Sunday, November 1, 2020

విష్ణు సేవా ప్రాశస్త్యం, వృకాసురుడి శివద్రోహం ..... శ్రీ మహాభాగవత కథ-83 : వనం జ్వాలా నరసింహారావు

 విష్ణు సేవా ప్రాశస్త్యం, వృకాసురుడి శివద్రోహం

శ్రీ మహాభాగవత కథ-83

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

పరమ శివుడిని కొలిచేవారు సకల సిరిసంపదలతో ఎప్పుడూ సంతోషంగా వుంటారనీ, విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా వుంటారనీ, దీనికి కారణమేంటనీ, సందేహాన్ని వెలిబుచ్చాడు ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో. సమాధానంగా శ్రీకృష్ణుడు, తన అనుగ్రహం ఎవరిమీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడి సమస్త సంపదలను తాను లేకుండా చేస్తాననీ, అతడప్పుడు దనహీనుడై బాధలు పడుతూ, బంధుమిత్రులను వదిలి, తన భక్తులతో స్నేహం చేస్తాడనీ, ఆ క్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది తనకు చేరువౌతాడనీ అన్నాడు. తరువాత కొంతకాలానికి అవ్యయమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడనీ, చివరకు ముక్తిని పొందుతాడనీ, విష్ణు సన్నిధానంలో పరమానందాన్ని అనుభావిస్తాడనీ అంటాడు శ్రీకృష్ణుడు. అందుకే తన సేవ చాలా కఠినమైనదని భావించి చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్పాడు. అన్యదేవతలిచ్చే సిరిసంపదలు, వరాలు, అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. ధర్మరాజు సందేహ నివృత్తి కొరకు ఒక కథ చెప్పాడు శ్రీకృష్ణుడు.

పూర్వం శుకుడనే ఒక దైత్యుడుండేవాడు. అతడి కొడుకు వృకాసురుడు పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు నారద మహర్షిని దర్శించి, బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తమ భక్తులకు వరాలను ప్రసాదిస్తారని అడిగాడు. జవాబుగా నారదుడు త్రిమూర్తులలో శివుడిని ప్రార్ధిస్తే ఆయన కోర్కెలన్నీ వెంటనే ఫలిస్తాయని చెప్పాడు. తక్షణమే వృకాసురుడు బయల్దేరి కేదార తీర్థానికి వెళ్లి, శంకరుడిని గూర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేయసాగాడు. అలా ఏడురోజులపాటు ఘోరమైన తపస్సు చేసి, ఏడవ రోజున కేదార తీర్థంలో పవిత్ర స్నానం చేసి, వృకాసురుడు గండ్రగొడ్డలితో తన తలనరికి అగ్నిగుండంలో వేయబోయాడు. అప్పుడు అగ్నిగుండం నుండి శివుడు ప్రత్యక్షమై వృకుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు. వరం కోరుకొమ్మన్నాడు.

తాను ఎవరి తలమీద చేయి పెడితే వాడి తల వెంటనే నూరు వక్కలై వాడు మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదించాడు. వృకుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకుని శంకరుడి మీదికి వెళ్లాడు. శివుడి తలమీద చేయి పెట్టబోయాడు. శివుడు భయంభయంగా పరుగెత్తాడు. ఇద్దరూ ముల్లోకాలు తిరిగారు. చివరకు పరమ శివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు. శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. వృకాసురుడి మదం అణచడానికి వటువు వేషంలో వాడి దగ్గరికి వెళ్లాడు. అక్కడికి ఎందుకు వచ్చావని అడిగాడు వాడిని. తానక్కడికి వచ్చిన సంగతి సవివరంగా చెప్పాడు వృకాసురుడు. శివుడిచ్చిన వరాలను నమ్మవద్దని, తానిచ్చిన వరం అసత్యమని తేలుతుందనే శివుడు పారిపోతున్నాడనీ అన్నాడు వటుడి రూపంలో వున్న విష్ణువు.

శివుడు వాడికిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు. వృకాసురుడిని శుభ్రంగా స్నానం చేయమని, పరిశుభ్రంగా శివుడి వెంట వెళ్తే వాడు శివుడిని తాకి కోరిక నెరవేర్చుకోవచ్చని సలహా ఇచ్చాడు. వృకుడు విష్ణుమాయకు లోబడిపోయి అజ్ఞానానికి లోనయ్యాడు. వటుడు చెప్పినట్లే స్నానం చేస్తూ, తన చేయిని తన తలమీదనే పెట్టుకుని చనిపోయాడు. వృకుడి తల నూరు వక్కలై హతమై పోయాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడిని చూసి, వృకుడిలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలివ్వకూడదని చెప్పాడు.

ఇదిలా వుండగా, మహా తపస్సంపున్నులైన కొందరు మునీశ్వరులు ఒక సారి సరస్వతీ నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలు చేయసాగారు. వారి మధ్య ఒకనాడు త్రిమూర్తులలో అధికులు ఎవరన్న చర్చ వచ్చింది. అది తెలుసుకోవడానికి సమాయత్తమయ్యారు. అంతా కలిసి ఎవరో తేల్చుకోవడానికి భృగు మహర్షిని నియోగించారు. ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయల్దేరాడు. మొదలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లాడు. నమస్కారం చేయకుండా, ఏమీ మాట్లాడకుండా, తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. వచ్చినవాడు తన కుమారుడని తలచి, తన కోపాన్ని చల్లబరుచుకుని శాంతించాడు బ్రహ్మ. అక్కడి నుండి శంకరుడిని దర్శించాలనుకుని వెండికొండకు వెళ్లాడు. శివుడు భృగు మహర్షిని చూసి ఎదురుగా వెళ్లాడు. వచ్చినవాడిని గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి. కోపంతో శివుడు, భృగు మహర్షిని త్రిశూలంతో పొడవబోగా పార్వతి వారించింది.

భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠ పురంలో ప్రవేశించాడు. విష్ణుమూర్తిని చూశాడు. ఆ సమయంలో ఆయన భోగభాగ్యాలతో విలసిల్లుతూ, లక్ష్మీదేవి సరసనే వున్నాడు. వెనకా-ముందూ చూడకుండా భృగు మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. విష్ణు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పాన్పు దిగివచ్చి మహర్షి పాదాలకు నమస్కరించాడు. తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మంచి మాటలతో ఆయన్ను అనునయించాడు. విష్ణుమూర్తి మాటలకు భృగు మహర్షి పరమానందభరితుడయ్యాడు. శ్రీహరి నుండి వీడ్కోలు తీసుకుని వైకుంఠం నుండి సరస్వతీ నదీతీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటిలేని దైవమని నిశ్చయించారు మునులంతా. విష్ణుమూర్తి పాదపద్మాలను మనస్సులోనే కొలిచారు.  

మహర్షులంతా విష్ణువును సేవించి అవ్యయమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందారు.                    

                (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment