Tuesday, March 6, 2018

“జైతెలంగాణ...జై భారత్”-కేసీఆర్ : వనం జ్వాలా నరసింహారావు


“జైతెలంగాణ...జై భారత్”-కేసీఆర్
వనం జ్వాలా నరసింహారావు

ప్రజల దీవెనలు ఉంటే దేశానికి అద్భుతమైన దశ, దిశ చూపిస్తానని, మార్గనిర్దేశం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలో మార్పు రావాలని, అది తెలంగాణ నుంచే మొదలుకావాలని కూడా చెప్పారు. ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో 70 ఏండ్లు ప్రయాణం సాగించిన తరువాత జరుగుతున్నదేంటి, దేశం ఎటువైపు పోతున్నది, దేశంలో నెలకొన్న పరిస్థితులపై అశ్చర్యంగా వుందని సీఎం అన్నారు. క్రితంరోజు రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు రావాలని తాను ప్రకటించిన తరువాత, దేశం నలుమూలల నుంచి అనేక ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. దేశప్రజల జీవితాల్లో, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, అందుకు అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు తానూ సిద్ధమని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు లేకుండా ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ మొదలైంది.

కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ మార్చ్ 4, 2018 ఆదివారం నాడు ప్రగతిభవన్‌కు పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలు మూలల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ పది లక్షల కిలోమీటర్లు ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలైతుందని, తెలంగాణ కోసం బయలుదేరిన్నాడు కూడా చాలామంది అనుమానాలు వ్యక్తంచేశారని,  ప్రజల దీవెనలు ఉంటే దేశ రాజకీయాలకు అద్భుతమైన దశ దిశ చూపించి, ప్రజానీకానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేస్తానని అన్నారు. ఈ విషయాన్ని తానూ ఆషామాషీగా, ఆవేశంతో చెప్పడం లేదని కూడా అన్నారు. కలిసి వచ్చేవారందరితో దేశ రాజకీయాలపై చర్చిస్తాననీ, ఏకాభిప్రాయం కలిగిన నేతలందరినీ కలిసి, వ్యవసాయ, ఆర్థిక శాస్త్రవేత్తలు, రైతులు....ఇలా అందరినీ విచారించి దేశానికి అవసరమైన ఎజెండా తయారుచేస్తాం అని చెప్పారు. సంకల్పం, నిజాయితీ, ధైర్యం ఉంటే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేకుండా ఒక కొత్తశక్తి తయారుకావాలన్నారు. రాష్ట్రాలకు అధికారాలిస్తేనే అవి వాళ్ల అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోగాలుగుతాయనీ, అలా జరిగిన నాడే దేశం బాగుపడుతుందని కేసీఆర్ అన్నారు.

బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఆరుగురు మహారాష్ట్ర ఎంపీలు, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ ఫోన్ చేసి కేసీఆర్ తో ఏకాభిప్రాయంతో ఉన్నాం అని చెప్పారాణి సీఎం అన్నారు. మేం కూడా దేశంలో చాలా మందితో మాట్లాడుతున్నాం. అందరం కలిసి మాట్లాడుదామని అన్నారు అని కేసీఆర్ తెలిపారు.

దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వాటి పంథాను, ఆలోచనను మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు రూ. 8000 పథకం దేశమంతా ఎందుకు ఇవ్వరు? పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చినట్లే వ్యవసాయదారుడికి ఇస్తే నామోషీనా? అని ప్రశ్నించారు. పేరుకు ఫెడరల్ వ్యవస్థ. ఈ దేశంలో ఫెడరలిజం ఉందా? మాట్లాడితే డెమోక్రసీ అంటరు. నరేగా కూలీలకు కూడా ఢిల్లీలో టప్పాలో డబ్బులు వేసేంత గొప్ప ప్రజాస్వామ్యం మనది. ఇది ప్రజాస్వామ్యమా?ఇక్కడున్న సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎటు పాయే? ఎమ్మెల్యే, ఎంపీ ఎటు పాయే? స్టేట్ గవర్నమెంట్ ఎటుపాయే? స్థానిక ప్రభుత్వాలను గౌరవించే విధానమా ఇది? అని సీఎం ఘాటుగా ప్రశ్నించారు.

ఆరోగ్యం, విద్య, వ్యవసాయ విధానం, అర్బన్ డెవలప్‌మెంట్ రాష్ట్రాలకు అప్పగించాలి. ఎందుకు అప్పగిస్తలేరు? ఢిల్లీలోనే పెత్తనం పెట్టుకుని డిక్టేటర్‌షిప్‌తో చిల్లరమల్లర రాజకీయలబ్ధికోసం ఆ రెండు పార్టీలు కోట్ల ప్రజల గోస పుచ్చుకుంటున్నాయి అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. 70 ఏళ్లు బీజేపీ, కాంగ్రెస్ పాలించింది. మళ్లీ వాళ్లే మాట్లాడుతరు. మీ పని విదేశీ విధానంమీద ఉండాలి, ఆర్మీ మీ కంట్రోల్లో ఉండాలి, జాతీయ రహదారులు మీ దగ్గర ఉండాలి. కానీ, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏంది? ఆప్‌కా క్యా కామ్ హై? అని అడిగారు సీఎం.

ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 90% ప్రజలు దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు. వారికి రిజర్వేషన్ ఇవ్వాలని అడిగాం. ఒకటే దేశంలో రెండు ఖానూన్లు ఉంటాయా? ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ విధంగా సమాధానం చెప్పాలి? దేశంలో ఒక్కో చోట పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. ఒక దగ్గర గిరిజనులు ఎక్కువ. ఓ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ. కొన్ని రాష్ర్టాల్లో ఓసీలు ఎక్కువ ఉండొచ్చుగాక. మరి వాళ్ల గతేంకావాలి?కేంద్రం రైతులకు ఏం చేసిందని సీఎం ప్రశ్నించారు. అందరికీ రేట్లు, జీతాలు పెరుగతయి. సబ్బు, చక్కెర, చెప్పుల ధరలు పెరుగుతయి. రైతులు పండించే ధాన్యం ధర మాత్రం పెరుగదు. ఎవడు అవునన్నా కాదన్నా భారతదేశం బతికేదే వ్యవసాయం మీద. పెద్ద సెక్షన్ రైతులు, రైతు కూలీలు! పెద్దపెద్ద లెక్కలు చెప్తరు. జీడీపీ అంటూ..! ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికి కావాలి జీడీపీ? అని ప్రశ్నించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, వారిపై ఆధారపడినవారు పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకుపోతుంటే....70 సంవత్సరాలు టైమ్‌పాస్ చేశారు అని ముఖ్యమంత్రి విమర్శించారు.

2004 నుంచి అనేక అనుభవాలు పంచుకున్నాననీ, పంచవర్ష ప్రణాళికలు చదివాననీ, ఏ రంగంలో ఏం జరిగిందీ అవగాహన చేసుకున్నానని కేసీఆర్ అన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని, ఈ విషయం ప్రజలందరికీ అర్థమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగాలి? నీళ్లు లేవా? 70,000  టీఎంసీలు ఉన్నాయి. ఇంకా దేశాన్ని ఎన్ని విధాలుగా విభజిస్తారు? దేశమంటే ప్రజలు. ఏ కులమైతే మనకేంది? ఏ మతమైతే ఏంది? అందరు బాగుండాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే వంకలు పెట్టి ప్రజాశక్తిని ఒకటి కాకుండా చేసి, రాజకీయ ఆటలు అడుకుంటున్నరు తప్ప, వాస్తవ దృక్పథంతో లేరు అని సీఎం అన్నారు.

దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పటిష్ఠమైన కూటమి ఏర్పాటు అంశంపై ఆశావహ దృక్పథంతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కూటమి ఏర్పాటుచేయగల సత్తా కేసీఆర్‌కే ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు వివిధ రాష్ర్టాల నాయకులు సుముఖత వ్యక్తంచేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వాదనకు మమత మద్దతుగా నిలిచారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రాబోయే ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయని, ఇందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధాన భూమిక పోషించనున్నారని అన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌కు ఫోన్‌చేసి సంఘీభావం ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోని వారితో కూడా సంప్రదించి అందరం కలిసి ముందుకుసాగుదామన్నారు. మహారాష్ట్రకు చెందిన ఆరేడుగురు ఎంపీలు కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి తమ హర్షం వ్యక్తంచేశారు. అభినందనలు తెలిపారు. తమ పదవులకు రాజీనామా చేయడానికి సైతం ముందుకుస్తామని ఉత్సాహంగా ప్రకటించారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల ప్రతినిధులు పలువురు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు.

తన ప్రసంగాన్ని “జై తెలంగాణ, జై భారత్” అన్న నినాదంతో ముగిమ్చారి సీఎం కేసీఆర్.

(మార్చ్ 4, 2018 ఆదివారం ప్రగతి భవన్ లో తనకు మద్దతి తెలియచేయడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించ కేసీఆర్  చేసిన ప్రసంగం ఆధారంగా)

3 comments:

 1. dear sir very good blog and very good content
  Latest Telugu Cinema News

  ReplyDelete
 2. This is a joke. In cricketing lingo, KCR seems like peaking early. Congress survived only on appeasement politics. Now, one can easily see through Mr.Rao's thinly veiled appeasement, which fortifies his chances at another term, thanks to the emotionally swaying electorate. Coming to the third front scheme, communists are nearly wiped out. TMC of Bengal is another appeasement flag bearer and populist. While TN politics is interesting, nothing can be predicted as yet. Congress under RaGa is going to be a relic soon. I don't know why Mr. Rao is coming with a change slogan in just four years. Change slogans work in cases like Bush, Zuma, and Manmohan.

  ReplyDelete
 3. Wish him best of luck. No chances for a third front,self interests won't permit. This is the saying of the people. Why no tolerance for BJP which ruled only 4 years?

  ReplyDelete