Saturday, March 12, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-76 : పరశురాముడిని ధిక్కరించి నిస్తేజుడిని చేసిన శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-76
పరశురాముడిని ధిక్కరించి 
నిస్తేజుడిని చేసిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

            పరశురాముడిలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి, సమీపంలో తండ్రి వున్నాడన్న కారణంతో-పెద్దవారి ఎదుట గట్టిగా మాట్లాడకూడదన్న నీతిననుసరించి-ఆయనమీదున్న గౌరవంతో, మెల్లని స్వరంతో, "ఏమన్నావు పరశురామా? నీకథంతా విన్నాను. శూరుడు పగ తీర్చుకోవడం న్యాయమే కాబట్టి జనకుడి ఋణం తీర్చుకునేందుకు నీవు చేసిన పని సరైందనే అంగీకరిస్తున్నాను. అంతవరకు బాగానే వుంది. కాకపోతే నేను దుర్బలుడని తలుస్తున్నావు నువ్వు. క్షాత్రధర్మంలో నేను తక్కువన్నట్లుగా నువ్వన్నమాటలను సహించను. నా తేజస్సు నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నా బలాధిక్యాన్ని చూపిస్తాను-చూడు" అని అంటూ, పరశురాముడి చేతిలోని భయంకరమైన వింటిని లాక్కున్నాడు. దాన్ని లాగి, ఎక్కుపెట్టిన బలశాలి రామచంద్రమూర్తి, ఒక బాణాన్ని సంధించి, కళ్లెర్రచేసి అమితమైన కోపంతో పరశురాముడిని చూసి "బ్రాహ్మణుడవైకూడా, శస్త్రాన్ని ధరించి వచ్చిన నిన్ను చంపవచ్చని శాస్త్రం అనుమతించినా, నీవు నా గురువైన విశ్వామిత్రుడి బంధువైనందున, నీమీద కోపంతో నీపై సంధించి-నిన్ను చంపగలిగిన ఈ బాణాన్ని నీమీద ప్రయోగించడానికి మనసొప్పుకోవడంలేదు. అందువల్ల, నువ్వింక ఎంతమాత్రం నడవ లేకుండా, ఒక దిక్కున పడే విధంగా నీ కాళ్ల గమనవేగాన్నిగానీ, నువ్వు తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనుగానీ-ఏదికోరుకుంటే దాన్ని-ఈ బాణంతో ఖండిస్తాను. ఈ బాణం వృధాగా పోదు. ఇది విష్ణు సంబంధమైంది కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదు. సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుంది. దీనిని ఖండించాలో చెప్పు" అంటాడు.


          దశరథరాముడిలా పరశురాముడిని భయపడేటట్లు మాట్లాడడం చూసిన దేవతలు-మునులు ఆకాశంలో గుంపులుగా చేరి అద్భుతమని అన్నారు. భయంకరాకారుడైన వీరుడు-రాముడిని, తీక్షణమైన బాణాలను ధరించినవాడిని చూసేందుకు బ్రహ్మ, చారణ-కిన్నెర సమూహంతో అక్కడకు చేరుకున్నాడు. భయంకరమైన రామబాణ వేగాన్ని చూసి, జగమంతా మొద్దుబారిపోయింది. పరశురాముడు జడపదార్థమై-వీర్య విహీనుడై-బొమ్మలాగా శ్రీరామచంద్రమూర్తిని చూడసాగాడు. శ్రీరామచంద్రుడి తేజంతో, పరాక్రమం నశించి-బలం పోయి-జడుడైన పరశురాముడు, మునుపటిలా కాకుండా-గౌరవంతో మెల్లగా ఇలా అన్నాడు రాముడితో.

