Sunday, October 7, 2018

సీతాదేవిని మళ్లీ సందర్శించి శలవు తీసుకున్న హనుమ .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవిని మళ్లీ సందర్శించి శలవు తీసుకున్న హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (08-10-2018)

ఇలా తలచిన హనుమంతుడు, సీతాదేవి వుండే ప్రదేశానికి పోయి, శింశుపావృక్షం కిందున్న ఆమెకు నమస్కరించి, తను చేసిన పూర్వ పుణ్యఫలంవల్ల, క్షేమంగా వున్న సీతను మళ్లా దర్శించే భాగ్యం తనకు కలిగిందని చెప్తూ, తన ప్రభుకార్యం ఏదెట్లా చేయాలో, ఎట్లా జరగాలో అవన్నీ అలానే చేయడం జరిగిందని అంటాడు.

(సీతాదేవి మాత్రమే క్షేమంగా వుండడమే కాకుండా, ఆమెను ఆశ్రయించిన కారణం వల్ల, శింశుపావృక్షం, అశోక వృక్షాలతో సహా వాటి చుట్టు ప్రక్కలున్న చెట్లు కూడా కాలిపోక, విరిగిపోక నిల్చి వున్నై. సీతారాములనాశ్రయించిన వారే కాకుండా, వారిని ఆశ్రయించిన వారు కూడా చెడరని దీనివల్ల స్పష్టమైంది. విభీషణుడే కాకుండా, ఆయన వెంట వచ్చిన వారందర్నీ రక్షిస్తాడు శ్రీరాముడు. విష్ణు భక్తులను ఆశ్రయించిన పశు-పక్ష్యాదులు, మనుష్యులు కూడా వారి వెంట విష్ణుని పరమపదానికి పోతారు).

ఇలాచెప్పి బయల్దేరబోతున్న హనుమంతుడితో, తనభర్తపై తనకున్న ప్రేమను తెలిపే వాక్యాలను మరోసారి చెప్పింది సీతాదేవి ఆయనతో. తాననుకున్న రీతిలో, శ్రీరాముడికి చెప్పి, ఇక్కడకు తీసుకునిరాగల సమర్ధుడు ఆంజనేయుడొక్కడేనని అంటుంది సీతాదేవి. చేయబోయె కార్యాన్ని తన బలాధిక్యంతో, శత్రువులను వధించే శక్తియుక్తులతో సాధించగల శక్తి కలవాడనికూడా అంటుంది. ఆయనకంటే గొప్పవారు సుగ్రీవుడి దగ్గరున్నారని తన బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేయవద్దనికూడా చెప్తుంది. ఎందరున్నా ఈ కార్యభారం తనమీదే వేసుకోవాలని ఆంజనేయుడిని మరీమరీ కోరుతుంది సీతాదేవి.

అణకువతో  సకారణంగా, దోషరహితంగా అర్ధం స్ఫురిస్తూ, సీతచెప్పిన ఆ మాటలకు సరైన రీతిలో స్పందిస్తాడు ఆంజనేయుడు. రామచంద్రమూర్తి వానర సైన్యంతో సముద్రాన్ని దాటివచ్చి, రాక్షసుల పొగరణచి, ఆమె శోకాన్ని నిర్మూలిస్తాడనీ, తనమాటలు నమ్మమనీ, దిగులుపడవద్దనీ సీతకు ఓదార్పు వచనాలు చెప్తాడు హనుమంతుడు. సాహసంచేసి, అపాయం కలిగే ఎటువంటి పనీ చేయవద్దని సీతకు చెప్పి, తానిప్పుడే రామచంద్రమూర్తిని చూడబోతున్నానని, ఆమె అనుజ్ఞ కోరుతూ ఆమెకు నమస్కరిస్తాడు.


సీత అనుమతి తీసుకుని, ఆమెకు అభివాదం చేసి, ఆశీర్వాదాన్ని పొందిన హనుమంతుడు, రాముడి దర్శనం త్వరలో చేసుకోవాలన్న కోరికతో అరిష్టమనే పేరున్న కొండనెక్కాడు. అరిష్ట పర్వతం అందచందాలు వర్ణనాతీతం. విశేషమైన తీగలతో, చెట్లతో, సింహధ్వనులను పోలిన పొడుగాటి గుహలతో, యక్షసంఘాలు, గంధర్వులు, మునులు, పాములు, తియ్యటి కందమూలాలున్న పర్వతమది. ఎత్తైన తామర రంగు చెట్లున్న నల్లటి ఉద్యానవనం ధోవతిలాగా, శిఖరాల మధ్య వ్రేలాడే మేఘాలు ఉత్తరీయంలాగా, సూర్యకిరణాలతో మెలకువ వచ్చి, రెప్పలు తెరిచి చూస్తున్న ధాతువులు నేత్రాలుగా, సెలయేళ్ల గంభీరధ్వనులు వేదాభ్యాసం చేస్తున్నరీతిలో, ఊటనీరు చప్పుళ్లు మనోహర సంగీతంలా, దేవదారు వృక్షాలు ఎత్తిన చేతుల్లాగా కనిపిస్తున్నదా పర్వతం. నలుపురంగు పుష్పాలతో, శరత్కాల మేఘాలకు ముసలిదానిలాగ వణకుతున్నదా పర్వతం. వెదురుబొంగుల్లోంచి వస్తున్న గాలి, కోకిల పంచమ ధ్వనిలాగా వుందక్కడ. పాములు బుసకొట్టే నెపంతో, హనుమంతుడిపై శ్వాస విడుస్తున్నాయా కొండమీద. ఆసాంతం మంచుతోనిండి, గంభీరమైన గుహలు ధ్యానం చేస్తున్నట్లుగా వుందక్కడ. మేఘాలు ప్రాకగల గుట్టలున్నాయక్కడ. మద్ది, తాటి, ఇనుమద్ది, వెదురుచెట్లతో నిండి వున్నదా అరిష్టాద్రి.

