Sunday, August 5, 2018

ఇంద్రజిత్తును హనుమంతుడి మీదకు పంపిన రావణుడు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


ఇంద్రజిత్తును హనుమంతుడి మీదకు పంపిన రావణుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (06-08-2018)
వీరుడైన తనకొడుకు అక్షకుమారుడు, కోతిచేతిలో చచ్చాడని విన్న రావణుడు హతాశుడైనాడు. కోపంతో కళ్లెర్ర చేసాడు, ఇంద్రజిత్తును ( అసలు పేరు మేఘనాదుడు. ఇంద్రుడిని జయించి ఈ బిరుదు పొందాడు) పిలిచి అతడిని యుధ్ధానికి పంపాలని నిర్ణయించాడు. ఉద్యానవనాన్ని పాడుచేసిన కోతి మామూలు కోతి కాదని తలచిన రావణుడు, మొదట తనసేవకులైన కింకరులను పంపాడు. ఆతర్వాత ఏడుగురు మంత్రిపుత్రులను పంపుతాడు. అప్పటికీ లాభంలేకపోవడంతో సేనానాయకులను పంపాడు. వీరందరూ చచ్చిన తర్వాత, ఎప్పుడూ ఇతరులనే పంపుతున్నాడన్న నింద పడుతుందేమోనని తన చిన్న కుమారుడిని పంపాడు. వాడూ చచ్చిన తర్వాత వీరందరికంటే ఘనుడూ, అస్త్రవిద్యలో ప్రవీణుడూ అయిన తన రెండవ కొడుకు ఇంద్రజిత్తును పంపదలచాడు.

ఇంద్రజిత్తు, అస్త్రవిద్యలలో ప్రధముడనీ, సమస్త దేవదానవులకు శోకం కలిగించిన వాడనీ, భుజబలంలో ఎల్లలోకాలలో ప్రసిధ్ధికెక్కిన వాడనీ, బ్రహ్మదేవుడి దగ్గరనుండి మహాస్త్రాలు సంపాదించిన వాడనీ, వాడు చేసిన పనులు దేవతలందరకూ తెలుసనీ, అంటాడు రావణుడతడితో. దేవదానవులూ, ఇంద్రుడూ అతడి ఎదుట నిల్చి యుద్ధం చేయడం మాట అటుంచి, మాయలు చేయడంలో కూడా అతడికి సమానులు కారనీ అంటాడు రావణుడు. (అంటే హనుమంతుడిని న్యాయమార్గంలో, అస్త్రాలతో చంపే ప్రయత్నం సఫలం కాకపోతే, మాయ చేసైనా చంపమని అర్థం). రావణుడు ఇంద్రజిత్తును పొగడ్తల మాటలతో ప్రేరేపించుతాడిలా:

"నువ్వాలోచిస్తే నీకు తోచని ఉపాయమేదీలేదు. యుద్ధంలో నీకు అసాధ్యమయిందేదీ లేదు. ముల్లోకాల్లో నీబలం, అస్త్రశస్త్ర పాండిత్యం, తెలియని వారెవ్వరూ లేరు. గొప్పతనంలో, పరాక్రమంలో, భయంకర అస్త్రబలంలో, గొప్ప శక్తిలో, నా అంతటివాడవు. యుద్ధంలో నీకెప్పుడూ జయం నిశ్చయమన్న ధైర్యంతో, నేనెప్పుడూ నిర్విచారంగా వుంటున్నాను. అన్నింటికీ ఇంద్రజిత్తున్నాడులే! నాకెవరివలనా భయం లేదని, సర్వవేళలా అనుకుంటున్న నాకు ఈ వేళా అంతేకదా!".

ఇంకా ఇంద్రజిత్తును గురించీ, వాడు ఎలా యుద్ధం చేయాలనే విషయాన్నీ రావణుడు ఇలా చెప్తాడు:


"యుద్ధంలో నిన్నెదిరించి భయపడని వాడూ, అల్లాడనివాడూ, ఎవరన్నా వున్నారా? భుజబలం, తపోబలం, అస్త్రబలం, నిన్నెప్పుడూ రక్షిస్తున్నాయి. ఎప్పుడెలా, ఎక్కడెలా ప్రవర్తిస్తే మంచిదో, అలానే ప్రవర్తించే తత్వంకల నీకు విజయం సులభం.( హనుమంతుడితో యుద్ధం చేసేటప్పుడు ఇవన్నీ వుపయోగించాలని సూచిస్తున్నాడు). కింకరులను, జంబుమాలిని, మంత్రిపుత్రులను, సేనానాయకులను, అక్షకుమారుడిని ఆ వానరుడు చంపాడు. అందరికంటే నీమీద నాకెక్కువ నమ్మకం వున్నందున, ఇంకెవరిని పంపినా జయించరేమోనన్న అపనమ్మకంతో నిన్నే పంపాల్సివస్తున్నది. వానరుడి బలం, వేగం చక్కగా పరీక్షించి, దానికి తగ్గట్లు నీ బలశౌర్యాలు చూపించు. వాడిని చంపడం ఆలస్యమైనకొద్దీ, మన సైన్యం నాశనం పెరుగుతున్నది. అందుకే అస్త్రాలతో త్వరగా చంపు. ఉత్తుత్తి బాణాలతో సమయం వృధా చేయొద్దు. మీ ఇరువురి శక్తియుక్తులు జాగ్రత్తగా పరీక్షించు".

