Friday, August 10, 2018

జ్యోతిష్య మహాసభలు : వనం జ్వాలా నరసింహారావు


జ్యోతిష్య మహాసభలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-08-2018)

తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక సౌజన్యంతో, హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర జ్యోతిష మహాసభలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆగమ, ధర్మశాస్త్రాల సదస్సులు కూడా జరగనున్నాయి. ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖం పర్యాటక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సంయుక్త సహకారాన్ని అందిస్తున్నాయి. మొదటి రోజు, మొదటి సదస్సు జ్యోతిశ్శాస్త్రంలోని పంచాంగ విభాగంపై వుంటుంది. ఇందులోని నాలుగు ప్రధాన అంశాలపై విఖ్యాతులైన పండితులు, సిద్ధాంతులు ప్రసంగిస్తారు. ఈ నాలుగు ప్రధానాంశాలు వరుసగా...పంచాంగ ప్రామాణికత-ముహూర్త నిర్ణయం; కాలసర్ప, పితృదోష విశ్లేషణ;  గుణమేళనం-నామనక్షత్ర ప్రాధాన్యత; కుజదోష ప్రభావం. రెండవ సదస్సులోని నాలుగు అంశాలు వరుసగా...జాతకఫల నిర్ణయ సమీక్ష; ఆధునిక దృక్కోణంలో జ్యోతిషం; జ్యోతిశ్శాస్త్ర వివిధ విభాగాలు; వాస్తు విజ్ఞాన ప్రయోజనం. 

అదే రోజు సాయింత్రం యువ సిద్ధాంతుల సమ్మేళనం జరుగుతుంది. ఇందులో రాష్ట్రంలోని వర్థమాన సిద్ధాంతులందరూ పాల్గొంటారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య భాగస్వామ్యంతో “విద్వత్సమ్మేళనం” వుంటుంది. ఇందులో సిద్ధాంతులు, వేదపండితులు, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ప్రధాన పురోహితులు, ధర్మకర్తలు పాల్గొని, వచ్చే తెలుగు సంవత్సరాది శ్రీవికారి నామ సంవత్సర పండుగల తేదీలను సైద్ధాంతికంగా నిర్ణయం చేస్తారు. ఈ ఏడాదిలాగే వచ్చే సంవత్సరానికి కూడా వీటినే ప్రామాణికంగా తీసుకునే అవకాసం వుంది.

రెండవరోజు మొదట ఆగమ శాస్త్రంపై సదస్సు వుంటుంది. ఇందులోని మొదటి అంశం “ఆగమాలు-ఆలయాలు”, రెండవ అంశం, “ఆలయపాలన-ధర్మరక్షణ”, మూడవ అంశం,  “అర్చకుల విధ్యుక్త ధర్మాలు”, నాల్గవ అంశం “ధార్మిక స్ఫూర్తికేంద్రం-ఆలయం”. తదనంతరం ధర్మశాస్త్ర సదస్సు జరుగుతుంది. ఇందులోనూ నాలుగు అంశాలుంటాయి. అవి వరుసగా... ధర్మాచరణలో దైవజ్ఞుల పాత్ర,  ధర్మమార్గ నిర్దేశకులు-పురోహితులు, ధర్మసంస్థాపనలో ధర్మాచార్యులు, సంస్కారాల ప్రయోజనం.

