Tuesday, December 5, 2017

ఉద్యోగులకు నైతిక బోధ : వనం జ్వాలా నరసింహారావు

ఉద్యోగులకు నైతిక బోధ
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (06-12-2017)

         దేశవ్యాప్తంగా వివిధ స్తాయిలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల అనైతిక-అవినీతి కార్యకలాపాల గురించి మీడియాలో అనునిత్యం వార్తలు పుంఖాను-పుంఖాలుగా రావడం తెలసిన విషయమే. ఇవన్నీ విశ్లేషణ చేసి చూస్తే, పునశ్చరణ శిక్షణా కార్యక్రమాల ద్వారా సిబ్బందిలో మానసిక పరివర్తన తేవాల్సిన అవసరం వున్నదనాలి. సుపరిపాలన కావాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, పాలనలో నైతిక విలువలు పెంపొందించడం అత్యంత అవశ్యం. అవినీతిని అరికట్టడం ద్వారానే, ఆర్థికాభివృద్ధి, అట్టడుగు వర్గాల వారి అభివృద్ధి, జాతీయాభివృద్ధి జరిగే వీలుంది. ప్రభుత్వ సిబ్బందికి నైతిక విలువలంటే ఏంటో తెలియచేయడానికి, అవగాహన కలగాచేయడానికి, కనీసం ఒక వారం రోజులపాటు “పాలనలో నైతిక విలువలు” అనే అంశం మీద శిక్షణ నిర్వహించాలి. బహుశా ఇలా చేయడం వల్ల పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం వుంది.

            శిక్షణ అంటే మూడు రకాలుగా సిబ్బందిలో మార్పు తేవడం. ఒకటి...సంబంధిత అంశంలో విజ్ఞానాన్ని కలిగించడం, రెండోది...నేర్చుకున్న దానిని అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యత కలిగించడం, మూడోది...మానసిక పరివర్తన తేవడం. మొదటి రెండు తేలికైనవే కాని మూడోది మాత్రం కష్టతరం. జాతీయ శిక్షణా విధానంలో కూడా మానసిక పరివర్తన తేవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ సిబ్బందికి పౌరుడిపట్ల-పౌరుల హక్కుల పట్ల ఒకింత ఆందోళన, గౌరవం వుండాలి....దీనికొరకు నిరంతరం నైతిక విలువల పరిరక్షణకు మానసిక పరివర్తన తెచ్చేలా శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలి. వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధి, సౌశీల్యం, నిబద్ధత, నీటి-నిజాయితీ అలవడడానికి శిక్షణ దోహదపడాలి.

         వ్యక్తిగతంగా, సామాజికపరంగా, ఒక రకమైన ప్రవర్తనా నియమావళి పాటించడమే నైతిక విలువలని అర్థం చెప్పుకోవాలి. ఏ సమాజమైనా ఇవి లేకుండా అభివృద్ధి చెందలేదు. భారతదేశానికి ఒక రాజ్యాంగం వుంది. రాష్ట్రాలలో శాసనసభలు, దేశంలో పార్లమెంటు చట్టాలను రూపొందిస్తాయి. న్యాయ విభాగం ఆ చట్టాలకు భాష్యం-వ్యాఖ్యానం చెప్తాయి. శాశ్వతంగా పనిచేస్తుండే అధికారగణం, ఎన్నికైన రాజకీయ ప్రజాప్రతినిధులు, ఉమ్మడిగా, ఒక కార్యనిర్వాహక వర్గంగా పనిచేస్తూ ఆ చట్టాలను అమలు పరచడం జరుగుతుంది.

            సంస్థలకు-వ్యవస్థలకు అయిదు రకాల నైతిక మౌలిక సూత్రాలుండాలని మాజీ కేంద్ర విజిలెన్స్ కమీషనర్ ఎన్ విట్టల్ చెప్పారు. అవి: సంకల్పం, అభిమానం, సహనం, పట్టుదల, దృష్టికోణం. సమాజ సంస్కృతిని బట్టి కూడా నైతిక విలువల పరిస్థితి మారుతుంటుంది. భారతదేశంలో అనాదిగా వస్తున్న, నెలకొన్న ఒక సంస్కృతి వుంది. పాలనలో నైతిక విలువలకు మనం అనాదిగా ఆచరిస్తున్న ధర్మం ప్రాతిపదిక. అనాదిగా ధర్మంలో భాగంగా, వ్యక్తులకు నిర్దేశించిన కర్తవ్యం, తక్కువ స్థాయి-వ్యక్తిగత ఆసక్తుల కంటే, ఉన్నతమైన అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని. ధర్మాన్ని మించింది ఏదీ లేదు.

