Sunday, October 11, 2015

రావణుడే మహనీయుడైతే రామాయణమే లేకపోయేది:వనం జ్వాలా నరసింహారావు

రావణుడే మహనీయుడైతే రామాయణమే లేకపోయేది
వనం జ్వాలా నరసింహారావు
నవ తెలంగాణ దినపత్రిక (వేదిక) : 12-10-2015

రావణుడు ఈ దేశ స్థానికులకు చెందిన రాజా? స్థానిక మూలవాసీ చక్రవర్తా? అతడు భూమి పుత్రుడా? రావణ బలి చక్రవర్తుల సామూహిక హత్యకు బాలకాండలో బ్లూ ప్రింటా? రావణ రాజ్యాన్ని రాముడు దురాక్రమణ చేసుకున్నాడా? రావణుడు పౌలస్త్య బ్రాహ్మణుడని తొండి వాదన చేస్తున్నారా? రావణుడు చేసిన నేరమేంటా? రావణుడిని బలపరాక్రమవంతుడనీ, సమర్థుడైన పాలకుడనీ, మహా రూపవంతుడనీ, సరసుడనీ, కళాకారుడనీ, సర్వజనహితుడనీ, జ్ఞాని అనీ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యస్థాపకుడనీ, స్త్రీలు ఆయన పట్ల మిక్కిలి గౌరవభావంతో వుండేవారనీ, మానవతా మూర్తి అనీ......ఇలా అనేక రకాలుగా ఆయనను ఒక మహనీయుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు డాక్టర్ కదిరె కృష్ణ గారు తన వ్యాసంలో.

రావణాసురుడు దేవుడని, ఇటీవల కొందరు పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే, ఒక్క రావణుడే కాదు..... మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు, శిశుపాలుడు...ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవతలంటున్నారు. రావణుడిని అగ్రవర్ణాల వారు అణగదొక్కారని కూడా వాదిస్తున్నారు. రావణుడు పుట్టింది బ్రాహ్మణ -క్షత్రియ జంటకు. అలాంటప్పుడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? సుమాలి అనే రాక్షస రాజు కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసుకో మంటాడు. తండ్రి సూచన ప్రకారం, కైకసి, విశ్రవసుడుని చేరబోతుంది. ఆమె వివరాలు అడిగి, మనసులోని భావాన్ని గ్రహించి, వచ్చిన సమయం మంచిది కానందున, క్రూరులైన రాక్షస శ్రేష్టులు ఆమెకు కొడుకులుగా పుట్తారని అంటాడు. విశ్రవసుడికి కైకసి వివాహిత భార్య కాదు. కొంతకాలానికి ఆమెకు నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, అగ్ర కులాలకు చెందిన వాడే!

రావణాసురుడు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు-నేరాలు చేసిన వాడే!. సవతి సోదరుడు కుబేరుడిని వర బలంతో లంక నుంచి వెళ్ల గొట్టాడు. ముల్లోకాలను బాధ పెట్టడం వాడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవమానించాడు. అయోధ్య రాజు అనరణ్యుడిని అవమానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. కార్తవీర్యార్జునుడితో, వాలితో కయ్యానికి దిగి గర్వభంగమవుతాడు. సీతాదేవిని అపహరిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడు చేసినవన్నీ అరాచకాలే! వాడెలా దేవుడవుతాడు.

          మయుడనేవాడు, తన కూతురు మండోదరిని, రావణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కూతురుతో పాటు మయుడు రావణుడికి "శక్తి" అనే ఒక అస్త్రాన్నిచ్చాడు. ఇక అప్పటినుంచి రావణుడు ముల్లోకాలను భాదించడం మొదలెట్టాడు. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. పుష్పక విమానంలో లంకకు మరలిపోతుండగా, కైలాస గిరి ప్రాంతంలో, విమానం కదలదు. రావణుడు కైలాసాన్ని పెకలించడానికి పూనుకుంటాడు. శివుడు తన కాలి బొటన వేలుతో, ఆ పర్వతాన్ని అణచి వేశాడు. రావణుడి చేతులు కొండ కింద పడి బాధించసాగాయి. ఏడవడం మొదలెట్టాడు. శంకరుడిని ప్రార్థించాడు. అలా వేయేళ్లు ఏడవగా శంకరుడు కరుణించాడు. ఆ విధంగా ముల్లోకాలు కలతచెందేట్లు ఏడ్చినందున అతడికి "రావణుడు" అని శివుడు పేరు పెట్టాడు.