"ఇరువురు యోధులు యుద్ధం చేస్తుంటే సైనికులు అడ్డం వచ్చి రక్షిస్తారు. కానీ, ఈ వానరుడు, సైనికులు ఏమీచేయలేని పద్ధతిలో, గమ్మున నీమీద దూకితే ఎవరూ ఏమీ చేయలేరు. సైనికులను నమ్మి యుద్ధం చేయొద్దు. సామాన్యంగా రాక్షసులుపయోగించే ఆయుధమైన “వజ్రం” వాడినేం చేయలేదు. అగ్నిహోత్రుడిలాంటి వాడిని నీ ముష్టిఘాతాలు కూడా ఏమీ చేయలేవేమో. నువ్వక్కడకు పోయినతర్వాత, ఏది మంచిదని తోస్తే అదే చేయి. బ్రహ్మాస్త్రంలాంటి మహాస్త్రాలనూ ధరించిపో! మనస్సు, దృష్టి, బాణం, మూడూ ఏకకాలంలో, ఒకేస్థలంలో పడేటట్లు యుద్ధం చేయి. ఈ మూడూ చెదిరిపోకుండా, తొందరపడకుండా, నిబ్బరంగా, ఏ కలతా మనస్సులో పెట్టుకోకుండా యుద్ధం చేస్తే జయం కలుగుగుతుంది".

"పెద్దవాళ్లుండగా యుద్ధంలోకి పిల్లలను పంపడం సరికాదని నాకు తెలుసు. మనం రాజులం, మనది క్షత్రియ ధర్మం. దానిప్రకారం, రాజు ముందుగా యుధ్ధానికి పోగూడదు. క్షత్రియధర్మం మనం అతిక్రమించకూడదు. అందుకే నిన్ను పంపుతున్నాను. రకరకాల అస్త్రాలను మనస్సులో స్మరించుకుంటూ యుద్ధం చేయి. జయించిరా!" అంటాడు.

(రావణుడు తాను క్షత్రియుడనని తానే అంగీకరించాడు. వాడు బ్రాహ్మణుడనీ, వాడిని చంపినందువల్ల రాముడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని కొందరనడం నిజం కాదు. ఎలాంటివాడు బ్రాహ్మణుడో తెలుసుకోవడం అవసరం. ఏ జాతివారు ఆ జాతివారిని పెళ్లిచేసుకుని, పిల్లలను కంటే, ఆ పిల్లలు, మాతా-పితరుల జాతికలిగి సజాతీయులమని పిలువబడతారు. బ్రాహ్మణుడికి శాస్త్రప్రకారం వివాహం చేసుకోని బ్రాహ్మణ స్త్రీయందు పుట్టినవారుకూడా బ్రాహ్మణులు కారు. సవర్ణ స్త్రీకి, రెండవ తండ్రికి పుట్టినవాడు కూడా జాతివల్ల శూద్ర ధర్మం కలవాడే. వాడికి బ్రహ్మచర్యాది వ్రతాలూ, ఉపనయనాది సంస్కారాలూ లేవు. బ్రాహ్మణుడికి బ్రాహ్మణ జాతి స్త్రీయందు పుట్టినా, బ్రాహ్మణ గుణకర్మములు లేకపోతే వాడు బ్రాహ్మణుడుకాడు. ఇకపోతే రావణుడి తండ్రి విశ్రవసుడు బ్రాహ్మణుడు. తల్లి కైకసి రాక్శసి, క్షత్రియురాలు. బ్రాహ్మణుడికి వివాహిత క్షత్రియ స్త్రీయందు జన్మించినవాడు క్షత్రియుడే అవుతాడు. విశ్రవసుడు బ్రాహ్మణుడే అయినా, అవివాహిత అయిన క్షత్రియ రాక్షస స్త్రీ కైకసికి జన్మించిన కారణాన రావణుడు బ్రాహ్మణుడు కాబోడు. వ్యాసుడికి శూద్ర స్త్రీయందు పుట్టిన విదురుడు శూద్రుడే అయినాడు).

No comments:

Post a Comment