తన పుణ్యలోకాల మీద అస్త్రం వేయమని
శ్రీరాముడిని ప్రార్థించిన పరశురాముడు

          "పుండరీకాక్షా, భూమినంతా కశ్యపుడికి దానంగా ఇచ్చాను. తనకిచ్చిన భూమిలో నేనుంటే, దానమిచ్చిన దానిని అనుభవించినట్లవుతుందని-వుండొద్దని ఆయన ఆజ్ఞాపించడంతో, పగలంతా తిరిగినా రాత్రివేళల్లో ఇక్కడుండకుండా వెళ్లిపోతుంటాను. మహానుభావా, నా నడకను నరకొద్దు. మనోవేగంతో పోయి మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటాను. నా తపస్సుతో నేను సంపాదించుకున్న పుణ్య లోకాలను నీ బాణంతో ధ్వంసం చేయి. ఆ పుణ్యలోకాల అనుభవం నాకు లేకుండా చేయి. అజ్ఞానంతో తప్పుచేసాను. తెలివిలేక, నీవు రాజమాత్రుడవని అన్నానుగాని, నీవంతకంటే చాలా గొప్పవాడివి. నీ సత్తా తెలుసుకోలేక, అందరి లాగే నేను కూడా నిన్ను రాజమాత్రుడవనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో వున్న విల్లు లాక్కొని బాణం సంధించావో, అప్పుడే, ఇతరులకెవరికీ సాధ్యంకాని పని నువ్వు చేసావనుకున్నాను. కాబట్టి నువ్వు నిర్వికారుడవు-అపరాజితుడవు, మధు వైరివైన శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. నేను తెలివి మరిచి అపరాధం చేసాను. క్షమించు. నీకు శుభం జరగాలి. నీ ప్రతాపాన్ని దేవతలందరు చూసారు. నాకింతవరకు పరాభవమంటే ఏంటో తెలియదు. నా జన్మలో మొదటిసారి రాచబాలుడవైన నీచేతిలో ఓడిపోయానని బాధపడడంలేదు. అవమానంగా భావించడంలేదు. ఎందుకంటే, నువ్వు ముల్లోకాలను పాలించే ముఖ్యదేవుడివి. మనోహరమైన దయతో, హృదయ సమ్మతమైన దశరథ రామా, అసమానమైన వ్యర్థంగాని నీ బాణాన్ని విడువు. నా కీర్తి నాశనం కావడం-గతులు తప్పడం కళ్లారా చూసి, సమయం దాటకుండా మహేంద్ర పర్వతానికి పోతాను". పరశురాముడిలా చెప్పగానే, రామచంద్రమూర్తి బాణాన్ని విడవడంతో, తన పుణ్య గతులన్నీ దగ్దమై పోవడం చూసి, ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి పోయాడు. పరశురాముడు పోగానే, కమ్ముకున్న చీకట్లు మాయమైనాయి. పరిమాణం చెప్పనలవికాని బలంగల శ్రీరాముడిని దేవతలు శ్లాఘించారు. సైనికులందరికీ తెలివొచ్చింది.


(పరమార్థ జ్ఞానం దేవతలు క్రియా రూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పినదానిలా కాకుండా, కళ్లార చూసి, ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా, విష్ణువు ఎక్కువా-శివుడెక్కువా అని, తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాసారు. శివ కేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు-జనార్ధనుడు ఒకడే. సృష్టి-స్థితి-నాశనం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అధికుడని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. వింటిని లాక్కుంటూ పరశురాముడిలో వున్న వైష్ణవ తేజస్సును కూడా శ్రీరామచంద్రమూర్తి లాక్కున్నాడని అర్థంచేసుకోవాలి. పరశురామావతారం ఆవేశావతారం. కార్యార్థమై, జీవుడిలో తత్కాలంవరకు, భగవంతుడి తేజస్సు ఆవహిస్తే అది ఆవేశావతారమవుతుంది. ఇక్కడ దేహం ప్రాకృతం. జీవుడు బద్ధుడు. ఇలాంటి ప్రకృతి సంబంధమైన అవతారాలు పూజ్యమైనవికావు-మోక్షమిచ్చేవీ కావు. శ్రీరామావతారం పూర్ణావతారం. ఈ రెండు అవతారాలు కలిస్తే, తక్కువ తేజస్సు, ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటికొచ్చి దేవతలందరు చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది).

No comments:

Post a Comment