Sunday, April 23, 2017

భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనం .... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనం
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
 వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (24-04-2017)

          సీతను తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో శ్రీరాముడి దగ్గరకు తీసుకు పోతాను రమ్మని ఆమెను కోరుతాడు హనుమంతుడు. "మగవాడిని-రాముడిని" తప్ప మరెవ్వరినీ తాకననీ-లక్ష్మణ, సుగ్రీవులతో కూడిన రామచంద్రమూర్తినే లంకకు తీసుకొచ్చి, రావణుడిని చంపి, తనను తీసికొని పొమ్మని, ఆయనతో చెప్పమని అంటుంది జవాబుగా. తను చెప్పిన ఈ "ఉపాయం" తప్ప తక్కినవన్నీ వదిలేయమనీ, దుఃఖంలో వున్న తనను కృతార్ధురాలిని చేయమనీ, ప్రార్ధిస్తుంది.

          హనుమంతుడు వెంట రానని సీతాదేవి చెప్పటంలో ఎంతో గూడార్ధముంది. "మగవాడిని-రాముడిని" (మగవానిని రాముని తప్ప నింకనెవ్వరిని స్పృశింప నొల్ల) తప్ప అన్యులను తాకననటంలో అర్ధం: శ్రీరామచంద్రుడొక్కడే పురుషుడని, తక్కిన వారందరూ స్త్రీలని అనుకోవాలి. "భగవంతుడు, వాసుదేవుడు" మాత్రమే పురుషుడు. తక్కిన బ్రహ్మాదులతో కూడిన ప్రపంచమంతా స్త్రీ మయమే! స్త్రీ-స్త్రీ తో కలిస్తే ఆనందం లేదు కదా! అంతే "జీవాత్మ". భగవంతుడితో సాయుజ్యం పొందితేనే ఆనందమ్ కలుగుతుందికాని, బ్రహ్మాదులతో సాయుజ్యం కల్గితే మళ్లీ పుట్టాల్సిందే...మళ్లీ దుఃఖించాల్సిందే!

          సీతాదేవి మరో అభిప్రాయంలో "ఆత్మనిక్షేపం, పారతంత్ర్యంస్పష్టంగా చెప్పడం జరిగింది. "ప్రపన్నులు" తప్ప తక్కిన "ముముక్షువు" లందరూ, భగవత్ ప్రాప్తికి, "భక్తో, కర్మయోగమో, జ్ఞాన యోగమో, అష్టాంగ యోగమో", ఏదో ఒకటి సాధనంగా స్వీకరిస్తారు. ప్రపన్నుడు ఈ సాధనాలేవీ ఆశించడు. భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనమనీ, ఆయనే వచ్చి తనను తీసుకోపోవాలనీ భావిస్తాడు. ప్రపన్నుడు భగవంతుడిని తప్ప మరే సాధనం కోరడు. ఒకవేళ  కోరినా, భగవత్ ప్రాప్తి తప్ప మరే ఫలం కోరినా, భగవంతుడిని తప్ప మరే దేవతను ఆశ్రయించినా, ప్రపత్తి చెడుతుంది, ఫలించదు. హనుమంతుడు వెంట సీతాదేవి వెళ్లుంటే, ఆమెను రామచంద్రమూర్తి భ్రష్టురాలివైనావని స్వీకరించి ఉండడు. కాబట్టి "ప్రపన్నులు" అన్ని విధాలుగా "అనన్యు" లై వుండాలి.

            "భక్తుడికీ, ప్రపన్నుడికీ" భగవంతుడు తన పాలిట వున్నాడను కోవటానికి అనేక నిదర్శనాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయి. వాటిని బట్టి తక్కినవి ఊహించుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి తక్కిన అందరు దేవతలకంటే గొప్పవాడని తెల్సుకోగలుగుతాడు. ఇట్టి ఉత్తమోత్తమ దేవతను సాధించే "ప్రవృత్తి"నే ఉత్తమోత్తమ "ఉపాయ"మని గ్రహించి దృఢ చిత్తంతో, అనన్యుడిగా వుండాలి. అందుకే సీత అంటుంది...తక్కిన అన్ని ఉపాయాలూ వదలమని, గుహలో వున్న భగవంతుడిని తాను వెతుక్కుంటూ పోలేను, ఆయన్నే ఇక్కడకు రప్పించమని. "శిశ్యుడు-ఆచార్యు"డిని కోరడమే యిది. హనుమంతుడు జవాబులో "ఆచార్య కృత్యం" అంటే ఏమిటో కూడా వుంది.

          హనుమంతుడుతో, శ్రీరామలక్ష్మణులకు సందేశ వార్తలను పంపుతూ సీతాదేవి, తనకు బదులుగా తన నమస్కారమని తన తరఫున రాముడికి మ్రొక్క మని అంటుంది. తనను రక్షించమని అడిగానని మాత్రం చెప్పవద్దని కోరుతుంది. ఇదివరకు తన్ను రక్షించమని కోరి మహాపరాధం చేసాననుకుంటుంది. ప్రపన్నురాలు అలాంటి కోరికలు కోరరాదు. భగవత్ కృత్యం ఆయనకు నేర్పి "దురహంకారి" నైనా ననుకుంటుంది సీత. అంటే ఆయనపై "విస్మృతి" దోషం ఆరోపిన్చినట్లే! ఆయన రక్షిస్తాడన్న విషయంలో విశ్వాసం లేనట్లే! ఆయన సొత్తు కాపాడుకున్నా, పోగొట్టుకున్నా, బలవంత పెట్టేందుకు తనెవరనుకుని, దోష నివృత్తి కొరకు, ప్రాయశ్చిత్తంగా "నమస్కరిస్తున్నా" నని మాత్రమే చెప్పమంటుంది.


            రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుధ్ధంలో బల-పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, తనను అయోధ్యకు తీసుకొని పోతేనే "కీర్తికరం" అంటుంది సీత హనుమంతుడితో. అప్పుడే తను "వీరపత్ని"నన్న బిరుదుకు అర్హురాలినని కూడా అంటుంది. ఈ విధంగా సీత కోరరాని కోరికేమీ కోరలేదు. "పరమ భక్తులు, ప్రపన్నులు" భగవంతుడే స్వయంగా వచ్చి, తమను పిల్చుకోపోవాలని కోరుకుంటారు కాని, దూతలతో పిలిపించు కోవటానికి ఇష్తపడరు. సీత చెప్పిన "ఉపాయం" గొప్పదైనా, "ఉపేయం" కూడా గొప్పదే! ఉపేయం గొప్పదైతే, దాన్ని సాధించే ఉపాయం కూడ గొప్పగానే వుండాలి. "ఉపేయం" రామచంద్రమూర్తి....దాని సాధనోపాయం రామచంద్రమూర్తి రావడమే!

          భగవంతుడు ఎల్లవేళలా జ్ఞాపకం వుండడానికి సీతాదేవి "చూడామణి"నుంచుకున్నట్లే, ఓ పతకం కానీ, మరేదైనా చిహ్నం కానీ శరీరం పైన ధరించాలెప్పుడూ. శరీరం ధర్మసాధనం, భగవత్ సాధనం కద! దాని పని భగవంతుడి స్మరణకే! దేహం లేక పోతే భగవత్ స్మరణే లేదు. భగవంతుడిని స్మరిస్తేనే గాని భగవత్ ప్రాప్తి లేదు. భగవత్ ప్రాప్తికై దేహ ధారణ చేయాలేకాని, మనమే దేహాన్ని విడిచిపెట్ట కూడదు. దానిని "అన్య ప్రాకృత" విషయాల్లో వినియోగించ కూడదు. దేహం పోయే లోపల భగవత్ ప్రాప్తి కలిగే ఉపాయాన్ని వెతుక్కోవాలి. అట్టి దేహం మీద సీతాదేవి, సర్వాభరణాలు వదిలి "చూడామణి"ని మాత్రం ప్రాణపదంగా వుంచుకుంది. దాన్నీ రామార్పణం చేసి,హనుమంతుడికి తన గుర్తుగా యిచ్చి, "సర్వస్వ నిక్షేపం" చేసిందయింది.

          అశోక వనాన్ని పాడుచేసిన హనుమంతుడి ఘోర, భయంకర రూపాన్ని చూసిన, రాక్షస స్త్రీలు, ఆయన్ను గురించి సీతాదేవిని అడిగినప్పుడు, తనకు తెలియదని అబధ్ధం చెప్పుతుంది. అయినా అసత్య దోషం ఆమెకు తగలదు. ప్రతిమనిషి, ప్రతినిత్యం, పాటించాల్సిన "యమము" లలో ముఖ్యమయినవి అయిదు. అవి: "అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం". చివరి నాలుగింటికి "అహింస" తల్లి. సత్యాదులు దాని బిడ్డలు. నిజం చెప్పడం వల్ల నిరపరాధికి, నిష్కారణంగా హింస జరిగితే, జరుగుతుందనుకుంటే, సత్యం చెప్ప రాదు. అసత్యమాడవచ్చు. దురుద్దేశం లేని హాస్యమాడేటప్పుడు, స్త్రీల విషయంలో, వివాహ కాలంలో, ప్రాణాపాయ సమయంలో సర్వస్వం కోల్పోయేటప్పుడు అసత్యం చెప్తే పాపం తగలదు. సత్యం చెప్తే హాని జరుగుతుందనుకుంటే, అసత్య మాడవచ్చునే కాని, ఆడాలన్న నిర్భందం మాత్రం లేదు. హనుమంతుడు, సీతాదేవికి ప్రత్యుపకారం కోరని ఉపకారి. నిరపరాధి. సత్యం చెప్తే, ఆయనకు, తనకు, ప్రాణహాని కలుగుతుందని భయపడింది సీతాదేవి.


ఇంద్రజిత్తు హనుమంతుడిని, "బ్రహ్మాస్త్రం"తో బంధించిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగానే, బ్రహ్మాస్త్ర బంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపోతాయి! దీనర్ధం:  ప్రపత్తి చేసినవాడు, దాని మీద విశ్వాసం లేక పోతే, ప్రపత్తికి సహాయ పడుతుందని వేరే సాధనాన్ని వుపయోగిస్తే, "ప్రపత్తి" చెడిపోతుంది. ప్రపత్తి లో వున్న అపాయం ఇదే! ఇతర "ఉపాయాల"ను అది సహించదు

No comments:

Post a Comment