హిమవత్పర్వత ప్రాంతంలో రావణుడికి వేదవతి కనిపించింది. కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఆమెను చేరబోయాడు. తల వెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. రావణుడు అవమానించిన ఆ దేహాన్ని ఇక తాను వుంచుకోనంటుంది. అగ్ని ప్రవేశం చేస్తానని, రావణుడి గర్వమణచడానికి మళ్లీ జన్మించుతానని అంటూ, చెప్పినట్లే చేస్తుంది. ఆ విధంగా రావణ వినాశానికి బీజాలు పడ్డాయి. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది. అయోధ్యకు వెళ్లాడు రావణుడు. ఆ సమయంలో అనరణ్యుడు అయోధ్యను పాలించేవాడు. ఆతడిని యుద్ధానికి పురిగొల్పాడు రావణుడు. యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు.

యముడిని చంపడానికి పోతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురు సరిసమానంగా పోరు సల్పారు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురిని విడిచి పోయాడు. తరువాత నశ్మ నగరాన్ని పాలిస్తున్న కాలకేయులను జయించి, వరుణ నగరంపై యుద్ధానికి పోతాడు. లంకా నగరానికి పోతూ, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. వారందరినీ పుష్పక విమానంలో పడేస్తాడు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలను కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.

దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. మార్గమధ్యంలో, దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, ఇలా చేయడం తగదని, వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన చెడ్ద పనిని భర్త నలకూబరుడి (కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. రావణుడు బలవంతంగా ఎత్తుకుని వచ్చిన పతివ్రతా స్త్రీలు ఆ శాపం తెలిసి కొని సంతోషించారు. రావణుడి వలన భయం వదిలారు. ఆ దినం మొదలుకుని, పర స్త్రీ సంగమం విషయంలో మనస్సు పోనిచ్చినవాడు కాదు రావణుడు.

ఇంద్రుడిమీదకు యుద్ధానికి పోతాడు. దేవ-దానవ యుద్ధం జరుగుతుంది. రావణుడి కొడుకు మేఘనాధుడు ఇంద్రుడిని బంధించుతాడు. అప్పటినుంచి మరింత లోక కంటకుడై విర్రవీగుతుండేవాడు రావణుడు. కనిపించిన ప్రతి వారినీ, రాజులందరినీ బాధించుతూ, భుజ బల గర్వంతో, కళ్లు మూసుకొనిపోయి, ఒకనాడు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాలనుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత, మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగరు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు.

రావణుడు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి, వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో వాలి సంధ్య వార్చడానికి నాలుగు సముద్రాలకు పోయాడు. అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య వారుస్తున్నాడని తెలుసుకుని పుష్పక విమానం ఎక్కి అక్కడకు చేరుకుంటాడు రావణుడు. వాలిని వెనుక నుంచి వెళ్ళి బంధించాలనుకుంటాడు. వాడి ఉద్దేశం కనిపెట్టిన వాలి, రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. కిష్కింధకు తిరిగొచ్చి రావణుడిని విడిచి, ఏమీ తెలియని వాడివలె అతడి క్షేమ సమాచారం అడుగుతాడు. తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చానని, గర్వభంగం ఐందనీ, అగ్ని సాక్షిగా అతడితో స్నేహం చేయాలని వుందని అంటాడు. ఆ తరువాత వారిరువురు స్నేహితులౌతారు.

