Monday, August 19, 2019

ఉద్యోగ శిక్షణతోనే పథకాలు సఫలం : వనం జ్వాలా నరసింహారావు


ఉద్యోగ శిక్షణతోనే పథకాలు సఫలం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (20-08-2019)
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేకానేక సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రాధమిక ఆవరణ మరింత చురుగ్గా, వేగవంతంగా, పకడ్బందీగా,  ఉద్యోగస్వామ్య నిబద్ధతతో, అంకితభావంతో ముందుకు సాగాలంటే, పథకాల అమలుకు ఒక క్రమపధ్ధతి విధానం అవలంభించాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా వుంది. ప్రభుత్వ శాఖల్లో అలాంటి క్రమపధ్ధతి విధానం అమలుపరచడానికి సంబంధిత శాఖాధినేత-హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి. పథకాల అమలు విధాన యావత్ ప్రక్రియ శాఖాధినేత నిబద్ధత, అంకితభావం మీదే ఆధారపడి వుంటుంది. నిబద్ధత కొరవడితే అమలులో లొసుగులకు, అనవసర లోపాలకు, జాప్యాలకు ఆస్కారం వుంటుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల, కార్యక్రమాల విజయవంత అమలుకు ఉద్యోగాస్వామ్య (ఇనుమడించిన) నిబద్ధత, అంకితభావం తప్పనిసరి. ఆ దిశగా ఒక క్రమబద్ద శిక్షణా కార్యక్రం చేపట్టితే బాగుంటుందేమో!

దేశంలో ఎక్కడా అమలులో లేని అనేక పథకాలతో సహా, ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను గత ఐదేళ్లకు పైగా, తెలంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి అమలు చయడం జరుగుతున్నది. ఇవన్నీ వివిధ దశల్లో అమల్లో వున్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పించన్లు, రైతుబందు, రైతు భీమా, గొర్రెల పంపకం, చేపల పెంపకం, కంటి వెలుగు, నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎత్తిపోతల సాగునీటి పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, తెలంగాణాకు హరితహారం, గురుకుల విద్యా విధానం, వెల్నెస్ కేంద్రాలు, కేసీఆర్ కిట్స్, టీస్-ఐపాస్, పంచాయతీరాజ్, మునిసిపల్ లాంటి పలు చట్టాలు వున్నాయి. 

యావత్ దేశంలో వ్యవసాయంతో సహా  అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన  మార్పు ఇటు వ్యవసాయ రంగానికి అటు పారిశ్రామిక రంగానికి నూతనోత్తేజాన్ని కలిగించింది. మంచినీటి సమస్య సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకం సఫలం అవుతుండడం ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నది.

సమాజం చివరి అంచున, నిస్సహాయంగా నిలిచిపోయిన నిరుపేద వర్గాలకు నిజమైన  చేయూత అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. ఆ దిశగా అనేక ప్రజా  సంక్షేమ పథకాలను ప్రారంభించి అమలుపరుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఒకరేమిటి ! ఎవరైతే పేదరికంతో విలవిల లాడుతున్నారో వారందరినీ గుర్తించి, కనీస జీవన భద్రత కలిగించే విధంగా ప్రభుత్వం ఆసరా పించన్లు అందిస్తూ ఆదుకుంటున్నది. ఎక్కడా  మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా పేదలకు అందుతున్న ఆసరా పించన్ల పథకం ప్రభుత్వానికి అత్యంత, సంతృప్తినీ సంతోషాన్ని కలిగిస్తున్న పథకం.

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అచ్చంగా కేసీఆర్ మానస పుత్రికలు. బలహీన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం అందించాలనే పట్టుదలతో రెండు బెడ్రూంల ఇండ్ల నిర్మాణం కొన సాగుతున్నది. బడులలో, హాస్టళ్ళలో విద్యార్థులకు పెడుతున్న సన్నబియ్యం అన్నం పరిపాలనలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తున్నది. గర్భిణులకు పౌష్టిక ఆహారం  అందించే ఆరోగ్యలక్ష్మి, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన కెసిఆర్ కిట్స్ పథకాలు మహిళా సంక్షేమానికి నూతన నిర్వచనంగా నిలిచినాయి. గ్రామీణ జీవితం లో మెరుగైన మార్పులు రావాలని ఆశించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేసింది ప్రభుత్వం. శిథిలమైన చెరువులను పునర్జీవింప చేసేందుకు ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాకు నిదర్శనంగా అంతర్జాతీయంగా ప్రశంసలను పొందింది.


