Monday, August 10, 2015

ఏబై ఏళ్ల సింగపూర్ - కొన్ని విశేషాలు : వనం జ్వాలా నరసింహారావు

ఏబై ఏళ్ల సింగపూర్ ... విశేషాలు
వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ (12-08-2015)

          సుమారు 52 లక్షల జనాభా,  704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగిన సింగపూర్ దేశమంతా అదే పేరు కలిగిన ఒక పెద్ద నగరం. బహుశా ప్రపంచంలో అలాంటివి అతి తక్కువగా వున్నాయి. ఆగస్ట్ 9, 1965 న ఆవిర్భవించిన సింగపూర్ దేశం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెండు సార్లు సింగపూర్ వెళ్లి వచ్చిన నాకు ఆ దేశ అభివృద్ధి కళ్లారా చూసే వీలు కలిగింది. నగరంలో తిరుగుతుంటే, ఆశ్చర్యం కలిగేది. ఎలా అతి కొద్ది కాలంలో సింగపూర్ ఇంతగా అభివృద్ధి చెందిందని! ప్రపంచ దేశాలలో, అత్యంత ఆధునిక ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది బహుశా ఇక్కడేనేమో! సంపన్న దేశాలలో ముందు వరుస నున్న వాటిలో సింగపూర్ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ప్రధాన ద్వీప దేశం ఇది. ఐరోపా దేశాల ఆధిపత్యానికి గండి పడి, రెండో ప్రపంచ యుద్ధానంతరం పరిస్థితులు మారిపోవడంతో, వలస రాజ్యాలకు స్వాతంత్ర్యం లభించడంతో పాటు, సింగపూర్ స్థితిగతులు కూడా మార్పుకు గురయ్యాయి. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నామకార్థం మిగిలిపోయింది. కామన్వెల్త్ దేశాల అధ్యాయం మొదలైంది. ఆ నేపధ్యంలో, తొలుత సింగపూర్ మలయాలో విలీనమై, మలేసియాలో భాగమైంది. రెండేళ్లకే సింగపూర్‌ను వదిలించుకుంది మలేసియా. సింగపూర్ జాతిపితగా, ఆ దేశ ఆవిర్భావ కారకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇటీవలే మరణించిన "లీ క్వాన్ యూ" దేశ ప్రధాని అయ్యారు. గణతంత్ర సింగపూర్‌గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్ వలస రాజ్యంగా వున్న సందర్భంలోను, పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్ర్యం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ-ఆర్థిక చరిత్ర ఒక దానితో మరొకటి పోల్చడం చాలా కాష్టం. అలాంటి దేశాలలో సింగపూర్‌ ప్రత్యేక స్థానం సంతరించుకుంది.
ఐదారు దశాబ్దాల క్రితం వరకూ, దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే వుండేది సింగపూర్. అలాంటిది, ఈ నాటి సింగపూర్ లాగా, ఒక పటిష్టమైన జాతిగా మనుగడ సాధించగలుగుతుందని, బహుశా ఎవరూ ఊహించి వుండరు. సింగపూర్‌లో కాలుమోపగానే మొదటగా అందర్నీ ఆకర్షించేది సింగపూర్ ప్రధాన విమానాశ్రయం చాంగి ఎయిర్ పోర్ట్. సింగపూర్ ప్రధాన వాణిజ్య సముదాయాల కూడలికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో, 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్న, ఈ విమానాశ్రయం, ఆగ్నేయాసియా మొత్తానికి ప్రధాన వైమానిక కేంద్రం. వందకు పైగా వివిధ దేశాలకు చెందిన ఎయిర్ లైన్లకు ఉపయోగపడుతున్న ఈ విమానాశ్రయం నుంచి, ప్రపంచవ్యాప్తంగా 60  దేశాలలోని 220  నగరాలకు-పట్టణాలకు 6,100 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఏటా సుమారు ఏడు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఈ ఎయిర్ పోర్ట్ లో నాలుగు టర్మినల్స్ వున్నాయి. 1981 నుంచి ఇప్పటిదాకా 2011 లో లభించిన 23 ఉత్తమ బహుమతులతో పాటు, 390 ఆవార్డులొచ్చాయి ఈ విమానాశ్రయానికి.

