Monday, December 18, 2017

సీతాదేవికి తనకోరికను చెప్పిన రావణుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీతాదేవికి తనకోరికను చెప్పిన రావణుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (18-12-2017)

ఇలా సీతను సమీపించిన రావణుడు, తియ్యటిమాటలతో,తన మనసులోని ఆలోచనను, స్పష్టంగా, పతివ్రతా శిరోమణైన సీతకు చెప్పాడీవిధంగా:

"ఓ నాప్రియురాలా! జగదేకమోహినీ! నన్నుచూసి నీవెందుకు కడుపు, స్తనాలూ దాచుకుంటున్నావు? ఎందుకిట్లా వణుకుతున్నావు? ఇక్కడ ఇతరులెవరూ లేరు. నామాటవిను. సౌందర్యగనీ! నన్ను గౌరవించు. ఇక్కడ నీజాతి మనుష్యులెవ్వరూ లేరు, నా జాతివారూ లేరు. కామరూపులైన రాక్షసులూ లేరు. ఎవరన్నా చూసి ఏమన్నా అనుకుంటారన్న భయంలేదు. నాకూ నీవు భయపడాల్సిన అవసరంలేదు. నేను రాక్షసుడనైనప్పటికీ, నీమీద కామంతో వచ్చానేకాని నిన్ను చంపడానికి రాలేదు."

"ఓరీ! నేను నీభార్యను కాను, పరుల భార్యలను కోరవచ్చా అంటావేమో! పరుల భార్యలను పొందడం, ఇతరుల ధనం అపహరించడం, మారాక్షస కులధర్మం. పిరికిదానా! ఇదికులధర్మం కాబట్టి దోషంలేదు. నీకు పాపభయమక్కరలేదు. సుందరీ! ఇది నాస్వధర్మమైనా, నాపై నీకు కామం కలుగలేదు కాబట్టి నిన్నింకా తాకడంలేదు. నీవే, నీకోరిక ప్రకారమే, యధేఛ్చగా నామీద దయవుంచి, నన్ను కామించు".

"దేవీ! నువ్వు భయపడవద్దు. నన్ను అనుగ్రహ దృష్టితో గౌరవించు. దిగులుపడొద్దు. ఒంటిజడ, నేలపైనిద్ర, ఉపవాసాలు, విచారం, మాసినచీరె, నీకిక్కడ తగవు. సొగసైన పూదండలు, దివ్యాభరణాలు, దివ్యచందనపు పూతలు, రకరకాల చీరెలు, అందమైన ఇల్లు, సొంపైన పానుపులు, పీటలు, ఆటలు, పాటలు, అంగీకరిన్చి నన్ను పొందు. స్త్రీలలో  శ్రేష్ఠురాలివైన నీవిలా వుండవద్దు. వెలగల ఆభరణాలు ధరించు. నాదగ్గరుండికూడా అలంకరించుకోకుండా వుండరాదు. కోమలమైన నీప్రాయం వృధాకాకూడదు. పోయిన వయస్సు తిరిగిరాదన్న విషయం నీకు తెలియదా?".

"నిన్ను పుట్టించిన బ్రహ్మ ఆ తర్వాత సౌందర్యవంతులైన స్త్రీలను సృష్టించడం మానేసుంటాడు. నీకు సరితూగే స్త్రీ ఈలోకంలో లేనేలేదు. నీనీ కంటే అందగత్తెను సృష్టించాలన్నా, అది వృధా ప్రయత్నమే. నీవు లభిస్తే మగవాడైన ఆ బ్రహ్మకూడా నిన్ను వదలడు. నీదేహం మీద ఎక్కడెక్కడ నాచూపులు పడ్డాయో, అక్కడే అవి ప్రేమతోభ్రాంతితో నిల్చిపోతున్నాయి. కొంచెంకూడా కదలడంలేదు. నిన్ను పొగడడం నాకు సాధ్యం కావడంలేదు. అజ్ఞానం వదలి నా భార్యవు కా. నేను దేశ, దేశాలనుండి బలాత్కారంగా తెచ్చిన స్త్రీలందరికి నీవు పట్టపురాణివి కా. నామణులు, రాజ్యం, నీ సొత్తే. ఇంకా కావాలంటే సమస్త భూమినీ, నగరాలనూ, జయించి, నీ జనకుడికి నీ తృప్తితీరా ఇస్తాను".

"యుధ్ధమందు నన్నెదిరించగల శూరులెవ్వరూలేరు. యుద్ధంలో నాబలామ్, శౌర్యం, నీవేచూస్తావు. సీతా, నేను యుద్ధం చేస్తుంటే, కట్టినతాళ్లు తెగి, దండాలు విరిగి, నేలరాలిన ధ్వజాలతో, రౌతులు చచ్చిన గుర్రాలతో, కుప్పకూలిన రథాలతో, విరిగిన విల్లంబులతో, విరబోసుకుని పరిగెత్తే వెంట్రుకలవారితో, చస్తున్న శతృ సేనాభటులతో నిండివుంటుంది యుధ్ధభూమి."


"నీ సౌందర్యాన్ని తనివితీర, కళ్లారా చూడాలని నాకోరిక. ఒంటిపై ఆభరణాలు ధరించు. ఆశ తీర సమస్త భోగాలనుభవించు. పానకం సంతోషంగా తాగు. ధనం, భూమి, రాజ్యం, ఇంకేదైనా సరే, నీ ఇష్టమొచ్చినట్లు, ఇష్టమొచ్చినవారికి దానం చేయి. నన్ను దయతో చూడు. నీవేదడిగినా ఇస్తాను. నీ అనుగ్రహం నాపై కలిగితే నీ బంధువులందరినీ సుఖపెడ్తాను. ఇదిసత్యం."

ఇలా ఇంతసేపు తన్ను పొగడుకున్న రావణుడు, రాముడిని దూషించసాగాడిలా:

"నీమగడికి ఇల్లు, వాకిలి, గుడిసె లేదు. అడవుల్లో తిరుగుతున్నాడు. కట్టుకుంటానికి మంచి బట్టల్లేవు. నారచీరెలు కట్తున్నాడు. గెలుపులేనివాడు. నిద్రించడానికి చాపైనా లేదు. నేలపైనే నిద్ర. అట్టి దరిద్ర రాముడికీ, నాకూ ఏంటిపోలికరాముడు, రాముడని అంగలారుస్తున్నావుకాని, అతడింకా బ్రతికేవున్నాడని నమ్మకమేంటి? చావలేదని ఎట్లా చెప్పగలవు? బ్రతికున్నా నిన్ను చూడడానికి రాలేడు. కొంగలు వ్యాపించిన చంద్రుడిపైన వానమబ్బు కమ్మితే వెన్నెలను చూడటమెంత అసాధ్యమో, సముద్రాన్ని దాటి నన్ను గెలిచి నీదగ్గరకు రావడమంత అసాధ్యం. (సముద్రమ్లో వుండే సింహిక అనే జలాంతర్గామి చంపబడిందన్న వార్త రావణుడికి తెలిసి వుండదు పాపం!) హిరణ్యకశిపుడి భార్యను ఇంద్రుడపహరించినా వుంచుకోలేకపోయాడు. కాని, నాచేచిక్కిన నిన్ను మరల రాముడు హరించెనేని నాకీర్తి హరించినట్లే. అది జరగదు. నీవు నా భార్యవు. నిన్ను రాముడు, నయానా, భయానా హరించలేడు నానుంచి. (రావణుడు తనను గొప్పకోసమని ఇంద్రుడితో పోల్చుకున్నాడు)"

"అందమైన చిరునవ్వుతో, సుందరమైన దంతాలతో, కళ్ల సొగసుతో, గరుత్మంతుడు పామును హరించినట్లు, నువ్వు నామనస్సును హరిస్తున్నావు (ఈ ఉపమానం సీతాదేవి రావణుడి పాలిట మృత్యుదేవతని సూచిస్తున్నది). మాసిన చీరెతో, సొగసుపోయి, ఆభరణాలు ధరించక, కష్టపడుతున్న నిన్ను చూస్తూ, నేను నా భార్యలతో నిశ్చింతగా గడపలేకపోతున్నాను. సీత ఇంత కష్టపడుతుంటే, నాకెందుకీసుఖమని, నామనస్సు నీమీదనే వుండడంతో, వారెవ్వరిపై మనసు పోవడంలేదు. అయితే నిన్నంగీకరిస్తే వాళ్లకు కోపమొస్తుందేమోనని అనుమానం వద్దు. నా భార్యలందరూ సుగుణ సంపత్తికలవారే. వారందరికి నీవే ఈశ్వరివి. నీ అధికారానుసారం నిన్నే అనుసరించి వస్తారు వారందరూ".

"శ్రీమహాలక్ష్మిని ముల్లోకాల అప్సరసలు ఏవిధంగా భయ, భక్తులతో సేవిస్తారో, అలానే, నా ఆడవాళ్ళందరూ నిన్ను సేవిస్తారు. కుబేరనగరం అలకాపురిలోని నిధులందున్న రత్నాలన్నీ నీవే. తీసుకో. లోకంలో వున్న వెలలేని ఆభరణాలన్నీ నీవే. తీసుకో. నన్ను స్వీకరించు. తపంలోకాని, బలంలోకాని, పరాక్రమంలో కాని, ధనంలోకాని, లోకంలో మంచికీర్తి విషయంలో కాని, రాముడు నాతో సమానుడు కాడు. సీతా! నీ ఇష్టమొచ్చినట్లు మనసారా నాతో గడుపు. త్రాగు  భోగాలు అనుభవించు. నీవు ఏదికోరితే అది ఇస్తానంటున్నాను కద! నీవాళ్ళందరినీ సుఖపెట్తానంటున్నాను కద!. ఓ లలనా! త్రాగు. విహరించు. రమించు. నీకు కావలసిన ధనమో, భూమియో, నీకేది కావాలంటే అది ఇచ్చేస్తాను. నీకేకాదు, నీవారందరికీ అన్ని సుఖాలను సమకూరుస్తాను.

"భామినీ, నీవింకా ఆలస్యం చేయొద్దు. బంగరుబొమ్మా! ఝంకారాలు చేసే తుమ్మెదగుంపుల మధ్య, సముద్రతీరంలోని పూలచెట్ల పొదల్లో నాతో విహరించు"అంటాడు రావణుడు. 

No comments:

Post a Comment