Tuesday, March 27, 2018

హనుమాన్ ను చూసి భయపడినా, సంభాషించిన సీతాదేవి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమాన్ ను చూసి భయపడినా, సంభాషించిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-03-2018)

రామనామస్మరణ చేస్తూ, చూస్తున్న సీతాదేవికి, చెట్టుకొమ్మల్లో కనిపించింది ఒక కోతి. ఆమె కంటికి ఆ కోటి, తూరుపు కొండపై అప్పుడే ఉదయించీ, ఉదయించకున్న సూర్యుడిలా, తెల్లటి వస్త్రాలు ధరించి ప్రియవాక్కులు పలుకుతున్న వాడిలా, మెరుగైన పింగళ వర్ణం కలవాడిలా, అశోక పుష్పాలరాశినిబోలిన ఎర్రటిముఖం కలవాడిలా, అద్భుత పరాక్రమవంతుడిలా, పచ్చనికళ్లు కలవాడిలా కనిపించింది. (సూర్యబింబం కనిపించీ, కనిపించని సమయమయిందన్న సూచన, రామచంద్రమూర్తనే సూర్యదర్శనం త్వరలో జరగబోతున్నదన్న సూచనా ఇందులో ధ్వనిస్తాయి)

కోతిని చూడగానే వళ్లుజలదరించింది సీతకు. భయంకరమైన కోతిరూపాన్ని చూసిన తనకేం కీడు జరగబోతున్నదో అని భయపడింది సీత. శోకంతో, రామలక్ష్మణులను స్మరించి మెల్లగా ఏడ్చింది సీత. అయితే తాను చూసింది, సుగ్రీవుడి మంత్రుల్లో శ్రేష్టుడూ, ఆయన బంటుగా వచ్చినవాడూ, బుధ్ధిమంతుడూ, వాయుకుమారుడూ, భయంకర భీమరూపం కలిగిన హనుమంతుడనే విషయం ఆమెకు తెలియదు. మనోవేదనతో దుఃఖిస్తున్న సీత, వినయవంతుడుగా వున్న హనుమంతుడిని చూసి, ఇదికలేమో అనుకుని, స్మృతి తప్పి, శవంలా అయిపోయి, తిరిగి తెలివి తెచ్చుకుని, తనలో తనే అనుకుంటుందీ విధంగా:

"కలలో కోతిని చూస్తే కీడంటారు. నేను కోతినికలగన్నాను. కీడుకలగనున్నదేమో! రామలక్ష్మణులకు మేలుకలుగుగాక! మాతండ్రి జనకమహారాజు కుశలంగా వుండుగాక! అయినా ఇదికలగాదే! నిద్రరాని నాకు కలలెలా వస్తాయి? అసలు దుఃఖంతో బాధపట్తున్న నాకు నిద్ర ఎలా వస్తుంది? సుఖమెక్కడనుండి వస్తుంది? నిద్రలేనందున కలకాదిది. రామదూత ఇంత సముద్రాన్ని దాటి రావణుడి అంతఃపురానికి రావటమనేది నమ్మరాని విషయం. అంటే, ఇది నిజంకాదు. బహుశా నేనెప్పుడూ రామనామ స్మరణే చేస్తున్నందువల్ల, ఆయన్ను గురించిన మాటలే వినవస్తుండవచ్చు. ఇదే వాస్తవం. రామచంద్రమూర్తిపైనే మనస్సు నిలిపి, దుఃఖంతో పరితపిస్తున్న నాకు, వేరే ఆలోచన లేకపోవడంతో, నేనేదిచూసినా, ఎందు చూసినా, రాముడి స్వరూపమే కనబడుతుండవచ్చు. ఆయన కధలే వినపడుతుండవచ్చు. నా మోహమే ఒక కోతిరూపంలో పలుకుతున్నదేమో! ఈ ఆలోచనా సరైందికాదేమో! మనస్సుకు రూపం వుండదుకదా! ఈకోతి స్పష్టంగా రూపంతో కనిపిస్తున్నదే! ప్రత్యక్షంగా కనపడుతూ, నన్ను చూసి మాట్లాడుతుంటే, ఇదిమాయ ఎట్లా అవుతుంది? ఇది వాస్తవమయ్యుండాలి".

ఇలా అనుకుని, తాను  చూసింది వాస్తవంగా కోతేనని నిశ్చయించుకుంటుంది. రెండు చేతులు జోడించి, బ్రహ్మకు, అగ్నికి, బృహస్పతికి, నమస్కరించుతుంది. కోతిచెప్పిన మాటలన్నీ నిజం కావాలని, భిన్నంగా జరుగవద్దని కోరుకుంటుంది. సీతాదేవి మనస్సుకు తాను నిజమైన కోతేనన్న నమ్మకం కుదిరిందనీ, పూర్తిగా నమ్మకం ఇంకా కుదరలేదని భావిస్తాడు హనుమంతుడు.