          సింగపూర్‌లో కారులో ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు వెళ్లాలంటే, ఎంపిక చేసిన కొన్ని సెంటర్లలో టోల్ వసూలు చేస్తారు. అదే విధంగా కారు ఎక్కడన్నా పార్క్ చేయాల్సి వస్తే ఫీజు వసూలు చేస్తారు. కాకపోతే అది డబ్బు రూపేణా వుండదు. కారులో మొదలే డబ్బు కట్టి కొనుక్కున్న ఒక ప్రి-పెయిడ్ కార్డు పెట్టుకోవాలి. ఆ కార్డునుంచి ఆయా ప్రదేశాలకు కాని, పార్కింగ్ స్థలానికి కాని పోయినప్పుడు, తిరుగు ప్రయాణంలో, కొంత రుసుం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఆ కార్డులో కొంత బాలన్స్ వుండేటట్లు జాగ్రత్త పడాలి. సింగపూర్‌లోని చాలా రోడ్లకు, ఏదో ఒకరకంగా, ఆ బజారుకు అతికేటట్లు ఒక పేరుంటుంది. "సూర్యోదయం రోడ్డు" అని ఒక చోట వుంటే, "సూర్యాస్తమయం" అని మరో చోట వుంది. పండ్ల పేరు మీదో, పప్పు దినుసుల పేరు మీదో, రాచరిక వ్యవస్థకు గుర్తుగానో, రచయితల పేరుమీద, స్థలాల పేరు మీదో, మనిషి హావ-భావాల మీదో, నంబర్ల మీదో రోడ్ల పేర్లుంటాయి. ట్రాఫిక్ రెగ్యులేషన్ కు, వేగం పరిమితం చేయడానికి చక్కటి వ్యవస్థ వుంది. ఎక్కడికక్కడ నియంత్రణ చేసేందుకు గోప్యంగా కెమెరాలుంటాయి. తెలిసి-తెలిసి ఎవరూ తప్పుచేయడానికి సాహసించరు. తప్పు చేస్తే (ఏ విషయంలో నైనా) శిక్షకూడా కఠినమే! సింగపూర్‌లో ఎక్స్ ప్రెస్ మార్గాలని, ఆర్చర్డ్ రోడ్లని, పాద చారుల మార్గమని, భవిష్యత్‍లో నిర్మించనున్న మార్గాలని నాలుగు రకాల రహదారులుంటాయి. ఎక్స్ ప్రెస్ మానిటరింగ్ సలహా వ్యవస్థ, ప్రమాదాలను పసిగట్టడంతో పాటు మార్గమధ్యంలో వాహనాలు చెడిపోతే సహాయం అందించేందుకు దోహదపడుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ సులభంగా నియంత్రించడానికి, ఇబ్బందులు కలగకుండా కొనసాగించడానికి వీలవుతుంది. రహదారులకు ఇరువైపులా, భారీ వృక్షాలు, రకరకాల ఆర్నమెంటల్ చెట్లు, పూల చెట్లు దర్శనమిస్తాయి. ఒక క్రమ పద్ధతిలో వాటిని పరిరక్షించుకుంటూ వస్తోంది సింగపూర్ ప్రభుత్వం. రోడ్లన్నీ చూడ ముచ్చటగా వుంటాయి. వాహనం ముందు సీట్లో కూచున్నవారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి.