సన్నాసి వేషంలో సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. సీతతో లంక చేరుకుంటాడు. సీత మీద రాక్షస స్త్రీలను కాపలాగా వుంచుతాడు. సీత తనను కామించడానికి పన్నెండు నెలల గడువిస్తాడు. ఆ మర్నాడు మాట వినని సీతను తన భోజనం కొరకు వంటవారు ముక్కలుగా కోసి వండుతారని బెదిరిస్తాడు.

రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత వున్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో వున్నాయనవచ్చు. ఐతే, ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో వున్నాయి కాని రావణుడిలో లేవు. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ వాడికి లేనందునే జనులు దూషించారు. దేవదానవులు వణకుతున్నారు. రావణుడు, విధానాన్నసురించి ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి, తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయమని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవే అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు.  

చీకటి-వెలుతురు ఒకేసారి రానట్లే, పాప-పుణ్య ఫలాలు రెండూ ఒకేసారి అనుభవించలేం. పుణ్యం అనుభవించుతున్నంత వరకూ, పాప ఫలం దరికి రాదు. ధర్మ ఫలం అధర్మ ఫలాన్ని చెరిపేస్తుంది. చీకటి ఎలాగైతే వెలుతురును చెరచ లేదో, అలానే అధర్మ ఫలం రావణుడికి చాలాకాలం అనుభవం లోకి రాలేదు. తపఃఫలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకున్నాడు! అష్టైర్యాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, వాడు చేసిన పర స్త్రీ అపహరణనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరగవు కాబట్టి, అతడి చావు రాముడొచ్చేవరకూ ఆగింది. అతడి వ్రత ఫలంగా దేవ దానవుల చేతుల్లో చావు లేకుండా వరం కోరాడు. నర వానరులను నిషేధించాడు. వాడి తపఃఫలం వారి నుండి కాపాడదు. ఇక రావణుడి పూర్వ పుణ్యం పూర్వ పాపాన్నే హరిస్తుంది. కాని తరువాత చేసిన పాప కార్యాలనుండి అతడిని రక్షించదు. నేడు చేస్తున్న భోజనం, నిన్నటి ఆకలి బాధ తీరుస్తుంది కాని, రేపటి బాధను కాదు కదా! పశ్చాత్తాపం చెందితే, ప్రాయశ్చిత్తముంటుంది. రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరి వారికి వారిని అప్పగించినట్లైతే అతడి దోషం పోయేది. తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు.

రామ రావణ యుద్ధం మొదలవుతుంది. శ్రీరాముడు మూల బలాల్ని సంహరిస్తాడు. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడుతారు. రావణుడు పరాజితుడై లంకకు పరుగెత్తుతాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. రావణుడి శూలాన్ని విరగగొట్టాడు రాముడు. రావణుడి ధ్వజాన్ని నరుకుతాడు రాముడు. రావణుడి శిరస్సును ఖండించాడు. తల నరకగానే తల మొలిచింది కాని వాడు చనిపోవడం లేదు. చివరకు బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.

 ప్రధమంగా ఉత్పన్నమైంది రామాయణం కావడంతో అది ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకో గలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. శ్రీ సీతారాముల పేరు విన్న ప్రతి ఆర్యుడు మనస్సులోనైనా భక్తితో నమస్కారం చేసుకోవాల్సిందే. సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో, తన శక్తికొలది వివరించాడు. రామాయణ గాథలో, శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు. రాముడి చర్యల ద్వారా, రాముడి వాక్కుల ద్వారా తాను చెప్పదల్చుకున్న దాన్ని సిద్ధాంతీకరించాడు వాల్మీకి. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది.

శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే! End 

8 comments:

  1. > రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే.
    వనంవారూ, మీ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నందుకు మన్నించండి. వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది. రావణుడి తండ్రిబ్రాహ్మణుడు కావటంతో, కైకసి బ్రహ్మక్షేత్రం అయ్యింది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే అవుతున్నాడు. ఈ విషయాన్ని మరికొంచెం విస్తరించి చూదాం. పరాశరుడికి మత్సగ్రంథి యందు ఉద్భవించిన వ్యాసుడు బ్రాహ్మణుడు. నిజానికి మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ. అదే పాండురాజ, ధృతరాష్ట్రులవిషయానికి వస్తే వారి తల్లులు క్షత్రియవనితలు - జన్మతః మరియు క్షేత్రాధికారం అక్కడ క్షత్రియత్వం కలది -వారు వివాహితలు కాబట్టి. అందుచేత క్షత్రియక్షేత్రములందు జన్మించిన పాండురాజ, ధృతరాష్ట్రులు క్షత్రియులే అయ్యారు. ఇదంతా ప్రస్తావించటం ఎందుకంటే వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యం ఆధారంగా జరిగుతుందని వివరించటానికే.