            ప్రభుత్వ పరిపానలో నీతిశాస్త్రం మూలాలలోకి పోతే, మనకొక మహత్తరమైన సంప్రదాయం-ఆచారం వుండేదని అవగతమౌతుంది. మన సాహిత్యం-వాగ్మయంలోకి తొంగి చూస్తే, సాంప్రదాయిక సమాజపరమైన లక్ష్యాలకు, వ్యక్తులకూ మధ్య చక్కటి సామరస్యం వున్నదని అర్థమవుతుంది. వాస్తవానికి ఆ సామరస్యమే ప్రభుత్వ పాలనలో అర్థవంతమైన నైతిక విలువలకు ఆధారం-మూలం. సమాజంలోని ప్రతి వ్యక్తీ అందరి క్షేమాన్ని కాంక్షించాలి. వేల-లక్షల సంవత్సరాల పూర్వం నుండీ ఆచరణలో వున్న మన సంస్కృతీ-సంప్రదాయాల పరంపరలో భాగమైన “ధర్మం” ఆధారంగానే సమాజంలోని వ్యక్తుల జీవన లక్ష్యం నిర్దేశించడం జరిగింది. ప్రతి వ్యక్తీ ధర్మాన్ని ఆచరిస్తే, అదే స్వీయ క్రమశిక్షణకు దారితీస్తుంది. స్వీయ క్రమశిక్షణ వున్న సమాజంలో శాంతి-సౌభాగ్యం సహజంగానే వుంటాయి. దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలో నూటికి-నూరు పాళ్లు స్వచ్చమైన ప్రవర్తన కలవాళ్లు అరుదనే అనాలి. ప్రభుత్వ పాలనకు ధర్మమే పునాది అనేది సుస్పష్టం.

            అసలెందుకు ప్రభుత్వ పాలనలో నైతిక విలువలుండాలి? వుంటే వాటిని ప్రోత్సహించదానికి ఏం చేయాలి? ఈ ప్రశ్నకు జవాబుగా, నైతిక విలువలు, నైతిక సిద్ధాంతాలూ, ప్రభుత్వ పాలనలో పాటించకపోతే సుపరిపాలనకు అవకాశం లేదని అంటారు మాజీ కేంద్ర విజిలెన్స్ కమీషనర్ ఎన్ విట్టల్. చట్టం ముందర-న్యాయపాలన ముందర అందరూ సమానమనే విషయం, ప్రతి వ్యక్తినీ గౌరవించాలనే విషయం, పరిమితంగా వున్న మన దేశ వనరుల వినియోగంలో వ్యర్థం కాకుండా జాగ్రత్తపడే విషయం, సుపరిపాలనకు గీటురాళ్ళు. 

         చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో విఫలమైతే సుపరిపాలనకు బదులు దుష్పరిపాలన చోటుచేసుకుంటుంది. అవినీతి బాగా వున్న చోట నైతిక విలువలు ధ్వంసం అవుతాయి-నీతీ, నిజాయితీలకు తావుండదు. మేధోపరమైన అవినీతి, ఆర్ధిక సంబంధమైన అవినీతి, నైతిక విలువలకు తిలోదకాలు, సంకుచిత మనస్తత్వం....ఇవన్నీ రక-రకాల అవినీతి చర్యలే. అవినీతికి పాల్పడం అంటే అలా పాల్పడిన వారు జాతి వ్యతిరేకిగా, ఆర్థికాభివృద్ధి వ్యతిరేకిగా, పేదవారికి వ్యతిరేకిగా భావించాలి.


         ఈ నేపధ్యంలో అవినీతిని అరికట్టడానికి, ప్రభుత్వ పాలనలో నైతిక విలువల ప్రోత్సాహానికి శిక్షణ అవసరం ఎంతైనా వుంది. శిక్షణలో సాధారణంగా ఇచ్చే వృత్తి నైపుణ్యపరమైన అంశమే కాకుండా, నైతిక విలువల పరమైన అంశాలు కూడా వుంటే, సిబ్బంది మానసిక పరివర్తనలో మార్పుకు అవకాశం వుంటుంది. ఒక వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయించేది, ఆ వ్యక్తి ఎంత మేరకు మానవ విలువలను, నైతిక విలువలను పాటిస్తున్నాడనేది మాత్రమే. డబ్బు సంపాయించాలన్న వ్యామోహం, అధికారం మీద మోజు, గుర్తింపు రావాలన్న తహ-తహ, పని చేయకుండా వుండే అనైతిక మనస్తత్వం, వీటికి సంబంధించిన నిరంతర ఆలోచనలు, స్వప్రయోజనాల ఆకాంక్ష, రోజు-రోజుకు వ్యక్తుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాలనా రంగంలోని సిబ్బందిలో పెరగడం దురదృష్ట పరిణామం. నియామకాల కొరకు, కాంట్రాక్టులు ఇప్పించేటందుకు, పదోన్నతులకొరకు, మరెన్నో రకరకాల రాయితీల కొరకు, వ్యక్తుల మధ్య, బృందాల మధ్య అనైతిక అవగాహనలు, ఒప్పందాలుండడం వింటూ వుంటాం.

            ఇలాంటి విపరీత పరిణామాలను అధిగమించడానికి అవసరమైన సంస్థలు-వ్యవస్థలు పాలనారంగంలో కావాల్సినన్ని ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకుని పరిస్థితులను చక్కదిద్దే యంత్రాంగం మాత్రం కొరవడిందనాలి. నైతిక విలువలు పాటించడమనేది పదిమంది కలిసి చేయాల్సిన పనైనప్పటికీ, ప్రారంభం కావడం మాత్రం వ్యక్తుల నుంచే కావాలి....వ్యక్తుల ఆలోచనా సరళిని బట్టి, వారి నీతి-నిజాయితీలను బట్టి, వాటి మనుగడ సాధ్యమవుతుంది. ఇందుకోసం మనం అనాదిగా పాటిస్తూ వస్తున్న పాత సిద్ధాంతాలను మరొక్క మారు పునశ్చరణ చేసుకోవాలి....తదనుగుణంగా, మన వ్యక్తిగత జీవన విధానంలోను, ఉద్యోగ ధర్మంలోను, మెసలుకోవాలి. మౌలికమైన నైతిక-మానవ విలువలకు సంబంధించిన ప్రేమ, వాత్సల్యం, దయ, నిబద్ధత, నీతి-నిజాయితీ, సత్ప్రవర్తన-న్యాయబద్ధత, సామాజిక బాధ్యత ఎవరైనా, ఎప్పుడైనా గౌరవించాలానే విషయం కానీ, ఒప్పుకోవాలనే విషయం కానీ ఎవరూ కాదనరు.

            ఇందుకోసమే, ప్రభుత్వ పాలనలో నైతిక విలువలు-మానవ విలువలు అనే అంశాన్ని, ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి రూపొందించబడే ప్రతి శిక్షణా కార్యక్రమంలో విధిగా చేర్చాలి. దానికి అనుగుణంగా శిక్షణా మోడ్యూల్స్ డిజైన్ చేసి తయారుచేయాలి. అలాంటి శిక్షణా కార్యక్రమం రెండు రకాల ఫలితాలను సాధించే వీలుంది. మొదటిది, శిక్షణలో పాల్గొనేవారికి నైతిక విలువలకు సంబంధించిన విషయం మీద సున్నితంగా అవగాహన కలిగించడంతోపాటు, అవి వారి జీవితాలపై, జీవన విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నిశితంగా తెలియచేయడం. ఇక రెండవది, నీతి సంబంధమైన సందిగ్తలను, సందిగ్తావస్తలను, సిబ్బంది ఎదుర్కుంటున్న తీరుతెన్నులను సందర్భానుసారంగా శిక్షణలో పాల్గోనేవారికి సోదాహరణంగా-ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసేందుకు తోడ్పడడం.  వాటిలో ఇమిడివున్న గూడార్థాలను పరిశీలించే అవకాశం కూడా పాల్గోనేవారికి కలుగుతుంది ఈ శిక్షణలో. 


శిక్షణ ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తే, తద్వారా సిబ్బంది పరివర్తనలో అనుకున్న మార్పు వస్తే, శిక్షణానంతరం గతం కంటే వారిలో అత్యాశ తగ్గితే, అవినీతి తగ్గితే, మరింత నిబద్ధతతో వుంటే, పౌరులపట్ల మరింత ప్రేమ-వాత్సల్యాలు చూపిస్తే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది? అదే జరుగుతే, శిక్షణ మీద పెట్టిన ఖర్చు పెట్టుబడే కాని దుబారా కాదు. శాస్త్ర సాంకేతిక రంగంలో, వ్యాపార-పారిశ్రామిక రంగాలలో, అనుక్షణం వస్తున్న మార్పులకు అనుగుణంగా, ప్రభుత్వ సిబ్బంది ప్రవర్తనలో మార్పుకు శ్రీకారం చుట్టడానికి తప్పనిసరిగా నైతిక విలువలు అనే అంశాన్ని వారికి ఇచ్చే ప్రతి శిక్షణా కార్యక్రమంలో చేర్చాలి.

No comments:

Post a Comment