Monday, March 5, 2018

శ్రీరాముడు రాలేదని అనేకవిధాలుగా పరితపించిన సీత .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడు రాలేదని అనేకవిధాలుగా పరితపించిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (05-03-2018)

దయాహీనుడైన రావణుడి ఆజ్ఞానుసారం రాక్షసస్త్రీలు తనను అనరాని, వినరాని మాటలంటుంటే, సీతాదేవి సింహం బారినపడ్డ ఏనుగుపిల్లలా వణికిపోయింది. అంతకుముందు రావణాసురుడి బెదిరింపు మాటలను కూడా గుర్తుచేసుకుని, అడవిలోపడి కాపాడేవారులేని ఆడపిల్లలాగా ఏడ్చింది. "విధి నిర్ణయించిన కాలంతీరేవరకు ప్రాణంపోదంటారు పెద్దలు. నావిషయంలో అదే నిజమవుతున్నది. కాలం రాలేదు. రావణాసురుడు నన్నిలా ఎత్తుకొచ్చి, ఈ రాక్షసులబారిన పడవేసి, వాళ్లంటున్న మాటల్తో బాధపడటానికి నేనెంత పాపం చేసానో! సుఖమా లేదాయె! దుఃఖమా అధికమవుతుండే! హృదయం వేయితునకలై పోతుండే! రావణాసురుడు పెట్టే హింసలకు లోబడి బాధపడడం కంటే ఉరిపోసుకుని చావడం మేలు. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతారంటారు కాని, ఆ నరకబాధ దీనికంటే తీవ్రమయింది కాదుకదా! రావణుడి ఇష్టప్రకారం నడుచుకుందామంటే, అన్నిబాధలు తప్పించుకుందామంటే, శూద్రుడికి వేదమంత్రం ఉపదేశించే బ్రాహ్మడిలాగా, నేను రాక్షసుడికి మనసీయవచ్చా? రామచంద్రమూర్తికి నామనసు త్రికరణశుధ్ధిగా ధారపోసాను. ఆ మనస్సును ఈ నీచుడికి అర్పించడం మహా దోషం" అని అనుకుంటుంది. (ఒక ఋశీశ్వరుడు శూద్రుడొకడికి వైదిక విధానంలో పితృకర్మ తెలిపి, వాడితో అట్లా చేయించి, రాజపురోహితుడిగా పుట్టినట్లు భారతంలో చెప్పబడింది. అంటే ముముక్షువుకు భగవత్ మంత్రం చెప్పడం నిషేధం కాదు. భక్తి, ప్రపత్తి మార్గంలో మోక్షానికి అందరూ అర్హులే, అధికారులే. చెప్పడం తప్పుకాదు. కాకపోతే, వైదిక కర్మల్లో, శూద్రుడికి అధికారం లేదనీ, ఆవిధానం చెప్పరాదనీ వాల్మీకి భావన)

"శత్రువు సహించలేని పరాక్రమవంతుడైన రాముడు రాకపోతే, గడువు ముగుస్తుండగానే, కోపం పెరిగిన రావణుడు, శస్త్రచికిత్స చేసే వైద్యుడు, గర్భంలో మరణించిన శిశువును కోసితీసేసినట్లే, వాడికత్తులతో నన్ను కోస్తాడుకదా! నిర్భాగ్యురాలైన నాకు, వాడిచ్చిన రెండునెలల గడువులో కూడా కొంతకాలం అప్పుడే గడిచిపోయిందే!" అనుకుంటూ శోకిస్తుంది సీత.

సీతాపరితాపం ఇంకా ఇలా కొనసాగుతుంది:"అయ్యో! జింకవేషంలో వున్న వంచకుడి చేతిలో నాకొరకు, రామలక్ష్మణులు, పిడుగుపాటుకు చచ్చిన సింహాల, వృషభాల జంటలా మరణించారేమో! ఇంతకంటే దుఃఖం ఏముంటుంది? ఈ అనర్ధానికంతటికీ నేనే కారణం. వాళ్లిద్దరూ నన్ను విడిచిపోవడానికి నేనే కారణం గదా! తెలివిమాలి, ఎప్పుడు దురదృష్టంతో, రామలక్ష్మణులను ఎడబాటుచేసుకున్నానో, అప్పుడే మృత్యుదేవత జింకరూపంలో వచ్చి నన్ను మోసగించింది. ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం? "జీవాత్మ-పరమాత్మ" లిరువురూ ఎడబాసిన దేహంలాగా అయిపోయానే!"

