Monday, October 24, 2016

అయోధ్య తీర్పు ఒక విజ్ఞాన సర్వస్వం : వనం జ్వాలా నరసింహారావు

అయోధ్య తీర్పు ఒక విజ్ఞాన సర్వస్వం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (25-10-2016)

          సరిగ్గా అరేళ్ల క్రితం ఇదే అక్టోబర్ మాసంలో ఏ పత్రిక చదివినా, ఏ ఎలెక్ట్రానిక్ మీడియా వీక్షించినా అత్యంత ప్రముఖంగా కనిపించిన-వినిపించిన ఏకైక అంశం, అయోధ్య వివాదంపై సెప్టెంబర్ 30, 2010 న వెలువడిన అలహాబాద్ హైకోర్ట్ సెక్యులర్ తీర్పు గురించే. సుదీర్ఘమైన ఆ తీర్పులో న్యాయమూర్తులు ఋగ్వేదం, కార్ల మార్క్స్, ఖురాన్, ఇక్బాల్, ప్రొఫెట్ మహమ్మద్, డార్విన్ లాంటి అనేక సనాతన, అధునాతన పుస్తకాల్లోని మహనీయుల మాటలను ఉటంకించారు. తీర్పిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు వారు చదివిన తీర్పు ముందు-చివర పేర్కొన్న వాటిల్లో ఆసక్తికరమైన, పరిశోధనలకు కావాల్సిన అనేకానేక విషయాలున్నాయి. వారి తీర్పులో న్యాయమూర్తులు అనేక ఆధారాలను చూపిస్తూ, పేర్కొన్న ఉదాహరణలు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో ఉన్నాయి. వేదాలు, పురాణాల ఉదాహరణలు సహితం తీర్పులో చోటుచేసుకున్నాయి. ఎనిమిదివేల పేజీల పైనున్న ఆ తీర్పు పాఠం ఒక మోస్తరు "విజ్ఞాన సర్వస్వం" అనవచ్చేమో !

          ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులు వేర్వేరుగా తమ తీర్పులు రాశారు. త్రి సభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.యూ.ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్ అనేక అంశాలపై ఏకీభవించారు. సీనియర్ న్యాయమూర్తి డి.వి. శర్మ, వివాదాస్పద స్థలం మొత్తం రామ జన్మభూమిగా ప్రకటించారు. అయితే... స్థలాన్ని మూడుగా విభజించి, ముగ్గురి కి కేటాయించాలన్న ఇద్దరు న్యాయమూర్తుల తీర్పు 'మెజారిటీ'గా నిలిచింది. అదే... హైకోర్టు అంతిమ తీర్పు అయ్యింది. వివాదాస్పద కట్టడం మసీదే అని జస్టిస్ ఖాన్ భావిస్తే, దానికి మసీదు లక్షణాలు లేవని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు. మసీదు కోసం మందిరాన్ని కూల్చలేదని జస్టిస్ ఖాన్ పేర్కొనగా... మందిరాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే వివాదాస్పద కట్టడం నిర్మించారని జస్టిస్ శర్మ తెలిపారు. వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి వాటి యాజమాన్య హక్కులను సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌లాలాకు అప్పగిస్తూ తీర్పిచ్చింది. బాబ్రీ మసీదుకున్న మూడు గుమ్మటాలను 1992లో కరసేవ చేసి కూల్చేసిన తర్వాత, ప్రధాన గుమ్మటం కింద రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాటుచేసిన తాత్కాలిక ఆలయం వున్న స్థలాన్నే రామ జన్మభూమిగా కోర్టు నిర్ణయించింది. దీన్నే రామ జన్మభూమి న్యాస్ ట్రస్టుకు కేటాయించింది. ఆ స్థలానికి రెండువైపుల వున్న సీతా రసోయి, రామ్ చబూత్రా స్థలాలను నిర్మోహి అఖారాకు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. రామ జన్మభూమికి, నిర్మోహి అఖారాకు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని, ఒకవేళ ఇతరులతో సమానంగా స్థలం లభించకపోతే పక్కనే కేంద్ర ప్రభుత్వం సేకరించిన భూమిలోంచి ఆ భాగాన్ని ఇవ్వాలని కూడా తీర్పిచ్చింది న్యాయస్థానం.

          విశ్వాసాల, నమ్మకాల, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం, చారిత్రిక సాక్ష్యాధారాలు, స్వాధీన అధీనం ప్రాతిపదికలుగా, అనేకానేక పరిశోధనాత్మక సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పిది. సుమారు నూటాపాతికేళ్ల సుదీర్ఘ అనిశ్చిత స్థితికి ఎవరినీ ఎక్కువగా నొప్పించకుండా... దాదాపు అందరికీ అంతో-ఇంతో ఆమోదయోగ్యమైన విధంగా, ఒకరు గెలిచామని పొంగిపోకుండా... వేరొకరు ఓడిపోయామని ఆవేదన చెందకుండా..ఎవరినీ అసంతృప్తికి గురిచేయకుండా ఇచ్చిన తీర్పిది. సంతృప్తికి హద్దులుండవు...అసంతృప్తికి పరిమితులుంటాయి...అందుకే అందరికీ అమోదయోగ్యమైంది. ఎక్కువమంది తగు మోతాదులో సంతృప్తి పడేందుకు అనుకూలమైంది.

          జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు. "ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!" అని మొదలవుతుందా శ్లోకం. అలా కొనసాగిస్తూ, చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో-లేరో తెలియనందున రాత్రి-పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు. "సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?" అని ఆరంభించి, వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్. ఇక అక్కడినుంచి స్థాన వర్ణన, వివాదాస్పద నిర్మాణం, కోర్టు దావాల వివరాలలోకి పోతారు.


          జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు చివర్లో, ఇదో "జైగాంటిక్, హెర్క్యూలియన్ టాస్క్" అని వర్ణించారు. తీర్పు అనుబంధంలో, న్యాయమూర్తులు పరిశీలించిన అనేక పుస్తకాల వివరాలను ఇచ్చారు. వాటిలో, ఇంపీరియల్ గెజెటీర్స్ తో సహా రకరకాల ఇతర గెజెటీర్స్, మహమ్మదీయుల చట్టాలకు సంబంధించిన పుస్తకాలు, మొగలాయిల డాక్యుమెంట్లు, హోలీ ఖురాన్, బాబర్ నామా, శ్రీ గురు గ్రంధ సాహిబ్, హెగెల్ చరిత్ర తత్వ శాస్త్రం (ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ), రోమిలా థాపర్ రాసిన భారత దేశ చరిత్ర, కుష్వంత్ సింగ్ సిక్కుల చరిత్ర, ఆర్ సి మజుందార్ భారత దేశ చరిత్ర, వివిధ భాషలలోని నిఘంటువులు, హిందూ మత నిఘంటువు, హ్యూయన్ సాంగ్ జీవిత చరిత్ర, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తో సహా అనేక విజ్ఞాన సర్వస్వాలు, ఆర్కియాలాజికల్ సర్వే నివేదికలు, స్వామి వివేకానంద రచనలు, ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత్ర మానస, భగవద్గీత, కాళిదాసు రఘువంశం, అధర్వ వేద సంహిత, రుగ్వేదం, రుగ్వేద సంహిత, సామవేదం, శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహస్పతి స్మృతి, మను స్మృతి, ధర్మశాస్త్రాలు, మత్స్య పురాణం, మేఘ దూత, నారదీయ ధర్మ శాస్త్రం, నారద స్మృతి, పురుష సూక్తం, శాకుంతలం, శుక్రనీతి, స్కంద పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి లాంటివి వున్నాయి.

          జస్టిస్ ఎస్ యు ఖాన్ తీర్పు ఆరంభం చేసిన విధానం మరింత ఆసక్తికరంగా వుంది. అవతారిక, ముందుమాటలతో ఆరంభించారాయన. అవతారికలో, పదిహేను వందల గజాల స్థలం ఒకచోట వుందని, అందులో దేవతలు వెళ్లడానికి కూడా జంకుతారని, ఎందుకంటే ఆ జాగా నిండా మందుపాతరలు అమర్చబడి వున్నాయని పేర్కొని ముందుకు సాగుతారు. "ఆ మందుపాతరలను తొలగించే బాధ్యత మాపై పడింది. వాటి జోలికి పోవద్దని ఉత్తములు కొందరు సలహా ఇచ్చారు. మాకు కూడా ఆదరాబాదరాగా వెళ్లి మూర్ఖుల ఆగడానికి బలి కావాలని లేదు. కాకపోతే, సాహసం చేయక తప్పదు-ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అవసరం కలిగినప్పుడు, తప్పనప్పుడు, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి రిస్క్ తీసుకోకపోవడమే, జీవితంలో మనకెదురయ్యే పెద్ద రిస్క్" అంటారు జస్టిస్ ఖాన్. "ఒకానొక సందర్భంలో మానవుడి ముందు దేవతలు మోకరిల్లాల్సి వచ్చిందట. తనకు లభించిన అరుదైన గౌరవానికి మానవుడు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యతుంది. మాకు అలాంటి అవకాశం వచ్చింది. మేము సఫలమయ్యామా? విఫలమయ్యామా? తమ వ్యాజ్యంలో తామే న్యాయమూర్తులు కాలేరు" అని అంటూ, తాను చెప్పబోయే తీర్పుకు ముందుమాట చదువుతారు. మసీదు కూల్చి వేసిన రోజుల్లో దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒక పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు తన తీర్పులో. అంత క్లిష్ట పరిస్థితుల్లోను ప్రజలంతా ఐకమత్యంతో వుండడాన్ని వివరిస్తూ, "సారీ జహాః సే అచ్చా హిందుస్థాన్ హమారా" అన్న గీతాన్ని ఇనుమడించిన ఉత్సాహంతో ఆలపించా మంటారు. ముఖ్యంగా అందులోని "మజ్హాబ్ నహీ సిఖాతా ఆపస్ మె బైర్ రఖ్నాచ..." అనే చరణాలను గుర్తుచేసుకుంటారు.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తన తీర్పు పాఠాన్ని ఉపసంహారం తొ ముగించారు. ఆసాంతం ఆయన తీర్పులో పలు ఆసక్తికరమైన అంశాలను చేర్చారు. చరిత్ర, పురావస్తు, ప్రాచీన శిల్ప శాస్త్రాలకు సంబంధించిన విషయాల్లో తానంత లోతుగా వెళ్ళ లేకపోయానని, దానికి నాలుగు కారణాలున్నాయని అంటారు జస్టిస్ ఖాన్. మొదటిది వ్యాజ్యాలను నిర్ణయించడానికి వాటి అవసరం అంతగా లేదని తాను భావించడం. ఒకవేళ తానలా వాటి మూలాల్లోకి పోయినట్లయితే, ఆ మార్గంలో, తనకు "నిజం అనే నిధి" లభ్యమవుతుందా, లేక, "అస్పష్టమైన కఠోర భ్రమ" మిగులుతుందా తెలియదంటారాయన. చారిత్రక విషయాల గురించి అంతగా పరిజ్ఞానం లేని తాను, చరిత్రకారుల సంకట జ్వాలల్లో ఇరుక్కోవాలని లేదంటారు. సివిల్ వ్యాజ్యాల్లో చరిత్ర సాక్ష్యాధారాలకు అంతగా స్థానం లేదని సుప్రీం కోర్టు గతంలో ఒక తీర్పులో చెప్పడం మరో కారణమంటారు. ఏదేమైనా తాము చెప్తున్న తీర్పు తుది నిర్ణయం కాదని, అసలైన నిర్ణయాత్మక దశ మున్ముందు రానున్నదని, ఆ దిశగా ఇరు పక్షాల వారికి తానొక సూచన చేయదల్చుకున్నానని ఉపసంహారంలో పేర్కొన్నారు జస్టిస్ ఖాన్.

          రాము డంటే త్యాగానికి మారు పేరని, ఆయన గుణగణాల్లో త్యాగానికే ప్రాధాన్యత అధికమని అంటారు జస్టిస్ ఖాన్. అలాగే ప్రాఫెట్ మొహమ్మద్ ప్రస్తావనా తెచ్చారు. హుదయ్ లియా వద్ద, ప్రాఫెట్ మొహమ్మద్ విపక్ష బృందంతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని, ఆయన బలీయమైన మద్దతు దార్లతో సహా పలువురు, మొహమ్మద్ లొంగుబాటుగా భావించారని, ఖురాన్ మాత్రం ఆ సంఘటనను మొహమ్మద్ విజయంగా వర్ణించిందని పేర్కొన్నారు. అదే నిజమైందని, అనతికాలంలోనే ముస్లింలు ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందకుండా మక్కాలోకి ప్రవేశించే వీలు కలిగిందని అంటారు న్యాయమూర్తి ఖాన్. డిసెంబర్ 6, 1992 నాటి మసీదు కూల్చివేత సంఘటనను ప్రస్తావించి, అలనాటి భారతీయుల సర్దుబాటు ధోరణిని అభినందనీయమంటారు. అయితే, అలాంటి సంఘటనలు మరల తలెత్తవని, అలా మళ్లీ జరుగు తే, కోలుకోవడం కష్టతరమవుతుందని అభిప్రాయ పడ్డారు. వర్తమాన కాలంలో ప్రపంచ గమనం వేగవంతమైందని, 1992 లో లాగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చితికిపోవచ్చని అంటారు. "వతన్ కీ ఫికర్ కర్ నాదా ముసీబత్ ఆనే వాలీ హై..." అన్న ఇక్బాల్ కవి వాక్యాలను, డార్విన్ చెప్పిన మాటలను ఉదహరించారాయన. "సహ యోగం చేసిన, మెరుగు పడిన జాతులు మాత్రమే మనుగడ సాధించగలిగాయి" అని చెప్పిన డార్విన్ మాటలను గుర్తుచేశారు.

          ఇతర మతాలవారితో ముస్లింల సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఇస్లాం బోధనలేంటో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్న విషయం ముస్లింలు లోతుగా ఆలోచించాలంటారు జస్టిస్ ఖాన్. విరోధం, శాంతి, స్నేహం, ఓర్పు లాంటి సందేశంతో ఇతరులను మెప్పించే సమయం కొరకా, లేక, ఎక్కడ-ఎప్పుడు వీలుంటే అప్పుడు దెబ్బతీసే సమయం కొరకా ఎదురు చూస్తోంది? అని ప్రశ్నించారాయన. ముస్లింలు భారత దేశంలో అద్వితీయమైన స్థానంలో వున్నారని, వాళ్లు ఒకప్పుడు పాలకులు గాను, మరొకప్పుడు పాలించబడిన వారి గాను వున్నప్పటికీ, ప్రస్తుతం, జూనియర్లగానైనా అధికారంలో భాగస్వాములయ్యారని అంటారు. వారిక్కడ మెజారిటీలో లేకపోయినా, ఉపేక్షించదగిన మైనారిటీలో లేరని, ఇండొనేషియా తర్వాత అధిక సంఖ్యాక ముస్లింలుండేది భారతదేశంలోనేనని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వారు మెజారిటీలో వున్నప్పటికీ అక్కడి సమస్యల పట్ల నిర్లిప్తతతో-ఉదాసీనతతో వుంటారని, మైనారిటీలో వున్న దేశాల్లో వారి ఉనికిని గుర్తించకపోవడం జరుగుతున్నదని అంటారు. భారత దేశంలోని ముస్లింలు మత పరమైన విద్యాభ్యాసాన్ని, పరిజ్ఞానాన్ని తర తరాల అపారమైన వారసత్వ సంపదగా పొందారని, అందువల్ల, యావత్ ప్రపంచానికి అసలు విషయాన్ని తెలియ పరిచే దిశగా పయనించడానికి సరైన స్థానంలో వున్నారని, ఆ దిశగా ఈ వివాద పరిష్కారాన్ని ఎరుక పరిచే విధంగా తమ పాత్ర పోషించాలని సూచించారు జస్టిస్ ఖాన్.

          జస్టిస్ ధరమ్ వీర్ శర్మ మాత్రం ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే తీర్పు రాశారు.


          తీర్పు వెలువడిన తరువాత దానిలోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ అఖిల భారతీయ హిందు మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే మంజూరు చెసింది. అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం, ఎవరూ కోరక పోయినా, స్థలాన్ని విభజించడం ఎందుకని ప్రశ్నించింది. వివాదానికి సంబంధించిన అనేక విషయాలు అరబిక్, పర్షియన్, సంస్కృతం, హింది, ఉర్దు, పంజాబీ భాషల్లో వున్నందున, వీటన్నింటినీ ఆంగ్లంలోకి తర్జుమా చేసి చదివి పరిశీలించాల్సిన అవసరం వున్నందున బహుశా వాదనలు వినిపించడానికి చాలా కాలం పట్టవచ్చు నేమో! End

1 comment:


  1. వ్యాసం బాగుంది !

    ఆ యెనిమిది వేల పైబడ్డ పూర్తి తీర్పు పీ డీ ఎఫ్ లింక్‌ కూడా చేర్చి ఉంటే బాగుంటుంది ! చేర్చగలరు


    జిలెబి

    ReplyDelete