Monday, November 2, 2020

కృష్ణార్జునులే నరనారాయణులని చెప్పిన శ్రీమన్నారాయణుడు .... శ్రీ మహాభాగవత కథ-84 : వనం జ్వాలా నరసింహారావు

 కృష్ణార్జునులే నరనారాయణులని చెప్పిన శ్రీమన్నారాయణుడు

శ్రీ మహాభాగవత కథ-84

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడు నివసిస్తున్న ద్వారకానగరంలో, ఒకనాడు, ఒక భూసురుడు తన కుమారుడు పుట్టగానే చనిపోవడంతో ఆ మృత శిశువును రాజద్వారం దగ్గర పడుకోబెట్టి, తానేంపాపం చేశానని ఏడ్వసాగాడు. ఏడ్వడంతో పాటు, రాజును నిందించసాగాడు. బ్రాహ్మణులపట్ల విద్వేషంతో శాస్త్రానుసారంగా ప్రవర్తించక, పాపాత్ముడైన రాజు పాలనలో, ఆ నరపతి చేసిన పాపాలవల్లే తన పుత్రుడు పుట్టగానే చనిపోయాడని, విషయలోలుడైన రాజు రాజ్యంలో ప్రజలు దుఃఖాల పాలవుతారని అంటూ అక్కడినుండి వెళ్లిపోయాడు. ఇలా ఆ బ్రాహ్మణుడి పుత్రులు పుట్టగానే చనిపోవడం, చనిపోగానే మృత శరీరం తెచ్చి రాజద్వారం దగ్గర పెట్టి అతడు ఏడ్వడం, తనను తానే తిట్టుకుంటూ వెళ్లిపోవడం జరుగుతుండేది. అలా ఎనిమిది మంది చనిపోయిన తరువాత తొమ్మిదో కొడుకు కూడా చనిపోవడంతో ఆ శిశువును ఎప్పటిలాగే రాజద్వారం దగ్గర పెట్టి ఏడ్వసాగాడు.

అర్జునుడు ఆ బ్రాహ్మణుడిని చూశాడు. బ్రాహ్మణుడి పుత్రుడిని తానిప్పుడే బతికిస్తానని అన్నాడు. అలా చేయలేకపోతే అగ్నిలో పడి దేహత్యాగం చేస్తానని అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు అర్జునుడి మాటలను వెర్రి మాటలుగా కొట్టిపారేశాడు. శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, బలరాముడు, అనేకమంది యాదవ వీరులు చేయలేని పని ఆయనెలా చేస్తాడని ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు అలా అనగానే, దురహంకారంతో అర్జునుడు, తాను వారిలో ఎవరినీ కాదని, గాండీవమనే ధనుస్సుగల ప్రచండ పరాక్రమంతో విరాజిల్లే ఆర్జునుడినని, సాక్షాత్తు పరమేశ్వరుడిని జయించిన మేటి వీరుడినని, మృత్యుదేవత గర్వాన్ని అణచి బ్రాహ్మణుడి పుత్రులను తెచ్చి ఇస్తానని పలికాడు. అర్జునుడి మీద విశ్వాసంతో బ్రాహ్మణుడు ఇంటికి పోయాడు.

కొన్నాళ్లకు విప్రుడి భార్య మళ్లీ ప్రసవ వేదన పడుతుంటే ఆమె భర్త అర్జునుడి దగ్గరికి వచ్చి విషయం తెలియచేశాడు. అర్జునుడప్పుడు శివుడిని ప్రార్థించి, మంత్రదేవతలను ఆరాధించి, గాండీవాన్ని ఎక్కుపెట్టాడు. బ్రాహ్మణుడి వెంట ఆయన ఇంటికి వెళ్లి, గృహం చుట్టూ బాణాలతో ఎవరూ ప్రవేశించడానికి వీలుకాకుండా గోడ కట్టాడు. మృత్యుదేవత ప్రవేశించకుండా కాపలా కాశాడు. ఇంతలో బ్రాహ్మణుడి భార్య మృత శిశువును కన్నది. వింతగా పుట్టిన ఆ శిశువు శరీరంతో సహా ఆకాశంలోకి పోయి మాయమయ్యాడు. ఆ పరిస్థితికి తట్టుకోలేక బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. అర్జునుడు విఫలమైన సంగతి కూడా చెప్పి, అతడి పౌరుషాన్ని ఎద్దేవా చేశాడు.

