Wednesday, November 4, 2020

వైకుంఠనిలయానికి చేరిన శ్రీకృష్ణ బలరాములు ...... శ్రీ మహాభాగవత కథ-86 : వనం జ్వాలా నరసింహారావు

 వైకుంఠనిలయానికి చేరిన శ్రీకృష్ణ బలరాములు

శ్రీ మహాభాగవత కథ-86

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

ఒకప్పుడు అమృతాన్ని తాగే అమరులు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, శివుడు, విరించి, మహా మునులు, పుండరీకాక్షుడి దర్శనం కోసం ద్వారకానగరానికి వచ్చినారు. శ్రీకృష్ణమూర్తిని చూసి ఆయన్ను అర్చించుకున్నారు. ఆయన భూభారాన్ని తొలగించడం కోసం నేలకు దిగివచ్చి 125 సంవత్సరాలు కావస్తున్నదని, ఆయన ఇక వైకుంఠనిలయానికి రావాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రార్థించారు. సమాధానంగా శ్రీకృష్ణుడు, యాదవులందరికీ పరస్పర వైరానుబంధాలను కల్పించి, వారందరినీ అంతం చేసి, భూభారాన్ని తగ్గించి, వైకుంఠనిలయానికి వస్తాను, వెళ్లమని చెప్పాడు. ఆ తరువాత ద్వారకానగరంలో అనేకరకాల దుర్నిమిత్తాలు కనబడినాయి. అలాంటప్పుడు యాదవులు ఇక అక్కడ వుండడం క్షేమం కాదని, వారందరినీ, ప్రభాస తీర్థానికి బయల్దేరమని ఆజ్ఞాపించాడు కృష్ణుడు.

యాదవులంతా బంధుమిత్రులతో సహా కృష్ణుడు చెప్పినట్లే ద్వారక నుండి బయల్దేరారు. జరుగుతున్న విపరీత పరిణామాలను జ్ఞానదృష్టితో గ్రహించిన ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని వేనోళ్ల సన్నుతించాడు. యదువంశాన్ని తుదముట్టించి కృష్ణుడు వెళ్లిపోతే తమకు దిక్కెవరని అడిగాడు ఆయన్ను. జవాబుగా కృష్ణుడు, బ్రహ్మాది దేవతలు వచ్చి చేసిన విన్నపాన్ని పురస్కరించుకుని తాను భూభారాన్ని తొలగించాల్సి వచ్చిందని, ఆ రోజు నుండి ఏడవ దినాన ద్వారకానగరాన్ని సముద్రుడు ముంచుతాడని, దానితో యదువంశ నాశనం పూర్తవుతుందని, అ ఆతరువాత అధర్మానికి ఆలవాలమైన కలియుగం ఆరంభం అవుతుందని, నాస్తికత్వం ప్రబలుతుందని చెప్పాడు. యుగాంతం సమీపిస్తున్నది కాబట్టి అన్ని బంధాలను తెంచుకోమని ఉద్ధవుడికి సలహా ఇచ్చాడు. ఆయన జ్ఞానవిజ్ఞాన యుక్తుడు కావాలని, ఆ ఆత్మానుభవంతో సంతృప్తి చెందితే ఆయనకు విశ్వమంతా వున్నది పరమేశ్వరుడే అన్న తత్త్వవిజ్ఞానం కలుగుతుందని అన్నాడు.

అప్పుడు ఉద్ధవుడు భక్తితో, సంసారంలో పడ్డ సామాన్యులు సంసార సాగరం నుండి ఈది, నది ఒడ్డుకు ఎప్పుడు, ఎలా చేరుతారని, ఏవిధంగా మోక్షం సిద్ధిస్తుందని అడిగాడు. కృష్ణుడి సేవకుడైన తనకు ముక్తి మార్గాన్ని చూపమని ప్రార్థించాడు. సన్మార్గం అవలంభించి, స్వధర్మాచరణతో తన నివాసానికి వెళ్లమని, తన రూపాన్ని మనస్సులో నిలుపుకోమని అంటూ, కృష్ణుడు ‘అవధూత యదు సంవాదం అనే ఒక ఇతిహాసాన్ని చెప్పాడు.

ఒకప్పుడు ఒక అవధూత యదు మహారాజు దగ్గరికి వచ్చి, 24 మంది గురువుల సాంగత్యంతో తాను విజ్ఞానినయ్యాను అని చెప్పగానే, జనార్దనుడిని  చేరుకునేది ఎలా అని ప్రశ్నించాడు రాజు. జవాబుగా అవధూత, పంకజనాభుడి పాదారవిందాలను భజిస్తూ, దానివల్ల అజ్ఞానం తొలగిపోగా, భగవదనుగ్రహం వల్ల కర్మదోషాలు నశించి కర్మల నుండి విముక్తి కలుగుతుందని చెప్పాడు.