    ReplyDelete
  2. >శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే,.......
    మీ రామభక్తిని శంకించే దురుద్దేశం ఏమీ లేదండీ. కాని మీరు ఈ వాక్యం విషయంలో కొంచెం పొరబడ్డారని నా ఉద్దేశం. కొద్దిగానే. నా మాటను వివరించటానికి యత్నిస్తాను. రామోవిగ్రహవాన్ ధర్మః అన్నది సాక్షాత్తూ ఒక రాక్షసుడైన మారీచుడే. అదీ రాముడి గొప్పదనం రావణవధానంతరం సీతాదేవి అగ్నిప్రవేశం చేయగానే ఇంద్రాదులు వచ్చి రాముడితో "రామా, సాక్షాత్తూ త్రిజదధీశుడవైన నారాయణుడవే, ఆదిలక్ష్మీదేవి సీతను అగ్నిప్రవేశం చేయనిచ్చావేమి" అని అంటారు. రాముడు దానికి సమాధానంగా. "అవునా? నాకేమీ తెలియదే!, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మనిషిని, దశరథసుతుడు రాముణ్ణి అనే అనుకుంటున్నాను" అంటాడు. అంతవరకూ తాను నారాయణుణ్ణి అన్న స్పృహ రాముడికి లేదు. ఉండరాదు. తాను మానవుడిగానే రావణసంహారం చేయాలి గాని నారాయణుడిగా కాదు కదా. అందుకని. అందుచేత రాముడి నటన అంటూ ఏమీ లేదు. రాముడు జీవితంలో ఎన్నడూ నటించే వాడు కానేకాదు కదా! పొరపాటుగా మిమ్మల్ని నేను అర్థం చేసుకొని ఉంటే మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. నటన అంటే నా ఉద్దేశం నెగేటివ్ అర్థం వచ్చేలా కాదు. ఆయనకు తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనని తెలుసు. రావణ వధ కోసమే జన్మించాననీ తెలుసు. అందరి మానవుల లాగా ఆయన జన్మించలేదు. రావణ వధ నర-వానరుల చేతుల్లోనే వుంది కనుక, ఆయన మానవుడిలాగానే నడుచుకున్నాడు. మీ వాదన పూర్తిగా సమర్థనీయమే.

      Delete
  3. " ఆయనకు తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనని తెలుసు. రావణ వధ కోసమే జన్మించాననీ తెలుసు. అందరి మానవుల లాగా ఆయన జన్మించలేదు. "
    Can't agree.

    ReplyDelete
  4. రావణుడు ఎన్నో దుర్మార్గాలు చేసి ఉండవచ్చు. రాముని చేతిలో మరణించాడు కాబట్టి మోక్షం పొందాడని చెప్పలేం. ఇక రాముడు సుగుణాభిరాముడు కావచ్చు నాతి చరామి అని మాట తప్పి విడిచిపెట్టడమే కాకుండా సీతపై నింద కూడా వేసాడు. సీత పతివ్రత అని చెప్పాలంటే రావణుడు మంచివాడనే చెప్పాలి కదా ? సీత పతివ్రత అని చెప్పాల్సింది కూడా రాముడే కదా ? రాముడికి కూడా మోక్షం రాలేదేమో ? మళ్ళీ బ్రాహ్మణుడుగానో క్షత్రియుడిలానో పుట్టి తీరాలి. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం రామ, రావణులు బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా పుట్టవచ్చునేమోగానీ నిమ్న జాతులుగా పుట్టే అవకాశం లేదు.