          సింగపూర్ అపార్ట్ మెంట్‌లో వుండేవారికి పూర్తి సెక్యూరిటీ వుంటుంది. ఎలివేటర్‍ చేరడానికి తెరవాల్సిన తలుపు దగ్గర నుంచి, ఎలివేటర్ డోర్ ఓపెన్ చేయడం వరకు, కాపురముంటున్న అంతస్తు చేరుకోవడం దాకా, అంతా డిజిటల్ ఆపరేషనే! ఎలివేటర్ డోర్ సరాసరి నివాసం వుంటున్న అపార్ట్ మెంటులోకి తెరుచుకుంటుంది. ఆ అంతస్తులో ఆ లిఫ్ట్ ఆ అపార్ట్‌మెంటులో వున్నవారికే పరిమితం. అంత సేఫ్టీ వ్యవస్థ సింగపూర్ మొత్తం వుంటుందలా. సింగపూర్ లోని నివాస ప్రాంతాలన్నింటిలో కి సెంటోజా కోవ్ కు ఒక ప్రత్యేకత వుంది. సముద్ర తీరంలోని భూమిలో, నిర్మాణం చేపట్టిన, సింగపూర్‌లోని ఒకే ఒక భవన సముదాయం సెంటోజా కోవ్ ప్రాంతం. ప్రభుత్వ రంగ సంస్థ సెంటోజా డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఐన సెంటోజా కోవ్ ప్రయివేట్ లిమిటెడ్ దీని నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తున్నది. సింగపూర్ లాండ్ అథారిటీ నుంచి 80 కోట్ల సింగపూర్ డాలర్లకు ఈ భూమిని సెంటోజా కోవ్ కొనుగోలు చేసింది. ఉత్తర-దక్షిణ కోవ్‍లుగా సెంటోజా విభజించబడింది. రెండు భాగాలలోను కొన్ని విల్లాలు, కొన్ని అపార్ట్ మెంటులు నిర్మించడం జరిగింది. ప్రతి విల్లా, అపార్ట్ మెంట్ సముద్రానికి అభిముఖంగానో, సముద్రం బాక్ వాటర్స్ కు అభిముఖంగానో వుండే రీతిలో డిజైన్ చేయడం విశేషం. ఉత్తర కోవ్ ను కోరల్ ఐలాండ్, పారడైజ్ ఐలాండ్, ట్రెజర్ ఐలాండ్ లుగా మూడు భాగాలు చేశారు. దక్షిణ కోవ్ లో నిర్మాణం 2006 లో మొదలై ఇంకా కొనసాగుతోంది. నిర్మాణం పనులు అక్కడుండేవారికి ఏ విధంగాను ఆటంకం కలిగించవు.
          సింగపూర్‌లో కెసినో లకు ప్త్రసిద్ధి. అభిరుచిగలవారెవరైనా కొన్ని నియమ నిబంధనలకు లోబడి జూదం అడేందుకు అనువైన ప్రదేశాన్నే కెసినో అంటారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో వున్న "మకావో", అమెరికా దేశంలోని లాస్ వేగాస్ కెసినోల తరువాత సింగపూర్ ది మూడో స్థానం. అక్కడున్నవి కేవలం రెండే! ఒకటి "మెరీనా బే సాండ్స్", మరోటి "రిసార్ట్స్ వరల్డ్ సెంటోజా". సింగపూర్‍ కెసినో లకు, అక్కడి పౌరులు కాని, శాశ్వతంగా నివసిస్తున్న ఇతర దేశాల వారు కాని వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. సరైన పాస్‌పోర్ట్ కలిగి వున్న విదేశీయులకు ఎంట్రీ ఫీజు లేదు. 24 గంటలు కెసినోలో గడపాలంటే వంద సింగపూర్ డాలర్ల టికెట్ కొనుక్కోవాలి. ఏడాదికి ఒక్క సారే తీసుకునేవారికి 2,000 డాలర్లు చెల్లించాలి. ఒకవిధంగా చెప్పుకోవాలంటే, సింగపూర్ పౌరులు కెసినోలో జూదం ఆడడాన్ని, డబ్బు వృధా చేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు వారికి ఎంట్రీ ఫీజు నిబంధన విధించింది ప్రభుత్వం. విదేశీయులక్కడకు భారీ సంఖ్యలో రావాలని, వారి డబ్బు సింగపూర్ కెసినోల ద్వారా ప్రభుత్వ ఆదాయంగా మారాలని వారికి టికెట్ లేకుండా ప్రోత్సహిస్తున్నారు కెసినో నిర్వాహకులు. కెసినోకు చెందిన సిబ్బంది స్నేహపూర్వకంగా, అత్యంత మర్యాదగా వచ్చినవారితో మెలుగుతారు.