నిత్య శుచిత్వాన్ని, నిర్మలత్వాన్ని, నిర్వికారతను, లోకోపకార గుణాన్ని, సంసారంపట్ల అనాసక్తిని, కర్మత్యాగాన్ని, ఇంద్రియ జయాన్ని, మొహాన్ని విసర్జించడాన్ని, ఇంద్రియ వశత్వాన్ని, వైరాగ్యాన్ని, మమత్వ పరిత్యాగాన్ని, విచార శూన్యతను, సంగత్యాగాన్ని, తదేక నిష్టను, భగవత్ తత్త్వాన్ని, సంసార పరిత్యాగాన్ని, కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలను జయించడాన్ని, నిత్య కర్మలను ఆచరించడం లాంటి వాటిని గ్రహించి పరమాత్మను గురించి తప్ప వేరొక చింతన చేయకూడదని అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడితో. చివరకు సర్వసంగ పరిత్యాగాన్ని చేసి ఆత్మనిష్టతో పవిత్రమైన యోగి పరమాత్మలో ఐక్యాన్ని పొందుతాడని చెప్పాడు.

దేహం నిత్యమైన ఆత్మకాదని గ్రహించి, మోహబంధాలన్నిటినీ తెంచేసి, సద్వర్తనను పాటించి, ఇల్లు విడిచిన నరుడు పరమాత్మ జ్ఞానాన్ని ఆర్జించి, అఖండమైన మోక్ష లక్ష్మిని చూరగొంటాడని అన్నాడు కృష్ణుడు ఉద్ధవుడితో. భగవంతుడి రూపాన్ని ఏవిధంగా చూడవచ్చని అడిగాడు ఉద్ధవుడు. భక్తిభావనతో తన కథలను, తన అవతారాలను, తన లీలలను వింటూ, తనకు సేవకులైన భాగవతులను సందర్శించిన వారు భగవంతుడిని చూడవచ్చని జవాబిచ్చాడు కృష్ణుడు. ఇదే భక్తియోగ విధానం అన్నాడు.

ఆ తరువాత ఉద్ధవుడు, సనక సనందనాది యోగీంద్రులకు శ్రీకృష్ణుడు చెప్పిన యోగామార్గాన్ని గురించి అడిగాడు. అప్పుడు తాను వారికి చెప్పిన, బ్రహ్మాది దేవతలు గ్రహించిన సాంఖ్య యోగం గురించి చెప్పాడు. పిమ్మట ఉద్ధవుడి కోరిక మేరకు ధ్యాన యోగాన్ని గురించి చెప్పాడు. దానిలో భాగంగా అర్జునుడు రణరంగంలో విషాదమగ్నుడైనప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు బోధించిన తత్త్వాన్ని వివరించాడు ఉద్ధవుడికి. తానే చరాచరాత్మకమైన జగత్తుకు పరమాత్మనని, సృష్టిస్థితిసంహారకర్తనని, ఈశ్వరుడినని, మహత్తని, బ్రహ్మనని, అగ్నినని, విష్ణువునని, భృగువునని, నారదుడినని, కామధేదేనువునని, కపిలమహర్షినని, ప్రహ్లాదుడినని, చంద్రుడినని, ఐరావతాన్నని, ఉచ్చైశ్స్ర వాన్నని, వాసుకినని, సింహాన్నని, ఓంకారాన్నని, గంగనని, క్షీరసాగరాన్నని, మేరువునని, బ్రహ్మ యజ్ఞాన్నని, ఆత్మయోగాన్నని, ఋతువులనని, వాసుదేవుడినని, కుబేరుడినని, ఆంజనేయుడినని....ఇలా అన్నీ తానేనని కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పాడు.

ఆ తరువాత ఉద్ధవుడి కోరిక ప్రకారం, కృష్ణుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల పుట్టుక గురించి, ఆశ్రమ ధర్మాల గురించి, నాలుగు వేదాలలో చెప్పబడిన ధర్మాల గురించి, ప్రవృత్తి-నివృత్తి మార్గాల గురించి, వైరాగ్యం గురించి, విజ్ఞానం గురించి వివరించాడు. తన మీద చిత్తాన్ని నిల్పి, విద్యుక్త కర్మలను అనుష్టించి, కర్మఫలాన్ని ఆశించిన కర్మయోగులు ముక్తిపదాన్ని పొందారని చెప్పాడు. ఉద్ధవుడిని కూడా వారిలాగే చేయమని చెప్పాడు కృష్ణుడు. పరమాత్మను పూజించే విధానం చెప్పమని అడిగాడు ఉద్ధవుడు.

అప్పుడు శ్రీకృష్ణుడు అన్ని వర్ణాలవారికి యోగ్యమైన పూజా విధానం గురించి చెప్పాడు. రాతితో కాని, మట్టితో కాని, చెక్కతో కాని, కంచు లాంటి లోహంతో కాని, బంగారంతో కాని, వెండితో కాని తన ప్రతిమను నామరూపానుసారం ఏర్పరుచుకుని, ప్రతిమ రూపంలో తానే కొలువైనట్లుగా భావించి కొలిచేవారికి తాను ప్రసన్నుడిని అవుతానన్నాడు. ఇలా నిత్యం తనను ధ్యానించిన వారు కర్మానంతరం తనను కలుసుకుంటారని చెప్పాడు. ఇలా చెప్పి, ఉద్ధవుడిని బదరికాశ్రమానికి వెళ్లమని, తాను చెప్పినట్లు ఏకాగ్ర నిష్ఠతో యోగదీక్ష వహించి, తాను బోధించిన సాంఖ్యయోగాన్ని అంతరంగంలో నిలుపుకొమ్మని అన్నాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడు కృష్ణుడి ఆనతి ప్రకారం బదరికాశ్రమానికి బయల్దేరాడు.

ఇదిలా వుండగా, శ్రీకృష్ణుడి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కార్యక్రమం పూర్తైన తరువాత అన్న బలరాముడితో కలిసి బయల్దేరాడు. మద్యపాన ప్రభావంతో యాదవులు కలహించి కనబడ్డవారితో కయ్యానికి కాలుదువ్వారు. మునిశాపం కారణాన, వారిలో వారే కలహించుకుంటూ, కొట్టుకున్నారు. శరీరాలు తెగిపోయాయి. ఇక ఆ యుద్ధంలో ఎవ్వరూ  బతికిబట్ట కట్టరని కృష్ణుడు చిరునవ్వు నవ్వుకుని, బలరాముడితో కలిసి బయల్దేరాడు. బలరాముడొకచోట యోగసమాధిలోకి పోయి తన మూలరూపమైన ఆదిశేషుడిని కలుసుకోగా పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వేరొక మార్గాన వెళ్లాడు.

కృష్ణుడు, ఒకచోట ఒక పొదరిండ్లను చూసి, అక్కడ విశ్రమించి, ఒక చరణాన్ని వేరొక చరణం మీద లీలగా ఆనించి, ఆత్మానందుడై వున్నాడు. అలా వుండగా, ఒక బోయవాడు వేటాడుతూ అక్కడికి వచ్చి, చెట్టుచాటున వున్న పరమపురుషుడి చరణకమలం జింక చెవి అనుకున్నాడు. దాన్ని చూసి బాణాన్ని ఎక్కుబెట్టి విడిచేసరికి అది ఆకస్మికంగా వచ్చి తగిలిన శరాఘాతానికి శ్రీకృష్ణుడు హాహాకారం చేశాడు. అప్పుడాబోయవాడు పరమేశ్వరుడి సన్నిధానానికి వచ్చి, ఆయన్ను సాక్షాత్తు జగన్నాథుడని గుర్తించి, ఘోరాపరాధం చేశానని, మహాపాపం మూటగట్టుకున్నానని, పరిపరి విధాల దీనాలాపాలు పలికాడు. దుఃఖిస్తున్న బోయవాడిని చూసి శ్రీకృష్ణుడు, ఆయనేం తప్పు చేయలేదని, పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే అని, కర్మఫలం వూరికే పోదని అన్నాడు. బోయవాడు కేవలం నిమిత్తమాత్రుడే అని అన్నాడు. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించిన బోయవాడు సర్వసంగ పరిత్యాగం చేసి, ఉపవాస దీక్ష చేసి, కర్మశేషం తీరగానే ప్రాణాలను విడిచి పరమపదమైన వైకుంఠలోకానికి చేరుకున్నాడు.

         ఆ సమయంలో అక్కడే వున్న కృష్ణుడి రథసారధి దారుకుడు ఇంకా ఏంజరగబోతున్నదో అని వీక్షించసాగాడు. కడగంటి చూపుతో కృష్ణుడు తనమీద దయారసాన్ని ప్రసరింప చేసి, తరింప చేయమని ప్రార్థించాడు. ఇలా అంటుండగానే దివ్యాయుధాలైన పాంచజన్య, సుదర్శన, కొమోదకీ నందకాలతోనూ, గరుడలాంఛనంతోనూ, శైబ్య సుగ్రీవ మేఘపుష్ప, బలాహక, హయాలు పూన్చిన దివ్యరథం ఆకాశానికి ఎగిరి అంతర్థానం అయిపోయింది. అప్పుడు నారాయణుడు దారుకుడిని చూసి, అక్రూర, విదురలకు జరిగిన వృత్తాంతమంతా చెప్పమని, ఆర్జునుడిని కలిసి అతడితో స్త్రీబాలవృద్ధులను, పెద్దలను హస్తినాపురానికి తీసుకెళ్లమని ఆదేశించాడు. దారుకుడు అలాగే చేశాడు.

శ్రీకృష్ణ పరమాత్మ దివ్యతేజోమయదేహుడై తరలి, నారదాది మునిగణం, బ్రహ్మరుద్రాది దేవతలు జయజయ ధ్వానాలతో కడలి వస్తుంటే వైకుంఠమందిరానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు నిర్గమించిన చోట ఆయన విగ్రహం సముద్ర తీరాన జగన్నాథస్వరూపమై వెలసింది. ఈ కథను విన్నా, ఆలకించినా, వ్రాసినా, నిండైన ఐశ్వర్యం, మంచి కీర్తి, భోగభాగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు పొంది, లోకుల మెప్పు పొందుతూ, మనిషి కలకాలం వుంటాడు.

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment