుకున్న పెద్ద ఆగమ శాస్త్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో దక్షిణాది ప్రాంతానికి చెందిన అనేకమంది ఆగమ పండితులు పాల్గొని దేవాలయాలలో పాటించాల్సిన పద్దతులను, అనుసరించాల్సిన విధివిధానాలను చర్చించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో పొందు పరిచారు. ఈ విషయాన్ని స్వయంగా త్రిదండి చిన జీయర్ స్వామి వెల్లడించారు.

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా యాదగిరిగుట్టకున్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వాటికన్ సిటీ తరహాలో, అక్కడి దేవస్థానాన్ని-పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయానికి సంబంధించినంతవరకు కొన్ని మార్పులు-చేర్పులు చేయాలని కూడా ముఖ్యమంత్రి అదే సందర్భంగా సూచించారు. వీటిలో ప్రధానమైనవి, దేవాలయాన్ని స్వర్ణ తాపడం చేయడం, గోపురం స్పష్టంగా కనిపించే రీతిలో దాని ఎత్తు పెంచడం, యాదగిరిగుట్ట పరిసరాలలో అభివృద్ధికి చాలినంత భూసేకరణ చేయడం, ప్రస్తుతం వున్న స్థలంలో-సేకరించనున్న స్థలంలో కల్యాణ మండపం,వేద పాఠశాల, అభయారణ్యం, సంస్కృత పాఠశాల, ఆలయ అభివృద్ధికి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు వున్నాయి. ఈ సూచనలు చేసిన నాడే ఆలయాభివృద్ధికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు ముఖ్యమంత్రి.

బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారి యాదగిరిగుట్టకు వచ్చి దైవ దర్శనం చేసుకోవడానికి ముందు, ఆ గుట్ట పరిసరాల విషయంలో స్వయంగా ఒక అవగాహనకు వచ్చేందుకుదేవాలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పరచడానికి ఎలా ముందుకు పోవాలో నిర్ణయించేందుకు, ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. దేవాలయ అభివృద్ధిపై అక్కడే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. గుట్టపై నున్న అస్తవ్యస్త కట్టడాలను తొలగించాలని, కాటేజీలను నిర్మించాలని, పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా దేవాలయ మండపాన్ని విస్తరించాలని, గుట్టపైన దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే జరిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇవే కాక, దూరంనుంచి కూడా భక్తులకు దేవుడు కనిపించే విధంగా గర్భగుడిని ఉత్తర దిశగా, ఆగమ శాస్త్ర పండితుల సలహా మేరకు, విస్తరించాలని ఆయన అన్నారు. గుట్టపైన, అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, గరుత్మంతుడి విగ్రహాన్ని నెలకొల్పడానికి అనువైన స్థలాలను ఎంపిక చేయాలని కూడా అయన సూచించారు. గుట్ట చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి అనువుగా స్థల సేకరణ, రహదారి ఏర్పాటు జరగాలని అన్నారు.

దరిమిలా, ముఖ్యమంత్రి సూచన మేరకు-ఆదేశాల మేరకు, 13 మంది సభ్యులతో, ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు చైర్మన్‌గా, దేవాలయ ప్రత్యేకాధికారి కిషన్ రావు ఉపాధ్యక్షుడిగా, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ ఏర్పడింది. ఇందులో స్థానిక ఎంపీ, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతరులు సభ్యులుగా వుంటారు. యాదగిరిగుట్ట, దాని పరిసరాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందించాల్సిన అవసరం దృష్ట్యా, చుట్ట పక్కలున్న ఆరు గ్రామాలను కూడా అభివృద్ధిలో భాగంగా కలిపింది ప్రభుత్వం. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రాయగిరి దగ్గరున్న చెరువును అందంగా తీర్చి దిద్దాలని, భువనగిరి-యాదగిరిగుట్ట మధ్యలో నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని, గుట్టకు నాలుగు దిక్కుల వున్న వంగపల్లి, తుర్కపల్లి, రాయగిరి, రాజుపేట రహదారులను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భూ సేకరణకు లేదా కొనుగోలుకు, ఇతర సంబంధిత అభివృద్ధి పనులకు చేయాల్సిన ఖర్చు కొరకు రు. 100 కోట్లను యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ అకౌంట్‌లో జమ చేసింది ప్రభుత్వం. ఆగమ శాస్త్ర-వాస్తు నిబంధనలకు అనుగుణంగా, దేవాదాయ-ధర్మాదాయ శాఖ స్థపతిల సలహా మేరకు, అభివృద్ధికి కావాల్సిన డిజైన్లను తయారు చేసేందుకు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని నియమించింది అథారిటీ.

ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామితో కలిసి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒకసారి యాదగిరిగుట్టపై ఏరియల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్టతో పాటు, ప్రభుత్వం అభివృద్ధి చేయదల్చుకున్న గుట్ట చుట్టుపక్కల ప్రదేశాలను కూడా వారిరువురు పరిశీలించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజుపేట మార్గాలను కూడా ముఖ్యమంత్రి జీయర్ స్వామికి చూపించారు. అక్కడా చేపట్టదలచిన పనులను కూడా ఆయనకు వివరించారు. ఇద్దరు కలిసి దేవాలయ ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. అక్కడి అణువణువును పరిశీలించారు. తన ఆలోచనలను, దేవాలయంలో తలపెట్టిన మార్పులను జీయర్ స్వామికి వివరించారు ముఖ్యమంత్రి. ఆలయ నిర్మాణ రూప శిల్పులు, స్థపతి, వేద పండితులు, దైవ క్షేత్రాల నిర్మాణ-నిర్వహణలో అనుభవజ్ఞులైన వారి సలహాలు-సూచనల మేరకు తాత్కాలికంగా రూపొందించిన డిజైన్లను జీయర్ స్వామికి ముఖ్యమంత్రి చూపించారు. అవి చాలా బాగున్నాయని, ఆగమ శాస్త్ర నిబంధనలకు, వైదిక ఆచారాలకు-సాంప్రదాయాలకు అనుగుణంగా వున్నాయని స్వామి అభినందించారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపు దిద్దుకోనున్న యాదగిరిగుట్టతో పాటు చుట్టూ వున్న నవ గిరులకు నామకరణం చేయాల్సిందిగా జీయర్ స్వామిని కోరారు ముఖ్యమంత్రి. యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేసిన స్వామి, మిగతా వాటికి త్వరలోనే పేర్లు పెడతామన్నారు. యాదగిరిగుట్టకోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అభినందించిన జీయర్ స్వామి, తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తిగా ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

ఈ నేపధ్యంలో, ముఖ్యమంత్రి ఆదేశాలకు-సూచనలకు అనుగుణంగా యాదాద్రి దేవస్థానం, యాదగిరిగుట్ట-పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతంగా-త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. 943 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడంతో పాటు, మరో 100 ఎకరాలు సేకరించి, మొత్తం 1000+ ఎకరాల భూమిని ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నారు. 2014-2015, 2015-2016 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రు. 200 కోట్ల బడ్జెట్ ను యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీకి కేటాయించింది ప్రభుత్వం. 180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గుట్ట చుట్టూ తిరగడానికి గిరి ప్రదక్షిణ రోడ్ ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అభివృద్ధిలో భాగంగా, గుట్ట ప్రాంతమంతా నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుతో పాటు, రోడ్ డివైడర్లు, ఫుట్ పాత్ లు, ఐ లాండ్లు నిర్మించనున్నారు. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో ఆహ్లాదకరంగా అలరారనున్నది. భక్తి భావన పెంపొందే విధంగా, గుట్ట ప్రాంతమంతా మారుమోగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు జరుగనుంది. సుమారు 1,000 ఎకరాల చుట్టుపక్కల స్థలాన్ని జోనింగ్ చేసి, లే అవుట్లు సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టారు. యాదాద్రి సమీపంలో వున్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు.

యాదాద్రి గుట్టపై వున్న 15 ఎకరాల భూమిలో ప్రధాన గుడి కింద వచ్చే 5 ఎకరాలలో ప్రాకారం, మాడ వీధుల నిర్మాణం జరుగుతుంది. దేవాలయ ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహ స్వామి 32 రకాల ప్రతిమలు ఏర్పాటు కానున్నాయి. దేవుడి ప్రసాదాలు తయారుచేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే నిర్మిస్తారు. యాదాద్రి పైనే, పుష్కరిణి, కల్యాణ కట్ట, అర్చకులకు వసతి-నివాస గృహాలు, రథ మండపం, క్యూ కాంప్లెక్స్, విఐపి గెస్ట్ హౌజ్, విఐపి పార్కింగ్ స్థలం నిర్మించనున్నారు. యాదాద్రి కింది భాగంలో ఉద్యానవనం, కాటేజీలు, బస్ స్టాండ్, కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, స్వామివారి పూజకు వినియోగించే పూల చెట్లతో కూడిన ఉద్యానవనం, యాత్రీకులకు వసతి కేంద్రాలు, గోశాల, అన్నదానం కోసం భోజన శాల, హెలిపాడ్ నిర్మించనున్నారు. గుట్ట కింద కూడా వివాహాలు చేసుకునేందుకు కల్యాణ మండపాలు కట్టే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వున్న పున్నమి గెస్ట్ హౌజ్ ను ఆధునీకరించి, మరింత వసతి సదుపాయం కలిగించనుంది అథారిటీ. యాదాద్రి సమీపంలోని 11 ఎకరాల స్థలంలో మూడు గెస్ట్ హౌజ్ ల నిర్మాణం కూడా జరుగనుంది. పాత యాదగిరిని దర్శించుకునేందుకు సౌకర్యం కూడా కలిగించనుంది ప్రభుత్వం.


అచిర కాలంలోనే యాదాద్రి-యాదగిరిగుట్ట ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రంగా, యాత్రా స్థలంగా రూపు దిద్దుకోనుంది. End

No comments:

Post a Comment