అరిష్టాద్రిపైనెక్కిన హనుమంతుడి కాళ్లరాపిడికి, రాళ్లు పొడిపొడవుతుంటే, "కొలువాసాలు"అనే చేపలు, పాములూ, వున్న భయంకరమైన సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసాడు హనుమంతుడక్కడినుండి. సముద్రపు ఉత్తరగట్టు చేరేందుకు, ఆ పర్వతం మీదనుండి సన్నధ్ధుడవుతున్న హనుమంతుడి కాళ్లతొక్కిడికి, అక్కడున్న అడవిజంతువులు తత్తరలాడాయి. పూలగుత్తులున్న చెట్లన్నీ నేలకూలాయి. కొండగుహల్లో వున్న సింహాలన్నీ బెదిరిపోయి దిక్కులు పిక్కటిల్లేటట్లు ధ్వని చేసాయి. వేగంగా పోతున్న అతడి తొడలతాకిడికి పూచిన పూల చెట్లన్నీ, పిడుగుపడ్డ చెట్ల మాదిరిగా కూలి విరిగిపోయాయి. ఆయన వేగానికి భయపడ్డ కొండసింహాలు, గుహల్లోకి పారిపోయి, అందులో చిక్కుకుని, తబ్బిబ్బై, దిక్కులు పగిలిపోయేటట్లు అరవసాగాయి. చీరలు జారుతుంటే, పైటలు వేలాడుతుంటే, ఆభరణాలు ఒకదానికొకటి పెనవేసుకుని రాసుకుంటుంటే, కలత చెందిన ఆ కొండలోని, విధ్యాధర స్త్రీలు అక్కడినుండి వెళ్లిపోయారు వేగాతివేగంగా.

హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు, ఆకాశానికి లంఘించి ఎగరగానే, అక్కడున్న విషం జ్వలించే సర్పాలు సందుల్లోకి దొర్లిపోయాయి. కిన్నరులు, పన్నగులు, యక్షులు, కింపురుషులు ఆ పర్వతాన్ని వదిలి ఆకాశానికి ఎగిరారు. చెట్లతో, శిఖరాలతో, ఎత్తుగా వున్న ఆ పర్వతం పాతాళానికి దిగబడింది. పదియోజనాల వెడల్పు, ముఫ్పై యోజనాల ఎత్తున్న ఆ పర్వతం నిమిషంలో నేల మట్టమైంది. 

ఆకాశ మార్గంలో పోతున్న హనుమంతుడు, సముద్రంలో పోతున్న నావలా వున్నాడు. సూర్యుడనే నీరుకోడిని, చంద్రుడనే తెల్లకలువను, పుష్యమి, శ్రవణ నక్శత్రాలనబడే హంసలను, మేఘాలనబడే పాచిపచ్చికను, పునర్వసు నక్షత్రమనే పెద్ద చేపను, అంగారకుడనే మొసలిని, ఐరావతమనే దీవిని, స్వాతి అనే హంసను, గాలికి కలిగే అలలనే మేఘాన్ని, సిద్ధులు, యక్షులు, సర్పాలు, గంధర్వులతో వికసించిన తామర రేకుల్లాగున్న ఆకాశమనే సముద్రాన్ని నావదాటినట్లు దాటిపోతున్నాడు హనుమంతుడు. అమిత తేజస్సుగల హనుమంతుడి దేహంతాకిడికి మేఘాలు, తెల్లగా కొన్ని, ఎర్రగా కొన్ని, పసుపు, నలుపు కలయికగా ఇంకొన్ని, ఎరుపు-నలుపు కలయికగా మరికొన్ని కనిపించాయి. మేఘాలమధ్య దూరిన చంద్రుడు కనిపించీ-కనిపించక వున్నరీతిలోనే, హనుమంతుడు కూడా మబ్బుల్లో దోబూచులాడుకుంటూ పోతున్నాడు. తెల్లటి వస్త్రాలు ధరించిన హనుమంతుడు, మేఘాలమధ్య చుట్టుకున్నప్పుడు ఆకాశంలోని చంద్రుడిలా, మేఘాలను చీలుస్తున్నప్పుడు ఆకాశంలో వెళ్తున్న గరుత్మంతుడిలా కనిపించాడు.

1 comment:

  1. ఈ హరికథలు బాగున్నాయి సార్. కానీ కేసీఆర్ అసభ్య భాష గురించి ఒక్క ముక్క చెప్పరేమి సాములూ.

    ReplyDelete