బ్రాహ్మణుడు తనను నిందించడం సహించలేని అర్జునుడు తన దివ్యమహిమతో యమధర్మరాజు నివాసానికి పోయాడు. అక్కడ బ్రాహ్మణ పుత్రులు లేరని తెలుసుకుని, అక్కడి నుండి సమస్త లోకాలకు వెళ్లి వారికొరకు వెతికాడు. ఎక్కడా వారి జాడలేదు. భూలోకానికి వచ్చి తన శపథం నెరవేరనందున అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుడు వచ్చి ఆర్జునుడిని అగ్ని ప్రవేశం చేయకుండా ఆపి, బ్రాహ్మణ పుత్రులను చూపిస్తానని అన్నాడు. తనతో రమ్మన్నాడు. కృష్ణుడి రథం ఎక్కాడు అర్జునుడు. రథం మీద పోతూ-పోతూ ద్వీపాలు, కులపర్వతాలు, చివరకు మేరు పర్వతం కూడా దాటి, మహాంధకారంతో నిండి వున్న ఒక ప్రదేశానికి సమీపించారు కృష్ణార్జునులు. ఇంకా పోగా-పోగా దట్టమైన చీకటి అలుముకున్న ఒక ప్రదేశం తగిలింది. గుర్రాలకు దారి కనబడలేదు.

ఆ చీకటిని ఛేదించాలనుకున్నాడు కృష్ణుడు. తన చక్రాయుధాన్ని పంపాడు. అది ఆ చిమ్మచీకటిని నరికి వేస్తూ, దారి చూపిస్తుంటే, దాన్ని దాటారు కృష్ణార్జునులు. అప్పుడు కనిపించిన ఒక దివ్య తేజస్సును చూసి అర్జునుడు కళ్లు మూసుకున్నాడు. ఆ తరువాత వారిరువురూ మహా గంభీరమైన ఒక జలంలోకి ప్రవేశించారు. ఆ నీటి మధ్య భాగంలో  కోటి సూర్యకాంతులతో తేజరిల్లుతున్న ఒక దివ్య భవనం కనిపించింది వారికి. ఆ మహాభవనం అనంతమైన తేజస్సుతో, మోక్షమార్గాన్ని నిర్దేశిస్తూ, అత్యద్భుతంగా దర్శనమిచ్చింది. అక్కడ తెల్లటి దేహకాంతితో మెరిసిపోతున్న సహస్ర ఫణీంద్రుడైన ఆదిశేషుడిని చూశారు. శేషతల్పం మీద కూర్చుని, శోభాయమానంగా వున్న పుండరీకాక్షుడిని దర్శిస్తూ ఆ దేవదేవుడి సన్నిధానం చేరారిద్దరూ.

దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న కమలాక్షుడిని, భూదేవి-శ్రీదేవిలతో కూడి వున్నవాడిని, ఆదిమద్యాంతాలు లేనివాడిని, సృష్టిస్థితిలయకారుడిని, జ్ఞానరూపుడిని చూసిన కృష్ణార్జునులు ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. పరంధాముడిని స్తుతించారు. ఆ పురాణ పురుషుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, కృష్ణార్జునులను చూసి, భూమాత భారం తగ్గించడానికి, దుష్ట సంహారానికి, వారిద్దరూ తన అంశతో భూమ్మీద నరనారాయణులుగా అవతరించారానీ, కార్యోన్ముఖులైన వారిని చూడాలని మహర్షులు కోరినందున వారి కోరిక తీర్చడానికి బ్రాహ్మణ పుత్రులను తీసుకువచ్చామని, ఆ పుత్రులను తీసుకుపోవడానికి నరనారాయణులు తన దగ్గరికి రావాలని ఈ పని చేశామని అన్నాడు. ఇలా చెప్పి ఆ బాలురను అప్పగించాడు. శ్రీమన్నారాయణుడిని అనేక విధాలుగా స్తుతిస్తూ, నమస్కారం చేసి ద్వారకా నగరానికి బయల్దేరారు కృష్ణార్జునులు. బాలురను తీసుకువచ్చి, వారిని వారి వయస్సుకు తగ్గ విధంగా రూపొందించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు కృష్ణార్జునులు.