అదే రోజు సాయంత్రం జ్యోతిష పండితులతో నిర్వహించే “జ్యోతిరాదిత్యమ్‌” అనే రూపకం వుంటుంది. తరువాత సమాపనోత్సవ సభాకార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ విద్వత్సభా విశిష్ఠ పురస్కారాలతో రాష్ట్రంలోని జ్ఞానవయోవృద్ధులైన 12 మంది పండితులను సత్కరించనున్నారు. ఈ జ్యోతిష మహాసభలకు రాష్ట్రంలోని సిద్ధాంతులు, పండితులు, అభిమానులు, అర్చకులు, పురోహితులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక ఆధ్వర్యంలో జ్యోతిష్య మహాసభలు రాష్ట్రంలో నిర్వహించడం ఇది రెండో సారి. 2017 సెప్టెంబర్ 9, 10 తేదీలలో హైదరాబాద్ లలితా కళాతోరణం, రవీంద్రభారతిలలో  సాంప్రదాయబద్ధంగా, అంతవరకు ఎప్పుడు, ఎక్కడా కనీ-వినీ ఎరుగని విధంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆర్ధిక సహాయంతో, తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహాసభలు వైభవంగా జరిగాయి. అలనాటి ప్రారంభ  కార్యక్రమానికి మదుసూదనానంద సరస్వతీ స్వామి, వ్రతధర రామానుజ జీయర్ స్వామి, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేను కూడా రెండు రోజులు సభల్లో పాల్గొన్నాను. సూర్య, చంద్రుల సాక్షిగా జ్యోతిశ్శాస్త్రం, ఇతర శాస్త్రాల కన్నా వివాదం లేకుండా సఫలమైంది, కాబట్టి, సనాతన  జ్యోతశ్శాస్త్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద వుంది. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో వున్న అనుభవజ్ఞులైన సిద్ధాంతులను, పంచాంగకర్తలను, జ్యోతిష పండితులను ఒకే వేదికపైకి తీసుకురావలన్నది నాడూ-నేడూ ఈ మహా సభల ప్రధాన ఉద్దేశం.

జ్యోతిశ్శాస్త్రం ప్రధానంగా రెండు భాగాలు. ఒకటి గణిత భాగమైతే,  రెండవది ఫలితభాగం.  గణితభాగాన్ని ‘‘సిద్ధాంతం’’ అంటారు.  ఫలితభాగాన్ని ‘‘జాతకం’’ అంటారు.  అందుకే మొదటి రోజు సిధ్ధాంత సదస్సును, రెండవరోజు జాతక సదస్సును నిర్వాహకులు ఏర్పాటు అప్పుడూ-ఇప్పుడూ చేశారు. ఒక్కో సదస్సులో పలు ప్రధానాంశాలను ఎంపిక చేసి, ఒక్కో అంశం మీద ప్రసంగ పత్రం సమర్పిస్తుంటారు.

ఉదాహరణకు గత ఏడాది, ‘‘వేదాంగ జ్యోతిష్య శాస్త్ర వైభవం’’ అనే అంశంలో, శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనే ఆరు వేదాంగాలలో జ్యోతిశ్శాస్త్రం అత్యంత ప్రధానమైంది అని అలనాటి వక్త చెప్పారు. వేదకాలం నుండి నేటి వరకు జ్యోతిశ్శాస్త్రం కాలానుగుణమైను మార్పులతో, సమన్వయ సాధనతో,  ధర్మపరిరక్షణకై వర్ధిల్లుతుందనీ, సమాజానికి అనుక్షణం జ్యోతిశ్శాస్త్రం  మార్గదర్శనం చేస్తుందనీ కూడా చెప్పారు. అదే విధంగా, సూర్య సిద్ధాంత ప్రాశస్త్యం పై ప్రసంగించిన సిద్ధాంతి అదొక అపౌరుషేయ సిధ్ధాంత గ్రంథమనీ, ఈ శాస్త్రం పూర్వం సూర్యునిచే చెప్పబడిందనీ, ప్రస్తుతం మనం ఉపయోగించే పంచాంగాలన్నీ ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయనీ అన్నారు. పంచాంగ ప్రామాణికత-ప్రయోజనం అనే అంశంపై మాట్లాడినాయన పంచాంగం లేకుండా నిత్య జీవితం కొనసాగించలేమనీ, ధర్మాచరణకు పంచాంగం అత్యంతావశ్యకమైందనీ, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలతో కాలాధీనులైన కర్మ సాధకులకు పంచాంగం ప్రసిద్ది చెందిందనీ తెలిపారు. ఇక “ముహూర్త నిర్ణయ రహస్యం అనే అంశం,దేశకాల పరిస్థితులు – పంచాంగ ప్రభావం అనే అంశాలమీద కూడా చర్చ జరిగింది. కాలానుగుణ మార్పులకనుగుణంగా, ధర్మమార్గాన్ని వీడకుండా దేశకాల పరిస్థితులను దృష్టిలో వుంచుకొని సిద్ధాంతులు పంచాంగాలనందిస్తున్నారని అంతా అన్నారు.

‘పండుగల నిర్ణయ సమీక్ష–పరిశీలన’ అంశంపై ప్రసంగించిన సిద్ధాంతి, నిత్య జీవితంలో పండుగులు–వ్రతాలు భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారమనీ, గత కొన్నేళ్లుగా పంచాంగాలలో పండుగలపై విభేదాలు రావడం, సమాజాన్ని ఇబ్బందులకు గురి చేయుట జరిగిందనీ, తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహా సభల ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించిందనీ అన్నారాయన. వర్ష సూచనలు–పంచాంగ ఆవశ్యకత” గురించి,  వస్తు ధరల నిర్ణయ విశ్లేషణ అనే అంశం గురించి,మౌఢ్య నిర్ణయ వ్యత్యాసం అనే  అంశంపైనా,  వార దుర్మూహూర్త–రాహుకాల ప్రభావం” మీదా ప్రసంగాలు సాగాయి.  

         గత ఏడాది జరిగిన యువ సిద్ధాంతుల సమ్మేళనంలో  అనుభవజ్ఞులైన సిద్ధాంతులు యువ సిద్దాంతులకు భవిష్యత్తు మార్గనిర్దేశం చేసారు.

సభల్లో భాగంగా ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో ఒక సిద్ధాంతిని నియమించాలనీ, ప్రభుత్వానికి కూడా ఒక ఆస్థాన సిద్ధాంతి అవసరమని సూచన వచ్చింది. జ్యోతిశ్యాస్త్రానికి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం వుండాలని కూడా కొందరు అన్నారు. ఆధునిక కాలంలో జ్యోతిష ప్రభావం పై ప్రసంగంలో, ప్రస్తుతం అందరికీ జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం పెరిగిందనీ, గణితం చేయడానికి ప్రస్తుతం శ్రమ లేకుండా, కంప్యూటర్ వుపయోగించుకోవచ్చనీ, కాని ఫల నిర్ణయానికి మాత్రం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల అవసరం వుందనీ అన్నారు.

         వివాహంలో రాశికూట ఆవశ్యకత పై జరిగిన చర్చలో, రాశికూటాలపై క్షుణ్ణంగా అవగాహన వుండాలనీ, దోషాలను విశ్వసించినపుడు, శాస్త్రంలో తెలిపిన పరిహారాలను కూడా విశ్వసించాలనీ, సమాజం మేలు కోసమే శాస్త్రం ఆవిర్భవించిందని వక్త నొక్కి వక్కాణించారు. గోచార ప్రాముఖ్యత-రాశీ ఫలాల విశిష్టత అనే అంశంపై వివరణ ఇచ్చిన సిద్ధాంతి, పంచాంగాలలో తెలిపే గోచార రాశి ఫలితాలు సూచనగానే స్వీకరించాలి తప్ప, ఖచ్చితంగా జరిగి తీరుతుందనడానికి వీలులేదన్నారాయన. మనం వుపయోగిస్తున్న ప్రపంచంలోని అన్ని వస్తువులు, వాతావరణంపై గ్రహాల ప్రభావమే మూల కారణం అనీ, మన శాస్త్రాలను మనమే పాశ్చాత్యులకంటే మెరుగ్గా,  క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం వుందనీ అన్నారు. సమాజంలో, ధర్మ పరిరక్షణలో జ్యోతిష్యుల పాత్ర అత్యంత కీలకమైంది.   శాస్త్రం, అనుభవం ఎంత వున్నా ఆచరణ చాలా ముఖ్యం.  ధర్మాచరణలోని జ్యోతిష్యులనే సమాజం గౌరవిస్తుంది.  ధర్మపరిరక్షణ అంటే వేదికలపై ఉపన్యసించడం గాదు.  ధర్మాన్ని ఆచరించడమే ధర్మ పరిరక్షణ అవుతుందని వీరంతా అన్నారు. 

         గత ఏడాది జరిగినట్లే ఇప్పుడు కూడా అదే తరహాలో, సమాజానికి స్ఫూర్తిని కలిగిస్తూ జ్యోతిష్య మహాసభలు జరగాలనీ, జరుగుతాయని ఆశిద్దాం. ఆచరణీయమైన ఆ మహాసభల సూచనలను మంచిమనసుతో స్వాగతిద్దాం, స్వీకరిద్దాం.

No comments:

Post a Comment