          సింగపూర్‌లో అమల్లో వున్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్-ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు-విదేశీయులకు వారి-వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తున్నాయి. ఇందులో ప్రాధమిక ఆరోగ్య-వైద్య సదుపాయం, ముందస్తుగానే జబ్బులు రాకుండా అరికట్టేందుకు అవసరమైన వైద్య సౌకర్యంతో పాటు, ఆరోగ్య సంబంధిత మైన విద్యావిధానాన్ని అమలు పర్చడం చేస్తోంది సింగపూర్ ప్రభుత్వం. సింగపూర్‌లో నూటికి ఎనభై శాతం మేర ప్రాధమిక వైద్య సౌకర్యం సుమారు 2000 వరకూ వున్న ప్రయివేట్  ఆసుపత్రులలో లభ్యమవుతుంది. ప్రభుత్వ పరమైన పాలీ క్లినిక్‌లు కేవలం 18 మాత్రమే. ప్రభుత్వ ఆసుపత్రులలో 80% స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం దొరుకుతుంది. ఆసుపత్రి పడకల సంఖ్య కూడా ప్రభుత్వ రంగంలోనే అధికం-సుమారు 80% పైగా. ప్రయివేట్ ఆసుపత్రులలో కేవలం 20% మాత్రమే! డాక్టర్ల సంఖ్య కూడా అంతే. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేవారి సంఖ్య 80% కాగా, ప్రయివేట్ రంగంలో 20% మంది మాత్రమే వున్నారు.
ఆసియా ఖండం మొత్తంలో అత్యున్నత ఆరోగ్య వైద్య ప్రమాణాలను పాటిస్తున్న దేశం సింగపూర్. 1965 లో సింగపూర్‌కు స్వాతంత్ర్యం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్ద ఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్‍లో ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983 లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. సింగపూర్లో అత్యవసర వైద్య సహాయ సేవలను, "ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్" పేరుతో, "సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్" నిర్వహిస్తుంది. 108 సేవల మాదిరిగానే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలఎత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరాలి. ఫోన్ చేసిన వెంటనే 108-అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్-ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కొరకు, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరినవారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాలర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే.
          "సింగపూర్ జాతీయ ర్యాలీ డే" అనేది ఏటేటా జరిగే ఒక నిర్దుష్ట కార్యక్రమం. ఆ ర్యాలీలో జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించడం ఆనవాయితీ. ప్రతి ఏడు ఆగస్ట్ 9 న జరిగే జాతీయ దినోత్సవం పరేడ్  ముగిసిన తరువాత, వచ్చే రెండో ఆదివారం నాడు, ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. 1966 నుంచి నిర్విఘ్నంగా సాగుతున్న ఈ ర్యాలీ నాడు, జాతిని ఉద్దేశించి చేసే తన ప్రసంగంలో ప్రధాని, సింగపూర్ ఎదుర్కొన బోయే సమస్యలను, భవిష్యత్ దర్శినిని, ప్రజల ముందుంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఏటేటా చేసే, "స్టేట్ ఆఫ్ ద యూనియన్" ప్రసంగం లాంటిదే ఇది. జాతీయ దినోత్సవం నాడు చేసే ప్రసంగంలోని వాడి-వేడి అంశాల నుంచి ప్రజలు వారికి తోచిన అర్థాలను ఆకళింపుచేసుకునే పక్షం రోజుల లోపలే, జాతీయ ర్యాలీ డే ప్రసంగం ప్రజల ముందుంటుంది. సర్వసాధారణంగా ప్రధాని ఉపయోగించే ఆనవాయితీ పదాలు ఎలాగూ ఉంటాయని ప్రజలు ముందుగానే ఊహించుకుంటారు.