ఇంకొంచెం కటువుగా ఏంచేసే శక్తిలేనిదానిలా అనుకుంటుంది సీత: "రఘురామా! నీ పూర్వీకుల యోగ్యత, కీర్తి-ప్రతిష్టలు, అలోచించు. సత్యప్రీతిగల నువ్వు వివాహసమయంలో నాకేం ప్రమాణం చేసావు? లోకానికంతటికీ చీకటి రూపుమాపి, అమృతం కురిపించి, అందర్నీ సంతోషపరిచే చంద్రుడిలాంటి ముఖమున్న నీవు నా విషయంలో ఎందుకు సార్ధక నామధేయుడవు కాలేకపోతున్నావో చెప్పు? పొడగాటి చేతులున్న నీకు అందలేని దూరం ఏదైనా వుందా? ప్రపంచానికంతా మేలుకోరే నీవు, నిన్ను విడిచిన నన్ను రక్షించవా? వేరే రక్షించేవారులేరే? నీవు దేనికైనా సమర్ధుడవే కద! ఒక ఆడదాన్నైన నన్ను ఆపదనుండి తప్పించలేవా? ఆసామర్ధ్యం లేదా? యుధ్ధరంగంలో అరివీర భయంకరుడవే? నువ్వే తల్చుకుంటే నీముందర ఈ రాక్షసులు నిలవబడగలరా? ముల్లోకాలలోని అందరినీ రక్షించే దీక్షకలవాడవు కదా! నన్నొక్కదాన్ని రక్షించకపోతే నీవ్రతభంగంకాదా? ఓ కమలలోచనా! ఈ రాక్షసుల్లాగా నువ్వు క్రూరుడివికాదే? దయార్ద్ర దృష్టిగలవాడివే! నాపై ఎందుకు నీ దృష్టి పడలేదు? నీవుసర్వజ్ఞుడివే! నన్నిక్కడ రాక్షసులు బాధించడం నీకు తెలియదా?"

"నీకంటే నాకు వేరే దైవంలేదనీ, నీవే నా దైవమనీ, నిన్ను కొలుస్తున్నాను. నీమాటలు వింటానన్న ఆశతో, రాక్షసుల పరుషవాక్యాలను సహించి వూరుకున్నాను. నీతో శయనించుదామని ఇక్కడ నేలపైన పడుకున్నానే! శ్రీరాముడే నన్ను రక్షిస్తాడన్న ధైర్యంతో, నన్ను నేను రక్షించుకునే ప్రయత్నమేమీ చేయలేదే!. పాతివ్రత్యమన్న తపస్సు తప్ప వేరే ఏమీ అలోచించలేదే! నేను నిర్భాగ్యురాలను కాబట్టి, కృతఘ్నునకు చేసినమేలులాగా అన్నీ వ్యర్ధమైపోయాయి”. (అందుకే, పరమ భక్తులు, ప్రపన్నులు చేయాల్సిందల్లా, భగవత్ చరిత్ర తప్ప వేరేదాని పై దృష్టి నిలపకపోవటమే. దేహ సుఖాలు కోరకూడదు. భగవంతుడే రక్షిస్తాడన్న దృఢ విశ్వాసం కలిగి, తన యోగక్షేమాలకై, తాను పాటుపడకూడదు. స్వతంత్ర బుధ్ధి మానాలని అర్థం)

“నాధా నీకు సంతోషం కలిగించే నా చక్కదనం పోయి, సన్యాసి దేహంలాగా బక్క చిక్కి పాలిపోయింది. ఇలా వుంటే, మునుపటి ప్రేమ వుంటుందో, లేదో! అందంగాలేని నన్ను, వెనుకటిలాగా నీవు ఆదరించక పోయినా, దూరం నుండైనా నిన్ను దర్శించగలనన్న ఆశ కూడా లేదు. నాపుణ్యఫలమంతా వ్యర్ధమైపోయింది. రెండు విధాల చెడ్డ రేవడిలాగా అయ్యాను. పుణ్యకర్మఫలం పోతే పర్వాలేదు. దానికి అంతగా బాధలేదు. కానీ, నన్ను రక్షిస్తుందనీ, వ్యర్ధమైపోదనీ, నిన్ను చేరే తిరుగులేని ఉపాయమనీ నమ్మిన నిర్మలమైన నా పాతివ్రత్యం (భక్తి) కూడా వృధా అయిందే! దానికి    దుఃఖ పడ్తున్నాను”. (దేహం భగవంతుడుం ఆలయమన్న భావనతో అలంకరించుకోవచ్చు. భగవదర్పణం అనుకుంటూ మంచి ఆహారం తీసుకోవచ్చు. స్వబుధ్ధి, స్వప్రయోజనం మటుకు నిషిద్ధం. సన్యాసుల్లాగా దేహాన్ని శుష్కింప చేసుకుని, తపస్సు చేయడం కంటే, గృహస్థ మార్గమే వుత్తమం. అయితే, దానికంటే ఇది కష్టమైన పని. ఇలా వుండలేనివాడే సన్యాసి అవుతాడు. సన్యాసులకు కలిగే బ్రహ్మలోక ప్రాప్తి కంటే వీరికి భగవత్ సాయుజ్య ప్రాప్తి తొందరగా లభిస్తుంది).



"రామచంద్రమూర్తీ! నీవు సత్యసంధుడవు. తండ్రి ఆజ్ఞ ప్రకారం పధ్నాలుగు ఏళ్లు వనవాసం చేసి, లోకం మెప్పు పొంది, అయోధ్యకు తిరిగి పోయి, రాజ్యాభిషేకం చేసుకుని, కృతార్ధుడవై, అనేకమంది సుందరీమణులతో కులుకుతావనుకుంటా! అట్లా చేయకుండా నువ్వెట్లా వుండగలవు? ఇంతరాజ్యం చేస్తూ విదురుడిలాగా, సన్యాసిలాగా వుండడం నీదగ్గరివాళ్లు చూస్తే వూరుకోరు. బలవంతం చేసైనా నీకు పెళ్లి చేస్తారు. నీకు పిల్లనివ్వడానికి ఎందరో రాజులు పోటీపడ్తారు. కాబట్టి నీవు మళ్లీ పెళ్లాడి సంసార సుఖం అనుభవిస్తావనుకుంటా. ఇదంతా సరేకానీ, నీవు ఏకపత్నీవ్రత దీక్ష వున్నవాడివికదా! పట్టిన వ్రతం విడువవే! నీమీద అనురాగమున్న నన్ను ఇక్కడే చావమని చెప్పి, వ్రతభంగం చేసుకుని, మాట తప్పుతావా? అలా చేయకపోతే, నేను నీసుఖం కూడా చెడగొట్టిన దాన్నవుతానుకదా! తాను చెడి, భర్తను చెడగొట్టే నా వంటి నిర్భాగ్యురాలు లోకంలో వుంటుందా?"

"ఎంతటి పాపాత్ములైనా, నీమీద కొంచెం మనసుంచితే శుభం కలుగుతుందికదా! అట్లయితే, చిరకాలం నుండీ దృడంగా నీమీదే మనస్సు నిల్పిన దాన్నికదా నేను. ఎందుకీవిధంగా నశిస్తున్నాను? ఇదినీదోషం కాదు, నాదే! ఎందుకంటే, నేను నియమం తప్పకుండా చేసిన వ్రతాలన్నీ, పుణ్యం కొంచెమే చేసుకున్న దాన్నైనందున, వ్యర్ధమైపోయాయి. ఏమాత్రం అదృష్టమున్న దాన్నైనా, ఇతరుల్లాగా, నిన్నాశ్రయించిన నేనుకూడా బాగుపడకపోయానా? నాదుర్దశకు నేనేకారణం, నీవు కానేకాదు"

"రామచంద్రా! నీవు అయోధ్యకు వెళ్లి, సుఖపడ్తావో, దుఃఖపడ్తావో కాని, దుఃఖపడకుండా, సుఖపడటానికి, నేనుమాత్రం ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఇట్టిదాన్ని జీవించి ప్రయోజనం లేదు. ప్రాణం తీసుకుందామంటే, విషమో, కత్తో కావాలికదా! నేనవి ఎక్కడనుండి తేవాలి? ఈ రావణుడింట్లో ఎవరైనా నామీద ద్వేషంతో కానీ, దయతోకానీ, ఇంత విషమో, పదునైన కత్తో ఇచ్చేవారుంటే బాగుంటుంది. ఇస్తే వెంటనే ప్రాణం, తీసుకోవచ్చే!" అని భర్తను నానా విధాలుగా తలచుకుంటూ, దుఃఖంతో కలవరపడ్తూ, నోరు తెరచి, నోరెండేదాకా ఏడుస్తుంది సీత. ఇక బ్రతికి ప్రయోజనం లేదని, పూచిన చెట్టు మొదట్లోకి పోయి, జడచేతుల్లోకి తీసుకుని, ఉరిపోసుకుందామన్న అభిప్రాయానికి వస్తుంది సీత.

ఉరిపోసుకోవటానికి అనుకూలమైన కొమ్మను చేతిలో పట్టుకుని, తన వంశాన్నీ, రామలక్ష్మణులను, స్మరిస్తూ, ఉరిపోసుకుండే ప్రయత్నంలో వుండగా, శోకాన్ని నశింపచేసి, ధైర్యం కలిగించే, శుభశకునాలు మునుపటిలాగానే కనిపిస్తాయి సీతాదేవికి.

No comments:

Post a Comment