ఆ తరువాత ప్రజలు ప్రస్తుతించే విధంగా శ్రీకృష్ణుడు వైదిక మార్గానుసారంగా అనేక యజ్ఞయాగాదులు చేశాడు. ఆ విధంగా రాజ్యపాలన చేస్తూ, శ్రీకృష్ణుడు ద్వారకానగరంలో దేవేంద్ర వైభవంతో అలరారాడు. తన పదహారువేల నూట ఎనిమిది మంది భార్యలతో మనోజ్ఞంగా విహరించాడు. వారంతా కృష్ణుడే తమ సర్వస్వంగా భావించి ఆయన సన్నిధానంలోనే నిలిచి పోయారు. వేదాలలో చెప్పబడినట్లు శ్రీకృష్ణుడు గృహస్తాశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాడు. గృహస్తులకు తానే మార్గదర్శిగా నిలిచి, సంసారిలాగా జీవితాన్ని గడిపాడు. శ్రీకృష్ణుడు ఒక్కొక్క భార్యయందు పదిమంది పుత్రులను కన్నాడు. పట్టమహిషి రుక్మిణీదేవి మొదలైన అష్ట భార్యలకు పుట్టిన పద్దెనిమిది మంది కుమారులు బలపరాక్రమాలలో ప్రసిద్ధి చెందారు. అలా సుప్రసిద్దులుగా కీర్తించబడిన పద్దెనిమిదిమంది ప్రద్యుమ్నాదులే కాకుండా, త్రివక్ర వల్ల జన్మించిన ఉపశ్లోకుడనే పుత్రుడు అఖండమైన దివ్య జ్ఞానాన్ని సుముపార్జించాడు. అతడే, ‘సాత్త్వతతంత్రం అనే వైష్ణవ స్మృతిని బోధించి స్మరణమాత్రం చేతనే మోక్షం లభించే మార్గాన్ని తెలియచెప్పాడు. శ్రీకృష్ణుడి పుత్రులు ఈ విధంగా మహావీరులై, చిరంజీవులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, కీర్తికెక్కారు.

ఇదిలా వుండగా, దేవాసుర యుద్ధంలో హతులైన రాక్షసులు ద్వాపరయుగంలో రాజులుగా జన్మించి ప్రజలను బాధలకు గురి చేయడం వల్ల, శ్రీమహావిష్ణువు ఆజ్ఞానుసారం దేవతలు యదుకులంలో జన్మించారు. యాదవ కులంలో జన్మించిన దేవతలు మొత్తం నూటా ఒక్క కులాలవారీగా పరిగణించబడ్డారు. ఆ యాదవ వంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడికి, రుక్మిణీదేవికి పుట్టిన ప్రద్యుమ్నుడి సంతతి వాడే శ్రుతసేనుడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక వంశాలు పరమ పవిత్రంగా వర్ధిల్లాయి. కృష్ణ పరమాత్మతో కాలం గడుపుతూ వారంతా సంతృప్తిగా వున్నారు.

సకల శుభాలను ప్రసాదించే శ్రీకృష్ణ కథ అనే అమృత రసాన్ని అత్యంత భక్తితో పానం  చేసిన పుణ్యాత్ములు ఇహలోకంలో సకల సుఖ సౌఖ్యాలను పొంది, చివరకు పాప విముక్తులై, విష్ణు పదమైన మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటారు.                                              

                (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment