Monday, April 17, 2017

ఆజన్మాంతం జీవన వెలుగులు : వనం జ్వాలా నరసింహారావు....ఆంధ్రజ్యోతి దినపత్రిక

ఆజన్మాంతం జీవన వెలుగులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (18-04-2017)

          రైతులకు అవసరమైన ఎరువుల కొనుగోలుకు ప్రతి రైతుకు ఏటా ఎకరానికి రు. 4000 చొప్పున ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సీఎం చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో మరో మైలురాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల మంది రైతులకు అవసరమైన సుమారు 25 లక్షల టన్నుల ఎరువులు ప్రభుత్వ ఖర్చుతో కొనుక్కునే వీలు కలుగుతుంది. రైతుల సంక్షేమానికి ఈ పాటికీ అమల్లో వున్న అనేక కార్యక్రమాలకు ఇది అదనం.

సీఎం ఆలోచనాధోరణికి అనుగుణంగా రూపకల్పన జరిగి, వివిధ స్థాయిల్లో అమల్లో వున్న వందలాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దారిద్రరేఖ దిగువన జీవనం సాగిస్తున్న బడుగు, బలహీన వర్గాల ప్రజల వెన్నంటి వుంటూ వారి జీవితాల్లో ఆజన్మాంతం వెలుగు రేఖలు నింపుతున్నాయి. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి, తల్లీ బిడ్డల సంరక్షణతో మొదలుకొని, వారికి సరైన పౌష్టికాహారం అందిస్తూ, వివిద స్థాయిల్లో వారిని ఆదుకుంటూ, ఆదరిస్తూ, ఔదార్యం చూపుతూ, ఆ బిడ్డ పుట్టిన తరువాత విద్యాబుద్దులు నేర్చే సమయంలో, ఉన్నత చదువుల నేపథ్యంలో, పెళ్లి నాటి వేడుకల్లో భాగమై వారి ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ, వృత్తిలో చేదోడువాదోడుగా నిలుస్తూ, ఆయా పథకాలను, ఆయా సమయాల్లో అందిస్తూ, అనునిత్యం ఆసరాగా వుంటూ, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, గతంలోనూ, వర్తమానంలోనూ ఇలా జరగలేదని పదేపదే గుర్తుచేస్తూ వుండడం తెలంగాణా రాష్ట్రానికే గర్వకారణం అనాలి. అలా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను సంక్షిప్తంగా నెమరేసుకుంటే ఆసక్తికరంగానూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగానూ వుంటాయనడంలో అతిశయోక్తి లేదు.

బిడ్డ పుట్టే నేపధ్యంలో....తొంబై రోజుల పాటు బిడ్డ ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రత్యేక సెలవు సదుపాయం కలిగించింది ప్రభుత్వం. ఆరు నెలల ప్రసూతి సెలవుకు ఇది అదనం. పిల్లలకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు దఫాలవారీగా ఈ సెలవులను విడతలుగా వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యే మహిళలకు, ప్రసవించిన అనంతరం తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పన్నెండు వేల రూపాయల ఆర్ధిక సహాయం మూడు విడతలుగా లభిస్తుంది. దవాఖానాలో చేరిన వెంటనే వారి జీవన అవసరాలకు మొదటి విడతగా 4 వేల రూపాయలు, డిశ్చార్జి సమయంలో మరో 4 వేల రూపాయలు, శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేల రూపాయలు అందుతాయి. అమ్మాయి పుడితే తెలంగాణ ఆడబిడ్డకు ప్రోత్సాహంగా మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందిఅప్పుడే పుట్టిన పిల్లకు కావాల్సిన 16 రకాల సామాన్లతో రూ.2వేల వ్యయంతో కేసీఆర్ కిట్ ను ప్రభుత్వం బహుమానంగా ఇస్తుంది. అలాగే ఏజెన్సీల్లో గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు క్షేమంగా తీసుకురావడం, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లడం కోసం "అమ్మ ఒడి" కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. గర్భిణీలు ప్రతి మూడు నెలలకోసారి చెకప్‌ల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం కొరకు వాహన సౌకర్యం కలిగించింది ప్రభుత్వం. బిడ్ద పుట్టిన తరువాత ఆరోగ్య లక్ష్మి - పోషకాహారం పథకం అమల్లో వుంది. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అంగన్‌ వాడి కేంద్రాల ద్వారా గర్బిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది.

విద్యాబుద్దులు నేర్చుకునే సమయంలో...హాస్టల్ విద్యార్థులకు, పాఠశాల్లో, కళాశాలల్లో చదువుకునే వారికి మధ్యాహ్న భోజన పథకానికి  జనవరి 1, 2015 నుండి సన్నబియ్యం సరఫరా చేస్తున్నది ప్రభుత్వం. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ సరేసరి. రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సులు చదివే 11,57,589 మంది పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ ప్రభుత్వం అమలు పరుస్తున్న మరో పథకం. రాష్ట్రం లోని పేద విద్యార్ధులకందరికీ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్దులందరికీ స్కాలర్ షిప్స్ ఇస్తున్నది. సర్కారీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలను, పాఠశాలలను పెద్ద ఎత్తున ప్రారంబించడం జరుగుతున్నది. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో సర్కార్ విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ తరగతులను ప్రారంభించింది. యూపిఎస్సీ, టిఎస్‌పిఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలకు పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి జిల్లా స్థాయిలోనే ఎస్సీ, ఎస్టీ, బిసి స్టడి సర్కిల్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పెరిగి పెద్దకాగానే....ఉన్నత చదువుల కోసం...మైనారిటి విద్యార్థుల కోసం "ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం" అమలవుతున్నది. దళిత విధ్యార్థుల కోసం అమల్లో వున్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం తరహాలోనే మైనారిటీ విధ్యార్థులకు ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల స్కాలర్ షిప్ తో పాటు విమానయాన ఖర్చులు కూడా ప్రభుత్వం అందచేస్తున్నది. అలాగే బిసి విద్యార్థుల కోసం ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇలా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు పెళ్లినాటికి కూడా అందుబాటులో వచ్చే విధంగా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేర్లతో, దళిత, గిరిజన, మైనారిటీ కుటుంబాలతో పాటు బిసిలు, అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వారి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఆర్థిక సహాయం అందచేస్తున్నది ప్రభుత్వం. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలే ఈ పథకానికి అర్హులనే ప్రభుత్వ నిబంధన వల్ల, బాల్య వివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆర్ధిక ఎదుగుదలకు బడుగు బలహీన వర్గాల వారి జీవితంలో వెలుగులు నింపడానికి, వారి సంక్షేమం కొరకు,  మరెన్నో పథకాలను అమలు చేస్తోందీ ప్రభుత్వం. వాటిలో ఒకటి...నిరుపేద, నిరుద్యోగ యువతకు జీవనోపాది కల్పించాలన్న ఉద్ధేశంతో అమలవుతున్న ఎకానమిక్ సపోర్ట్ పథకం. ఈ కొత్త విధానంలో వారికి ఇచ్చే రుణ సదుపాయంలో సబ్సిడీని భారీగా పెంచింది.

అందరూ, అందరిలాగే, కడుపు నిండా భోజనం చేయాలన్న దృక్ఫదంతో, ఆరు కిలోల బియ్యం ప్రవేశ  పెట్టిందీ ప్రభుత్వం. ఒక్కో వ్యక్తికి  6 కేజీల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కేజీల చొప్పున  బియ్యాన్ని అందిస్తున్నది. హైదరాబాద్ నగరంలో ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం దొరుకుతున్నది. నగరంలోని పెద్ద పెద్ద హాస్పటల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, కూలీలు వుండే వివిద ప్రదేశాలలో  ఈ భోజనం లభించే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వేడి వేడి ఆహారాన్ని అందచేస్తున్నది ప్రభుత్వం.  హైదరాబాద్ నగరంలో "ఓన్ యువర్ ఆటో" అనే వినూత్న పథకం ద్వారా మైనారిటీ యువకులకు 50 శాతం సబ్సిడీపై ఆటోలు దొరుకుతున్నాయి. మైనారిటీ జీవన పరిస్థితులు మెరుగు పర్చడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. స్కాలర్ షిప్పులు,   టిఎస్ ప్రైమ్ పథకంహైదరాబాద్ లో ప్రత్యేక ఐటి పార్కు లాంటివి వారి కొరకుద్దేశించిన కొన్ని సంక్షేమ పథకాలు.


బీసీ కులాల్లోని అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా  వీరి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కుల వృత్తులకు తద్వారా మళ్లీ మహర్దశ పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ, గొల్ల కురుమ కులాలవారికి 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వంద శాతం సబ్సిడీతో చేపపిల్లల పెంపకం కొరకు ఏర్పాట్లు జరిగాయి. అవసరమైన నిధులను కేటాయించి, ఉచితంగా చేపపిల్లల పంపిణీకి, కేజ్ కల్చర్ (పంజరాల్లో చేపల పెంపకం), చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణానికి వినియోగిస్తున్నది. నేత కార్మికుల సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి నేత కార్మికుల సంక్షేమం కొరకు, చేనేత మగ్గాలు, మర మగ్గాలలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నది ప్రభుత్వం. సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్ అమలు చేసి, విద్యుత్తు చార్జీల్లో మినహాయింపు ఇస్తున్నది.

ఆజన్మాంతం సంక్షేమం అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో భాగంగా సీఎం తలపెట్టిన మరో కార్యక్రమం సాదాబైనామాలకు సంబంధించినది. రాష్ట్రంలో భూ వివాదాలన్నీ సత్వరం పరిష్కరించి, భూ రికార్డులు సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సాదా బైనామాలను (గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు) ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నది. దాదాపు 11.19 లక్షల మందికి సాదా బైనామాల ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా లబ్ది కలుగుతుంది. హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలోని వ్యవసాయ భూములకు కూడా సాదాబైనామా ద్వారా లబ్ది చేకూరుతుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, రైతు చేసిన అప్పుల చెల్లింపునకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది. బాధిత కుటుంబంలో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి పథకం అమలవుతుంది. సమాజంలోని అన్ని వర్గాల వారికి ఏ విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో అలాగే పేద బ్రాహ్మణుల సంక్షేమానికి వరుసగా రెండేళ్లలో రూ.100 కోట్లు చొప్పున రు.200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన 470 మంది తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద రు.10 లక్షలు, కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ కుటుంబమైతే భూమిని సమకూర్చడం జరిగింది. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు సంవత్సరానికి 46 రూపాయల ప్రీమియంతో 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. గీత కార్మికులకు, మత్య్స కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా సమాన పరిహారం అందిస్తుంది. గీత పారిశ్రామిక సంఘాలు, మత్య్స కార్మికసంఘాల్లో ఇప్పటివరకు రిజిస్టర్ అయి సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న కార్యకర్తలకే ఇది వర్తిస్తుంది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం 11 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఐడీ కార్డులు, ఇతర నిర్మాణ వ్యవస్థల గుర్తింపు, సెస్ వసూలు, ఆరోగ్య కార్యక్రమాలు కూడా చేపట్టింది. కార్మికులు నిలబడే చోట నీడ, తాగునీటి సౌకర్యంతోపాటు వారికి ఈఎస్‌ఐ వైద్య సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంట కోసం కిరోసిన్ వాడని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం అర్హులందరికీ దీపం కనెక్షన్లు అందిస్తున్నది. అంగన్ వాడీల జీతాలు 150 శాతం పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతూ, ఆర్థిక పరిస్థితులతో కష్టాలు పడుతున్న మహిళలకు ప్రభుత్వం నుంచి 2017 ఏప్రిల్ నుంచి ఆసరా ఫించన్ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభా పరంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. కాని సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే రద్దు అయ్యేవి. ఇకపై వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా ప్రతిపాదనలు చేశారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా పక్కాగా సవరణలు రూపొందించింది. కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాది బడ్జెట్‌లో కలిపే విధంగా ఫిబ్రవరి 2, 2017న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సవరణలు చేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరును ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి పేరుతో పిలువనున్నారు. ఈ నిధులను దళితులు, గిరిజనుల కుటుంబాలు, ఆవాసాలకు మాత్రమే ఉపయోగపడేలా వాడాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో సాధారణ పనులు, పథకాల ద్వారా చేసే ఖర్చు ఆ గ్రామానికి ఉపయోగపడితే సంబంధిత శాఖ నిధులే వినియోగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బిల్లు శాసనసభ, మండలి ఆమోదం పొందింది. ఇకనుంచి ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో, ఆ డబ్బంతా నేరుగా ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌ శాఖకే వెలుతుందిదాని ద్వారా ఖర్చు చేస్తారు. దీనవల్ల నిధుల మళ్లింపు జరుగదు. ఎస్సీల కోసం తయారు చేసే పథకాలు, కార్యక్రమాలు కూడా గ్రామీణ ప్రాంతాలు, అర్బన్‌ప్రాంతాలు, సెమి అర్బన్‌ప్రాంతాలకు వేరు వేరుగా వుంటాయి.

రాష్ట్రంలోని వృద్దులు, వికలాంగులు, వితంతువులతో పాటు కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఆసరా పెన్సన్లు అందిస్తున్నది. గతంలో కంటే వారి పెన్షన్లను భారీగా పెంచింది.

రాష్ట్రంలోని 4.22 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 50 లక్షల మంది సభ్యులకు  ఉపయోగపడేలా గ్రూపుల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది ప్రభుత్వం. మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. కుటుంబానికి మూడెకరాల భూ వసతి కల్పిస్తే, అది వారు ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అనువైన వనరుగా  ఉపయోగపడుతుందని భావించిన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆగష్టు 15, 2014న "దళితులకు మూడెకరాల భూ పంపిణీ" కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని బోరు, మోటారు, కరెంట్‌ కనెక్షన్‌ లాంటి వసతులతో  చేపట్టింది. ఈ సదుపాయాలన్నిటితో పాటు మొదటి పంటకు అవసరమైన పెట్టుబడిని కూడా సమకూరుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం  కలిగిస్తున్న రాయితీలలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో 22% మేరకు స్థలాలను ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు. హైదరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు జరుగనుంది. స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ ప్రీనర్స్ (TS PRIDE) అనే కొత్త కార్యక్రమం అమలు అవుతున్నది.

ప్రతి మనిషికి తప్పక కావాల్సింది తింటానికి అండ...వుండడానికి అండ. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు బలహీన వర్గాల గృహనిర్మాణాల పేరిట ఇండ్లు నిర్మించినా, అవి పేదలకు పెద్దగా మేలు చేయలేదుతెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాసయోగ్యమైన ఇల్లు, వారి ఆత్మ గౌరవం కాపాడే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటుందిఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు ఒక హాలు, వంటగది, టాయిలెట్లు ఉంటున్నాయి. మొదటి విడతగా ఆధునాతన పద్ధతుల్లో ఒక్కో యూనిట్‌కు 7లక్షల 90 వేలు ఖర్చు చేసి ఐడిహెచ్ కాలనీలో ఇళ్లనిర్మాణం చేపట్టారు. మలి విడతగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో దాదాపు 600 ఇండ్లకు ఒకేసారి గృహప్రవేశాలు చేశారు. లబ్దిదారులకు రూపాయి భారం కూడా పడకుండా పూర్తిగా ఉచితంగా ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది ప్రభుత్వం.

ఇవన్నీ ఒక ఎత్తైతే రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన కొత్త రిజర్వేషన్ల చట్టం మైనారిటీ, ఎస్టీ సంక్షేమ దిశగా మరో ముందడుగు అనాలి. ఈ చట్టం ఆమల్లోకి రాగానే , బీసీ-ఈ కేటగరీ కింద ముస్లిం మైనారిటీలకు విద్యా-ఉద్యోగాలలో 12% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్ సదుపాయం కలుగుతుంది.

          మూడు నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు సేవలందించి పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ రోజునే పూర్తి పెన్షన్ అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అదే రోజు ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ వాహనంలో ఇంటిదాక పంపించి రావాలని నిర్ణయించింది. దీనిని కచ్చితంగా పాటించాలని అధికారులకు స్పష్టం చేసింది. వీరి పట్ల అత్యంత మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఇతర ఉద్యోగులకు ఉందని సీఎం స్పష్టం చేసారు.

            తెలంగాణ అంతటా మెరుగైన స్వర్గధామాల ఏర్పాటుకు కృతనిశ్చయంతో వుందీ ప్రభుత్వం. ఎంతటివారికైనా తప్పని అంతిమయాత్రకు పరమపద వాహనాలు కూడా ఏర్పాటు చేసిందీ ప్రభుత్వం. మనిషి చనిపోతే సమీప బంధి మిత్రులకు ఓ వైపు పుట్టెడు దుఖం, కడసారి చూపుకోసం ఇంటి వద్ద ఎదురుచూసే కుటుంబ సభ్యులు, ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా వుండడం.. ఆ పరిస్థితులనే ఈ దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకునేవారు. వీరి బాదలను అర్ధం చేసుకున్న ప్రభుత్వం దవాఖానల్లోని మార్చురీల్లో పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాలను సంబంధిత బంధువుల ఇళ్ల వద్దకు ఉచితంగా చేర్చడానికి పార్థివ దేహాల అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాలు మృత దేహాలను వారి గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.


            తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా...ఇలా.. ఆజన్మాంతం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా పలువురి మన్ననలను పొందుతున్నది. END

No comments:

Post a Comment