రెండేళ్ల క్రితం ప్రధాని చేసిన ప్రసంగం యావత్ సింగపూర్ ప్రజలను ఆకట్టుకుంది. "అవర్ సింగపూర్" అన్న నినాదం లోతుపాతులను గురించి వివరణ ఇచ్చారాయన. ప్రధాని తనకు సూచించిన ప్రణాళికా బద్ధ కార్యక్రమంలో మూడు ప్రధానమైన లక్ష్యాలు-ధ్యేయాలు వుంటాయని విశదీకరించారు. మొదటిది: ఇప్పటికే ప్రభుత్వం రూపొందించి అమలు పరుస్తున్న పథకాలలో దేశాభివృద్ధికి పని కొచ్చే వాటి విషయంలో సంపూర్ణమైన నమ్మకాన్ని ప్రకటించడం; రెండోది: కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుకూలంగా, ప్రభుత్వ ఆలోచనా విధానంలో కూడా ఎలాంటి మార్పు రావాలి; మూడోది: నూతన ఆలోచనల దిశగా ఎలా అడుగులు వేయాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సింగపూర్ ప్రజలకు ఇస్తున్న ఒక చక్కటి అవకాశమని, "అన్నింటికన్నా నా దేశానికి ప్రధానమైంది ఏంటి? ఒక దేశంగా, ఈ దేశ ప్రజలుగా మనం ఎక్కడకు-ఎలా పయనించాలి?" అని ప్రతి పౌరుడు ప్రశ్నించుకోవాలి అన్నది ఆ ప్రసంగ సారాంశం. ఇలాంటి వాటి విషయంలో ఒక అవగాహనకు రావాలంటే, సుదీర్ఘమైన చర్చ జరగాలనీ, అందుకే, "నేషనల్ కన్వర్జేషన్" ప్రతిపాదనను ప్రభుత్వం ప్రజల ముందుంచిందని ఆయన తెలిపారు.
          దరిమిలా, 26 మంది సభ్యులతో కూడిన "మన సింగపూర్" కమిటీ రూపు దిద్దుకుంది. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను కమిటీ సభ్యులుగా చేసింది ప్రభుత్వం. ఒక టాక్సీ డ్రైవర్, సామాజిక కార్యకర్తలు, కళాకారులు, విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, రాజకీయ వాదులు, ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు. ఒక్కో సెషన్‌లో 50 నుండి 150 మంది వ్యక్తులు పాల్గొనే విధంగా, 30 డైలాగ్ కార్యక్రమాలను నిర్వహించాలని, ఆ విధంగా ప్రజలను భాగస్వాములను చేయాలనీ, డైలాగ్ వివిధ భాషలలో జరపాలనీ, కమిటీ నిర్ణయించింది. ఫేస్ బుక్ లాంటి సామాజిక మీడియాలో కూడా, సింగపూర్ ప్రధాని ప్రకటించిన "నేషనల్ కన్వర్జేషన్" ప్రతిపాదన బహుళ ప్రాచుర్యం పొందుతోంది.
          బహుశా ప్రపంచ దేశాలలో సింగపూర్‌తో పోల్చదగిన దేశం మరోటి లేదనాలి. End


2 comments:



  1. చాలా బాగా వ్రాసారు వెరీ గుడ్ వ్రైట్ అప్ ; కీప్ ఇట్ అప్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. మీ వ్యాసం చాలా బాగుందండీ!! ఒక చిన్న సవరణ ఛాంగీ ఎయిర్పోర్ట్ లో ఇప్పటివరకు ౩ టర్మినల్స్ మాత్రమె ఉన్నాయ్, నాలుగవది ఇంక నిర్మాణం లో ఉండండి, మీ వ్యాసాన్ని సరిచేయగలరు.

    ReplyDelete