పెద్ద ఎత్తున జరుగుతున్న గొర్రెల పంపిణీ గొల్ల కుర్మల దగ్గర జీవ సంపదను పెంచింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేపల పెంపకానికి కావాల్సిన చేప విత్తనాన్ని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసింది. రైతులకు పంట కాలంలో కావల్సిన పెట్టుబడిని అందించడం కోసం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం రైతుల హృదయాల్లో హర్షం నింపింది. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, అతని కుటుంబం అగాధం అయిపోవద్దని ఎంతో ఆలోచించి ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. పర్యవరణ పరిరక్షణ కోసం  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. ఇవన్నీ ఎంత పటిష్టంగా, ప్రణాలికా బద్ధంగా అమలవుతున్నప్పటికీ, ఇంకా మెరుగుపరచుకునే వీలుంది.    

రాష్ట్ర స్థాయిలో సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, లేదా, ముఖ్య కార్యదర్శి, లేదా, కార్యదర్శి, శాఖాపరంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జిల్లా స్థాయిలో కలెక్టర్ పథకాల అమలు పర్యవేక్షణ, మానిటరింగ్ చేయడంతో పాటు తన కింది అధికారులకు అవసరమైన దార్శనికత సమకూరుస్తారు. యావత్ అమలు ప్రక్రియను తమ భుజస్కందాలమీద వేసుకుని, శాఖాపరంగా, జిల్లా పరంగా, అనునిత్యం అమలు పురోగతిని సమీక్షిస్తుంటారు. ఎక్కడ లోపాలున్నా సరిదిద్దుతుంటారు. అన్నిరకాల నాయకత్వాన్ని అందిస్తారు. ఇంతవరకూ పథకాల అమలు పటిష్టంగానే జరుగుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ మరింత క్రమబద్ధంగా, క్రమపద్ధతిలో జరగాలంటే సరైన పునశ్చరణ శిక్షణ దిశగా ఆలోచనజరగాలి.

పథకాల, కార్యక్రమాల పకడ్బందీ, విజయవంత అమలుకు సంబంధిత అధికారుల సామర్థ్య పెంపుదల జరగడానికి ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతిలో పునశ్చరణ కార్యగోష్టి (వర్క్ షాప్) లను నిర్వహించాలి. కార్యక్రమాల అమలుకు ఒక సమగ్ర, సమన్వయ విధానం ద్వారా కార్యదర్శులకు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లకు, జిల్లా కలెక్టర్లకు కనీసం మూడురోజులపాటు శిక్షణ ఇవ్వాలి. అలాంటి వర్క్ షాప్ లక్ష్యాలు, ఆశయాలు నిర్దుష్టంగా వుండాలి.

   వర్క్ షాప్ లో భాగంగా అందులో పాల్గొనే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, లేదా, ముఖ్య కార్యదర్శి, లేదా, కార్యదర్శి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల మీద సమగ్రమైన చర్చ చేయడానికి, పథకాల సమగ్ర అవగాహనకు, దృక్ఫదాల మార్పిడికి అవకాశం కలిగించి, పథకాల అమలు సామర్థ్యాలను ఒక క్రమపద్ధతిలో వృద్ధి చేసుకోవడానికి వ్యూహాన్ని రూపొందించే వీలు కలిగించాలి. సాధ్యమైనంత వరకు పథకాల అమలుకు వికేంద్రీకరణ విధానం అవలంభించే దిశగా చర్చ జరగాలి. సామూహిక చర్చలు, వ్యక్తిగత, సిండికేట్ ఎక్సర్సైజులు, పథకాల అమలు కార్యాచరణ ప్రణాళికల తయారీ, సభాముఖంగా వాటి సమర్పణ వర్క్ షాప్ లో వుండాలి.

ఈ రకమైన డిజైన్ ప్రాతిపదిక మూడు విధాలు. మొదటిది: ఇంతవరకు పథకాల అమలు విషయంలో జరగాల్సింది ఏమిటి, ఎంతవరకు జరిగింది? వాస్తవానికి జరిగింది మాత్రం ఏ మేరకు? తేడా గుర్తించి దానికి కారణాలను ప్రతిబింబించాలి; రెండవది: పథకాల క్రమబద్ద అమలుకు భావనల, విధానాల, ప్రక్రియల సమీక్ష జరపడం; మూడవది: యావత్ ప్రక్రియను పునఃపరిశీలన చేసి, ఒక పునరాకృతి కలిగించి, తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన రీతిలో ఒక రోడ్ మ్యాప్ రూపొందించడం. వర్క్ షాప్ లో భాగంగా అమలుకు సంబంధించి ఆందోళన కలిగించే అంశాలేవైనా వున్నాయా గుర్తించడం, అమలుకు సంబంధించిన వివిధ పనులను వాటి పరిధులను గుర్తించడం, పథకాల పటిష్ట అమలుకు కార్యాచరణ ప్రణాళిక గుర్తించడం వుండాలి. ఇలాంటి ఓరియంటేషన్-పునశ్చరణ శిక్షణా కార్యక్రమం, మార్పు సవాళ్లను ప్రణాలికా బద్ధంగా అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యాలను వృద్ధి చేయడానికి దోహదపడుతుంది. పర్యవసానంగా, శిక్షణకు హాజరైనవారి జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం శాస్త్రీయంగా అభివృద్ధి చెంది, అధికారులలో మెరుగైన పనితీరుకు వీలు కలుగుతుంది. వారు చేస్తున్న పనిలో ఇనుమడించిన నిబద్ధత, నైపుణ్యంతో పాటు, బహుళార్థ నైపుణ్యానికి కూడా ఆస్కారం వుంటుంది. 

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, లేదా, ముఖ్య కార్యదర్శి, లేదా, కార్యదర్శి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్లకు, వారి తరువాత కింది స్థాయి ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి మధ్య వారి-వారి స్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యతల విషయంలో స్పష్టత వుంటే మార్పు సవాళ్లు అధిగమించడం సులభమవుతుంది. ఉన్నతాధికారులు ఒక పనిని నిర్ణయించి, దార్శనికత చూపించి, నిర్వహణ బాధ్యతను వహిస్తే, వారి కింది స్థాయి సిబ్బంది ఆ పనిని కార్యరూపంలో పెట్టగలుగుతారు, అమలు చేయగలరు. పథకాల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చేది పై స్థాయి వారైతే, వాటిని సక్రమంగా ఉపయోగంలోకి తెచ్చే బాధ్యత వారి కింది వారిది. ఉన్నతాధికారులకు అమలు ప్రక్రియకు సంబంధించిన పూర్తి అవగాహన వుంటే, కిందివారికి వాటిని కార్యరూపంలో పెట్టడానికి అవసరమైన నైపుణ్యం వుండాలి. ఇవన్నీ పునశ్చరణ వర్క్ షాప్ లో కూలంకషంగా చర్చించి పూర్తి అవగాహనకు రావాలి.

ఈ వర్క్ షాప్ లో, ఇంతవరకూ అమల్లో వున్న పథకాల, కార్యక్రమాల అమలు విషయంలో తలెత్తిన అంతరాల తగ్గింపు, లోపాలను అధిగమించడం చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. ముందు-ముందు అమలు చేయబోయే పథకాల విషయంలో సంబంధిత అధికారుల సామర్థ్యం పెంపుకు సంబంధించి కార్యక్రమం ఆదినుండి అంతందాకా రూపొందించాలి. ప్రతి పథకం మార్గదర్శకాలను పటిష్టమైన శిక్షణ ఆకృతిలోకి మార్చి, వివిధ స్థాయిలలో అమలు చేసే వారి బాధ్యతలను నిర్వచించాలి.

ఈ బృహత్తర ప్రణాలికను ముందుకు తీసుకుపోవడానికి ఒక బహుళార్థ సాధక డిజైన్ రూపకల్పన జరగాలి. ఇంతవరకు అమల్లో వున్న, మున్ముందు అమలు కానున్న ప్రతి పథకాన్ని డిజైన్ రూపకర్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. పథకాల అమలులో భాగాస్వామ్యులైన వారితో చర్చించి డిజైన్ తయారు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న ప్రతి పథకం మరింత విజయవంతంగా, ఇప్పటికన్నా మరింత మెరుగ్గా అమలు కావాలంటే, ఉన్నతాధికారుల నిబద్ధత, అంకిత భావం ఎంత ప్రధానమైందో, అంతే మోతాదులో వారి కింది స్థాయి ఉద్యోగులలో కార్యక్రమం అమలు పట్ల నైపుణ్యం ప్రధానం. అందుకే సంక్షేమ, అభివృద్ధికి ఉద్యోగాస్వామ్య నిబద్ధత, అంకిత భావం దిశగా వడి-వడిగా అడుగులు వేయాలి. పై స్థాయి ఉద్యోగుల కమిట్మెంట్ తీసుకోవడానికి ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ గతంలో ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం “ఓఎంఓటీ” (ఓరియంటేషన్ టు మానేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్) విజయవంతంగా నిర్వహించింది. యావత్ దేశానికి ఆదర్శమైన ఆ కార్యక్రమాన్ని అప్పట్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ పరిపాలనా శిక్షణా సంస్థలు చేపట్టాయి. అఖిలభారత సర్వీస్ అధికారులతో సహా సుమారు 200 మంది ఉన్నతాధికారులు ఆ పునశ్చరణ శిక్షణలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా పథకాల అమలు విషయంలో పునశ్చరణ శిక్షణా కార్యక్రమ వర్క్ షాప్ డిజైన్ తయారు చేయడానికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థను ప్రభుత్వం ఆదేశించవచ్చు.  

No comments:

Post a Comment