    ReplyDelete
  5. “....వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది. రావణుడి తండ్రిబ్రాహ్మణుడు కావటంతో, కైకసి బ్రహ్మక్షేత్రం అయ్యింది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే అవుతున్నాడు. ….మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”


    వందల, బహుశా వేల సంవత్సరాల క్రితం అప్పటి కవులు ఆయా పాత్రల సంబంధబాంధవ్యాలను, సమాజంలో స్థితిగతులను ఎంత నిర్దిష్టంగా వర్ణించారో తెలియదు గాని… ఉత్కృష్టమైన గ్రాంధిక భాషలో 21వ శతాబ్దపు పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు మాత్రం తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు.


    సామాన్యుల భాషలో దీన్ని విశ్లేషిస్తే…


    కైకసి, బ్రాహ్మణుడిచే చేపట్టబడినది కాబట్టి బ్రహ్మక్షేత్ర మయ్యింది. క్షేత్రమంటే దున్నుకొని, విత్తులు నాటుకొని, పంట పండించుకొనే పొలం. దున్నుకోకలిగిన పొలం మాదిరిగా ఆమె ఎవరి అధికారంలో వుందో ఆతడి వర్ణమే, ఆమెకి కలిగిన కుమారుడికి వర్తిస్తుంది. కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే. అంటే, స్త్రీకి తాను పుట్టిన జాతినుంచి కాని, వర్ణము నుంచికాని ఏమాత్రము విలువ వారసత్వం పొందగల అర్హతలేదు, మనిషిగా స్వంత వ్యక్తిత్వానికి నోచుకోలేదు. పెళ్లి కాకముందు తండ్రి సొత్తు, తర్వాత భర్త ఆస్తి. అదీ, మన ఆధునిక బ్రాహ్మణుడి సూత్రీకరణ.


    ఇవీ మన ధర్మగ్రంధాల మేధోమధనం ద్వారా శ్యామలీయం గారు, వనం వారు వంటి పండితోత్తములు ఈ 21వ శతాబ్దంలో మన తెలుగు బ్లాగ్లోకానికి అందిస్తున్న విజ్ఞానగుళికలు.


    మర్చిపోయానండోయ్… ఇంత అద్భుత జ్ఞానసంపద కేవలం మన హిందూ భారత జాతి సొత్తని మరీ ఎక్కువగా స్వకుచమర్ధనం చేసుకోనవసరంలేదు. మన సోదరులు కూడా ఏమీ తక్కువ తినలేదు…


    Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .


    Deuteronomy 22:28, Bible:
    "If a man finds a girl who is a virgin, who is not engaged, and seizes her and lies with her and they are discovered, then the man who lay with her shall give to the girl's father fifty shekels of silver, and she shall become his wife because he has violated her


    Exodus 20:17, Bible (Tenth Commandment): "Thou shalt not covet thy neighbour's house, thou shalt not covet thy neighbour's wife, nor his ox, nor his ass, nor anything that is thy neighbour's." The tenth commandment forbids coveting your neighbor's house, wife, animals or anything else that the neighbor owns, any piece of property.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. “మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”

      “మత్సగ్రంధి … క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబట్టి క్షేత్రాధికారిగా మరొక క్షత్రియుడు లేడక్కడ, అంటే ఆమె పొలం ఇంకా దున్నబడలేదు, కావున ఆ పొలం స్వంతదారుగా వేరే క్షత్రియుడెవరికి అధికారం లేదు. అందువల్ల, ఆ పొలం దున్నుకొన్న బ్రాహ్మణుడి ద్వారా (అధికారం లేకున్నా) ఆమెకి కలిగిన వ్యాసుడు బ్రాహ్మణుడే.

      ఆహా ఏమి తర్కం… ఏమి న్యాయం… కింద పడినా మీదే గెలుపు, పైన పడినా మీదే గెలుపు. న్యాయ సూత్రాలు సృష్టించేదే మీరైనప్పుడు, మీరెలా చెపితే అదే న్యాయం.


      Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .

      Delete