తనమీద సీతకు కొంత విశ్వాసం కలిగిందన్న నమ్మకంతో, హనుమంతుడు పైకొమ్మనుండి కింది కొమ్మకు దిగుతాడు. వినయవంతుడి వేషంలోనే వుండి, రెండు చేతులు జోడించి, శిరస్సు వంచుకుని, వినయంతో, తియ్యనిమాటలతో ఇలా అంటాడు సీతతో: "అమ్మా పతివ్రతారత్నమా! నా ప్రార్ధన విని  నన్ననుగ్రహించి  నువ్వెవరివో, ఎందుకిట్లా మాసిన పట్టువస్త్రం కట్టుకుని, కొమ్మను పట్టుకుని, నిలబడి వున్నావో చెప్పు తల్లీ? తామర రేకులనుండి నీళ్లు పడుతున్నట్లే, నీకళ్ల నుండి నీరెందుకు కారుతున్నది? నీవు కిన్నెర స్త్రీవా? వసువుల, రుద్రుల భార్యవా? పన్నగ స్త్రీవా? దేవతాస్త్రీవా? యక్ష కాంతవా? చంద్రుడుని విడిచి నేలరాలిన రోహిణివా? నీ శుభ లక్షణాలు చూస్తుంటే, నీవు మనుష్య స్త్రీవి కావనీ, దేవతాస్త్రీవనీ అనుకుంటాను. పోనీ, కోపంతోనో, మోహంతోనో, భూమి మీద తిరగటానికి వశిష్టుడిని విడిచివచ్చిన అరుంధతివి కావుకదా?"

"అమ్మా! ఎక్కడనుండి నీవిక్కడకు వచ్చావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీతండ్రి ఎవరు? తోడబుట్టిన వాళ్లెవరు? భర్త ఎవరు? కొడుకెవరు? నీరూప, గుణాలను బట్టి నీవు దేవతా స్త్రీవనుకున్నాను కాని, రాచరికపు స్త్రీలకు వుండాల్సిన లక్షణాలు, చిహ్నాలు, నీకుండడంతో, నీవు దేవతాస్త్రీవి కాదని అనిపిస్తున్నది".



(చక్రం, స్వస్తికం, వజ్రం, ధ్వజం, మత్స్యం, గొడుగు ఆకారంలాం రేఖలు పాదంలో వుంటే, రాజపత్ని అవుతుందట. కాలివేళ్ల నడిమిభాగం భూమిని తాకి వుంటే, అఖండ భోగాలు కలుగుతాయి. బొటనవేలు ఎత్తుగా, గుండ్రంగా వుంటే, అమిత సుఖాలు కలుగుతాయి. మీగాలు ఎత్తుగా, చెమటలేకుండా, నరాలు కనిపించకుండా, నున్నగా, మెత్తగా, బలిసినవిగా వుంటే రాజు భార్యవుతుంది. పిక్కలు, రోమాలు లేకుండా, నున్నగా, గుండ్రంగా, నరాలు కనిపించకుండా వుంటే రాజపత్ని అవుతుంది. తొడలు దృడంగా  ఏనుగు తొండాల్లా, నున్నగా,  లావుగా, గుండ్రంగా, వెంట్రుకలు లేకుండా వుంటే రాజపత్ని అవుతుంది. ఇలా ఆమెకున్న అనేక చిహ్నాల వల్ల సీత రాజపత్ని కావచ్చునని హనుమంతుడి నిశ్చయం)

"తల్లీ! నీవు క్షత్రియస్త్రీవని కూడా నీ శుభచిహ్నాలు చూసి భావిస్తున్నాను. భూమండలాన్నంతా పరిపాలించే రాజశ్రేష్టుడి పట్టపురాణివని కూడా నేను ఊహిస్తున్నాను. ఒకవేళ దండకారణ్యంలో తిరుగుతున్నప్పుడు, రావణాసురుడు బలాత్కారంగా ఎత్తుకొచ్చిన సీతవు కావుకదా! నిజం చెప్పు. మనుష్య స్త్రీలకుండని నీ అందం, దీక్షతో వున్న నీ వేషం, నీ కాంతిహీనత, ఇవన్నీ చూస్తుంటే నీవు రామచంద్రమూర్తి భార్యవన్న సందేహం కలుగుతున్నది. నా అభిప్రాయం నిజమేకద! చెప్పాలి" అని అడుగుతాడు హనుమంతుడు సీతాదేవిని. త్రిజట మాటలకు భయపడ్డ రాక్షస స్త్రీలు సీతను వదిలి ఎక్కడి వారక్కడే దూరంగా పోయారు కొంతసేపు. అందువల్లనే సీతతో మాట్లాడటానికి కొన్త సమయం దొరికిన్ది హనుమంతుడికి.

(సీతావిలాపం, ముముక్షువైన ప్రపన్నుడి విలాపం, ఒకటేనని ముందే చెప్పడం జరిగింది. సంసారం తరించే మార్గం తెలీక, నిర్వేదంతో తనను ఆశ్రయించిన జీవులను రక్షించటానికి, భగవంతుడు "ఆచార్యు" లను పంపుతాడని కూడా చెప్పుకున్నాం. ఇట్టి భగవత్సహాయం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేహాభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టి, తన కొరకే [భగవంతుడి] మాన, ప్రాణాలను పోగొట్టుకోటానికి సిధ్ధపడే పరతంత్రులకు మాత్రమే లభిస్తుంది. స్వప్రయత్నంతో, దేహంపై ఏమాత్రం అభిమానమున్నా, ఆ సహాయం రాదు.  సీతాదేవి తనను, రాక్షసులు ఏం చేసినా, చేసుకోమని చెప్పి, దేహాభిమానాన్ని విడిచి, నిద్రాహారాలు మాని, ఏకాగ్రతతో, బుధ్ధి పూర్వకంగా, తన దేహాన్నీ, ప్రాణాన్నీ, రామచంద్రమూర్తికే సమర్పించాలనుకొని, నిరాశతో మరణించాలనుకొని సిద్ధపడిందో, అప్పుడే హనుమంతుడి ద్వారా "ఆచార్య" లాభ ప్రాప్తి కలిగింది).

No comments:

Post a Comment